Previous Page Next Page 
భారతి పేజి 35

    అతని గుండె  మళ్ళీ కలుక్కుమంది. "మీతో కలిసి  తిరగటానికి ఇతరులు ఉబలాటపడాలి, ఆ దశ నుండి  ఎప్పుడో  దాటిపోయారు"

    "అయితే....అయితే....నేను  నర్సింగ్  కోర్సులో  చేరుదామనుకుంటున్నానండీ" ఆమె తల వంచుకుని  నెమ్మదిగా  అంది.

    "నర్సింగా?"

    "అవునండీ. నాకు నర్సునవాలని  కోరికగా  ఉంది."

    ఎందుకు  మీకలాంటి  కోరిక  కలిగింది? ఇన్నాళ్లూ చెప్పారు కాదేం?'__ఇలాంటి  ప్రశ్నలేవీ  అతడు వెయ్యలేదు. ఒక్క నిమిషం  మెదలకుండా  ఊరుకుని, "చాలా మంచిదండీ, మీ అభిరుచుకి  మిమ్మల్నభినందిస్తున్నాను" అన్నాడు.

    "అవసరమైతే  వచ్చి కనిపిస్తూ  వుంటానండీ"

    "ఆరోగ్య  విషయంలో మాత్రం  అలాంటి  అవసరమెన్నడూ  రాదు, యుగో ఎ హెడ్ భారతిగారూ?"

    ఆమెనతను  పేరుపెట్టి  పిలవడం  అదే ప్రథమం. నివ్వెరపోయి అతనివైపు  చూసింది. మళ్ళీ వెంటనే  కళ్ళు దించేసుకుని  ఒక నిమిషం  మెదలకుండా  ఊరుకుని, "నేనిహ  సెలవు  తీసుకుంటానండీ" అని లేవబోయింది.

    "అన్నట్టు నేనూ ఒక విషయం  చెప్పాలండీ  మీతో....కొద్దిరోజుల్లో  ప్రాక్టీస్ మానేయబోతున్నాను  నేను."

    ఆమె అదిరిపడి. లేచే ప్రయత్నం  విరమించి  అతనివైపు  తిరిగింది.

    "అవునండీ. ఇన్నాళ్ళూ  మంచిరోజులు  ఇంకా  వస్తాయేమో....ఇంకా వస్తాయేమో  అని ఎంతో ఓపికతో, ఆశతో  ఎదురు చూశాను. బహుశా ప్రైవేటు ప్రాక్టీస్ లో  రాణించాలంటే  ఓర్పుకన్నా  నేర్పు, ఇతరత్రా కొన్ని హంగులు ఉండాలనుకుంటాను. డబ్బు సంపాదించటంలో  కూడా  అనేకమైన  ఒడుపులు  చూపించాలి. నాకు పేషెంట్లు పెరుగుతున్నారుగాని  రాబడి  తక్కువయిపోతోంది. వారినెలా  అడగాలో నాకర్ధం  కావటంలేదు. ఈ రోజు  మీ ముందు  దాపరికం  లేకుండా  చెబుతున్నాను. కాంపౌండర్ని  కూడా  భరించటం  కష్టమనిపించి, అతన్ని మానిపించి, ఓ బాయ్ ని పెట్టుకుని వాడితో  గడుపుకొస్తున్నాను....ఇలా ఎన్నాళ్లో  సాగేటట్లు  లేదు. ఇది ఎత్తేసి సర్వీస్ లో చేరిపోదా మనుకుంటున్నాను."

    భారతి చకితురాలై  ఆలకించింది. అతనిపట్ల  ఆమె హృదయం సానుభూతితో నిండిపోయింది. ఓ నిట్టూర్పు విడిచి అన్నది. "ఈ ప్రపంచంలో  గెలుపు  వరించాలంటే  సామర్ధ్యంతోపాటూ  ఇంకా ఎన్నో వుండాలి డాక్టరుగారూ! అది లేనివారు అందులోనే తారట్లాడటం  కంటే  దారి మార్చుకోవటమే మంచిది"

    నిజానికి  తనకు వైద్యంచేసే వ్యక్తి  అంత వున్నతుడుగా  వుండటం  ఆమె ముందు ఊహించని  విషయం. అంత ఉన్నతుడైన  వ్యక్తి  తన వృత్తిపట్ల  అసంతృప్తుడై  వుండటం  ఆమెను బాధించింది.

