Previous Page Next Page 
అర్ధచంద్ర పేజి 37


    "నిన్నీ స్థితిలో" విడిచి వెళ్ళను."
    
    "అదేమిటి? నేను బాగానే వున్నాను."
    
    "బాగా లేవు."
    
    "అయ్యో! మీరు నన్ను మరీ అంత ప్రేమగా చూడకూడదండీ. కొంచెం యాంత్రికంగా ఉండటం నేర్చుకోవాలి. లేకపోతే డెయిలీ రొటీన్ దెబ్బ తినేస్తుంది. మగవాడికిది మంచి లక్షణం కాదు."
    
    "అంతేనంటావా?" అన్నాడు రాజాచంద్ర విధిలేనట్లుగా.
    
    "అంతే."
    
    పది గంటల ప్రాంతంలో రాజాచంద్ర కారేసుకుని ఆఫీసుకు వెళ్ళిపోయాడు.
    
    పిల్లలు ముగ్గురూ బయటికెళ్ళారు. ఈ వారం పదిరోజులుగా వినూత్న తన శక్తికి మించే తల్లికి సపర్యలు చేసింది. ఆమె అలవాటులేని కొన్ని పనులు చేస్తుంటే విశారదకు నవ్వొచ్చేది కూడా.
    
    ఇంట్లో కొంచెం అటూ ఇటూ తిరగవచ్చని డాక్టరుగారు చెప్పారు. విశారదకు బాగా నీరసంగా ఉన్నా ప్రతి చిన్నదానికే వంట మనిషిని పిలవటం ఇష్టంలేక అప్పుడప్పుడూ లేచి కొన్ని పనులు చూసుకుంటోంది.
    
    ఆరోజెవరో అమ్మాయి దగ్గర్నుంచి వచ్చిన ఫోన్ కాల్ గురించి అప్పుడే మరిచిపోయింది. మగవాడికి సొసైటీలో అనేక పరిచయాలుంటాయి. కొన్ని ఇంట్లో చెప్పగలిగినవి ఉంటాయి. కొన్ని చెప్పలేనివి ఉంటాయి. ఒక్కోసారి సరిగ్గా అర్ధం చేసుకోలేకపోవచ్చని అబద్దం కూడా చెప్పవచ్చు అంతమాత్రం చేత చెడుగా తీసుకోకూడదు.
    
    పన్నెండు గంటల ప్రాంతంలో ఫోన్ మోగింది. పక్కమీద పడుకున్నదల్లా లేచి మెల్లగా ఫోన్ దగ్గర కెళ్ళింది.
    
    "హలో" అంది రిసీవర్ చేతిలోకి తీసుకుని.
    
    'విశారదా' అంది అవతల్నుంచి ఓ పురుషుడి కంఠం.
    
    విశారద ఉలికిపడింది. ఎవరతను? ఇంతకుముందెప్పుడూ అతని గొంతు వినలేదు. అంత చనువుగా పిలుస్తున్నాడు.
    
    "ఎవరు మీరు?" అంది చాలా అసహనంగా.
    
    అవతల్నుంచి నవ్వు.
    
    విశారదా! నేనెవరో నీకు తెలీదు. కాని నువ్వు నాకు క్షుణ్ణంగా తెలుసు. నిజం చెప్పాలంటే నీలోని ప్రతి అణువూ నాకు తెలుసు. చాలా డీప్ గా కూడా తెలుసు."
    
    "షటప్!"
    
    అవతలి వ్యక్తి నవ్వాడు. "నువ్వు నన్ను తిట్టినా కోపం రాదు. ఎందుకంటే...నీకూ నాకూ ఉన్న అనుబంధాన్ని బట్టి..."
    
    "ఏమిటి నువ్వు మాట్లాడేది? నా వయసెంతో తెలుసా?"
    
    "నేనేం మాట్లాడుతున్నానో ముందు ముందు నీకు తెలుస్తుంది. నీ వయసెంతో నీకంటే ఎక్కువగా నాకే తెలుసు. యూ ఆర్ స్టిల్ ఫార్టీ ఫైవ్!
    
    విశారద గబగబా ఆలోచిస్తుంది. తన జీవితకాలంలో ఎప్పుడూ ఇలాంటి ఫోన్ రాలేదు అసలు ఎవరితను? ఎవరనుకుని తనకు చేస్తున్నాడు?
    
