Previous Page Next Page 
రాక్షస నీడ (రెండవ భాగము) పేజి 37


    "ప్లీజ్, విక్రం! నా ఉద్దేశం అదికాదు."
    "నీ మాటలకు అర్ధం ఏమిటి?"
    "నాకు ఈ కేసులోనుంచి బయటపడాలని లేదు."
    కారు ఎదురుగా వచ్చిన ఆటోను గుద్దుకోబోయి పక్కకు తోసింది.
    "జాగ్రత్త!" గౌతమ్ ముందుకు పడబోయి ఆపుకున్నాడు.
    "నీ మాటలు వింటుంటే న అచేతిలో ఇవాళ ఎవరికో చావు తప్పదని పిస్తోంది" అన్నాడు విక్రం.
    గౌతం మాట్లాడలేదు.
    "ఈ కేసునుంచి బయటపడాలని లేదా?" ఆశ్చర్యంగా అడిగాడు.
    "నా ఉద్దేశం- ప్రయత్నించి బయట పడాలని లేదు."
    "డోంట్ బి ఫూలిష్!"
    గౌతం మౌనంగా రోడ్డుకేసి చూడసాగాడు.
    "మా యింటికి వెళ్దామా?"
    "ముందు ఇంటికి వెళ్తాను. అమ్మ ఆరోగ్యం బాగాలేదు."
    కారు గౌతం ఇంటికేసి పోతోంది.
    "గౌతం!"
    "ఊఁ....."
    "నీ రూపంలో తిరుగుతున్నావా డేవడో నీకు తెలుసుగదూ?"
    "గౌతం ఉలిక్కిపడ్డాడు.
    "అవును. తెలుసు! నీకు తెలుసుగదూ?"
    "ఎందుకలా అనుకున్నావ్?"
    "నే నా ప్రశ్న వేయగానే తుళ్ళిపడ్డావ్."
    "ఓ....అదా!"
    "నీకు తెలుసు కదూ?"
    "నేను చూడలేదు."
    "కాని అతడెవరో తెలుసు."
    "తెలియదు."
    "అబద్దం ఆడుతున్నావ్. అతడు నీకు తెలిసినవాడే. నీకు కావాల్సిన వాడు కూడా."
    "విక్రం!"
    "అందుకే నువ్వు ఈ కేసు నీ నెత్తిన వేసుకోవడానికి సిద్దంగా ఉన్నావు. అతన్ని రక్షించాలని చూస్తున్నావ్.
    "విక్రం! ఏమిటి నువ్వంటున్నది? అతడేవడో నాకు తెలియదు చెప్పాను." తీవ్రంగా పలికింది గౌతం కంఠం.
    విక్రం ఆలోచనలో పడ్డాడు.
    "గౌతం! నువ్వు పోయిన నెల ఏడో తేదీన రేస్ కు వచ్చావు గదూ?
    "నేనా? రేస్ కా?" ఆశ్చర్యంగా అన్నాడు.
    విక్రం ఆలోచిస్తూ వెంటనే సమాధానమివ్వలేదు.
    "నాకు ఆ అలవాటు లేదని నీకు తెలుసు. నువ్వు ఎన్నోసార్లు అడిగావు. అయినా నేను రాలేదు. ఏ తేదీ అన్నావ్?" పోయిన నెల ఏడో తేదీన నేను మద్రాసులో క్రికెట్ ఆడుతున్నాను" అనబోయి ఆగి "సర్దాన్ని చూడాలనిపించిందిరా. అందుకే రేస్ చూట్టానికి వచ్చాను" అన్నాడు.
    "ఐసీ." సాలోచనగా అన్నాడు విక్రం.
    "ఏమిటలా అన్నావ్? నా మీద నీకూ అదే-ఇద్దరు వ్యక్తులు ప్రవర్తిస్తున్నారని అనుమానంగా ఉందా?"
    విక్రమ్ చెయ్యి స్టీరింగ్ మీద కొద్ది క్షణాలు బిగుసుకుంది.
    "అంటే అందరూ అలా భావిస్తున్నారా?"
    "అవును!"
    "ఇందుమతి?"
    "ఆమె కూడా."
    "ఎందుకలా చేస్తున్నా వనుకుంటున్నారు?"
    "అదే నాకూ అర్ధం కావడం లేదు."
    "ఐసీ."
    "ఏమిట్రా ఏదో పెద్ద రహస్యాన్ని కనిపెట్టినట్టుగా ముఖం పెట్టావ్?" నవ్వుతూ అన్నాడు గౌతం.
    "అవును. కనిపెట్టాను."
    "ఏమిటి నీ మొహం కనిపెట్టింది?"
