"సర్! ఇంత అద్దె నేను కట్టలేను!"
"నువ్వు కట్టక్కరలేదు! నీ తమ్ముడు కడతాడు. సుప్రసన్నా చారికి వడు పుట్టలేదా?"
"అయ్యోరామ!" అపురూప నుదురు కొట్టుకొంది. "పెళ్ళి చేసుకొని వెళ్ళి మా ఆడపిల్లలకి ఓ పట్టెడు పువ్వులుగాని, నాన్నగారికి ఓ రెండు పళ్ళుగాని తెచ్చిన పాపానపోలేదు వాడు మా ఇంటి అద్దె కడతాడా? అయినా వాడికి ఆ అద్దె పుస్తకాల మీద వచ్చేదేమి? మా కిచ్చేదేమి?"
"నీ ప్రశ్నలకు జవాబు కోసం రెండు రోజులాగాలి!"
సరిగ్గా రెండే రెండు రోజులకి ఉదయభాను తన భార్యలో కలిసి ఇంటికి వచ్చాడు! వస్తూనే "మనకొత్త ఇంటికి తీసికెళ్ళడానికి వచ్చాను! సామానుసర్దేద్దాం, అక్కా! ఓ గంటలో మా కంపెనీ ట్రక్కు వస్తుంది!" అన్నాడు హడావిడిగా.
"కంపెనీ ట్రక్కేమిటిరా? నువ్విప్పుడు ఎక్కడ పనిచేస్తున్నావ్?" అపురూప ఆశ్చర్యంగా అడిగింది.
"పరంజ్యోతి గారు పవన్ ఇంజనీరింగ్ కంపెనీలో మంచి ఉద్యోగమిప్పించారక్కా! నిన్ననే జాయినయ్యాను. మా కంపెనీ ప్రొప్రైటరు గారు, పరంజ్యోతిగారు మంచి స్నేహితుల!"
"పరంజ్యోతి గారు నీకెలా పరిచయం అయ్యారురా?" మరింత ఆశ్చర్యంగా అడిగింది.
"ఆయన నీ దగ్గర నా అడ్రసు తీసుకొన్నారట కదా? మొన్న మా ఇంటికి వచ్చారు! నువ్వాయన పత్రికలో పనిచేస్తున్నావనీ, మనింటికి వచ్చి నాన్నగారిని చూశానని చెప్పారు. సర్టిఫికెట్లవి తీసుకొని తన వెంట రమ్మన్నారు. ఆయనే తన కారులో ఎక్కించుకువెళ్ళి మా ప్రొప్రైటర్ గారికి పరిచయం చేసి మంచి ఉద్యోగం ఇమ్మని చెప్పారు. మా ప్రొప్రైటర్ గారు నా సర్టిఫికెట్లన్నీ చూసి లాంఛనంగా! ఓ అప్లికేషన్ వ్రాయించుకొని , మరునాడు కంపెనీకి వచ్చి కలుసుకోమన్నారు . కలిశాను. అఫ్పటికప్పుడు పోస్టింగు ఇచ్చి జాయిన్ కమ్మన్నారు. డ్యూటీలో జాయినై పోయాను. మాది చాలా పెద్ద కంపెనీ, అక్కా! రోజూ కోట్లలో నడుస్తుంది వ్యాపారం. పరంజ్యోతి గారి మాట మీద వచ్చిందేగాని ఆ కంపెనీ కేసి కన్నెత్తి చూసే తాహతుకూడా నాకుండదు. నాకిచ్చిన పోస్టుకూడా చాలా పెద్దది, అయితే పరంజ్యోతిగారు మనందరం కలిసి ఉండాలన్న షరతు మీద నాకీ ఉద్యోగం ఇప్పించారు!"
ఇది పరంజ్యోతిగారు సాధించిన మరో అద్భుతం అన్నమాట! ఈ సమాజంలో డబ్బూ, పరపతీ ఉన్న వ్యక్తులు సాధించలేనిదంటూ ఉండదేమో!
