"బాగా సంతోషించావులే! అపరభూదేవిని! ధరణి కున్నంత ఓర్పు, క్షమా" చిరుకోపంతో అన్నాడు పరంజ్యోతి. "స్త్రీలో ఉండాల్సిన ముఖ్యమైన సుగుణాలివి! నీలో ఇవిచూసే నీ మీద అభిమానం పెంచుకున్నాను" అంటుంటే ఆయన మనస్సులో ఆప్యాయత తొణికిసలాడింది.
* * *
"శశీ! రేపు రాజగోపాల్ అంకుల్ వస్తున్నాడురా ఢిల్లీ నుండి. చైత్రని కూడా వెంట తీసుకు వస్తున్నాడట ఈసారి" సుధ ప్రొద్దుట కొడుక్కి టీ ఇస్తూ చెప్పింది.
చైత్రని పదిహేళ్ళ పిల్లవరకూ బాగా ఎరిగున్నాడు శిశిర్. రాజగోపాల్ అంకుల్ అంటే బంధుత్వమేదీ లేదు! తండ్రికి అతడు మంచి ఫ్రెండ్. ఇద్దరి మైత్రీ బంధం వారి భార్యలనూ మంచి స్నేహితులను చేసింది. ఇద్దరూ వదినా వదినా అని పిలుచుకుంటారు. ఒకరి భర్త ఒకరు 'అన్నయ్యా!' అని పిలుస్తారు. ప్రతి శ్రావణపున్నానికి చైత్ర తల్లి తన తండ్రికి రాఖీకడుతుంది. స్వయంగా కట్టడానికి వీలుకాకపోతే పోస్టులో పంపిస్తుంది. తన తండ్రి ఆమెకు మంచి బహుమతి అందజేస్తాడు. అల్లుడు గాని అల్లుడు తను వాళ్ళకి! చిన్నప్పుడు ఎంతగారాబం చేసేవాళ్ళో! బిజినెస్ రిక్యా వాళ్ళు ఆరేళ్ళుగా ఢిల్లీలో ఉంటున్నారు. రాజగోపాల్ అంకుల్ తరచూ హైదరాబాద్ వస్తూనే ఉంటాడు. వచ్చినప్పుడల్లా కుదరదుగాని కుదిరి నప్పుడు మాత్రం "సుధా! నీ చేతి భోజనం తినక చాలా రోజులైందమ్మా!" అని, వచ్చి ఆప్యాయంగా అన్నం అడిగిపెట్టించుకు తినిపోతాడు. అంతచనువూ, అభిమానం తమకుటుంబంపట్ల.
చైత్రని చివరిసారిగా చూసి నాలుగైదేళ్ళు అవుతోంది.
'కాశ్మీర్ కి కలీ' అనగానే మగ కళ్ళముందు ఓ ముగ్ధ సుకుమార రూపం మెదులుతుంది. చైత్రని చూస్తే 'కాశ్మీర్ కి కలీ' అనాలనిపిస్తుంది. సుకుమారు రూపమే కాదు, సుతిమెత్తని హృదయంకూడా. ఎగిరి ఎగిరి గంతులు వేయాల్సిన బాల్యంలో కూడా ఏదో పుస్తకం పట్టుకొనో, బొమ్మలు గీస్తూనో కనిపించేది! సంగీతమంటే మరీపిచ్చి! రక రకాల వాయిద్యాలు ప్రాక్టీస్ చేస్తుండేది.
చైత్ర ఇప్పుడు ఏ వాయిద్యంలో పండితురాలైందో!
క్రితంసారి అంకుల్ వచ్చినప్పుడు మ్యూజిక్ లో పి.హెచ్. డి .చేస్తోందని చెప్పాడు.
మళ్ళీ చెప్పింది సుధ! " ఇక్కడేదో సంబంధం గురించి చైత్రని తీసుకు వస్తున్నట్టు వ్రాశాడు అంకుల్."
"ఆహాఁ? సంబంధం ఎవరిదట?" కాళీ కప్పు క్రిందపెడుతూ అన్నాడు శిశిర్.
"మోహన్ రావు అని ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పంజగుట్టలో. వాళ్ళబ్బాయి ఈ మధ్యనే అమెరికాలో చదువు పూర్తిచేసుకుని వచ్చాడుట డాక్టరట."
"అయితే అంకుల్ అల్లుళ్ళవేట మొదలు పెట్టారన్నమాట."
"ఆడపిల్లను కన్న వాళ్ళకి అది ఎప్పటికైనా తప్పదుగా? మంచి అల్లుడు దొరికేవరకు ఎంత ఆరాటమో!" సోఫాలో కూర్చొంటూ అంది.
"మగపిల్లాడిని కన్న నీకూ ఆ ఆరాటమేం తక్కువలేదుకదమ్మా? ప్రతిదానికి ముందు కోడలొస్తే అనడం అలవాటైందిగా? పెళ్ళి పెళ్ళని కలవరించని రోజంటూ ఉందా?"
"నువ్వేం తోట్లలో వేలుచీకటం లేదురా! వచ్చే నెల అయిదుకి ఇరవై ఐదవ పుట్టినరోజు చేసుకోబోతున్నావు.
ఇంతవరకు రెండుమూడు మారేజ్ డేలు చేసుకోవలసినవాడివి! ఇప్పుడే పెళ్ళెందుకు వద్దంటున్నావో చెప్పవు."
"ఇప్పుడే చేసుకోవాలని పించడం లేదంతే!"
"మగపిల్లాడైనా ఆడపిల్ల అయినా ఏవయసు కాముచ్చట జరగాలిరా అన్నీ జరగాల్సిన సమయంలో జరిగితే ఇంట్లో నడయాడే పిల్లలుండే వాళ్ళు."
"అప్పుడే నడయాడే పిల్లల మీదికి పోయిందా మనసు? ఆ పిల్లలొచ్చేవరకు నన్నే నడయాడే పిల్లాణ్న నుకోరాదా?" తల్లి ఒడిలో తల పెట్టుకుని నోట్లో వ్రేలేసుకున్నాడు.
"ఛ! నోట్లో వ్రేలు తీయరా! మనుమణ్నియ్యరా అంటే వెధవ్వేషాలు వేస్తావు!" కొడుకు చెంపమీద సుతారంగా కొట్టింది సుధ.
అప్పుడే గదిలో ప్రవేశించిన శిశిర్ తండ్రి రామకృష్ణ. "అబ్బాయిని ఒళ్ళోపడుకో బెట్టుకుని చిచ్చికొడుతున్నావా?" అడిగాడు నవ్వుతూ.
పెళ్ళి చేసుకొని మనమణ్నియ్యరా అంటే, ఒళ్ళో పడుకుని తనే నోట్లో వ్రేలేసుకుంటున్నాడు వెధవ!" మురిపెంగా కొడుకు ముఖంలోకి చూస్తూ ముసిముసి నవ్వుతో చెప్పింది సుధ.
"ప్రొద్దున్నే కొడుకు పెళ్ళి మీదికి ధ్యాస మళ్ళిందేమిటి?"
"అదే! రేపు రాజగోపాల్ అన్నయ్య వస్తున్నాడు కదా? పెళ్ళి సంబంధం గురించి చైత్రని వెంటబెట్టుకు వస్తున్నాడు. ఎవరింట్లో పెళ్ళన్నా నాకు గుండెలో గుబులుపుడుతుంది."