    "ఈ కేసునుంచి నువ్వు ఎందుకు బయటపడాలని అనుకోవడం లేదో తెలిసింది."
    "నేను అలా అనలేదే!"
    "అలా అనలేదనుకో....అయినా......!"
    కారు గౌతం ఇంటి ముందు ఆగింది.
    గౌతం కారు దిగి స్నేహితుడికి థాంక్స్ చెప్పి తల వంచుకొని చకచక లోపలకు నడిచాడు.
    అలా వెళ్తున్న స్నేహితున్ని కొన్ని నిముషాలు జాలిగా చూసి కారు స్టార్టు చేశాడు విక్రం.
    గౌతం గేటు తెరుచుకొని చిన్నగా అడుగులు వేస్తూ లోపలకు నడిచాడు.
    ఇంట్లోకి వచ్చిన గౌతం ను కళ్ళప్పగించి చూశారు పనివాళ్ళు. వాళ్ళ చూపులు గౌతం గుండెకు బాకుల్లా గుచ్చుకుంటున్నాయి.
    "ఏమిటలా చూస్తారు?" విసుగ్గా అన్నాడు.
    అందరూ గాభరాపడి ఎవరి పనుల్లోకి వాళ్ళు జొరబడ్డారు. గౌతం ఓపిక లేనట్టుగా డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు.
    వంటమనిషి కాఫీ తెచ్చి ఎదురుగా పెట్టింది.
    "రంగమ్మా! అన్నపూర్ణమ్మ నీరసంగా పిలిచింది.
    "వస్తున్నా!" అంటూ రంగమ్మ అన్నపూర్ణమ్మ గదిలోకి వెళ్ళింది.
    "ఎవరొచ్చారు?"
    "పెద్దబాబుగారు."
    "వచ్చాడా? ఎప్పుడోచ్చాడు? కాఫీ ఇచ్చావా టిఫిన్ పెట్టావా?" తల్లి ఆత్రంగా అడగడం వినిపించింది గౌతంకు.
    "ఇప్పుడే వచ్చాడమ్మా. కాఫీ తాగుతున్నాడు."
    "వెంటనే టిఫిన్ తయారుచెయ్యి. దోసెలు వెయ్యి. వాడికి ఇష్టం ఆఁ.....కరకరలాడే లా ఉండాలి."
    తల్లి పురమాయింపుకు గౌతం తనలో తనే నవ్వుకున్నాడు. తనను చూసి తనే జాలిపడుతున్నట్లుగా అనిపించింది గౌతంకు.
    "ఛ! ఏమిటిది? సెల్ఫ్ పిటీ! నో! సెర్ఫ్ పిటీ చాలా భయంకరమైంది. తను దానిని దరికి చేరనివ్వకూడదు.
    "రంగమ్మా! రంగమ్మా!" కేకలువేస్తూ ఉత్సాహంగా మమేడ మెట్లు దిగి వస్తున్న రవి అకస్మాత్తుగా కాళ్ళకు బంధాలు పడినట్టుగా ఆగిపోయాడు.
    మూడు మెట్లు పైనే ఆగిపోయాడు. ముఖంలో కోపచ్చాయలు కొట్టోచ్చినట్లుగా కనిపించాయి. గౌతం రవిని చూసీ చూడనట్టే తల వంచుకొని కాఫీ తాగుతున్నాడు.
    "మళ్ళీ ఎందుకొచ్చావ్?"
    "గౌతం చివ్వున తల తిప్పి చూశాడు.
    "ఇంటికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి." ఉసిగా మెట్లు దిగి దగ్గర కొచ్చి, గౌతం ముఖంలోకి చూసి గతుక్కుమన్నాడు.
    "నువ్వా!" అప్రయత్నంగా అన్నాడు రవి.
    "నన్ను కూడా గుర్తించలేదా? అంటే నాలాంటివాడితో, మరొకడితో నీకు లావాదేవీ లేమైనా ఉన్నాయా?" తమ్ముడి ముఖంలోకి చురుగ్గా చూశాడు గౌతం.
    రవి తడబడ్డాడు.
    "నీలాంటివాడితో నాకేం లావాదేవీలు?"
    "మరి నన్ను చూసి ఎందుకొచ్చావ్ మళ్ళీ అన్నావ్. ఎవరనుకొని అన్నావ్?"
    "ఓ అదా! అదీ....."
    "చెప్పు!" గౌతం కంఠం గంభీరంగా పలికింది.
    "నా ఫ్రెండొకడు అప్పుకోసం నా పాణం తీస్తున్నాడు. పెద్దశనిగా తయారయ్యాడు."

 Previous Page Next Page