మోహన్ ను చూసి నిర్లక్ష్యంగా నవ్వి "ఎంత అదృష్టం! మా ఇంటికి స్వయంగా వచ్చారు" అంది.
రాధమ్మను చూపించి "మా అమ్మ!" అని పరిచయం చేసింది.
ఇన్నాళ్ళుగా ప్రసూన తనను ఇంటికి ఎందుకు ఆహ్వానించలేదో అర్ధమయింది మోహన్ కు.
"మీరు అదృష్టవంతులు. తల్లీ తండ్రి అందరూ ఉన్నారు. ఎవరూ లేని అనాథను నేను. అందరి దయా ధర్మాలమీద బ్రతికాను" అన్నాడు.
ప్రసూన కళ్ళలో ఆశ్చర్యం కనిపించింది. మాటాడలేదు.
మోహన్ కోసం ఫలహారం తెప్పించింది.
"మీరుకూడా తీసుకుంటేనే కాని నేను తీసుకోను!" అన్నాడు మోహన్. ప్రసూన ఏమీ తిని ఉండదని అనిపించింది అతనికి.
"నాకు ఆకలిగా లేదు!"
"నాకు అసలు లేదు"
ఆప్యాయత ఉట్టిపడే అతని ధోరణి ప్రసూనకు ఆశ్చర్యంగా ఉంది. తనను విశ్వసిస్తున్నాడా మోహన్! అంత అదృష్టమా!
ప్రసూనతో కలిసి కాఫీ తీసుకున్నాక సందేహిస్తూ అన్నాడు మోహన్.
"మీరు ఈ ఉద్యోగం మానెయ్యరాదా" అన్నాడు మోహన్.
ప్రసూన ముఖంలో చిరునవ్వు ఎగిరిపోయింది. నిబ్బరంతో తెలెత్తి "ఎందుకు మానెయ్యాలి?" అంది.
"మీకు బాగుందా ఈ ఉద్యోగం?"
"ఎందుకు బాగుండదు? ఈ రోజుల్లో ఇలాంటి ఉద్యోగం ఎంత మందికి దొరుకుతుంది?"
"అవును లెండి! ఇలాంటి ఉద్యోగాలకు చాలా అర్హతలు కావాలి!"
పకాలున నవ్వింది ప్రసూన.
"అవునా! మరి, ఆ అర్హతలన్నీ ఉన్న నేను ఈ ఉద్యోగం ఎందుకు వదులుకోవాలి?"
"అవును వదులుకోవలసిన అవసరంలేదు. పరువు ప్రతిష్ట డబ్బు హోదా........"
"ఇన్ని యిస్తోంటే వద్దనే మూర్ఖులెవరైనా ఉంటారేమో చూపించండి....."
"మూర్ఖులవునో, కాదో, కాని ఇలాటివన్నీ కాలదన్నుకుని తాము విలువలనుకునే వాటిని పాటించేవాళ్ళూ ఉంటారు!"
"ఎవరు? మీ బోటివాళ్ళా?"
వెటకారంగా అడిగింది ప్రసూన.
మీరు నన్ను బాగా అర్ధంచేసుకున్నారు!"
"మీరు నన్ను అర్ధంచేసుకున్నదానికంటేనా?"
"ఇవాళ నేను మీఇంటిని వెతుక్కుంటూ వచ్చాను. మిమ్మల్నెలా అర్ధంచేసుకున్నానో చెప్పటానికి ఇది చాలదా?"
"చాలు! ఇవాళ రేఖ తీరిగ్గా లేదా?"
ప్రసూన ధోరణికి మోహన్ లో సహనమంతా నశించి పోయింది.
"తెలియదు. నేను మిమ్మల్నీ రేఖనూ ఒక లెవల్ లో ఎన్నడూ ఊహించలేకపోయాను. ఆ పని మీరే చెయ్యగలిగితే..... ఓ. కె......థాంక్యూ!"
"వెళ్ళివస్తాను" అన్నాడు. లేచి నించుని చేతులు జోడించాడు మోహన్. ప్రసూన కూర్చున్న చోటినుంచి లేవలేదు, కనీసం అంగీకారసూచకంగా, మర్యాదగా తల కూడా ఆడించలేదు. వాలిన ఆవిడ కనురెప్పలముందు దట్టంగా అలుముకున్న అంధకారం తప్ప మరేమీ కనిపించడంలేదు.
ఆ రోజు ఉదయం 5 గంటలకే మోహన్ కు ఫోన్ వచ్చింది. అవతలివైపునుండి రేఖ కంఠం విలాసంగా పాలికింది___
"మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా?"
"చేసేసారుగా! చెప్పండి!"
"ఇది అంత ముఖ్యమైన విషయం కాకపోతే ఇలాంటి సమయంలో మీకు ఫోన్ చేసేదాన్ని కాను."
"అసలుసంగతి చెపుతారా? లేదా?"
"చెప్పాలనే ఉంది-ఎలా చెప్పాలో అర్ధంకావటం లేదు"
"ఆలోచించుకుని మళ్ళీ ఫోన్ చేస్తారా?"
"అక్కర్లేదు__విని మీరేమనుకుంటారో, ఏం చేస్తారో ఊహించలేకుండా ఉన్నాను. చాల భయంగా ఉంది."
మోహన్ మాట్లాడలేదు-
"హలో!" అంది రేఖ-
"వింటున్నాను"
"అంత కోపమయితే ఎలాగండీ! మీ మేలు కోరేదాన్ని గనుక కష్టపడి ఫోన్ చేస్తున్నాను. కాని లేకపోతే నాకేం పట్టింది? పెట్టెయ్యనా?"
"ఇందాకటినుండి నేనుఅడుగుతున్నది చెప్పమనే?......" "ఎలా చెప్పనండీ? సరే! వినండి-మన శ్యామ్ ఒక పెద్ద గవర్నమెంటు ఆఫీసర్ గారి దగ్గర నుండి "త్రి ఇన్ వన్" జపాన్ ఇంపోర్టెడ్ దొంగిలించి పట్టుబడిపోయాడు- ఆ ఆఫీసర్ గారు పోలీస్ రిపోర్టు ఇస్తానని కూర్చున్నారు. నేను సాంబశివంగారు ఆయనకు సర్ది చెప్పలేక సతమతమయి పోతున్నాము- వచ్చిన చిక్కు ఎక్కడంటే శ్యామ్ దొంగతనం చేసాడనటానికి కావలసిన ఆధారాలన్నీ ఉన్నాయి." మోహన్ రక్తం చల్లబడిపోయింది. సాంబశివం పన్నిన ట్రాప్ మోహన్ కు అర్ధమయింది. మళ్ళీ శ్యామ్ తనకాళ్ళకు అడ్డుపడుతున్నాడు- సాంబశివం తనలాంటి ఆఫీసర్ ను బెదిరించటానికి సాహసిస్తున్నాడంటే, అవతలి గవర్నమెంటు ఆఫీసర్ చాల ప్రముఖుడై ఉండాలి-