Previous Page Next Page 
అసావేరి పేజి 36

    ఎక్కడో తీతువు అరుపు....
   
    ఉలిక్కిపడిన సావేరి అప్పుడు తేరుకుంది వేగంగా వెనక్కి జరిగింది.
   
    "ఎ...ఎందుకొచ్చావిలా?"
   
    "ఇప్పుడు గుర్తుకొచ్చిందా?" నవ్వుతున్నాడు అదోలా సావేరికి ఎంతకోపమొచ్చిందని? ముందు తానే ఓడినట్లు పరిహసిస్తుంటే కోపంతో అతని పెదవి కొరికి ఆ ముక్కుని చేతిలో వుంచాలన్నంత ఉక్రోషం.
   
    "కోపమొచ్చిందా?" అడిగాడు గుసగుసలా.
   
    "మరి రాదేమిటి?"
   
    "అయితే విరక్కొట్టించు"
   
    "ఏమిటి?"
   
    "ఎప్పుడూ దబాయిస్తుంటావుగా నా కాళ్ళు విరగ్గొట్టిస్తానని."
   
    ఓ నీటిపొర ఆమె కళ్ళల్లో "అంటేమాత్రం నేనెప్పుడయినా అలా చేయించగలనా?"
   
    "మీవాళ్ళు చేస్తున్నదదేగా!"
   
    ఏ మనసు అర చిట్లిందో ఒక్క అంగలో అతన్ని అల్లుకుపోయింది.
   
    "ఛీ....పిరిగ్గొడ్డు" తల పైకెత్తే కళ్ళు తుడిచాడు. "నువ్విలా బాగోలేదు"
   
    "ఇలా అంటే?"
   
    "ఏడుస్తూ...ఏడిపిస్తూ మాట్లాడతావుగా? అలాగే బాగుంటావు."
   
    "వ్వె వ్వె వ్వె...."
   
    తమాయించుకోలేనట్టు నాలుకతో ఆమె పెదవిని స్పృశించాడు.
   
    "చంపుతా" దూరంగా జరిగింది మళ్ళీ.
   
    "కానియ్"
   
    "అమ్మో' ఉట్టుట్టికే"
   
    "అదేం?"
   
    చెప్పలేదు ఆ వూహనైనా భరించలేనని అంతకన్నా ముందు తనే రాలిపోవాలనుందని "శంకూ!"
   
    ఆమె నేత్రాలు అరమోడ్పులయ్యాయి.
   
    ఆమె నుదుట సారించే కురులు సవరిస్తూ అన్నాడు "చెప్పు...."
   
    "ఆ రోజు అదే బొజ్జన్న కొండ దగ్గరికి చీకటిలో ఎందుకు వచ్చావు?"
   
    "వచ్చేదాకా ఉంటానన్నావుగా?"
   
    "మరి తొందరగా రాలేదేం?"
   
    "నిజంగా ఉండవనుకున్నాను."
   
    "ఆ తర్వాత ఉన్నానని ఎలా తెలిసింది?"
   
    "నువ్వింటికి రాలేదని మంగ చెబితే...."
   
    "రావాల్సిందికాదు నువ్వు" గోముగా అంది.
   
    "అదేం?"
   
    "ఆ రోజు వాళ్ళలా...."
   
    "చంపుతా...." కోపంగా అన్నాడు.
   
    "ఎందుకూ?"
   
    "చీకట్లో నువ్వలా తెల్లార్లూ ఉండిపోతే భయం వెయ్యదూ?"
   
    "వేస్తే?"
   
    "జ్వరం పెట్టుకోవూ?"
   
    "జ్వరమొస్తే?"
   
    "ఇప్పటిలా కాలేజీకి రావడం మానేస్తావుగా?"
   
    "మానేస్తే?"
   
    "నాకు పిచ్చెక్కినట్టుండదూ?"
   
    "పిచ్చెక్కితే?"
   
    "చంపుతా"
   
    "ఎవర్ని?"
   
    "ఎక్కించిన నిన్ను"
   
    "ఆ పని చేసేయ్"
   
    "ఎందుకు?"
   
    "మనకీ బాధ తప్పుతుందిగా!"
   
