Previous Page Next Page 
బొమ్మా - బొరుసూ పేజి 36


    "అసలిదంతా నావల్లే జరిగిందనుకుంటాను! నేను రాకపోతే ఇంతగొడవ అయుండేది కాదు! కదూ?" అడిగాడతను బాధగా.
    "ఊహు! నువ్వు రావడం మంచిదయింది. లేకపోతే రేపు ఉదయంవరకూ ఆ కూపంలోనే ఉండాల్సివచ్చేది....."
    రాత్రి పదకొండు గంటలకు బస్ లో ఆమె ఊరు బయల్దేరిరారివురూ ఉదయం అయిదు గంటలకు ఇంటి తలుపు తట్టినహేమనూ, ఆమెవెనుక చంద్రకాంత్ నూ చూసిఆశ్చర్యపోయాడు రామరాజు. ఏదో మళ్ళీ రభస జరిగి ఉంటుందని అర్ధమయిపోయిందతనికి.
    "పాపాయి ఏదమ్మా?' అడిగాడు రామరాజు.
    "ఆదుర్మార్గుడే లాక్కున్నాడు! తనకే రావాలిట!"
    "అఘోరించనీ! అదెలాగో కోర్టు ద్వారా తేల్చుకుందాం!"
    "త్వరగా డైవర్స్ కోసం ప్రయత్నించండి నాన్నా! అది లభించేవరకూ నాకు మనశ్శాంతి ఉండదు....."
    "అలాగేనమ్మా ఇంక ఈ నిర్ణయం మార్చుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను ఆ రాక్షసుడి చేతిలో ఉంచి ఇంతకాలం హింసలపాలుచేశాను! ఇంకొక్కక్షణం కూడా ఈ అన్యాయం జరగడానికి వీల్లేదు...."
    "నేను వెళతాను హేమగారూ! మరోసారి వస్తాను...." అన్నాడు చంద్రకాంత్.
    "అసలు నువ్వేం పనిమీద వచ్చావో అడగటమే మర్చిపోయాను!" తేరుకుంటూ అందామె.
    "వసుంధర ఈ నెలాఖరుకి విజయవాడరావాలని అనుకుంటోంది అప్పుడు మీరుండేదీ లేనిదీ తెలుసుకోవాలని ఉత్తరం రాసి నాకిచ్చింది నేను హైద్రాబాద్ నుంచి మద్రాస్ వెడుతూ మిమ్మల్ని చూద్దామని దిగానిక్కడ....."
    "కొద్ది నిమిషాలుండు! కాఫీ చేసుకొస్తాను!" లోపలకు నడుస్తూ అందామె.
    శ్రీనివాసరావ్ వెంటనే పాపతో సహా తన తల్లిదండ్రుల దగ్గరకు చేరుకున్నాడు. వాళ్ళు అతనిని చూసి నిర్ఘాంతపోయారు.
    "హేమ ఏదీ!" అడిగాడతని తండ్రి.
    "ఇంట్లోనుంచి బయటకు గెంటేశాను. అందుకే పాపాయిని ఇక్కడకు తెచ్చేశాను!" "అదేమిటి? మళ్ళీ ఏమయింది?"
    "ఎవడెవడో దానికోసం వచ్చి సరససల్లాపాలాడడం నేనుసహించలేను!"
    "ఎవరువచ్చారు?"
    "ఎవడోదాని చెత్తరచనలు చదివేవారట!"
    "నీకు తొందరెక్కువ శీనూ! జీవితంతో ఆటలాడుతున్నావ్ నువ్వు!" మందలింపుగా అందతని తల్లి.
    "నీకు తెలీదు ఊరుకో అమ్మా! దానితో సంసారం చేస్తోంది నేను! అది అసలు ఆడది కాదు నీతి, సిగ్గూ, శరంలేని రాక్షసి అది! అలాంటిపొగరుమోతు దానికి అదే సరయిన శిక్ష! నేను దాన్ని వదిలేస్తున్నాను మరో వివాహం చేసుకుంటాను. మొగుడు చెప్పినట్లువిని నోరు మూసుకుని పడివుండే ఆడపిల్లలు కోటిమంది దొరుకుతారు రెండో పెళ్ళి వాడినయినా కట్నమిచ్చి కాళ్ళుకడిగి కన్యాదానం చేస్తారు నాకు..." అన్నాడతను ఆవేశంగా.
