Previous Page Next Page 
నెత్తుటిబొట్టు పేజి 36

    ఆమె ఎందుకో భయపడుతోంది. కాని చెప్పటాని కిష్టపడడం లేదు. అతని కామెమీద  ఆప్యాయతా, అనురాగం పెల్లుబుకుకొని వచ్చాయి. అనుకోకుండా ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి కొద్దిగా దగ్గరకు లాక్కున్నాడు.

    ఆమె కాదనలేదు. వెళ్ళవల్సిన చోటుకే వెడుతున్నానన్న అనుభూతి ఆమె మనసులో కలిగింది.

    "ప్రజ్ఞా ! నీకెలాంటి సహాయం కావల్సివచ్చినా సరే నీ వెనక నేవున్నానన్న సత్యం మరిచిపోకు."

    అతని మాటలు వీనుల్లో వేణువు ఊదినట్లుగా ధ్వనించాయి. అతని  భుజంమీద తల వాల్చుకోవాలన్న కోరికను కష్టంమీద ఆపుకుంది.


                   *                 *                 *


    స్వేచ్చా ప్రణయంమీద ఆచార్య జగదీష్ చెబుతున్న ఉపన్యాసం కోనసాగుతోంది. అతి విలాసవంతంగా
కట్టబడిన ఆడిటోరియంలో వేల సంఖ్యలో వున్న శ్రోతలు అత్యంత ఆసక్తితో ఆలకిస్తున్నారు.

    "మానవుడు 'సుఖం' లోంచి పుట్టి కష్టాల్లోకి కాలు మోపటానికి తాపత్రయపడుతూ వుంటాడు. ఈ కష్టాలనే సత్యమని భ్రమిస్తూ అనుక్షణం సుఖానికి దూరమవుతూ వుంటాడు.

    మనిషి ఉద్యోగంలో వుండనీ, వ్యాపారంలో వుండనీ, వృత్తిలో వుండనీ _ అతి భయంకరమైన యంత్రబద్దమైన జీవితానికి తనని తాను గురి చేసుకుంటాడు. మొదట ఆ శిక్ష తానే విధించుకుంటాడు. తర్వాత అందులోంచి బయటకు రాలేక తారట్లాడుతుంటాడు.

    జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి చేరుకుంటున్నా _ ఈ యాంత్రికత్వపు ఒంటరితనం అతన్ని నిర్దాక్షిణ్యంగా వెంటబడి తరుముతూ వుంటాయి.

    మనుషులు ఒకరినొకరు చేరువయినకొద్దీ మానసికంగా ఒకర్నొకరు హింసించుకుంటూ వుంటారు.

    బంధం ఈ హింసాకాండను పెంచుతూ వుంటుంది. తల్లీ కొడుకులు, తండ్రీ కొడుకులూ, అన్నదమ్ములూ. అక్క చెల్లెళ్ళు, అన్నిటికన్నా ఎక్కువగా భార్యాభర్తలు _ ఈ బంధం అనే చట్రంలో ఇరుక్కుని ఇమడలేక అనుక్షణం మానసిక రుగ్మతలకు లోనవుతూ వుంటారు.

    అశాంతి, అలజడి, అసంతృప్తి, నిర్లిప్తత, నిస్సహాయత మనిషిని తరిమితరిమి కొడుతూ వుంటాయి.

    అన్నిటికన్నా మించింది రెస్ట్ లెస్ నెస్. అన్నీ వుంటాయి అయినా ఇంకా ఏదో కావాలన్న తపన."

    ఈ అలసట నుంచి, అలజడి నుంచి తప్పించుకోవడానికి, రిలీఫ్ పొందడానికి మానవుడు అనేక కృత్రిమ సాధనాల మీద ఆధారపడతాడు. నిజాన్ని తెలుసుకోవడం కోసం ఎన్నో ప్రయోగాలు చేస్తూ వుంటాడు.

