'లెస్సపలికితివి పలకరో అయ్య పలుకు నీ పలుకు చిలక పలుకు. మాట కొండదేవర మాట. అస్సో అస్సు ఇస్సో ఇస్సు" బెన్ హర్ సినిమాలో రధాల చప్పుడులాగా తనూ అరిచాడు వర్ధనరావు.
వీళ్ళ స్వరానికి ఆ గదిలో వున్నవాళ్ళు లేచి బైటికి వచ్చారు.
ఆ గదిలో వున్నది ముగ్గురు మగవాళ్ళు. తీరుబడిగా పేక ఆడుతున్నారు. ఆట మంచి రసపట్టులో ఉండగా వీళ్ళ అరుపులు వినిపించాయి. వాళ్ళ ముగ్గురిలో ఒకతనికి చచ్చే చిరాకు, అదే పాళ్ళలో చచ్చే కోపం. తను గెలుస్తాను అనుకున్న సమయంలో వీళ్ళ అరుపులు, ఆ వెంటనే ఎదుటివాడికి జోకర్ రావటంతో ఆట పూర్తికావటంతో అతనికి తుస్సున కోపం వచ్చింది.
తలుపులు బార్లా తీసుకుని రయ్యిన ఇవతలికి వచ్చాడు వాడు.
"అహో ఏం మొహం....?" అన్నాడు వర్ధనరావు.
"దీపం బుడ్డిలా వెలిగిపోతున్నది" వెంటనే అన్నాడు అహోబిలం.
"నా ముఖమేమోగాని మీ మొహాలు మాత్రం పొగచూరిన గొట్టాలలాగా ఉన్నాయి. పోండి పోండి. మీరు వాకిట్లోకి తగలడ్డారు, అక్కడ నా ఆట తగలడింది" అంటూ కయ్యిమన్నాడు అతను.
"ఏంది దొర అట్టంటవు! కొండదేవరలం మేము. మా నోటంట పలుకు మాలచ్చి పలుకు. మా వాక్కు దేమొడి వాక్కు...." అహోబిలం సాంతం మాట పూర్తిచేయకముందే అతను నానా మాటలు అన్నాడు.
"మీరు కొండదేవరలా! జిడ్డు మొఖాలు మీరూను. పొట్టలో పొడిస్తే అక్షరం ముక్క బయటికిరాదు. మీరు జాతకాలు చెపుతారా! చెప్పండిరా చెప్పండి దేభ్యం మొహాలు...." అని అతనంటుంటే__
'ఊరుకోరా కామేశం, నీకు ఆవేశం తప్ప మరేమీలేదు. మాకేమీ చెప్పక్కరలేదు. పొండి అంటే పోలా" అంటూ రామేశం అనేవాడు శాంతంగా సర్దబోయాడు.
'నీకేంరా, వరసగా మూడాటలు గెలిచావు. నా డబ్బులు పోయింది గాక మీ ముఖాలకి బుడ్డి కూడా కొనివ్వాలి. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదని మీ పేరు అదే కాబట్టి అన్నింటిలోనూ చెయ్యి తిరిగిన నాకు ఇవాళ ఆటలో చెయ్యి విరిగింది.'
'అందుకు మండిపడితే ఏం ప్రయోజనంరా!'
'నువ్వూరుకో నాగూ!'
ఇలా ముగ్గురిమధ్య మాటలు సాగుతుండగా అహోబిలం గదిలో చూపు సారించాడు.
గదిలో__
పరిచిన పేక ముక్కలు, సిగరెట్ పీకలు, ఖాళీ అయిన బాటిల్, వంకెకి తగిలించి జీన్స్ పాంట్లు ముదురురంగు గళ్ళ షర్టులు ఉన్నాయి.
ప్రస్తుతం వాళ్ళ ముగ్గురి వంటిమీద ఉన్నవి పూల పూల లుంగీలు, కళ్ళి బనీనులు.
'ఏంటిరా చూసేది, మా మొహాన కోతులు ఆడుతున్నాయా, వెళ్ళు బే వెళ్ళు' కామేశం అనేవాడు అరిచి మరీ చెప్పాడు.
'కీసర మాసరహరె హౌసిర హౌసిర' అన్నాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.
'హుశామి హుశామి భళిరే దొర భళి కమ్ భళి" అన్నాడు అహోబిలం.
వర్ధనరావు మాట్లాడింది, అహోబిలం సమాధానంగా మాలాడింది మనదేశంలో ఏ భాషా కాదు. ఇతర దేశం భాష అసలే కాదు, ఆటవికుల భాష అంతకన్నా కాదు.
అది _
కీసరబాసర భాష.
కీసరబాసర భాష అనగా అదో కోడ్. మారువేషాలు వేసినప్పుడు ఎవరికీ అర్థంకాకుండా వీళ్ళకి మాత్రమే అర్ధమయ్యేలా వర్ధనరావు, అహోబిలం ఓ భాష తయారుచేసుకున్నారు. ఆ భాషకి ఓ పేరు కూడా పెట్టారు. ఆ పేరు కీసరబాసర భాష.