    కొద్దిక్షణాలు  మౌనంగా  గడిచాక  "వస్తానండీ, సెలవు" అంటూ ఆమె లేచి  నిల్చుని  చేతులు రెండూ  జోడించి  నమస్కరించి, బయటకు నడిచింది. అతనుకూడా  లేచి నిలబడి గుమ్మందాకా  వచ్చి ఆమెను  సాగనంపాడు.


                              *    *    *    *


    జీవితంలో  మార్పులు  జరగటం  ఎదురుచూసిన  దానికన్నా  ఎక్కువ  వ్యవధే  తీసుకోవచ్చు. కాని మార్పు జరిగాక, ఆ కొత్త అధ్యాయంలో  లీనం కాగలిగితే  గతంలోని  నష్టాన్నీ, కష్టాన్నీ  కూడా చాలా  సులభంగా  దాటిపోగలిగే  శక్తి  వస్తుంది  మానవుడికి. ఈ మార్పే తన జీవిత గమనానికి  నిర్దేశమైన  పథకం  అని కూడా  నమ్మటం  జరుగుతుంది.

    ప్రస్తుతం  అలాంటి  దశలో వుంది భారతి. ఈ కొత్తదనానికి  ఆశ్చర్యపడటం  మానివేసింది.

    కాని చందరాల  విడిచిపెట్టేముందు  ఆమెకు పిన్నిని విడిచి  వెళ్ళాలంటే  దుఃఖం  ముంచుకు వచ్చింది. తనకు ఊహ  తెలిసినప్పటినుంచీ  పిన్నే  తన మాతృమూర్తి. తన అంగరక్షకురాలు. తనకు తోడునీడ. తనకు తెలిసిన మాతృమూర్తి. అలాంటి వ్యక్తిని  విడిచి  వెళ్ళేందుకు ఆమె ప్రాణం  విలవిల్లాడింది.

    కాని తప్పదు. ఈ నాలుగేళ్లూ  తను నర్సెస్  క్వార్టర్స్ లోనే  వుండాలి. బయట ఆమెతో  ఎక్కడన్నా  నివసించటానికి  హాస్పిటల్ రూల్స్ ఒప్పుకోవు.

    "భయంలేదు  పిన్నీ! నాగరాజు  వున్నాడు. నిన్ను కంటికి రెప్పలా  చూసుకుంటాడు. నాకు సెలవు దొరికినప్పుడల్లా  వస్తూవుంటాను. నలుగేళ్ళంటే  ఎంతలో పిన్నీ! ఇట్టే గడిచిపోతాయి" అంది రాధమ్మకు ధైర్యం చెప్పటానికి  ప్రయత్నిస్తూ.

    బయట కంత తేలికగా  అన్నదిగానీ నాలుగేళ్ళు__మరో మనిషి  అండ లేకుండా  ఆ బావురుమనే  ఇంట్లో  ఒంటరిగా  తచ్చాడుతూ  గడపాలంటే  ఎంత గుండెలు  పగిలిపోయేలా  వుంటుందో  ఆమెకు తెలియని సంగతి కాదు.

    కాని రాధమ్మ మాత్రం  ధైర్యంగానే వుంది. తన జీవితం  ఎలాగూ  తగలబడి పోయింది. భారతి జీవితం సగం  కాలిపోయింది. మిగతా  సగమన్నా  రంగు రంగుల దీపాల  తోరణంలో  వెలగాలని  ఆమె ఆశ.

    అందుకే కన్నీరు నింపలేదు.  అక్కున  చేర్చుకుని ,ఎంతో  ప్రగతీ, సంస్కారం వున్న మనసుతో  ఆశీర్వదించింది.

    ఆమె ఎంత  ముందుకువెళ్ళి  ఆలోచించి, ఆశీర్వదించిందో, ఎవరైనా  గుర్తించగలిగితే జన్మంతా  పల్లెటూరిలో  గడిపిన  ఆ అనుభవశూన్యురాలైన  స్త్రీలో  వున్న వివేకం  తెలుసుకుని విభ్రాంతి  చెందుతారు.