    ఊరికినే ఆవేశపడి ప్రయోజనం లేదు. దానివల్ల అనర్ధాలు పెరుగుతాయి. తాపీగా మాట్లాడి విషయం తేల్చుకుందామనుకుంది.
    
    "చూడండీ! నన్ను మీరెవరనుకుంటున్నారో తెలీదు. నేను మిసెస్ రాజాచంద్రను. నా పేరు విశారద అన్న మాట కరక్టేగానీ మీరనుకున్న మనిషిని కాను. మీరు చాలా పొరబడుతున్నారు, అంది చాలా సహనం ప్రదర్శిస్తూ.
    
    ఆ మనిషి మళ్ళీ నవ్వాడు. "మిసెస్ రాజాచంద్రా! నేనేమీ పొరబడటం లేదు. ముమ్మూర్తులా మీకే....కాదు నీకే ఫోన్ చేస్తున్నాను. నిన్ను నువ్వు అని పిలిచే అధికారం నాకుంది. ఒక్కొక్క విషయం నీకు క్రమంగా తెలుస్తుంది. అన్నీ ఒక్కసారే చెబితే షాక్ అయిపోతావు."    
    
    "అసలు నువ్వెవరివి?"
    
    "నా పేరు తారాచంద్ర" ఆ వ్యక్తి ఠక్కున ఫోన్ పెట్టేశాడు.
    
    విశారద మొహమంతా నల్లబడిపోయింది. ఒళ్ళంతా ముచ్చెమటలు పట్టాయి.
    
    తారాచంద్ర! ఎవరితను? ఆ పేరెప్పుడూ తాను వినలేదు. అతని గొంతెప్పుడూ వినలేదు. ఈ ఫోన్ అర్ధమేమిటి? బ్లాక్ మెయిలింగా? తాను గాని, రాజాచంద్రగానీ చీమకైనా అపకారం చేసి ఎరుగరు. తమ జీవితాల్లో ఏ కల్మషమూ లేదు. తన మనస్సూ, శరీరం వాటిలోని ప్రతి అణువూ రాజాచంద్రకు అంకితం. అతను తన దేవుడు. తన సర్వస్వం మరి....ఈ వ్యక్తి ఎవరో అర్ధం లేకుండా వాగుతూ బెదిరిస్తున్నాడేమిటి?
    
    విశారదకు భయమేసింది. తమ జీవితాల్లో....ఈ వయసులో సుడిగుండాలేమయినా ఏర్పడబోతున్నాయా? భయంకరమైన మలుపులు తిరగబోతున్నాయా?
    
    తమ కుటుంబానికి అజ్ఞాతమైన శత్రువు లెవరయినా ఉన్నారా?
    
    ఆమెకు చాల నీరసంగా అనిపించి మనసంతా వ్యాకులపాటుతో నిండి పోయింది. వెంటనే రాజాచంద్రతో మాట్లాడాలనిపించి రిసీవర్ మీద చెయ్యి వెయ్యబోయింది.
    
    ఫోన్ మళ్ళీ మోగింది- అంతలోనే.
    
    "హలో" అంది విశారద రిసీవ్ చేసుకుంటూ.
    
    "మిసెస్ రాజాచంద్రగారా?"
    
    ఆ గొంతు గుర్తు పట్టింది. ఆ రోజు ఛారిటీ ప్రోగ్రాం గురించి మాట్లాడిన అమ్మాయి.
    
    ఆ గొంతు... విశారద ఒళ్ళు జలదరించినట్లయింది.
    
    "నేనే మాట్లాడుతున్నాను."
    
    "మీరేనా? నమస్కారమండీ మీకు ఈ మధ్య ఆపరేషనయిందని ఇంతకు ముందే తెలిసింది. ఎలా ఉందండీ ఇప్పుడు?" ఆ అమ్మాయి చాలా ఆదుర్దాగా, ఆప్యాయంగా అడుగుతోంది.
    
    "బాగానే ఉంది. మీరెవరో తెలుసుకోవచ్చా?"
    
    "మా ప్రోగ్రాం రోజున మీకు ఫోన్ చేశాను. నా పేరు విజ్ఞత.
    
    "మీ కెవరు చెప్పారు నా ఆరోగ్యం గురించి?"
    
    "రాజాచంద్రగారు ఇంతకుముందే ఆయనకు ఫోన్ చేశాను."
    
    "ఒకసారి రండి మా ఇంటికి" అన్నది విశారద ఏమనాలో తోచక.

 Previous Page Next Page