Previous Page Next Page 
భారతి పేజి 37

    పోస్టింగ్  వచ్చేదాకా  భారతి ఇంటికి వెళ్ళి వుండవచ్చు. ఆమెకింక  హాస్టలు నిబంధనలు  వర్తించవు. ఆ రాత్రి మల్లిక  గదిలో ఆమె మంచంమీద  ఇద్దరూ  ఒకరి ప్రక్క ఒకరు  పడుకున్నారు.

    "పోస్టింగ్  వచ్చేవరకూ  చందరాలలోనే  వుంటావా? ఇంతకూ  ఎక్కడ వస్తుందనుకుంటున్నావు నీకు?"

    బెడ్ లైట్ వెలుగులో, భారతి స్నేహితురాలివైపు  తిరిగి  ఆమె ముఖంలోకి చూస్తూ అంది. "నేను సంకల్పించిన పని వింటే  నాకు పిచ్చి ఎత్తిందని  నివ్వెర పోవుకదా?"

    "ఏమిటా  సంకల్పం? చెప్పు."

    "ఇక్కడకు అరవై డెబ్బయి  మైళ్ళ దూరంలో  కదిరి అని ఓ ఊరు  ఉంది. అక్కడ  పెద్ద కుష్ఠురోగుల  ఆసుపత్రి  వుంది. నన్ను  అందులో  నర్సుగా  నియమించమని  ప్రత్యేకంగా  ప్రార్ధిస్తూ దరఖాస్తు పెట్టుకున్నాను."

    మల్లిక  మ్రాస్పడి  పోయినట్లు. ఒక నిమిషంపాటు  మెదలకుండా  ఊరుకుని  తరువాత  నెమ్మదిగా  తేరుకుని  ఆమె భుజంచుట్టూ  చేయివేసి  అన్నది! "ఎంత  లోతుగా  ఆలోచించి  ఇలాంటి  నిర్ణయం  తీసుకున్నావో! నీకు పిచ్చి ఎత్తిందని  అనుకుంటానా? నీ నిర్ణయానికి  అభినందిస్తాను."

    స్నేహితురాలి  వద్దనుంచి  అంత త్వరగా  అనుమతిపత్రం లభించినందుకు, భారతి ఉప్పొంగిపోయింది. ఆమె వీపుమీద చేయిపెట్టి  రాస్తూ. "నీ హృదయంలో  అమృతానికి  లోటులేదు....కాని ఒకందుకు అసూయ కలుగుతున్నది సుమా! రేపు ఏ రాజకుమారుడో  వచ్చి నిన్ను తన స్వంతం చేసుకున్నప్పుడు  ఆ పాత్రలోని  ధార  ఇటువైపు  మరలదు" అంది.

    హఠాత్తుగా  మల్లిక  ముఖం  గంభీరంగా  మారిపోయింది. ఏమీ జవాబు చెప్పకుండా  వూరుకుంది.

    భారతి ఆమె వీపుమీద నుంచి  చేయితీసి, పరుపుమీద  ఒక ప్రక్కకు వాల్చి వున్న ఆమె ముఖాన్ని, చుబుకం  పట్టుకుని  పైకెత్తుతూ, "చెప్పవా?" అంది మృదువుగా.

    "ఏమిటే?" అంది మల్లిక  కంపిత  స్వరంతో.

    "అదే! రాజకుమారుడి గురించి  ఎప్పుడు? ఎక్కడ? ఎవరు?"

    మల్లిక ముఖంలో  రంగులు మారాయి. "ఇప్పుడు  నా పెళ్ళికేమి తొందర వచ్చిందే" అంది తడబడే కంఠంతో.

    "తొందరే వచ్చింది! నువ్వు  మరీ పసిపాప  పనుకుంటున్నావా  ఏమిటి?"

    "మా అమ్మలానే  మాట్లాడుతున్నావు  నువ్వూనూ. చూద్దాంలే" అని ముక్తసరిగా  ఊరుకుంది  మల్లిక  తరువాత  మాట మార్చింది తాను. ముందు ముందు  వృత్తి రీత్యా  ఎక్కడ ఉన్నా  వారానికి  ఒక ఉత్తరమైనా  రాస్తూ  వుండాలనీ, రెండు మూడు నెలలకు  ఒకసారయినా  తనని చూడటానికి వస్తూ  వుండాలనీ హెచ్చరించింది.

