Previous Page Next Page 
ప్రేమికారాణి పేజి 36

    "నువ్వు రైతువి కాకపోతే ఇహ మాకు అన్నమేదొరకదు కాబోలు." అంటూ అన్నలు ఎగతాళి చేసేవాళ్ళు.

    "నవ్వుతున్నావు, గీతత్తా! ఏం జ్ఞాపక మొచ్చింది?" కుతూహలంగా ప్రశ్నించాడు.

    "చిన్నప్పటినుండి నీకు వ్యవసాయమంటే ఇంత అభిమానం ఎందుకు ఏర్పడిందా అని."

    "చిన్నప్పుడు తాతయ్యతో ఊరెళ్ళేవాడిని. బండిలో వెడుతూంటే ఎద్దులమెడలో మువ్వలు ఎంతశ్రావ్యంగా ధ్వనించేవని. బండి తోలడమంటే ఎంత ఇష్టంగా ఉండేదని. ఇప్పుడుకూడా కారు డ్రైవ్ చేయడంకంటే బండి తోలడంలోనే నాకు ఎక్కువ ఆనందముంటుంది తెలుసా?"

    "అందుకే పెద్దబావవాళ్ళు నీకు 'అడవి మనిషి' అని బిరుదిచ్చేశారు తెలుసా?" అంటూ వచ్చింది జ్యోతి. "మొన్న పుట్టినరోజుకు రమ్మని వ్రాశాను. నువ్వు రాకుండా ప్రజెంటేషన్ పంపితే పుచ్చుకొంటాననుకొన్నావేమిటి? అత్తయ్యకే ఇచ్చేశాను. తెలుసా?"

    "అమ్మ ఉత్తరంలో ఆసంగతి వ్రాసింది. 'పుట్టినరోజు పండగకు నువ్వు రాలేదని జ్యోతికి చాలాకోపం వచ్చింది తెలుసా? నువ్వు ఇచ్చావన్న కానుక చేతికికూడా తీసుకోలేదు. అది లేకుండాచూసి దాని బీరువాలో ఉంచేశాను. అని వ్రాసింది." అని నవ్వసాగాడు విశాల్.

    "బీరువాలో ఉంచేసిందా? అరే. నేను చూచుకోనేలేదు." జ్యోతి ముఖం వెలవెలబాగా పరిగెత్తి, రెండు నిమిషాల్లో రిబ్బను కట్టిన అట్టపెట్టెతో తిరిగి వచ్చింది "నాకేం వద్దు. తీసికెళ్ళు" అంటూ అతడి ఒళ్ళోకి విసిరేసింది.

    "ఈసారికి క్షమించు. మళ్ళీ ఏటికి క్షేమంగా ఉంటే నిన్ను ఆశీర్వదించడానికి స్వయంగా వస్తాను."

    "నీ ఆశీర్వచనంలో మహిమ ఉందా?" వెటకారంగా అంది.

    "అది పరీక్షించుకోవాల్సింది నువ్వు. ఆశీర్వదించనా? వచ్చే ఏటికల్లా నువ్వు సుమంగళవై, ఆవచ్చే ఏటికల్లా 'అమ్మా' అని పిలిపించుకొందువుగాక." చెయ్యెత్తి కొంటెగా ఆశీర్వదించాడు.

    జ్యోతి ఒక అంగలో అతడిని సమీపించి, అతడి చెవులు పట్టుకుమెలిదిప్పబోతూ, "ఇంకెప్పుడూ ఇలాంటి వెధవ వాగుడు వాగనని చెప్పు. లేకపోతే నీ చెవులు నీ తలకి ఉండవు." అంది కోపంగా.

    "ఉండకపోతే పోనీ. నీ తాళాలగుత్తికి తగిలించుకొని రొంటిన దోపుకో."

    "అబ్బ! ఉత్త పల్లెటూరిబైతువి అయిపోయావు. ఎక్కడా నాజూకు లేకుండా అయిపోయింది నీ ప్రవర్తనలో."

    "ఇప్పుడు నేను ఏం మోటుగా ప్రవర్తించాను, గీతత్తా? జ్యోతిచెయి పట్టుకులాగానా? ఎత్తుకెళ్ళి పెళ్ళాడతానన్నాగా? ఇంత మగవాడిని! తనే నాచెవులు లంఖించుకొందే?"

    "మీ బావా మరదళ్ళ సరసంలోకి నన్నెందుకు లాగుతావు, బాబూ? చివరికి మీరిద్దరూ ఒక్కటే." గీతాభవాని ముసిముసిగా నవ్వింది.

    మరురోజు ఉదయం,

    కారులో గీతాభవానితో బయల్దేరాడు విశాల్.

