Previous Page Next Page 
హృదయాంజలి పేజి 34

   
    గుండెలో చిరు చిగురుల గిలిగింత!

    గత జన్మకు తెర తీసినట్టుగా......

    మూగబోయిన మురళి సన్నగా మ్రోగినట్లుగా.....

    ఆచారి ఉత్సాహంతో గొంతు సవరించుకొని పద్యం అందుకొన్నాడు. సాధన లేకపోవడం వల్లేమో పద్యం సాఫీగా సాగలేదు. అక్కడక్కడ కొన్ని పద్య పాదాలు మరిచిపోయి......... ఆయాసంతో ఆగిపోయాడు.

    "సాధన లేదు కదా? పాడలేను" అన్నాడు సిగ్గుపడుతూ.

    "పూర్తిగా పాడలేకపోతేనేం? మూగబోయిన మీ గొంతును పలికించాను! నేను విజయం సాధించాను. ఒప్పుకుంటావా, అపురూపా"
 
    ఒప్పుకుంటున్నట్టుగా తలూపింది అపురూప.

    తిరిగి కొనసాగించాడు పరంజ్యోతి. "సెక్స్ కోరికల్ని అణుచుకుని సంప్రదాయపు శృంఖలాలలో బందీలైన స్త్రీలకు చలంగారు తలుపులు, కిటికీలు తెరిచేశాడని చెప్పుకొంటాం గాని, అంతకు ముందే మన పురాణేతిహాసాల్లోనే ఆ పని జరిగింది, బృహస్పతి వృద్దుడు. జపతపాల్లో ఉపవాస వ్రతాలలో శరీరాన్ని కృశింప చేసుకున్న ఋషి. యవ్వనవతి అయిన తార కోరికల భారాన్ని ఆపుకోలేక బృహస్పతి శిష్యుడయిన చంద్రుడిని మొహపాశంతో బంధిస్తుంది. 'కులటా' అని సంభోదించిన భర్తకు సూటిగా సమాధానం చెబుతుంది. జపతపాలని కొన్నాళ్ళు ఇంద్రుడి కొలువని కొన్నాళ్ళు ఇంటికి దూరంగా వుండి భార్య కోరికలు పట్టించుకోవడానికి, ముక్కు మూసుకునే ముని, పుంగవులకు, ముదివగ్గులకు పెళ్లెందుకు? భార్య ఎందుకు? కన్నెల జీవితాలను కాలరాచే హక్కు మీకెవరిచ్చారని అడుగుతుంది. ఆడదానికీ ఒక మనస్సుందని ఆనాడే మన కవులు చెప్పారు. ఏమంటారు ఆచార్లూ?"

    "తుప్పు పట్టినట్టుగా ఉంది నా మనస్సు. మీకు జవాబేం ఇవ్వగలను?"
 
    "ఆ తుప్పునే వదిలించుకోమని నా సలహా!" అంటూ లేచాడు పరంజ్యోతి

    ఆయన్ని బయటికి వచ్చి సాగనంపుతూ,  "మీరింత అద్భుతం సాధించగల వ్యక్తులని నేననుకోలేదు! నాన్న గారు ఏనాడో మూసుకొన్న హృదయ తలుపులను ఈనాడు మీరే తెరువగలిగారు! రాళ్ళనైనా తట్టి స్పందింపజేయగల మీ వంటి సహృదయులు ఆనాడే నాన్నగారికి తారస పడి ఉంటే ఆయన అలా జీవచ్చవమై మంచంలో పడి ఉండేవారు కాదు! మీరు దయతో అప్పుడప్పుడూ వస్తూ నాన్నగారిని మాట్లాడి్సతూ ఉండండి ఆ తలుపు లెప్పుడూ తెరిచి ఉండేలా చూడండి" అంటుంటే అపురూప కళ్ళు తడిగా మెరిశాయి.
 