    అతని తల్లిదండ్రులు ఎంత వాదించినా వినిపించుకోలేదుతను. ఆ రాత్రికే విజయవాడ చేరుకున్నాడు. విడాకులు మంజూరు కావాలంటే మరో సంవత్సరం వరకూ ఓపిక పట్టాల్సిందే! ఆ తరువాత తను వివాహం చేసుకొంటాడు. మగాడిలా కాకుండా ఆడదానిలా ప్రవర్తించే ఆడది కావాలి. బాధ్యతలు విస్మరించి, స్వేచ్చగా, అధికారాలకోసం వివాదాలుపెట్టుకునే స్త్రీ కాదు తనక్కావలసింది. నాగమణికి ఆ అర్హతలన్నీ ఉన్నాయ్. ఆమె తనను తప్పక అంగీకరిస్తుంది. అసలామెయేనాడో శారీరకంగా తనభార్య అయిపోయింది. ఆమెకింకేం అభ్యంతరం ఉంటుంది? హేమవచ్చిన తరువాత తను ఆమెను కలుసుకోవడం సాధ్యపడలేదు. అంతకు ముందు రెండుమూడుసార్లు ఆమె ఇంటికెళ్ళికొద్దిసేపు మాట్లాడివచ్చాడు.
    ఆ రోజు నాగమణి దగ్గరకెళ్ళి మాట్లాడాలని నిర్ణయించుకున్నాడతను. ఆమె ఒకచోటా తనొకచోటా ఎందుకింకా? ఆమెను తీసుకొచ్చేస్తే తనింట్లో తనతోనే ఉంటుంది. ఎలాగూ కొద్దిరోజుల్లో వివాహం చేసుకోబోయే వారేగా! ఆ సాయంత్రం ఆఫీసు నుంచి ముందుగానే బయల్దేరి నాగమణి ఆఫీసుకి చేరుకున్నాడతను.
    "చాలారోజులకు కనిపిస్తున్నావ్ బావా!" చిరునవ్వుతెచ్చిపెట్టుకుంటూ అందామె.
    "అవును! ఒకటి రెండుసార్లు వద్దామని ప్రయత్నించీ రాలేకపోయాను!" అన్నాడతను.
    "అలా కూర్చో!" తన టేబుల్ కెదురుగా వున్న కుర్చీ చూపుతూ అందామె. కుర్చీలో కూర్చున్నాడు శ్రీనివాసరావు.
    ఆమె తన దారిన తనుటైప్ చేసుకోసాగింది.
    "నీతో కొంచెం మాట్లాడాల్సిన పనివుంది నాగూ!" అన్నాడతనుకొద్దిసేపటి తర్వాత.
    "ఏమిటది" అడిగింది నాగమణి.
    "ఊహు! ఇక్కడ మాట్లాడేది కాదు ఎక్కడయినా ఏకాంతంగా కూర్చుని మాట్లాడుకుందాం!"
    "ఊహు! వీలుండదు బావ! నాతోపాటు ఎప్పుడూ ఎవ్వరో ఒకరుంటారు!"
    అబద్దమాడేస్తూఅందామె.
    "ఆఫీసునుంచి ఇంటికెళ్ళేప్పుడు ఎవరుంటారు?" ఆశ్చర్యంగా అడిగాడు శ్రీనివాసరావ్.
    "మా ఆఫీస్ టైపిస్ట్ ఒకామె కూడా నాతోనే వస్తుంది!"
    "కానీ ఇవాళ నీకు వేరేచోట కెళ్ళేపని వుందని ఆమెతో చెప్పవచ్చుగా!"
    "ఊహు! బావుండదు!"అతనివంక చూడకుండా టైప్ చేసుకుంటూ అందామె. ఆమె ధోరణి శ్రీనివాసరావుకి కష్టం కలిగించింది.
    "అదికాదు నాగమణీ! మనం చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి! మన భవిష్యత్తుగురించి నిర్ణయం తీసుకోవాలి!" వివరంగా అన్నాడతను.
    "అక్కావాళ్ళు వచ్చారా బావా?" అడిగిందామె సందర్భంమారుస్తూ.
    "ఆ! వచ్చారు! మళ్ళీ శాశ్వతంగా వెళ్ళిపోయిందికూడా!"
    "అంటే!" టైపు చేయడం ఆపి అడిగిందామె. "ఈసారి ఇద్దరికీ పూర్తిగా తెగతెంపులయిపోయినట్లే!"
    నాగమణి మాట్లాడలేదు.