    ఊరు ఓ రెండుమైళ్ళు ఉండగానే విశాల్ చెయిచాపి చూపుతూ, "అదిగో! అక్కడినుండి మన పొలాలు ప్రారంభమౌతాయి. ఆ మిట్టప్రక్కన చూశావా? చిక్కగా చెట్లు కనిపించడంలేదూ? అది మనతోట. ఈ రోజంతా రెస్ట్ తీసుకో. రేపు తీసికెడతాను." అన్నాడు ఉత్సాహంగా.

    అతడి పొలానికి చూస్తూనే అతడికళ్ళలోకి క్రొత్తమెరుపులు వచ్చినట్టుగా అనిపించింది గీతాభవానికి.

    కారు పొలాల్నిదాటి ఊళ్ళో ప్రవేశించింది. ముందు ఒక చిన్న రామాలయం, తరువాత గుడిసెలు, ఇళ్ళు ప్రారంభమౌతాయి.

    "అది కోదండ రామాలయం. నేను ఈ ఊరికి రాకముందు పాడుబడి ఉండేది. నేను వచ్చాక రిపేర్ చేయించి, ప్రతి శ్రీరామనవమికి సున్నాలు వేసి, నిత్యపూజలు జరిగేట్టుగా ఏర్పాటు చేశాను."

    గీతాభవాని మౌనంగా అతడు చెప్పేవన్నీ వింటూంది.

    కారు ఒక పెద్దగేటులో ప్రవేశించింది. లోపల ఇల్లు భారీ మరమ్మత్తులో ఉంది. వాకిటినిండా పెల్లకుప్పలు, ఇసుక, కంకర కుప్పలుగా పోసిఉన్నాయి.

    ఈ ఇల్లు మరమ్మత్తుకూడా విశాల్ తల్లితండ్రులకు ఇష్టం లేని సంగతి గుర్తు వచ్చింది గీతాభవానికి. ఈ పల్లెటూళ్ళో ఎవరు కాపురం ఉంటారు? అంతంతడబ్బుపోసి ఆ ఇల్లు కట్టించకపోతే ఏం? అని వాళ్ళవాదం.

    "మనం పెద్దల ఆస్తుల్ని అనుభవిస్తున్నప్పుడు వాళ్ళవైభవాన్ని నిలబెట్టవద్దా?" అంటాడు విశాల్ వాళ్ళు ఎంత వద్దన్నా శిధిలమైన పాత బంగళాని పునర్నిర్మిస్తున్నాడు.

    విశాల్ అన్నట్టుగానే గీతాభవాని ఇక్కడికి వచ్చాక ఒక్కక్షణం ఒంటరిగా ఉండనివ్వడం లేదు ఊరివాళ్ళు. ఎవరెవరో రావడం, ఏవో ప్రశ్నలు వేయడం. ఆమె సౌందర్యాన్ని అబ్బురపడి చూడడం! 'ఈమె మగడే ఆ ముసలాయన గిరిధరం' అని చెవులు కొరుక్కోవడం. చివరికి రామాలయం పూజారి భార్య వచ్చింది.

    "మీరు మా ఊరికి ఇప్పుడే రావడమైనా మీరు మాకు చిరపరిచితులు" అంది.

    గీతాభవాని ఆశ్చర్యంగా, "అదెలా?" అంది.

    "మీ మేనల్లుడు ఎప్పుడూ మీగురించి చెబుతూ ఉంటాడు, మీ అందం, మీ మంచిమనసు. మీరు మీ సవితి పిల్లల్ని ఎంతప్రేమగా సాకిందీ, వాళ్ళంటే ఇప్పటికీ మీ కెంత ప్రేమో. ఇంటికి వచ్చిపోయే బంధువులను, అతిధులను మీరు ఎంత బాగా చూస్తారో-అన్నీ చెబుతాడు. 'మా గీతత్త దేవత' అంటాడు. అతడికి మీరంటే చెప్పలేనంత భక్తీప్రేమ"

    గీతాభవాని మనసులో చీకటితెరలేవో వ్యాపించినట్టుగా అయ్యాయి. కేవలం గాలి మార్పుకోసం రాలేదు. ఈ ఊరికి తన జీవితంలోని ఒక రహస్యం చెప్పి విశాల్ ని సహాయం అడగడానికి వచ్చింది. విశాల్ కి తన మీద ఉన్నగౌరవం, అభిమానం తెలియనివికావు. ఆవిషయం ఒకరినోట స్పష్టమౌతూంటే అతడికి తన రహస్యం చెప్పగలనా, అతడికి తనమీదున్న గౌరవం పోగొట్టుకోగలనా అనుకోసాగింది.
   

 Previous Page Next Page