    "ఊరికే మాట్లాడించడం చాలదమ్మా! ఆయన్ని మనిషిగా నిలబెట్టాలి మనం. కొద్దిగా ప్రయత్నిస్తే ఆయన మామూలు మనిషి కాగలడు నాకు తెలిసిన సంగీత, నాటక పరిషత్తు వాళ్ళు ఈ మధ్యే ఇనిస్ట్టిట్యూట్ ఒకటి పెట్టారు, ఆయనకి అక్కడ జాబ్ ఇప్పించగలను! ఏమంత దూరం కాదు! ఆటోలో వెళ్ళి ఆటోలో వచ్చేయొచ్చు"
 
    "ఆయనలో పోయిన ఉత్సాహం, చైతన్యం వస్తే చాలండీ! ఆయనకష్టపడి సంపాదంచి మాకు పెట్టాలనుకోలేదు. ఆయన అలా మాకు పెద్దదిక్కుగా ఉంటే చాలు!"

    "ఇదే - నువ్వు నీ పది పదిహేనేళ్ళ వయస్సులో చేసిన తప్పు! మీ నాన్నగారు నీ కళ్ళముందే జీవద్భవమై పోతుంటే చూస్తూ ఊరుకొన్నావు! ఆరిందలా సంసార భారాన్ని నీ చిన్ని భుజాల మీదికి ఎత్తుకొని ఆయనకీ ప్రపంచంతో బంధాలు త్రెగిపోవడానికి నీ వంతు సహకారాన్ని అందించావు. ఆయనింకా నీ మీదే ఆధారపడాలనుకొంటున్నావు! ఈ ఆధార పడడం అన్నది ఆయనకి ఎంత నరక ప్రాయమైందీ చూస్తూ కూడా ఆయన్ని అదే స్థితిలో ఉంచాలని ఎందుకు చూస్తావు?"

    "ఆయన నా మీద ఆధారపడ్డానని ఫీలయితే అయి ఉండొచ్చుగాని నేనలా అనుకోవడం లేదే! అశక్తుడైన తండ్రికి కూతురిగా ఆసరా ఇచ్చాను ఇది తప్పా?"

    "తప్పోకాదో మరోసారి మాట్లాడుకుందాం! వస్తాను! డ్రైవర్ పోనీ!"
 
    "కాదు. ఇప్పుడే చెప్పండి! లేకపోతే నాకీరోజు నిద్రపట్టదు!"
 
    "పోనీ! ఒకపని చెయ్యి! మీ నాన్నని ఏదైనా వృద్దుల గృహంలో చేర్పించు! పిల్లల్ని కష్టపెడుతున్నానన్న బాధ ఆయనకి తప్పుతుంది. నీకు ఒక బరువు దింపుకొన్నట్టూ అవుతుంది.

    "ఎంత మాటన్నారు సర్! నేను బ్రతికి ఉండగా నాన్నగారిని అనాధను కానిస్తానా?"

    "అయితే నా ప్రయత్నం నన్ను చెయ్యనివ్వు. అడ్డురాకు. పన్నెండేళ్ళ వెనక్కి తీసికెడతాను మీ నాన్నని, అద్భుతం సాధించిన వ్యక్తినని ఇందాకే అన్నావుకదా? డ్రైవర్ పోనీ!"
 
                                 *    *    *

    వారం రోజుల తరువాత ఒకనాటి సాయంత్రం అపురూపను వెంటబెట్టుకు వెళ్ళి ఒకిల్లు చూపాడు పరంజ్యోతి.

    మంచి లోకాలిటీ. ఇల్లుకూడా బాగుంది. అద్దె మాత్రం అపురూప జీతం మొత్తం మింగేస్తుంది.

    "ఇల్లు ముచ్చటగా ఉంది. కాని, అద్దె ఎక్కువ! నా జీతం మొత్తం ఇల్లే మింగేస్తే మేం ఏం తినాలి?"
    "అద్దె విషయంలో నువ్వు చింతేమీ పెట్టుకోకు! నీ తమ్ముడి అడ్రసివ్వు!"
 
    ఇంటద్దెకూ , తమ్ముడి అడ్రసుకూ సంబంధమేమిటో తెలీలేదు అపురూపకు అయోమయంగా చూసింది.
    "అడ్రసివ్వమ్మా!"
 
    వ్రాసిచ్చింది అపురూప. బాగ్ లోంచి ఓ కాగితం తీసి.

    ఇంటివాళ్ళకి నెల అద్దె అడ్వాన్స్ ఇచ్చి, ఇంటికి తాళం వేసి కీస్ అపురూప చేతిలో పెట్టాడు పరంజ్యోతి.

 Previous Page Next Page