ఇంతవరకూ సర్వీసులో చేరింతర్వాత వర్ధనరావు అందరిని తిట్టడం తప్ప తాను తిట్టించుకోలేదు. (చాటుగా తిట్టేవాళ్ళు సవాలక్ష మంది. వాళ్ళని దేముడు కూడా పట్టించుకోడని వర్ధనరావు అభిప్రాయం_అది వేరే సంగతి) ఇప్పుడు వీళ్ళు ఎడాపెడా తిడుతుంటే మీసాలు గడ్డాలు (తను అతికించుకున్నవి) పీకిపారేసి 'దొంగనాకొడకా! నేనెవర్ననుకుంటున్నావురా? ఈ ఏరియాకి ఇన్ స్పెక్టర్ ని. ఐయామ్ ది గ్రేట్ ఇన్ స్పెక్టరు వర్ధనరావుని అర్థమైందా! ఉల్లూకాబచ్చా! పిల్లీకాలుచ్చా? బల్లీకా కిచ్చా....'
అవి....
తనెవరో చెప్పి....
వాళ్ళని ఎడాపెడా వాయించి, టపాటిపీ తిట్టి తీసుకెళ్ళి కటకటాల్లోకి నెట్టిపారేద్దామనుకున్నాడు. అలా అనుకుని నాకు కోపం వచ్చింది. వీళ్ళ భరతం పడతాను అనేమాట అహోబిలానికి అర్థంకావాలని కీసరబాసర భాషలో 'కీసరమాసర హరె హౌసిర హౌసిర' అని తెలియజేశాడు వర్ధనరావు.
వెంటనే అహోబిలం 'హుశామి హుశామి (తగ్గండి తగ్గండి) భళిరే దొర (మీకు వచ్చిన నష్టమేమీలేదు) భళికమ్ భళి (నేవో రహస్యం కనిపెట్టాను) అని కోడ్ భాషలో హెచ్చరించాడు.
'లెస్కో (సరే) లెస్కో (సరే)' అన్నాడు వర్ధనరావు.
'ఏంటి మీ భాషలో తిడుతున్నారా?' కామేశం కోపంగా అడిగాడు.
"హుయ్యమియ్య! అది మా భాష చిన్నదొర. హుయ్యమియ్య అంటే దండాలు అని దొర. మాకు డబ్బు వద్దు, దస్కం వద్దు. కొండదేవర ఆనమీద రోజూ కొందరికి జోస్యం చెప్పాల. అది మా వృత్తి. మేము నిజం పలికితే దొర మీకు తోచింది ఇవ్వండి. లేదంటే మేము చెప్పేది విని ఉట్టి చేతులతోనే పంపించండి. మియ్యర మియ్య' అన్నాడు అహోబిలం.
'ఓరి నీయవ్వ, నువ్వు మా జాతకాలు చెపుతావా! చెప్పు బే చూస్తాను' కాస్త తగ్గి అన్నాడు కామేశం.
'చెయ్యి ఇటు పారేయండి దొర' అహోబిలం కూర్చుంటూ అన్నాడు.
కామేశం చెయ్యి చాపాడు.
"హుర్రే హుర్ర, బర్రే బర్ర" అన్నాడు అహోబిలం.
"ఇదిగో అలా అర్థంకాని భాషలో చెపితే ఉతికిపారేస్తాను. అచ్చ తెలుగులో చెప్పు" అన్నాడు కామేశం.
అహోబిలం హుర్రేహుర్ర బర్రేబర్ర అన్నదానికర్థం వర్ధనరావుకి అర్థమైంది. మీరు జాగ్రత్తగా అన్నీ గమనించండి అన్న క్లూ అహోబిలం తనకి అందించాడని__
నోరు మూసుకుని కాస్త ముందుకెళ్ళి కూర్చున్నాడు వర్ధనరావు.
"చిన్నదొరా! హుర్రేహుర్ర బర్రేబర్ర అన్నమాట తిట్టుకాదు. మా కొండదేవరని తలుచుకుని వంటిమీదకి రప్పించుకోటం.... సరే వినుకుండి. అరె రామన్న, అరె లచ్చన్న, కొండదేవరన్న కోరంగ వచ్చెరన్న...." అని మొక్కి "ఇంక వినుకుండి చిన్నదొర. మీ చెయ్యి బంగారం, అలా పడితే ఇలా లచ్చిండేవి ఉరుకురికి మీ ముందలకి రావాల. కాని ఈమద్దె మీ గుండెకాయకి జిల్లేళ్ళ దెయ్యం తగులుకుంది. మీరు పట్టింది బంగారం కావాలకాని.... ఆ దెయ్యం తగులుకోటం వల్ల లచ్చిమి చేజారిపోతున్నది....