Previous Page Next Page 
ప్రేమికారాణి పేజి 35

    దానికోసం ఈ తల్లిగుండె తల్లడిల్లిపోతూంది.

    జ్యోతికీ, స్వాతికీ తల్లీ, తండ్రీ, బంధువులు, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి. మరి ప్రేమికకు? ఆ ముసలాడు పోయాక ఈ విశాలప్రపంచంలో ఏకాకిగా, పేదగా, రెక్కాడితేగాని డొక్కాడని మనిషిగా నిలబడిపోదూ? అదృష్టవశాత్తూ తనిప్పుడు ఒక శ్రీమంతుడి భార్య, తన బిడ్డకు ఏమైనా చేయగలిగీ ఏమీ చేయలేని స్థితివస్తే....పగవాడికి కూడా రాకూడని సంకటం ఇది.

    "గీతా! నీ మనసులో ఏమీ లేదంటూనే కళ్ళనీళ్ళు పెట్టుకొంటున్నావు. దేనికి చెప్పు?" ఆమె కనుకొలుకుల్లో నిలిచిన నీళ్ళను చూసి విచలితంగా అన్నారు గిరిధరం.

    "ఇంత అభిమానాన్నీ, ఇంత ఆప్యాయతనీ పొందడానికి నేనెంత పుణ్యం చేసుకొన్నానో అనుకొంటుంటే సంతోషంతో కళ్ళలో నీళ్ళొచ్చాయి."

    "ఇందరికోసం నీ జీవితాన్ని ఖర్చుపెట్టావు. ఇందరికి నీఆప్యాయతనీ, కరుణనీ పంచావు. నీ కోసం మేం కొంచెం ఆందోళనపడితే నీకు భరించలేని సంతోషంగా ఉందా?"

    "నాది కానిది ఏం చేశాను? మీ భార్యగా వచ్చాను. నా బాధ్యత నెరవేర్చాను. డానికి మీరంతా కృతజ్ఞత ఎందుకు చూపాలి?"

    "నువ్వు నెరవేర్చింది బాధ్యతే కావచ్చు. కాని, ఒక దేవతకుండే సహనం, ఓర్పు ఉన్నాయి నీలో. చిన్నదానివి నేను పొగడకూడదు నిన్ను"

    "అమ్మమ్మా! విశ్సూబావ వచ్చాడు." రాకేష్ పరిగెత్తుకు వచ్చి చెప్పాడు. రాకేష్ గిరిధరంగారి రెండో అమ్మాయి శిరీష కొడుకు.

    గిరిధరంగారు మంచంమీదినుండి లేచి ప్రక్కనే కుర్చీలో కూర్చున్నారు.

    ఆజానుబాహువు, స్పురద్రూపి అయినా యువకుడు ప్రవేశించాడు, "అత్తకెలా ఉంది?" అంటూ.

    "బాగున్నావా, విశాల్?" అంటూ పలకరించారు గిరిధరం.

    "ఆఁ. చాలా చిక్కిపోయావు, అత్తయ్యా. అందరూ సుస్తీ అంటే మామూలు అనారోగ్యమే అనుకొన్నాను." అన్నాడు విశాల్. "డాక్టరు ఏం చెప్పాడు, మామయ్యా?"

    "శారీరకంగా ఏ జబ్బూ లేదట. మానసికంగా దేనికో బాధపడుతూంది అన్నారు."

    "అత్తయ్యకి మానసికమైన బాధా? అబ్బే. అత్తయ్యకి బాధపడేందుకు ఇప్పుడు క్రొత్తగా వచ్చిన ట్రబుల్
ఏముంది?" తేలిగ్గా కొట్టిపారేశాడు విశాల్. "ఈ డాక్టర్లు ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు, మామయ్యా! ఏ జబ్బూ లేదన్నారుగా? చాలు, పల్లెకు పంపించు. అక్కడి గాలే సాటిలేని ఔషధం నెలరోజుల్లో గీతత్త కోలుకొని తిరిగి రాకపోతే చూడు."

    "మీ పల్లెలో మనుషులు రోగాలొస్తే మందులు తీసుకోరన్నమాట. గాలే ఔషధమన్నమాట." నవ్వారు గిరిదరం. "గాలి మార్పు ఆరోగ్యానికి మంచిదే. మీ అత్తయ్యని అడుగు వస్తుందేమో."

