మొదటి ఏడు మధ్యలో నెలరోజులు సెలవుమీద ఒకసారి చందరాల వెళ్ళి గడపటానికి వీలయింది. ఆ నెలరోజులూ ఆమెకేమీ తోచలేదు. ఏదో పోగొట్టుకున్నట్లు బాధపడుతూనే వచ్చింది.
ఆ ఏడు చివరిని విశాఖపట్నం తన సహాధ్యాయినులతో వెళ్ళి మొదటి సంవత్సరం పరీక్షలు రాసి వచ్చింది.
భారతి పరీక్ష పాసయింది.
* * *
నాలుగేళ్ళలో ఎన్నయినా సంఘటనలు జరగవచ్చు: జరగకుండానూ వుండవచ్చు.
ఒకసారి నాగరాజు భారతికి ఉత్తరం రాశాడు. సారధికి మళ్ళీ పెళ్ళి చేశాడట గంగాధరంగారు. ఆ అమ్మాయి పేరు కుంతల. బోలెడు కట్నం తీసుకొచ్చిందిట. ఆమె తలిదండ్రులు బాగా ఆస్తిపాస్తులు వున్నవారు.
సారధి ఆ అమ్మాయితో హాయిగా జీవితం గడిపేస్తున్నాడట.
ఈ విషయమంతా మల్లికకు చెప్పి నవ్వింది భారతి.
"నవ్వుతావేం? ఏడుపును నవ్వుగా మార్చుకున్న ఆడదాన్ని నిన్నొకత్తినే చూశాను" అంది మల్లిక విసురుగా.
"పోనీ పాపం, నా పతి సుఖపడుతున్నాడని...." అంది భారతీ తిరిగి నవ్వుతూ.
"నీలాంటి పతివ్రతలు దేశంలో పదిమంది వుంటే మళ్ళీ పది శతాబ్దాలు వెనక్కి వెళ్ళి జీవించాల్సి వుంటుంది."
"కోప్పడకు మల్లికా! నా నమ్మకాలు నాతోనే అంతమౌతాయి. ఈ ప్రభావం యితరులమీద ప్రసరింపజేయును."
బయటకు నవ్వేసిందేగాని, ఆరోజు ఎంత భారమైన రాత్రి గడిపిందో ఒక్క భారతికే తెలుసు. ఏడ్చి ఏడ్చి ముఖం వాచిపోయింది. కళ్ళు మంటలు పుట్టాయి. మరునాటికి జ్వరం వచ్చినట్లుగా తయారయింది.
'ఈ లోకం ఎక్కడ వుంది? నేనాయన్ని ఎందుకు మరిచిపోలేకుండా వున్నాను?' భారతికి అర్ధం కాలేదు.
* * * *
కాలప్రవాహం చకచక సాగి భారతి నాలుగో ఏడులో ప్రవేశించింది. కర్తవ్య నిర్వహణలో ఆమెకు ఊపిరి సలపటంలేదు. మరి ఏ యితర ఆలోచనలనూ ఆమె మనసులోకి చొరవియ్యటం లేదు.
మరి ఓ ఆరు నెలలో ఆమె కోర్సు పూర్తయిపోతుంది. ఆ దశలో నాగరాజు ఆమెకు వైర్ ఇచ్చాడు__రాధమ్మకు హటాత్తుగా జబ్బు చేసిందనీ, చాలా సీరియస్ గా వుందనీ, వెంటనే బయల్దేరి రమ్మనీ....
భారతికి గుండె ఆగిపోయినట్లయింది. క్షణంపాటు మతి చలించినట్లయింది. అంతలో తేరుకుని అధికారుల దగ్గర సెలవుతీసుకుని చందరాల ప్రయాణమైంది.
ఆమె ఊరు చేరుకునేసరికి మధ్యాహ్నం దాటిపోయింది. తను ఇంటిముందు నలుగురయిదుగురు మనుషులు కూర్చుని వున్నారు. "పిన్నీ!" అని అరుస్తూ లోపలికి పరుగెత్తింది.
రాధమ్మ మంచంమీద పడుకోపెట్టబడి వుంది. కళ్ళు మూతలు పడివున్నాయి, స్పృహలో లేదు. విపరీతమైన ఆయాసంతో ఆమె చాతీ ఎగిరి పడుతూంది.
నాగరాజు భారతికి ఎదురుగా వచ్చాడు.
"ఏం జరిగింది?" అనడిగింది కంపితస్వరంతో.
నాగరాజు చెప్పాడు. రాధమ్మకు నిన్న ఉన్నట్లుండి ఆయాసం, దగ్గు, జ్వరం ముంచుకు వచ్చిందని ఊళ్లోని ఆచార్యులుగారు వచ్చి పరిస్థితి చూసి, మైలవరం వెళ్ళి, అక్కడ కొత్తగా ప్రాక్టీసు పెట్టిన డాక్టర్ని కారులో తీసుకొచ్చాడట. ఆయన పరీక్షచేసి "ఇది వైరస్ న్యుమోనియా. పరిస్థితి చాలా ప్రమాదకరంగా వుంది. వెంటనే హాస్పిటల్లో ఎడ్మిట్ చేయండి" అని చెప్పి అప్పటికి కొన్ని ఇంజక్షన్లు చేసి వెళ్ళిపోయాడట.
రాధమ్మకు అప్పటికింకా పూర్తిగా స్పృహపోలేదుట. బలవంతంగా కళ్ళు తెరిచి 'నేనిక్కడ నుంచి కదలను?' అన్నట్లు సంజ్ఞలు చేసిందట. కొంతసేపు గడిచాక మళ్ళీ కళ్ళు తెరిచి 'భారతికి కబురు చేయండి' అన్నట్లు సంజ్ఞలు చేసి చూపించిందట. తరువాత ఆమెకు తెలివి తప్పిపోయింది.
