అతని గుండెలో కళుక్కుమన్న భావాన్నణుచుకోలేకపోయాడు. మరో అడుగు ముందుకువేసి బెడ్ మీద ఆమె ప్రక్కగా కూర్చుని "ప్రజ్ఞా!" అని పిలిచాడు.
ఆమెకు నిద్రనుండి మెలుకువరాలేదు.
చెయ్యి ముందుకు జాచి చెంపలమీద కన్నీటి చారికల్ని మృదువుగా తుడిచాడు.
"డాక్టర్ గారూ ! మీరే నన్ను ..." నిద్రలోనే అంటూండగా చెంపలమీద నుంచి తీసి వెయ్యబోతూన్న అతని చెయ్యి ఆమె చేతిని తాకింది. ఆమె చేతి వ్రేళ్ళులో అతని చెయ్యి బంధించబడినట్లయింది.
"ప్రజ్ఞా !"
"మీరు నన్ను ..." అతని చేతిని గుండెలమీదకు లాక్కుంది.
జాలి, కరుణ, ప్రేమ, ఆకర్షణ ...సమ్మిళితమై అతని నరాల్లోంచి అణువణువునా పయనిస్తోండగా స్తబ్దుగా ఉండిపోయాడు.
పది నిమిషాలు అలాగే గడిచిపోయింది. ప్రజ్ఞ ఆ చేతిని విడిచి పెట్టడాని కిష్టంలేనట్లు గుండెను హత్తుకుని నిద్రలో అలానే పడుకుని వుంది.
బయట కారేదో ఆగిన చప్పుడయింది. పేషెంటెవరో వచ్చి వుంటారు. అతను మృదువుగా ఆమె చేతినుండి విడిపించుకుని లేచి యివతలకు వచ్చాడు.
* * *
మధ్యాహ్నం పన్నెండు దాటిపోయింది. బహుశా ఎక్కడో తుఫాను పడుతూ ఉండవచ్చు. వర్షమింకా కురుస్తూనే ఉంది.
జర్నల్ చదువుకుంటోన్న దయాకర్ గుమ్మందగ్గర అలికిడయి తల ఎత్తి చూసేసరికి తలుపుదగ్గర ప్రజ్ఞ నిలబడి వుంది.
"అరె! మీరు లేచి వచ్చేశారా ?" అన్నాడు. మళ్ళీ అరె ...
"ఇప్పుడు తేలిగ్గానే వుంది. చాలాసేపు నిద్రపోయాననుకుంటాను. పేషెంట్సెవరయినా వచ్చారా ?"
"కార్లున్నవారు అయిదుగురు వచ్చారు."
"న ...నన్ను లేపకపోయారా ?"
"అంత అవసరం లేకపోయింది. వాన యింకా పడుతూనే వుంది. ఈ స్థితిలో ఒక్కరే ఇంటికెలా వెడతారు ? రండి కార్లో డ్రాప్ చేస్తాను" అంటూ దయాకర్ సీట్లోంచి లేచాడు.
"మీకెందుకండీ శ్రమ ?" నేను రిక్షాలో వెళ్ళిపోతాను" అంది ప్రజ్ఞ మొహమాట పడుతూ.
"కార్లో తీసుకెళ్ళడానికి శ్రమేముంది. అయినా యింత వర్షంలో రిక్షావాళ్ళు అంత తేలిగ్గా వస్తారా?" అంటూ ఆమె మాట వినిపించుకోకుండా అతను ఆయాకు తలుపు వేయమని చెప్పి కారు కీస్ తీసుకుని పోర్టికోలోకి నడిచాడు.
గేటు అవతల కొంచెం దూరంలో _ రిక్షాలోంచి పడిన దెబ్బల ఫలితంగా పరాభవాగ్నితో గుండె పరవళ్ళు త్రొక్కుతుండగా, పగబట్టిన త్రాచులా కసితీర్చుకునేందుకు సిద్దమవుతూ యోగి పొంచివున్నాడని వాళ్ళకి తెలియదు.
దయాకర్ కారులో ఎక్కి కూర్చుని "రండి" అన్నాడు వరండాలో నిలబడి వున్న ప్రజ్ఞ వంక చూసి.
వర్షం పడుతున్న శబ్దం వల్ల అతని మాటలామెకు వినిపించలేదు. కాని పెదవుల కదలికలను బట్టి అతని భావాన్నర్ధం చేసుకుని, మెట్టు దిగి కారు దగ్గరకొచ్చింది. ఎక్కడ కూచోవాలో తెలీక సందిగ్ధంగా నిలబడితే, కొంచెం ప్రక్కకు వొంగి ఫ్రంట్ డోర్ తెరిచాడు. ఆమె లోపలికి ఎక్కి కూచుని డోర్ వేసింది.
రివర్స్ లో కారు బయటికొచ్చి ప్రక్కకి తిరిగింది.
అక్కడికి కొంచెం దూరంలో ఓ షాపు చూరుక్రింద స్కూటర్ పార్క్ చేసుకుని నిలబడి, కారు వెళ్ళిపోయాక, బయటికొచ్చే ప్రజ్ఞను వేటాడుదామన్న దీక్షతో నిలబడివున్న యోగి _ దయాకర్ ప్రక్క ఆమె కూచుని వుండడం చూసి ఉలిక్కిపడ్డాడు. అతడు తేరుకునేటంతలో కారు అతను నిలబడ్డ ప్రదేశాన్ని దాటి ముందుకెళ్ళిపోయింది.
కానీ ఏదో అనుమానంతో అటుకేసి చూసిన ప్రజ్ఞ అతన్ని గుర్తుపట్టింది. భయంతో ఆమె వళ్ళు జలదరించింది. ముఖం వెలవెల బోయింది.
* * *
వర్షాన్ని చీల్చుకుంటూ కారు జాగ్రత్తగా ముందుకు దూసుకెడుతున్నది. ఫ్రంట్ గ్లాసు మీద వైపర్స్ పనిచేస్తూ సాధ్యమైనంత దారి చూపడానికి ప్రయత్నిస్తున్నాయి.
దయాకర్ తలత్రిప్పి ఆమె వైపు చూశాడు. "ఏమిటలా వున్నారు?" అనడిగాడు,
"ఊ ?"
"మళ్ళీ ఎందుకలా అయిపోయారు ?"
"... ఏమీ లేదు."
"మీరెందుకో చాలా వర్రీ అవుతున్నారు. కారణమడిగితే చెప్పడం లేదు."
"నిజంగా ఏమీ లేదు" అంటూ ఆమె తల వెనక్కి త్రిప్పి, ఎవరయినా ఫాలో అయి వస్తున్నారేమోనని చూడడానికి ప్రయత్నించింది. కాని అద్దాలెత్తి ఉండడంవల్ల, బ్యాక్ గ్లాస్ మీద ఆవిరి క్రమ్మి వుండడం చేత ఏమీ కనిపించడంలేదు.