Previous Page Next Page 

    శంకూ స్పష్టంగా చూశాడు కారిడార్ లో నుంచి వస్తున్న రాధమ్మని....
   
    అంతే....
   
    రెండు అంగల్లో గోడని చేరుకుని వేగంగా నేలపైకి దుమికాడు.
   
    భయంతో గదిని చేరుకున్న సావేరి ద్వారం మూయబోతుండగా తల్లి నిలబడి వుంది ఎదురుగా.
   
    కొన్ని క్షణాలు వణికించే నిశ్శబ్దం.....
   
    "ఎవరు...." సూటిగా చూస్తూ అడిగింది రాధమ్మ.
   
    "ఎ-ఎ-ఎవరేమిటి-నేనే__"
   
    "ఎందుకలా నవ్వుతున్నావిందాక?"
   
    "న-నవ్వానా-కలయ్యుంటుంది మమ్మీ!"
   
    అలవోకగా అప్పుడు చూసింది రాధమ్మ. నేలపైవున్న రక్తపు మరకల్ని! సప్తపడిలా కనిపిస్తున్న పాదాల గుర్తుల్ని.
   
    సావేరి కట్రాడలా బిగుసుకుపోయింది.
   
    రాధమ్మ మరి రెట్టించలేదు.
   
    వెనక్కి మరలింది.
   
    ఎలా తెల్లవారిందో సావేరీకి గుర్తు లేదు.
   
    కానీ కళ్ళు తెరిచేసరికి నేలపై రక్తపు మరకల్ని తడిగుడ్డతో తుడుస్తున్న తల్లి కనిపించింది.
   
    బిక్కమొహం వేసుకుని చూస్తున్న సావేరిని రమ్మంటూ నడిపించుకు వెళ్ళిన రాధమ్మ"అటు చూడు" అంది.
   
    అక్కడ ఉదయసూర్యుడి కాంతిలో గోడపై వున్న గాజు పెంకులపై ఎర్రగా ప్రతిఫలిస్తున్న రక్తం.
   
    "అలా చిమ్మిన రక్తం కూడా కలలోనే అయితే ఫర్వాలేదు సావేరీ! ఇక్కడ నేలపై నిజంలా అనిపిస్తున్న రక్తాన్ని శుభ్రంచేసే అవకాశం వుండబట్టే అమ్మగా నీకు సహకరించాను తప్ప ఎంత తల్లినయినా నా సహకారాలకీ ఓ సరిహద్దు వుంటుందని మరిచిపోకు."
   
    రాధమ్మ వెళ్ళిపోయింది వణికించే నిశ్శబ్దంగా.
   
    స్థాణువులా నిలబడిపోయింది సావేరి నిశ్శబ్దంగా....
   
                                          *    *    *    *    *   
   

    పగలు పదకొండు గంటలు కావస్తూంది.
   
    ఇంటర్మీడియెట్ విద్యార్దులంతా కెమిస్ట్రీ లేబ్ లో అమోనియా తయారీకి సంబంధించిన హేబర్ ఏక్సపరిమెంట్ లో నిమగ్నమైవున్నారు.
   
    చేతిలో టెస్ట్ ట్యూబ్ తో నిలబడ్డ సావేరి ఎదురుగా మరో టేబుల్ ముందున్న శంకూనే గమనిస్తూంది.
   
    నిజానికి ఆమె కాలేజీకి రావటానికి చాలా ప్రతిఘటల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
   
    తన విషయంలో తండ్రికి వచ్చిన ఫోన్ కాల్ గురించి సావేరికి తెలీదు.
   
    కానీ ఇంచుమించు కాలేజీ మానేయమన్నంతదాకా తండ్రి నచ్చచెబుతుంటే చాలా కంగారు పడిపోయింది.
   
    ఒకవేళ అమ్మ అంతా చెప్పేసిందా? అని కూడా ఆలోచించింది. కానీ ఉదయమే అమ్మఅన్న మాటలు గుర్తుచేసుకుంటే అమ్మ ఇలాంటి పనిచేసి వుండదని అనిపించింది.
   
    మరయితే ఎందుకు తనను కాలేజీ మానేయమన్నది?
   
    రాజేందర్ ఏదన్నా చెప్పివుంటాడా....?
   
    అదే నిజమైతే డాడీ ప్రవర్తన మరోలా వుండేదే....?
   
    "ది రెసిడ్యుల్ గేసిస్ ఆర్ రిసర్క్యులేటెడ్...." లెక్చరర్ గారి కంఠం వినగానే ఆమె ఆలోచనలనుంచి తేరుకుంది.
   
    ఇక్కడ శంకూ చేసిన పొరపాటు ఓరకంటగానైనా అతడిదృష్టి సావేరి నుండి మళ్ళించకపోవడమే....
   