తాము నరకకూపంలాంటి ఈ ఇంట్లోంచి బయటపడి అంతమంచి ఇంట్లో ఉంటారని ఎన్నడయినా అనుకొందా? జీవచ్చవంలా తయారైన తండ్రితో రవ్వంత చైతన్యాన్నయినా ఊహించారా? తమ్ముడు తమబరువు బాధ్యతలను స్వీకరిస్తాడని కలలోనైనా తలచారా?
ఈ అద్భుతాలన్నీ సాధించిన వారు పరంజ్యోతిగారు!
"నువ్విక ఉద్యోగం చేసే అవసరం కూడా లేదక్కా! జ్యోతి రెంటెడ్ బుక్ షాప్ చూచుకొంటుందట. నాకు నెలనెలా జీతం వస్తుంది. ఎలాగ సర్దుకొందాం. ఇంతకాలం నువ్వు ఇంటికోసం కష్టపడింది చాలు" అన్నాడు ఆర్ద్రంగా.
"ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చొంటే నాకేం తోస్తుందిరా?"
"కాలేజీలో చేరి పి.జి. చెయ్యి"
"మళ్ళీ ఇప్పుడు కాలేజీలో ఏం చేరుతాను. మా ఎడిటరుగారు జర్నలిజంలో డిప్లామా చెయ్యమన్నారు. అది చేస్తాను! ఉద్యోగం చేస్తూనే అది చేస్తాను!"
మరునాడు పత్రికాఫీసుకు వెళ్ళగానే పరంజ్యోతిగారికి ధన్యవాదాలు తెలిపింది అపురూప. "అద్భుతం సాధిస్తానంటే మరీ ఇంత అద్బుతం ఇంత తొందరగా సాధిస్తారనుకోలేదు"
మీసాన్ని మెలేస్తూ 'మరి ఏమిటనుకొన్నావు నేనంటే?' అన్నట్టుగా గర్వాతిశయా్ని వ్యక్తం చేసి ముసిముసిగా నవ్వాడు పరంజ్యోతి "ఉద్యోగం దొరికిందని మరీ అంత సంతోషపడిపోవద్దనిచెప్పీ, నీ తమ్ముడికి మాయల ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టుగా నీ తమ్ముడి ప్రాణం నా చేతిలో ఉంది! మిమ్మల్ని సరిగా ఎప్పుడు చూచుకోడో అప్పుడు వాడి పీక నొక్కేస్తాను! ఆ సంగతి వాడికి చెప్పే పంపాననుకో! వెధవ! ప్రేమించి పెళ్ళి చేసుకొని తన దారిన తాను పోతాడా? అవిటి తండ్రినీ, ఆడపిల్లల్నీ పుట్టెడు కష్టాల్లో వదిలిపెట్టి మరీ అంత బాధ్యాతారాహిత్యమా?"
"పాపం! ఎన్నాళ్ళని వాడు మాత్రం మాతోపాటు కష్టపడతాడు? చాలా చిన్న వయసులోనే వాడూ కష్టపడ్డాడు. పత్రికలమ్మాడు. పాలపాకెట్లు వేశాడు. ఇంటింటికీ పార్శెల్స్ చేరవేశాడు. నాలుగు డబ్బులొస్తాయంటే అభిమాన పడకుండా అడ్డమైన చాకిరీ చేశాడు. చేసిచదువు కొన్నాడు. డిగ్రీ పూర్తి చేశాడు. యవ్వనపు వాకిళ్ళు తెరుచుకోగానే వాడి జీవితంలోకి వచ్చింది జ్యోతి. ప్రేమించి పెళ్ళి చేసుకొన్న పిల్లకూ మా కష్టాలు పంచ లేడుగా? అందుకే మామగారు బుక్ స్టాల్ పెట్టిస్తానంటే భార్యతో వేరే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడని వాడిమీద నాకు కోపం లేదు. ఈ కష్టాలనుండి విముక్తి పొంది వాడైన సుఖపడుతున్నాడులే అని సంతోషించాను."