    "నువ్వు ధైర్యంగా వెళ్ళు చెల్లీ. ప్రతి మూడు నాలుగు రోజులకూ  నేనోసారి  ఇక్కడికి వచ్చి  యోగక్షేమాలు  కనుక్కుని వెడుతూంటాను" అన్నాడు నాగరాజు  భారతి ఏడుస్తూంటే  స్వాంతన వచనాలు చెబుతూ.

    మునసబుగారు  వచ్చారు. ఊళ్లో  ఆ కుటుంబాన్ని  అభిమానించే వాళ్ళంతా  వచ్చారు. ఆడా, మగా అంతా చేరారు.
    అందరి దగ్గరా  సెలవు  తీసుకుని భారతి  గుంటూరు  ప్రయాణమైంది.


                                                               *    *    *    *


    తరువాత  కాలం  ఎంత చకచకా  పరుగెత్తిందని! భారతి ఓ నూతన ప్రపంచంలో  పడిపోయింది. అది రోగుల ప్రపంచం, డాక్టర్ల ప్రపంచం. నర్సుల ప్రపంచం. తెల్లవారుఝామున  నిద్రలేవటం ,ఏడు గంటలకల్లా  యూనిఫారం  వేసుకుని వార్డుకి  పరిగెత్తడం, అక్కడి నుంచీ  ఏవేవో  డ్యూటీలు, మందులు, రకరకాల మనుష్యులు, ఉక్కిరి బిక్కిరి అయేటట్లు  పని, మధ్యలో  ఒకటి రెండు  గంటలు  క్లాసులు, రాత్రికి గదికి  వెళ్ళాక  బట్టలు  మార్చుకుని  భోజనం చేశాక చాలాసేపు  చదువుకుని పడుకోవటం....

    ఎంతో సహనం  అలవరుచుకుంది. ఎలాంటి  అవమానం  భరించవలసివచ్చినా చిరునవ్వుతో ఎదుర్కోవటం  అలవరుచుకుంది. ఒక్కో డాక్టరు  చాలా నిరసనగా  చీదరించుకుంటూ  వుంటాడు. ఒక్కో స్టాఫ్ నర్సు  తన అధికారదర్పం  వినియోగించుకుని  కారణాన్ని  కల్పించుకుని  గుండెల్లో  గుచ్చుకునేటట్లు  దులిపేస్తూ వుంటుంది. కొందరు  రోగులు విసిగించి, ప్రాణాలు కొరుక్కుతినేస్తూ  వుంటారు. ఒక్కోసారి  తోటి సిస్టర్లపరిహాసాలు, వెటకారాలు, ఎక్కడికక్కడ ఆంక్షలు, అధికారాలు, అజమాయిషీలు....

    అయితే  కొద్దిరోజుల్లోనే  ఆ వాతావరణానికి  అలవాటు  పడిపోయింది. పని నేర్చుకోవటంలో  ఎంతో ఉత్సాహం  ప్రదర్శించేది భారతి. తన సపర్యలు ,డ్యూటీలు, నైట్ డ్యూటీలు, తన విద్యుక్తధర్మం....ఈ కర్తవ్య నిర్వహణలో   ఒక రకం  హుందాతనం, గర్వం, సంతృప్తి ఆమెను ఆవహిస్తూ  వుండేవి.

    మిగతా  వ్యవహారాల గురించి  ఆలోచించటానికి కూడా  ఆమెకు వ్యవధి దొరికేది కాదు.

    మల్లిక మాత్రం  తరుచు కలిసేది. భారతికి  ఆఫ్ వున్న  రోజున ఆమె ముందుగా తెలుసుకుని వచ్చి  ఒకటి రెండు గంటలు కూర్చుని, కులాసాగా కబుర్లు చెప్పి వెళ్ళేది. ఒక్కోసారి  భారతి రానని ఎంత మొండికేసినా, బలవంతం చేసి ఏ సినిమాకైనా  లాక్కువెళ్ళేది.

    నాగరాజు  పది పదిహేనురోజుల  కొకసారి  ఉత్తరం  రాసేవారు. రాధమ్మ యోగక్షేమాలు  తెలియజేస్తూ ఉండేవాడు.

 Previous Page Next Page