    "ఏం, అత్తయ్యా?"

    "అక్కడ నాకేం తోస్తుంది? ఒంటరితనం నాకంత సరిపడదు, విశాల్."

    "నేనుంటాగా వందమంది పెట్టు? అసలు, నిన్ను వంటరిగా ఎవరు ఉండనిస్తారు? పల్లె అయితే మాత్రం మనుషులు లేరా? వాళ్ళు నిన్ను వంటరిగా ఉండనిస్తారా?"

    "పల్లెలూ, పొలాలూ అంటే నీకొక వింత ఆపేక్ష. వాటిమీద మాట పడనీయవుకదా?"

    "తాతయ్యా. నీకోసం నాగప్ప వచ్చాడు," రాకేష్ వార్త అందించి తుర్రుమన్నాడు.

    "ఏం గీతత్తా? ఇప్పుడు కావలసినంత తీరికేగా? ఎప్పుడు రమ్మన్నాతీరిక ఏదీ అనేదానివి."

    దీర్ఘాలోచనలో మునిగిపోయినట్టున్న గీతాభవాని, కాస్సేపటికి తరువాత ఏదో నిశ్చయానికి వచ్చినట్టుగా చటుక్కున అంగీకారం తెలిపింది. "అలాగే వస్తాను, విశాల్."

    "థ్యాంక్స్, గీతత్తా." నవ్వాడు.

    "దీనికి థాంక్స్ ఎందుకుగాని, అమ్మ మొన్నవచ్చి రెండురోజులుండి వెళ్ళింది. తెలుసుకదూ?"

    తెలుసునన్నట్టుగా తలూగించాడు.

    "అమ్మ నీగురించి చాలా బాధపడుతూంది!"

    "బాధపడుతూందా? దేనికి?" విస్మయంగా అడిగాడు విశాల్.

    "నువ్వు వ్యవసాయం చేయించడం వరకు బాగానే ఉంది. కాని, నువ్వు ఆకూలినాలి జనంతో అంత సన్నిహితంగా ఉండడం, బండితోలడం, దున్నడంలాంటి పనులు పరువు తీసేవిగా ఉన్నాయిట. నిజమేకదూ? ఉండివాళ్ళమీద అజమాయిషీ చేయిస్తే జరిగిపోయేపనులకు నువ్వు నీ అంతస్తును మరిచిపోయినట్టుగా ప్రవర్తించడం అమ్మా నాన్నకి బాధకదూ?"

    "ఈసారి ఇలా మాట్లాడితే, నేను బండితోలినా, దున్నినా, బురదలో దొర్లినా నా పొలంలో దొర్లానని, నా బండినే తోలానని చెప్పు, అత్తా."

    "కోపం వచ్చిందా, విశాల్?"

    "నాకు సామాన్యంగా కోపం రాదని నీకు తెలుసు." కోపం రాలేదని చెప్పడాని కన్నట్టుగా ఒక నవ్వు నవ్వేశాడు.

    విశాల్ ది చిన్నప్పటినుండి స్వేచ్చాప్రవృత్తి. అతడి అన్నయ్యలంతా "పెద్దయ్యాక ఏం చేస్తార్రా?" అని అడిగితే డాక్టర్నో, కలెక్టర్నో అవుతామని సగర్వంగా చెబితే, అంతే సగర్వంగా 'నేను వ్యవసాయం చేయిస్తాను' అని చెప్పేవాడు విశాల్.
అన్నట్టుగానే చదువులో వ్యవసాయ శాస్త్రాన్నే అభిమాన విషయంగా తీసుకొన్నాడు.

    "అందరూ డాక్టర్లం యాక్టర్లం అవుతామని చెబుతూఉంటే నువ్వు రైతు నౌతానని చెబుతావేమిటి?" అని అడిగినవాళ్ళకి,

    "మీకు రైతు అంటే అంత చిన్న చూపుగా ఉందేమోగాని, రైతు జీవితంపట్ల నాకు చాలా ఉన్నతమైన అభిప్రాయంఉంది! డాక్టర్లకి, యాక్టర్లకి, కలెక్టర్లకీ ముద్ద నోటికందాలంటే రైతు అనేవాడు తప్పనిసరిగా ఉండాలికదా? నేను వాళ్ళందరికీ అన్నం పెడతా నన్నమాట."
   

 Previous Page Next Page