భారతి పిన్ని మంచంమీద కూర్చుని చేయిపట్టుకుని చూసింది.నాడి పలుచగా కొట్టుకుంటూంది. స్మృతి తప్పిపోయికూడా ఆమె పడే అవస్థ. నరకయాతన చూసేసరికి ఆమె చెంపలమీద కన్నీళ్ళు కాలువలు కట్టాయి.
"నీ జీవితమంతా నాకోసం ధారపోశావు పిన్నీ! నిన్నెంతో సుఖ పెట్టాలనుకున్న నా ఆశలు అడియాశలు చేస్తున్నావా?"
ఇంతలోనే ఆమెలో ఆవేశం పొంగి పొర్లింది. "ఎంత కష్టపడయినా సరే నిన్ను బ్రతికించుకుంటాను పిన్నీ!నువ్వేం తప్పు చేశానని ఇంత ముందుగా వెళ్ళిపోవాలి?"
మంచంమీద నుంచి లేచి నాగరాజువంక తిరుగుతూ అంది: "వాకిట్లో వున్న కారు ఎవరిది నాగరాజూ?"
"టాక్సీ డాక్టరుగార్ని తీసుకురావటం కోసం మైలవరంలో తీసుకున్నాను. అప్పటినుంచీ ఎప్పుడేం అవసరం వస్తుందో అని మన క్రిందే వుంచాను."
క్షణంపాటూ ఆమె కన్నులు ఆనంద ప్రపూర్ణాలయినాయి. "నీ మేలు జన్మలో మరిచిపోను నాగరాజూ! మా కోసం నువ్వు పడుతున్న శ్రమకు ఎన్ని జన్మలెత్తినా ఋణం తీరదు.... పద. క్షణమైనా ఆలస్యం చేయటానికి వీల్లేదు. పిన్నిని వెంటనే గుంటూరు తీసుకెళ్ళాలి."
నాగరాజు వెంటనే అందుకు సిద్ధమయ్యాడు. మలుగురు మనుషుల సాయంతో రాధమ్మను కారు వెనకసీట్లో పడుకోబెట్టారు. భారతి ఆమె తల దగ్గర కూర్చుంది. నాగరాజు ముందు సీట్లో కూర్చున్నాడు. కారు కదిలింది.
ఎంతలో ఎన్నెన్ని విపరీతాలు జరుగుతూంటాయి! భారతి దుఃఖాన్ని దిగమ్రింగుతూ మౌనంగా కూర్చుంది.
గుంటూరు చేరేసరికి రెండు గంటలు పట్టింది.... రాధమ్మని చూసి వెంటనే వార్డులో చేర్చుకున్నారు.
ఆ రాత్రి, మరునాడు పగలూ గడిచి, తిరిగి రాత్రి ప్రవేశించింది. భారతి పిన్నిని ఒక్క క్షణమైనా వదలటంలేదు. పిచ్చిదానిలా ప్రక్కనే కూర్చుని చూస్తూంది. తోటి సిస్టర్లు వచ్చి ఆమెను భోజనానికి రమ్మనీ, కనీసం కాఫీ అయినా తీసుకోమనీ ఎంత బ్రతిమాలినా అక్కడి నుంచి కదల్లేదు. అలాగే కళ్ళు విప్పుకుని చూస్తూంది.... కళ్ళు మూసుకుని పడుకున్న పిన్ని వంక.
హాస్పిటల్లో ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎంతో హైరాన పడ్డారు. అయినా ఆమె ముఖంమీద ఆవరించివున్న మృత్యుచ్చాయలు తొలగిపోలేదు. ఆరాత్రి అవి అంతకంతకూ ఆమె ముఖంమీద చిక్కగా అలుముకున్నాయి. చివరకు అర్ధరాత్రివేళ స్మృతిలేని ఆమె దేహం అంతిమ శ్వాసను విడిచిపెట్టి, దీర్ఘస్మృతిగా మారిపోయింది.
* * *
ఎంతటి బరువైనా తనలో ఇముడ్చుకోవటం నేర్చుకున్న భారతి మరో ఆరునెలలకు ఫైనల్ పరీక్ష పాసయి స్టాఫ్ గా మారిపోయింది.
మల్లిక స్నేహితురాల్ని గాఢాలింగనం చేసుకుని అభినందించింది. "ఎందుకూ పనికిరాని శూన్యంగా మిగిలిపోతాననుకున్న నీవు ప్రయోజకురాలివై, నాకంటే ఒక సంవత్సరం ముందుగానే ప్రపంచంలో అడుగు పెడుతున్నావు. నువ్వు మహా తపస్వినివి, భారతీ!" ఆమె కన్నులలో ఆనందబాష్పాలు నిలిచాయి.
"ఇదంతా నీ చలవే, మల్లికా! నీవే లేకుంటే నేను నిజంగానే ఎందుకూ పనికిరాని దాన్నిగా అయిపోయి ఉండేదాన్ని."
మల్లిక అప్పుడు ఎమ్.బి.బి.యస్. పాసయి హౌస్ సర్జన్ చేస్తూంది. మరో పది నెలల్లో ఆ లాంఛనం ముగిసి సంపూర్ణమైన డాక్టరుగా జీవితరంగంలో ప్రవేశిస్తుంది.
ఆ రోజంతా ఇద్దరూ ఒకర్ని ఒకరు వదలకుండా కలిసి తిరిగారు. ఇద్దరూ తిరిగి మంచి హోటలుకు వెళ్ళి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. ఆ సాయంత్రం హాయిగా సినిమా చూసి వచ్చారు.