    మల్లిక చాలాసార్లు హాస్పిటల్  వార్డులలో  తోటి విద్యార్ధి  ఒకతనితో  సన్నిహితంగా  మెలుగుతూండటం. అతనితో  మాట్లాడుతుంటే  ఆమె కళ్ళలో  ఓ విధమైన  మెరుపు  గోచరించటం  భారతి  అనేక పర్యాయాలు గమనించింది. అయినా స్నేహితురాలి దగ్గిర  ఆ ప్రసక్తి ఎప్పుడూ  తీసుకురాలేదు. ఈవేళ  సందర్భం  వచ్చింది కదా అని ఆ యువకుడి ప్రమేయం  తీసుకువచ్చి  ప్రశ్నిద్దామని  కుతూహలం  కలిగింది. అయినా  మల్లిక  తన వివాహం విషయంలో  అనాసక్తంగా  వుండటం గ్రహించి, కుతూహలాన్ని  తనలోనే  అణుచుకుంది. తరువాత స్నేహితురాళ్ళిద్దరూ  వేరే కబుర్లలో  పడిపోయారు.


                                 0    0    0


    మరో నెల రోజుల్లో  భారతికి  పోస్టింగ్  ఆర్డర్స్  వచ్చాయి. కోరికో, కలో గాని అది ఫలించింది. ఆమెను కదిరిలో లెవ్రసీ  హాస్పిటల్ లో  వేశారు. ఈ నెలరోజుల్లోను  సగం  కాలం ఆమె చందరాలలో  గడిపింది. కాని, ఒక్కోరోజు ఒక్కో యుగంలా  గడిచి  ఆమెకక్కడి జీవితం  దుర్భరంగా కనిపించింది. పాత జ్ఞాపకాలు  కందిరీగల్లా  కుడుతున్నాయి. ఇహ అక్కడ వుండలేక, ఊళ్ళో  తనని  అభిమానించే  వారందరి  దగ్గిరా  సెలవు  తీసుకుని మల్లిక దగ్గిరకే  వచ్చేసింది.
    భారతి  వెళ్ళిపోయేముందు  మల్లిక  దుఃఖం  ఆపుకోలేక స్నేహితురాల్ని  కావలించుకుని  వెక్కి వెక్కి  ఏడ్చేసింది. భారతి కూడా ఏడ్చింది. ఇద్దరూ పసిపిల్లల్లా  ఏడ్చారు.

    భారతిని ఎక్కించుకున్న  రైలు....స్టేషన్  వదిలి వెళ్ళిపోయాక చాలాసేపు  ప్లాట్ ఫారంమీద స్తబ్దుగా  నిలబడిపోయింది  మల్లిక. తరువాత  తేరుకుని, కళ్ళు  తుడుచుకుని, బరువుగా  అడుగులు వేస్తూ బయటకు కదిలింది.


                                 *    *    *


    కదిరి ఊళ్ళోకి  అడుగు పెడుతూనే  భారతి  ఆ గ్రామాన్ని  ఎందుచేతనో  ప్రేమించింది. పచ్చని పొలాలు, దూరంగా ఆకుపచ్చని  పర్వత కనుమలు, ఎవరితోనూ సంబంధం లేదన్నట్లుగా, ఒంటరిగా, గంభీరంగా, దయగా  పొడగట్టిందా  ఊరు.

    ఆ ఊళ్ళో  రైల్వేస్టేషన్  వుంది. తన సామాను  స్టేషన్  మాస్టర్ కి అప్పగించి, బయటకు వచ్చి, ఎదురైన ఒకరిద్దరు  గ్రామస్థులను  తను  పోవలసిన దారి అడిగి  తెలుసుకుని  మెల్లగా  బయలుదేరింది.