    ఈసారి అతని కళ్ళు సజలాలయ్యాయి. నిజమే మధురంగానయినా ఎంత బాధగా వుందని? కలుసుకోనివ్వరని తెలుసు. అయినా ఆ కలయిక కోసం ప్రాణాలు పోతేనేం అనిపిస్తుంది. కలయిక ద్వారా అపురూపంగా వుంటుంది. మళ్ళీ విడిపోయేటప్పుడే ఊపిరి పోతున్నట్టుగా వుంటుంది.
   
    "ఏయ్! ఏమిటా కన్నీళ్ళు?" అతనినలా చూడలేకపోతూంది.
   
    "నాకెందుకు కనిపించావు నువ్వు?" ఉక్రోషంగా అన్నాడు. దుఃఖం ఉధ్రుతమౌతుంటే "ఇంతకు ముందు ఎంత సరదాగా వుండేవాన్నని?"
   
    "అయితే ఇప్పుడు సుఖంగా లేవన్నమాట" కోపంగా ప్రక్కకు తిరిగింది.
   
    "నీకు తెలీదేమిటీ?"
   
    "అంటే నా మూలంగానే నీకు కష్టాలన్నమాట?"
   
    "కాదేమిటీ?"
   
    "అయితే మరిచిపో"
   
    ఆమెకి ఏడుపొచ్చేస్తూంది. వెంటనే__
   
    "ఓ....అలాగే"
   
    "నిజంగా మరిచిపోతావా?" ఆమె కళ్ళు నీటికుండలయ్యాయి.
   
    "నిజంగానే....నేను చచ్చిపోయినప్పుడు."
   
    అతడి పెదవుల్ని మూసినా ఆమె అరచేతిని అలాగే వుంచి మొహాన్ని అతడి గుండెలకి వత్తింది. అదృశ్య హస్తమేదో ఊపిరితిత్తుల్ని నొక్కుతున్నట్టు వెక్కిపడుతూ వుండిపోయింది.
   
    "సా....వే....రీ.... ఊరికినే అన్నాను."
   
    "ఈసారి అనకేం...." నిజంగా సావేరికి భయంగానే వుంది.
   
    "అననంటే...."
   
    "అంటేమాత్రం నిజంగా చంపుతా"....
       
    "అలాగే"
   
    "చూడు" మైకంనుంచి తేరుకుంటున్నట్టు నెమ్మదిగా అంది.
   
    "మళ్ళీ ఇలా రాకేం...."
   
    "వద్దా?"
   
    తలూపింది.
   
    "అయితే నువ్వు రోజూ కాలేజీకి రావాలి."
   
    "జ్వరంగా?"
   
    "తగ్గిపోతుంది"
   
    "అదేం?"
   
    "మందిచ్చానుగా?"
   
    "ఇచ్చింది ముద్దుగా" సిగ్గుతో ఆమె కపోలాలు ఎరుపెక్కాయి.
   
    "రేపు కాలేజీలో యింకోటిస్తాను....అప్పుడు నార్మల్ కొచ్చేస్తావు."
   
    "ఏయ్...." తల వంచకుండానే అంది- "అక్కడ పిచ్చివేషాలు వేస్తే అందరూ చూస్తారు.
   
    "అలా వేసేది నేనుకాదు. దబాయించేది నువ్వేగా?"
   
    నవ్వింది తెరలు తెరలుగా! చెరగని ఓ శిలాజ్ఞాపకాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుని పడి పడీ నవ్వింది.
   
    అక్కడ ఆవరణలోని అరవిరిసిన మొగ్గలు చలించేట్టు స్థంభించిన నిన్నటి ప్రకృతికి జీవం వచ్చేట్టు యింకా నవ్వుతూనే వుంది. అప్పుడు విందో అడుగుల చప్పుడు!
   
    తేరుకుంది....
   
    "ఎవరో వస్తున్నారు" కంగారుపడింది ఈసారి అడుగుల సవ్వడి యింకా స్పష్టంగా వినిపించింది.
   
    "వెళ్ళిపో!" ఆందోళనగా నెట్టింది.
   
    బాల్కనీవరకు శంకూని లాక్కువెళ్ళిందికాని వెళ్ళబోయిన శంకూని యింకా బలంగా పట్టుకునే వుండిపోయింది. వెళ్ళటం యిష్టం లేనట్టు?

 Previous Page Next Page