"కుడికంటి విషయం?"
"అది వట్టి కన్ జక్టివైటిస్ మాత్రమే. ఊరంతా ఎపిడమిక్ గా వ్యాపించి వుండటంచేత వచ్చి- అప్పుడే తగ్గిపోయింది."
"కాబట్టి కుడికంట్లో రెటీనోబ్లాస్టోమా లేదు?"
"లేదు."
తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ మొదలయింది.
"మీకు ఆఫ్ థర్మాలజీలో స్పెషలిస్ట్ గా పదేళ్ళ అనుభవం వుందన్నారు కదూ?" అనడిగాడు ప్రతాపరావు.
"అవును."
"రెటీనోబ్లాస్టోమా కేసులుకూడా చాలా చూశారు, ఆపరేషన్లు చేశారు?"
"అవును."
"మీరు చూసిన, ట్రీట్ మెంట్ చేసిన కేసుల్లో యెక్కువగా యూనిలేటరల్ (ఒక కంటిలో ట్యూమర్ వున్నది) వున్నాయా? లేకపోతే బైలేటరల్ (రెండు కళ్ళలో ట్యూమర్ వున్నవి) యెక్కువగా వున్నాయా?"
"బైలేటరల్ లే యెక్కువగా తటస్థపడ్డాయి."
"కాబట్టి రెండుకళ్ళలో ట్యూమర్ వున్న సందర్భాలే యెక్కువగా వుంటాయి."
"......."
"ఒకవేళ మొదట్లో ఒకకంట్లో ప్రారంభమైన తర్వాత రెండోకంటిలో ఆవిర్భవించటానికి అవకాశం వుందా?"
"ఉంది."
"ఒక కంటిలో ట్యూమర్ వచ్చాక. రెండోకంటిలో కూడా రావటానికి యెంతకాలం పడుతుంది?"
"ఎంత యెక్కువ కాలమైనా పట్టవచ్చు. యెంత తక్కువ కాలమైనా పట్టవచ్చు."
"అంటే ఒక కంట్లో వచ్చాక రెండో కంట్లో ట్యూమర్ రావటానికి కేవలం కొన్నిరోజుల వ్యవధి సరిపోతుందా?"
"......సరిపోతుంది."
"రాధను మీరు ఏ యిన్ స్ట్రుమెంట్ తో ఎగ్జామిన్ చేశారు?"
"ఆఫ్ థల్మాస్కోప్ తో."
"డయాగ్నోసిస్ కరెక్టుగా చెయ్యటానికి అంతకన్నా శక్తివంతమైన యిన్ స్ట్రుమెంట్స్ వున్నాయా?"
"వున్నాయి. స్టేపెన్స్ యిన్ డైరెక్ట్ ఆఫ్ థల్మాస్కోప్ అని వుంది."
"మీరు దానితో ఎగ్జామిన్ చేశారా?"
"లేదు. నాదగ్గర ఆ యిన్ స్ట్రుమెంట్ లేదు."
"పోనీ మీరు రాధకు జనరల్ ఎనస్థిషీయా యివ్వకుండా తెలివిగా వున్నప్పుడు ఎగ్జామిన్ చేస్తే ఒకవేళ ట్యూమర్ వున్నా కనిపెట్టలేకపోవటానికి అవకాశం వుందికదా?"
"రాధ తెలివిగా వున్నప్పుడు ఎగ్జామిన్ చేస్తే ఎడమకంట్లో వున్న ట్యూమర్ కనిపించింది కదా."
"అప్పటికి కుడికంట్లో ట్యూమర్ నైజ్ పేషెంట్ కోపరేట్ చెయ్యని స్థితిలో కనిపెట్టటానికి వీల్లేనంత చిన్నగా వుండివుండవచ్చు. ఎనస్థిషియా యిచ్చి నప్పుడుగాని కనిపించనంత చిన్నసైజులో వుండివుండవచ్చు. కనిపెట్టలేనంత మాత్రాన జనరల్ ఎనస్థిషియా యివ్వకుండా, స్పెషల్ యిన్ స్ట్రుమెంట్ వాడకుండా "ట్యూమర్ లేదు" అని కొట్టిపారెయ్యటానికి వీల్లేదు. అవునా?"
డాక్టర్ గుర్నాథ్ మాట్లాడలేదు.
"చెప్పండి. యివేమీ చెయ్యకుండా, ఒకటికి రెండుసార్లు ఎగ్జామిన్ చెయ్యకుండా 'లేదు' అని కొట్టిపారెయ్యటానికి వీల్లేదు. అవునా?"
"అవును"
కోర్టులో వున్నవారంతా "అరె" అనుకున్నారు.
"మీ అంతట మీరే యీ కేసుని డాక్టర్ అశోక్ కి రిఫర్ చేశారు. ఆయన ఆఫ్ థల్ మాలజీలో సూపర్ స్పెషలైజేషన్ చేశారనీ అయన దగ్గర లేటెస్ట్ ఎక్విప్ మెంట్ వున్నదనీ మీకంటే మేధావి అనీ ఆయనదగ్గరకు కేసు రిఫర్ చేశారు."