    స్టేషన్ కూ, లెప్రసీ హాస్పిటల్ కూ  దాదాపు  మైలు  దూరముంది. ఎండలో  అంతదూరం  నడవటంవల్ల  ఆమె సుకుమారమైన  దేహం  అలిసిపోయి, ముఖమంతా  చిరుచెమటలు  క్రమ్మివేశాయి, చివరకు చేరుకుంది.

    చుట్టూ  పది అడుగుల ఎత్తున  ప్రహరీ  గోడ, మధ్యలో  పెద్దగేటు, ఆ గేటు ముందు ఆసక్తిగా  తిలకిస్తూ  నిలబడింది  భారతి.

    గేటులో నుండి  లోపలి  విశాలమైన  ప్రదేశం  కనిపిస్తూంది. ఎత్తుగా  పెరిగిన  చెట్లూ, చుట్టూ చిన్న చిన్న పెంకుటిళ్ళూ, అటూ ఇటూ  తిరుగుతూ  అక్కడక్కడ  మనుష్యులూ....

    "ఏం కావాలమ్మా?"  అనడిగాడు   ప్రక్కనుండి  వచ్చినగేటు  కాపలా  మనిషి.

    భారతి అతని  వంక చూసి, తను  వచ్చిన పని చెప్పింది.

    "రండి" అని  అతను గేటు  తెరిచాడు. చేయెత్తి  దూరంగా కనిపిస్తున్న  పెంకుటింటి వైపు  చూపుతూ, "అది ఆఫీసమ్మా, డాక్టరుగారు  వుంటారక్కడ. వెళ్ళి కనిపించండి" అని చెప్పాడు.

    మరో అయిదు నిమిషాల్లో  భారతి ఆఫీసు  గది ఇవతల  నిలబడి. "మే ఐ కమ్ ఇన్ సర్?" అనడిగింది వినయంగా.           

    "యస్" అన్న  కంఠం  వినబడింది  లోపలి నుండి.

    భారతి  లోపలికి అడుగు పెట్టి, అక్కడ  కూర్చుని వున్న డాక్టరును చూసి తెల్లబోయింది.
    "మీరా?" అంది అప్రయత్నంగా.

    యాభయి ఏళ్ళు పైబడి, బట్టతలతో  వున్న  ఆ డాక్టరు  ఆమె వంక పరీక్షగా  చూశాడు. ఆయన కళ్ళలో ఆశ్చర్యంతోపాటు  పెదవులపై వ్యంగ్య పూరితమైన నవ్వొకటి  మెదిలింది.

    "నువ్వా? భారతి అంటే  ఎవరో అనుకున్నాను, నర్సింగ్ పాసయ్యావన్నమాట!"

    అవునన్నట్లు  భారతి  తల ఊపింది.

    "పాపం, అప్పుడు చాలా  జబ్బు  పడినట్లున్నావు. ఇప్పుడెట్లా  వుంది. ఆరోగ్యం?"

    ఆమె ముఖం  వాడిపోయింది. తను తండ్రితో  బెజవాడ వెళ్ళి చూపించుకున్న  డాక్టరు ఆయనే, తన వ్యాధి పేరు మొదటిసారిగా  విన్నది ఈయన  నోటివెంటే.

    తిరిగి  ఆయన దగ్గిరకే  నర్సుగా  పనిచేయవలసి  రావటం తలచుకుని  ఆమె మనసు  ఏదోలా  అయిపోయింది. కాని, అంతలోనే ధైర్యం తెచ్చుకుంది మళ్ళీ. తను ఇటువంటి  సున్నితమైన విషయాల గురించి బాధపడకూడదు.

    "బాగానే వుంది" అంది నిశ్చలమైన  కంఠంతో.

    "ఒంటిమీద  ఆ మచ్చలన్నీ  పోయాయా?"

    ఆ ఒక్క మాటతో  అతను ఎంత వెకిలిమనిషో, అతని మనస్సు ఎంత  జటిలమైనదో  ఆమె అర్ధం చేసుకుంది.

    కలిగిన  అసహ్యాన్ని  ముఖంలో  కనిపించకుండా  ప్రయత్నిస్తూ తల ఊపింది.

 Previous Page Next Page