Previous Page Next Page 
న్యాయానికి అటూ-ఇటూ పేజి 36

 

      "డాక్టర్లు ఏమన్నారో నేనడగలేదు. కుడికన్ను కూడా ఎర్రబడింది అవునా?"
   
    "అవును."
   
    "నిన్ను డాక్టర్ గుర్నాథ్ దగ్గరకు తీసుకెళ్ళిందెవరు?"
   
    "మా అక్కయ్యా, అంకుల్ ప్రదీప్ గారు."
   
    "ప్రదీప్ గారు తీసుకువెడితే వెళ్ళావా?"
   
    "నాతో అక్కయ్యకూడా వచ్చింది."
   
    "ప్రదీప్ గారు లేకుండా మీ అక్కయ్యతో మాత్రమే కలసి ఎప్పుడైనా వెళ్ళావా?"
   
    "లేదు."
   
    "కాబట్టి ప్రదీప్ గారే తీసుకువెళుతూ వుండేవారు. అవునా?"
   
    "రాధ జవాబివ్వలేదు.
   
    "ప్రదీప్ గారు మీకు బాగా ఫామిలీ ఫ్రెండ్! ఆయనే చొరవ తీసుకుని నీ ఆరోగ్యవిషయంలో పట్టించుకుని డాక్టర్ల దగ్గరకు తీసుకెడుతుండేవారు."
   
    రాధ జవాబివ్వలేదు.
   
    "డాక్టర్ గుర్నాథ్ పరీక్ష చేశాక డాక్టర్ అశోక్ దగ్గరకు కూడా ఆయనే తీసుకెళ్ళాడు."
   
    "అవును."
   
    "నీ ఎడమకన్ను, కుడికన్నులలో వున్న డిసీజ్ ల గురించి..."
   
    "కుడికంటిలో డిసీజ్ లేదు."
   
    "ఎర్రబడిందన్నావుగా?'
   
    "అది వొట్టి కంటికలక."
   
    "సరే. నీ ఎడమకన్ను, కుడికన్నుల గురించి డాక్టర్ గుర్నాథ్ గాని, డాక్టర్ అశోక్ గాని స్వయంగా నీకు చెప్పారా? లేకపోతే ప్రదీప్ గారు చెప్పారా?"
   
    "డాక్టర్లు స్వయంగా చెప్పలేదు. ప్రదీప్ గారుకూడా భయపడతానని వివరంగా చెప్పలేదు."
   
    "వివరంగా చెప్పినా, క్లుప్తంగా చెప్పినా ప్రదీప్ గారివల్లే నీకు తెలిసింది."
   
    "అవును."
   
    "డాక్టర్లు ప్రదీప్ గారితో ఏంచెప్పారో నీకు తెలీదు."
   
    "తెలీదు."
   
    "నిజం చెబుతే నువ్వు భయపడతావని ప్రదీప్ గారు వివరంగా చెప్పలేదని నువ్వే అన్నావు. అలాగే కుడికంటిలో కూడా కేన్సర్ వుండి నువ్వు భయపడతావని ప్రదీప్ గారు దాచివుంచటానికి అవకాశంవుంది కదా?"
   
    ప్రదీప్ లేచి నిలబడ్డాడు. "అబ్జక్షన్ యువరానర్! రాధను తికమకపెట్టటానికి అడిగే ఊహాజనితమైన యీ ప్రశ్నకు నేనభ్యంతరం తెలియజేస్తున్నాను. తనకు తెలియని విషయాలు ఊహించి జవాబు చెప్పే పరిస్థితిలో ఆమెను వుంచటం భావ్యంకాదు" అన్నాడు.
   
    "ఇది అసమంజసమైన ప్రశ్నకాదు యువరానర్! రాధ భయపడుతుందని ఆమె ఎదమకంతి గురించికూడా ఆమెముందు దాచివుంచారు. ఫలానా జబ్బు వుందని ఆమెతో ఎవరూ అనలేదు. అయినా ఊహించి జవాబులు చెప్పింది. అంతేకాదు తనంతగా తాను కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకుంది. అటువంటప్పుడు మిగతావన్నీ ఒప్పుకుని దీనికభ్యంతరం చెప్పటంలో అర్ధం లేదు" అన్నాడు ప్రతాపరావు.
   
    "అడగనివ్వండి" అన్నాడు మేజిస్ట్రేట్ గారు.

    ప్రతాపరావు ఆ ప్రశ్న మళ్ళీ అడిగాడు.
   
    "అవకాశముంది."
   
    "డాక్టర్ అశోక్ నీకు ఎడమకంటికి మాత్రమే ఆపరేషన్ చేస్తాననీ, కుడికంటికి ఆపరేషన్ అవసరంలేదనీ చెప్పటం జరిగిందా?"
   
    "లేదు."
   