డాక్టర్ గుర్నాథ్ జవాబివ్వలేదు.
"చెప్పండి."
డాక్టర్ గుర్నాథ్ మాట్లాడలేదు.
"మీరు మౌనంగా వుంటే నేను చెప్పింది అంగీకరించినట్లు అర్ధంవస్తుంది."
అప్పటికీ డాక్టర్ గుర్నాథ్ మాట్లాడలేదు. నిస్సహాయస్థితిలో చూసి వూరుకున్నాడు.
"మీరు రాధను జనరల్ ఎనస్థీషియా యిచ్చి ఎగ్జామిన్ చెయ్యలేదు. మామూలు ఆఫ్ థల్మాస్కోప్ ని ఉపయోగించారుగాని మోడర్న్ యిన్ స్ట్రుమెంట్స్ ఏమీ ఉపయోగించలేదు. పైగా యీ కేసు విద్యలో, అనుభవంలో, మేధస్సులో అన్నివిధాలా అధికుడైన డాక్టర్ అశోక్ ఎగ్జామిన్ చేస్తే బాగుండునని అభిప్రాయ పడి మీరే ఆయనకి రిఫర్ చేశారు. కాబట్టి యీ కేసు డయాగ్నోసిస్ లో మీకు కొన్ని అనుమానాలున్నాయనీ, మీ రోగ నిర్ణయం లోపభూయిష్టంగా వున్నదనీ, అంటున్నాను" అన్నాడు ప్రతాపరావు తన క్రాస్ ఎగ్జామిన్ కన్ క్లూడ్ చేస్తూ.
"నేను డయాగ్నైజు చెయ్యలేక కేసు రిఫర్ చెయ్యటంకాదు. ఆపరేషన్ ఫెసిలిటీస్ అక్కడెక్కువ వుంటాయనీ, పెద్ద హాస్పిటల్ కాబట్టి పేషెంటుకు, వారి తాలూకు వాళ్ళకి విశ్వాసం, తృప్తి వుంటాయని అక్కడకు పంపించాను" అన్నాడు డాక్టర్ గుర్నాథ్.
కేసు మరుసటి వారానికి వాయిదా పడింది.
17
టీపాయ్ మీద విస్కీగా, గ్లాసూ, మిగతా సరంజామా అంతా వున్నది. ప్రదీప్ అంతకుముందే మూడో పెగ్గు పూర్తిచేసి నాలుగోది మొదలుపెట్టాడు.
హనుమంతరావు అంతవరకూ కూర్చుని గబగబా తనపని పూర్తిచేసుకుని వెళ్ళిపోయాడు.
ఈమధ్య హనుమంతరావుని భరించటం కష్టంగా వుంది. తనమీద ఏదో అధికారమున్నట్లు కంపెనీలోకి చొచ్చుకురావటం, కూర్చున్నంతసేపూ అతని మాటలూ, కడుపులో చల్ల కదలకుండా బ్రతికేమనిషీ తనకోసమే యీ కోర్టుల చుట్టూ తిరుగుతూ, నానా అవస్థ పడుతున్నట్లు వున్న అతని ప్రవర్తనా చాలా దుస్సహంగా వుంది.
అంకుశం పత్రిక లేటెస్ట్ ఎడిషన్ లో ప్రదీప్ గురించి చాలా దారుణంగా వ్రాయబడింది. అతనూ, అరుణా దగ్గర దగ్గరగా నిలబడి వున్న ఫొటో ప్రచురించి దానిక్రింద అసభ్యకరమైన పదజాలంతో యిష్టమొచ్చినట్లు రాయబడింది.
"ఇంతకూ ప్రదీప్ యింట్రెస్టు దేనిమీద? రాధకేసుమీదా? అరుణ పొంగే యవ్వనంమీదా?"
"రోజూ కోర్టునించి వస్తూ హనుమంతరావు యింటిచుట్టూ చక్కర్లు కొట్టటంలో రహస్యమేమిటి?"
"అసలే వంటరిగా వున్నాడు. యిహ అడ్డేముంది?"
అవన్నీ చూసి ప్రదీప్ ఆగ్రహంతో వణికిపోయాడు. వెళ్ళి పరాంకుశంమీద యిష్టం వచ్చినట్లు ప్రతీకారచర్య తీసుకుందామన్నంత ఆవేశమొచ్చింది కష్టంమీద నిగ్రహించుకున్నాడు.
హనుమంతరావు ఆ వ్యాసం చదివి రెచ్చిపోయాడు. "దీనికంతటికీ కారణం నువ్వే - నువ్వే" అని గట్టిగా అరిచాడు. "నా కుటుంబం, పరువుగా సాగే నా కుటుంబ ప్రతిష్ట పబ్లిక్ లోకి ఎక్కిపోయింది. ఇహ నా కూతుళ్ళ పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి? నలుగురిలో నా మొహం ఎత్తుకుని ఎలా తిరగను?" అని కేకలేసి గబగబా మూడుపెగ్గులు సేవించి, కాసేపు తనలోతాను ఏడ్చి తూలుకుంటూ వెళ్ళిపోయాడు.