కోరిక లేని ప్రేమ, శృంగారం లేని ప్రేమ ప్రేమేకాదు _ అది పిరికితనపు ఆత్మవంచన.
అవధులు లేని శృంగారం మనిషిని యోగిని చేస్తుంది. ప్రపంచంలో ఏ బంధమూ శాశ్వతం కాదు, కారాదు. ఒక మనిషితో ఇంకో మనిషి శాశ్వత బంధం ఏర్పరచుకోవాలనుకోవడం ఆటవికపు అనాగరిక చర్య.
ఎటాచ్ మెంటు మనిషిని ఊపిరాడకుండా చేసి నిర్వీర్యుడుగా తయారుచేస్తుంది.
ఈ గాలి, వెలుగు, ప్రకృతి సౌందర్యం నిబంధనలతో నిరర్ధకం కారాదు. వాటిలో మీరు ఎప్పుడు విలీనం కాగలగుతారు? స్వేచ్చగా వాటిలో మీరు జొరబడి గలిగినప్పుడు, స్వేచ్చా ప్రణయంతో వాటిని జుర్రుకున్నప్పుడే అవి మీ వశమౌతాయి.
మనిషి పుట్టుక, చావు, పునర్జన్మ సిద్దాంతం! ఇదంతా ఓ గందరగోళం బంధనాలు లేని, అవధులు లేని విశాలమైన ప్రేమే మిమ్మల్ని పునీతుల్ని చేస్తుంది.
మనిషంటే ఎవరు ?
ఓ పంచభూతాల సమ్మేళనం.
రూపం లేని ఈ నాగరిక ప్రపంచంలో మీ ఆచ్చాదనలు మిమ్మల్ని తీర్చిదిద్దలేవు. మిమ్మల్ని తీర్చిదిద్ద గలిగింది మీ నిజరూపమే."
మనుషులందర్నీ ఏకం చేసేదీ, మనం కల్పించుకున్న పొరలు తొలగించి, ఒకరిలో వున్న దైవత్వాన్ని ఇంకొకరి చేత సందర్శించగలిగేదీ నగ్నత్వమే.
మీ బాధల్ని, మీ భేవజాల్ని, మీ అహాల్ని, మీ ఆవేదనల్ని మరిచిపోయేటట్టు చేసి, మిమ్మల్ని దివ్యత్వ రూపులుగా తీర్చదిద్దగలిగేది ఈ నగ్నత్వమే.
ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాలి. ఈ సిద్దాంతంలోని గొప్పతనం దేశ దేశాలా ప్రాకాలి.
అందుకనే కొద్ది రోజుల్లో మన ఆశ్రమ ప్రాంగణంలో 'ప్రపంచ నగ్నదినం' ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఉత్సవం చాలా భారీ ఎత్తున నిర్వహించబడుతుంది.
నా అశ్ర్తమంలో సభ్యులుగా చేరిన మీ అందరూ ఆనంద స్వరూపులు కావాలి. చింత, సమస్యలు, లేని ఉత్క్రుష్టదశకు మీరు చేరుకోవాలి. అదే నా ఆదర్శం, అదే నా దీక్ష."
"కాని మన కీర్తి ప్రతిష్టలు దినదినాభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రపంచం నలుమూలల నుంచీ మన సిద్దాంతానికి ప్రతికూల నినాదాలు కూడా ఎక్కువవుతున్నాయి."
ఆచార్య జగదీష్ నవ్వాడు. "జీవి గొప్పవాడవుతున్న కొద్దీ అతని మీద ప్రతికూల నినాదాలెక్కువవుతూ వుంటాయి. ప్రతికూల నినాదాలెక్కువవుతున్న కొద్దీ అతను మరింత గొప్పవాడవుతుంటాడు."
"కాని మననే సంఘ ప్రతికూల శక్తిగా వాళ్ళు చిత్రిస్తున్నారు."
"ఈ జగదీష్ లేవదీసిన సిద్దాంత బలం ముందు ఏ ప్రతికూల నినాదమైనా దూదిపింజెలా ఎగిరిపోతుంది. నా సిద్దాంతం కొద్ది రోజుల్లోనే ఓ మహాశక్తిగా రూపొంది ప్రపంచాన్ని స్వాదీనం చేసుకుంటుంది. ఈ అద్భుతమైన సిద్దాంతానికి మూలవిరాట్టునైనా నేను ఓ యుగపురుషుడుగా, ప్రపంచానికి ఏకైక దైవంగా కీర్తించబడతాను. ప్రస్తుతానికి నా దివ్యగణంలో ఇంచుమించు అన్ని దేశాలకు చెందిన ప్రతినిధులు వున్నారు. ఆషా ! ఆ మాత్రం చాలదు. ఆయా దేశాల అధినేతలు, అత్యున్నత స్థానంలో వున్న వాణిజ్యవేత్తలు, తమకో క్రేజ్ సృష్టించుకున్న ఇతర ప్రముఖులు మన దివ్యగణాలలో చేరిపోవాలి. అప్పుడే మనం అన్ని దేశాల నగరాల్లోకి చొచ్చుకుపోయేందుకు వీలుంటుంది."
అతను ఒక్కోసారి ఈ సిద్ధాంతానికి 'నా' అనీ, మరోసారి 'మన' అనీ ప్రయోగించడం చూసి ఆమె పెదవులమీద చిరునగవు ఉదయించింది.
ఆషాకు తెలుసు. అతనో ఉన్నత పర్వతమైతే, తానో అంతులేని అగాధం.
"ఆషా ! ఈ రోజు మన దివ్యగణంలోకి కొత్తవారెవరయినా వచ్చిచేరారా?"
"నైలీనా అని ఫారిన్ వుంచి ఓ యువతి వచ్చింది. ఆమె మీకు అదే మన ఆశ్రమానికి ఓ రోల్స్ రాయిస్ కారు బహుమానంగా తీసుకొచ్చింది."
"తను ఇప్పుడెక్కడుంది?"
"మీరు అవకాశమిస్తే దర్శనం చేసుకునేందుకు సిద్దంగా వుంది."
"అయితే లోపలకు పంపించు. ఈ రాత్రే ఆమెకు గురూపదేశం చేస్తాను"