    "కుదర్దు....నా క్లాసులో కాన్ సెంట్రేషన్ లేకపోతే అసలు కుదర్దు...." కెమిస్ట్రీ లెక్చరర్ అనకాపల్లి అప్పారావు ఆవేశంగా అరిచాడు.
   
    శంకూ పక్కనే నిలబడ్డ ఇంటర్ అప్పారావు.... (లావుపాటి లావణ్యని దారుణంగా ప్రేమించే శంకూ క్లాస్ మేట్) మోచేత్తో పొడిచాడు.
   
    ఉలిక్కిపడ్డ శంకూ "యస్సర్" అన్నాడు కంగారుగా.
   
    "అలాంటి కంగారు నా ముందు అస్సలు కంగారుగా.
    తలవంచుకున్న శంకూని చూస్తూ మరేదో అనబోతుంటే...."ఎందుకు కుదర్దు....?"
   
    అసలే ఇందాక పాదానికి గాయంతో హవాయి చెప్పులేసుకొచ్చిన శంకూని చూసి బోలెడంత బాధపడిన సావేరి ఇలా జోక్యం చేసుకోవటంతో ఆమె వంశవృక్షం గురించి తెలిసిన సదరు అనకాపల్లి అప్పారావు మృదువుగా నవ్వాడు అంతకంటే చేసేదేమీ లేనట్టు.
   
    "అద్గదీ" ఏవ్రాసి మొహంతో అన్నాడాయన "అలర్ట్ నెస్ అంటే అలా వుండాలి....అలా అయితే అద్భుతంగా కుదరిద్ది..." ఆ తర్వాత అమ్మోనియా తయారీపై అద్భుతంగా చెప్పుకుపోయాడు.....ఆనక అందర్నీ ప్రయోగం చేయమని చెప్పి హడావుడిగా బయటికెళ్ళి పోయాడు.
   
    అయిదు నిమిషాలు గడిచేసరికి శంకూ సాహసంచేసి సావేరి పక్కగా వెళ్ళాడు.
   
    తననెవరూ గమనించలేదన్న నిర్దారణకి వచ్చాక "రాత్రి మీ వాళ్ళు నన్ను చూశారా....?"
   
    ఆమె ఆజ్ఞాపకానికే తొట్రుపడింది.
   
    "నిన్నే...."
   
    ఈసారీ జవాబు చెప్పలేదు....
   
    "నాక్కోపమొస్తుంది" రోషంగా అన్నాడు.
   
    "నీ పాదాలెలా వున్నాయి?"
   
    "ముందు నేనడిగిన డానికి జవాబు చెప్పు....."
   
    చెప్పాలనివున్నా శంకూ భయపడి తనతో ఎక్కడ దూరమౌతాడో అని "అబ్బే" అంది తలవంచుకుని.
   
    "నిద్రపట్టిందా?"
   
    "నీకో...."
   
    "అహ...." తల అడ్డంగా వూపాడు.
   
    కిసుక్కున నవ్వేస్తూ అంది "ఆ పొడుపు కథకి అదే....నిప్పుల గుండం తొక్కాను....గుప్పెడు బూడిదనయ్యానుకి జవాబేంటి....?"
   
    "తెలుసుకోలేకపోయావా?"
   
    "అనువు ఓడిపోయాను...."
   
    "మరి చెబితే ఏమిస్తావు?" అదోలా చూస్తున్నాడు.
   
    ఆమె చెంపలు ఎరుపెక్కాయి "నేనివ్వను...."
   
    "నేను తీసుకుంటా!"
   
    "బాగా ధైర్యం వచ్చేసినట్టుంది కదూ...."
   
    "మరేం... ఇచ్చావుగా...."
   
    "అంతా చూస్తున్నారు....ఆ పొడుపు కథకి జవాబు చెప్పేయ్....ఆనక యిస్తాను...."
   
    "పిడక...."
   
    "ఏమిటీ" విస్తుపోతున్నట్టుగా చూసింది.
   
    "నిజం....అమ్మ కడుపున పుట్టాను....అంత సుఖమున్నాను.....నిప్పులగుండం తొక్కాను....గుప్పెడు బూడిదనయ్యాను అంటే పిడకే.....ఇచ్చెయ్...." పాదంతో ఆమె కాలు తొక్కాడు.
   
    "ఇదిగో...చంపుతా...."
   
    తనదీ కేవలం తనకు మాత్రమే చెందేదీ అన్న వస్తువుపై స్వాధికారిగా ప్రవర్తించటానికి పరిసరాలతో పనిలేదుగానీ పైగా వయసు ఉన్మాదం ఒక్కోమారు ఎలాంటి ఉద్రేకానికి గురిచేస్తుందీ అన్న థియరీ గురించిగాని శంకూకి అవగాహనలేదు.....అందుకే గభాలున ఆమె చేయి పట్టుకున్నాడు.

 Previous Page Next Page