    అతని దృష్టి ఆధ్యాత్మికత మీదకు మళ్ళుతుంది. ఈ ఆధ్యాత్మికత అనేక రూపాల్లో వుంటుంది. మీకెవరూ సరియైన సలహాలు చెప్పరు. మీకు త్రోవ చూపిస్తారని ఆశపడ్డ వాళ్ళందరూ ఆచరించడానికి సాధ్యం కాని, కేవలం సిద్దాంతపరంగానే అందంగా వున్న ఉపన్యాసాలను చెప్పి మిమ్మల్ని కన్ ఫ్యూజ్ చేసేస్తారు. భగవద్గీతలోని ఒక్క శ్లోకానికి వంద పేజీల భాష్యం చెప్పి _ 'అమ్మో వేదాంత మంటే ఇదా' అన్నట్టు మిమ్మల్ని హడలగొట్టేస్తారు. సూక్ష్మమైన విషయాన్ని జటిలం చేసి పారేస్తారు. ఒక్క మెడిటేషన్ విషయమై తీసుకోండి. ఒక్కొక్కరూ ఒక్కొక్క పద్దతిని ఉపదేశిస్తారు. ఒకరు మంత్రం అక్కర్లేదంటారు. ఒకరు కావాలంటారు. ఒకరు రిలాక్స్ చేయాలంటారు. ఇంకొకరు కాన్ సన్ ట్రేషన్ సరియైన పద్దతంటారు..."

    ముక్తి పొందాలంటే పూజలే మూలాధార మంటారు పీఠాధిపతులు. ఉపవాసాలు చేసి కడుపు మాడుస్తూ రోజుకు పది పదిహేనుసార్లు స్నానాలు చేస్తూ, కనీసం పది పన్నెండు గడియలు పూజలు చేస్తూ, మంత్రాలు వల్లెవేస్తూ, అభిషేకాలు చేస్తూ ఇదే ముక్తిమార్గ మంటారు.

    ఇహ బాబాలు, దేముడమ్మలు  అరిచేతిలో వైకుంఠం చూపిస్తూ లౌక్యాన్ని ప్రదర్శిస్తూ, మంత్రాలు, మహత్యాలు చూపిస్తూ వాళ్ళ నామం తప్ప ఇంకొకటి జపించకుండా చేసి, మిమ్మల్ని బానిసలుగా చేసుకుని, ఎప్పటి కప్పుడు  ఊరిస్తూ సంవత్సరాలకు సంవత్సరాలు గడిపేస్తూ వుంటారు.

    మీ జీవితం కరిగిపోతూ వుంటుంది. మీ యౌవనం కరిగిపోతూ వుంటుంది. మీరు నిర్వీర్యులైన, మంత్రబద్ధులైన వేదాంతపు చిలకపలుకులు పలికే ప్రబుద్దుల్లా తయారవుతారు.

    ప్రేమ మూర్తులారా! ఎక్కడయితే ప్రేమ వున్నదో అక్కడ భగవంతుడున్నాడు. ఆ ప్రేమ మీలో వున్నప్పుడు ఆ భగవంతుడు మీలోనే వున్నాడు.

    మీ దేహమే ఓ దేవాలయం.

    దేవుడికి కూడా కోరికలుంటాయి. అలాగే మీలో వున్న దేవుడికి కూడా కోరికలుంటాయి.

    ఒక కోరిక ఇంకో కోరికతో కలిసినప్పుడు ఆ చల్లని సెగలు నుండి, ప్రేమ ప్రభంజనం నుండి ఓ దివ్యత్వం ప్రభవిస్తుంది.

    "అదే ముక్తికి మార్గం. అదే సంవత్సరాల తరబడి మీరు అన్వేషించిన నిజం. మాలిన్యం లేని శృంగారం, స్వార్ధం లేని శృంగారం _ అదే నిజమైన మెడిటేషన్.

 

 Previous Page Next Page