    "కాబట్టి డాక్టర్ అశోక్ ఏ కంటికి ఆపరేషన్ చేయ నిశ్చయించుకున్నాడో డైరెక్టుగా నీకు తెలీదు. ప్రదీప్ గారో, మీ యింటిలో వాళ్ళో అదీ సగం దాచిపెట్టి సగం చెప్పి యిలా చేస్తే నీకు తెలిసింది. అవునా?"
   
    "......."
   
    "చెప్పు. అవునా?"
   
    "అ... అవును."
   
    "మొదట్నుంచీ ప్రదీప్ గారు కానీ, మీ యింటిలోవాళ్ళు గానీ పూర్తిగా నీకేసంగతీ చెప్పలేదు. నువ్వు భయపడతావనే ఉద్దేశంతో అవునా?"
   
    "...అవును."
   
    "నీకు నీ రెండుకళ్ళలో వున్న డిసీజ్ గురించి సరియైన అవగాహన లేకుండా చేశారనీ, నీకు ఏ విషయమూ పూర్తిగా చెప్పలేదనీ, నీ ఎడమకంటితోబాటు కుడికంటిలో కూడా రెటీనోబ్లాస్టోమా వున్నదనీ, కుడికంటికి ఆపరేషన్ చెయ్యటం అవసరమేననీ, యిదంతా ముందుగా నిర్ణయించుకున్న విధంగానే జరిగిందనీ, నువ్వు చిన్నపిల్లవనే ఉద్దేశంతో నీకు డాక్టర్ అశోక్ చెప్పకపోతే అది అతని తప్పుకాదనీ, నీకు కుడికంటికి ఆపరేషన్ చెయ్యటం సమంజసమే ననీ అంటున్నాను" అన్నాడు ప్రతాపరావు కన్ క్లూడ్ చేస్తూ.
   
    "కాదు. కాదు. కాదు" అని అరిచింది రాధ.
   
                                   * * *
   
    తర్వాత వాయిదాకు పి.డబ్ల్యూత్రీగా డాక్టరు గుర్నాథ్ విచారించబడ్డాడు.
   
    మొదట ఛీఫ్ ఎగ్జామినేషన్.
   
    "మీ క్వాలిఫికేషన్ ఏమిటి?" అనడిగాడు ప్రదీప్.
   
    "ఆఫ్ థాల్మాలజీలో పోస్టుగ్రాడ్యుయేషన్ చేశాను. ఎమ్.ఎస్.డి.వో."

    "మీరెనేళ్ళబట్టి ప్రాక్టీస్ చేస్తున్నారు?"
   
    "పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయాక మూడేళ్ళబాటు గవర్నమెంట్ సర్వీస్ లో వున్నాను. తర్వాత స్వతంత్రంగా జీవించాలనే ఉద్దేశంతో ఏడేళ్ళబట్టీ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నాను."
   
    "అంటే ఐ స్పెషలిస్ట్ గా మీకు పదేళ్ళ అనుభవం వుంది."
   
    "అవును."
   
    "రెటీనాబ్లాస్టోమా కేసులు మీరు చాలా చూసి వుంటారా?"

    "చూశాను."
   
    "అంటే కేసులు తరచుగా వస్తూ వుంటాయా?"
   
    "తరచుగా కాకపోయినా అరుదేంకాదు. నెలకి ఒకటి రెండుకేసులు తటస్థిస్తూ వుంటాయి."
   
    "రాధను మీరు ఎగ్జామిన్ చేశారా?"
   
    "చేశాను"
   
    "థరోగా రెండుకళ్ళూ ఎగ్జామిన్ చేశారా?"
   
    "చేశాను."
   
    "చేశాక మీరు ఏ నిర్దారణకు వచ్చారు?"
   
    "ఆమె ఎడమకంట్లో రెటీనో బ్లాస్టోమా వుంది. కుడికంటిలో కన్ జక్టివైటిస్ మాత్రమే వుంది."
   
    "ఈ విషయంలో మీ డయోగ్నోసిస్ లో ఏవన్నా సందేహపడటానికి అవకాశం వుందా?"
   
    "లేదు."
   
    "ఈ సంగతులు రాధకు చెప్పారా?"
   
    "లేదు."
   
    "ఎందుకని?"
   
    "కేసు సీరియస్ స్వభావం గలది అయినప్పుడు డాక్టర్లు పేషెంట్ తో డైరెక్ట్ గా డిస్కస్ చెయ్యరు. ఆ పేషెంట్ తాలూకు ముఖ్యులతో డిస్కస్ చేస్తారు."
   
    "మీరు వాళ్ళకి ఏమని సలహా యిచ్చారు?"
   
    "ఆమె ఎడమకంటిలోమాత్రం రెటీనో బ్లాస్టోమా వున్నదనీ, ఆ కంటికి వెంటనే ఆపరేషన్ చేయించమనీ సలహా యిచ్చాను."   

 Previous Page Next Page