    మళ్ళీ టైప్ చేసుకోసాగింది. ఆమెకు అంతకుముందు కొద్ది రోజులపాటు చదివిన హేమ నవల గుర్తుకొచ్చింది. అందులోని హీరో శ్రీనివాసరావే అనిపించింది తనకు. ఆ నవల చదువుతోంటే అతని దుర్మార్గం, అతని దౌర్జన్యం, అతను భార్యను పెట్టేహింసలూ అవన్నీ పూర్తిగా కాకపోయినా కొంతవరకయినా నిజాలుకాకపోవని అనిపించిందామెకి.
    హేమరాసినట్లు కథానాయకురాలిది ఎలాంటి తప్పూ కాదని కూడా తననుకోవడంలేదు. ఏదేమయినా శ్రీనివాసరావ్ లాంటివ్యక్తితో తెలిసికూడా జీవితాన్ని పంచుకోడానికి అంగీకరించడం సబబుగానే కనిపించడం లేదామెకి. మరింకెప్పుడూ అతనిని కలుసుకోకూడదనీ, తెలివితక్కువగా అతనికి తనను అర్పణ చేసుకోకూడదనీ నిర్ణయించుకుందామె. అతనిగురించి తలుచుకున్న కొద్దీ అయిష్టం చోటు చేసుకోసాగింది.
    "నాగమణీ! దయచేసి ఈ ఒక్కరోజు నాతో కొద్దిసేపు గడుపు ప్లీజ్!" బ్రతిమాలుతున్న ధోరణిలో అన్నాడతను.
    "బావుండదు బావా! మాట్లాడేదేదో ఇక్కడే మాట్లాడు! ఫరవాలేదు. ఇక్కడమన మాటలు వినేవారెవరూ లేరు....." అందామె.
    అతనికేం చేయాలో పాలుపోవడం లేదు. ఆమె వైఖరికి అతనికి ఆశ్చర్యం, కోపం రెండూ కలిగిస్తున్నాయ్.
    గత్యంతరంలేక చెప్పడం ప్రారంభించాడతను.
    "నాగమణీ! మరికొద్ది రోజుల్లో మా విడాకుల తతంగం పూర్తయిపోతుంది. అప్పుడు మనిద్దరం వివాహం చేసుకుందామని అనుకున్నాంగుర్తుందా! నేను ఇప్పుడు ఒంటరితనం భరించలేకపోతున్నాను. నువ్వు ఒక్కదానివే వేరేచోట ఎందుకూ? మనింటికి వచ్చేయకూడదూ? ఇద్దరం ఎప్పటికయినా భార్యాభర్తలమేగా! అసలు మనమేనాడో భార్యాభర్తలమయాము. అవునంటావా? కాదు అంటావా?"
    నాగమణి మాట్లాడలేదు. ఆమె కలవరపడింది. తన మనసులోని ఉద్దేశ్యం ఎలా చెప్పాలో పాలుపోవడంలేదు.
    "మనిద్దరిపద్దతులూ మనకునచ్చినవే! ఒకరిగురించి ఒకరికి తెలుసు! మధ్యలో నేను తెలివితక్కువగా ప్రవర్తించబోయి ఉన్నట్లయితే ఏనాడో ఒకటయి ఉండేవాళ్ళం! మన జీవితం సాఫీగా గడిచిపోతుందని నాకు పూర్తి నమ్మకముంది. ఏమంటావ్?"
    "నేను ఇన్నాళ్ళుగా ఈ విషయం ఆలోచిస్తూనే ఉన్నాను బావా! ఎంత ఆలోచించినా మనం వివాహం చేసుకోకుండా ఉండడమే శ్రేయస్కరం అనిపిస్తోంది....." కిందకు చూస్తూ అందామె. శ్రీనివాసరావు త్రుళ్ళిపడ్డాడు. "నాగూ!" అన్నాడు ఆవేదన నిండిన గొంతుతో.
    "అవునుబావా! నాకెందుకో మనస్కరించడం ఆ ఆలోచనే బావుండటంలేదు నాకు!"
    "హేమ నీ గురించి చెడుగా భావిస్తుందని ఆలోచిస్తున్నావా?" అడిగాడు శ్రీనివాసరావ్ కొద్ది క్షణాలాగి. "ఊహు! కాదు! అసలు నా మనసుకే నచ్చలేదీపని!....."
    "కానిమనిద్దరం శారీరకంగా ఒకటయిన విషయం మర్చిపోయావా నాగూ?"

 Previous Page Next Page