Previous Page Next Page 
నిరాశలో నిండు గుండె పేజి 37

   
    "హలో....." అంది రేఖ మళ్ళీ - ఈసారి చిలిపిగా- కొంటెగా-    
    మోహన్ మాట్లాడక పోయేసరికి "వింటున్నారా?" అని మోహన్ సమాధానం కోసం ఆశించకుండా తనే ప్రారంభించింది.    
    "పాపం. మన శ్యామ్ ఎంతో మంచివాడండీ! ఇంత వయసు వచ్చినా పసితనం వదలలేదు. 'రేఖా' 'రేఖా' అంటూకూడా కూడా తిరుగుతాడు. ఏమిటో కలం కలిసి రాక పట్టుబడిపోయాడు. విచారణ జరిగితే మన శ్యామ్ భవిష్యత్తు ఏమయిపోతుందండీ?"    
    ఏడుపు గొంతుకతో అంది రేఖ- ఆ ఏడుపులో విరగబడి నవ్వుతున్న రేఖ స్పష్టంగా కనిపిస్తోంది మోహన్ కి-    
    "థాంక్యూ! ఈ విషయం గురించి నేను ఆలోచింస్తాను లెండీ!"    
    "ఆగండి! ఆగండీ! పెట్టెయ్యకండీ-శ్యామ్ కోసంనేను సాంబశివంగారిని ఎన్నో విధాల బ్రతిమాలాను- ఆయన సాధారణంగా నా మాట కాదనరు లెండి! ఈ ఆఫీసర్ గారు సాంబశివంగారి ఫ్రెండ్-అందుకే.....సరే! సాంబశివంగారు ఎంతమంచివారో తెలుసా! ఏమన్నారో వినండి-'నేను ఎవ్వరికీ ఏ అపకారం చెయ్యను. మోహన్ అంటే నాకెంతో ఇష్టం-అతనే నిష్కారణంగా నన్ను కాదని వెళ్ళిపోయాడు-మోహన్ నా స్నేహం కోరితే అంతకంటే నాకు కావలసింది ఏముందీ?' - అని. మీరేం నిర్ణయించుకుంటారో, మరి!"     
    ఫోను పెట్టేసింది రేఖ -    
    ఆ తరువాత మోహన్ కు నిద్ర పట్టలేదు - భరింప రాని అశాంతితో మనసు ఉడికి పోసాగింది-    
    "దయాఋణంనుండి బయటపడటం కష్టం సార్?' అంటున్న చిరంజీవి మూర్తి తనను వెక్కిరిస్తున్నట్లు అనిపించ సాగింది.    
    ఏమయినాసరే లొంగకూడదనే నిర్ణయించుకున్నాడు గుండె రాయి చేసుకుని తను సంపాదించిన రికార్డుమీద రిపోర్ట్ వ్రాయటానికి తయారయ్యాడు.    
    జనార్ధన్ వచ్చాడు- ఎందుకు వచ్చాడో అర్ధమయింది మోహన్ కు. ఆ వెనుక శ్యామ్ కూడా ఉన్నాడు__తల వంచుకుని కూర్చున్నాడు.    
    జనార్ధన్ నవ్వుతూ "మోహన్! ఒకరకంగా జరిగిన దానికంతకు నువ్వే బాధ్యుడివోయ్! శ్యామ్ కు డబ్బు అంధనీయవద్దని అన్నావు. నీమాట విన్నాను. మనం యియ్యకపోయినా శ్యామ్ కు డబ్బు ఎలా వస్తోందని ఎవ్వరమూ ఆలోచించలేదు. చివరకు ఇలా వచ్చింది. ఈ సమస్య ఎలా పరిష్కరిస్తావో పరిష్కరించు" అన్నాడు. జనార్ధన్ గడుసు తనానికి నివ్వెరపోయాడు మోహన్.    
    రేఖ ప్రోత్సాహంతో చిన్నచిన్న దొంగతనాలు హోటల్ లో చెయ్యటానికి అలవాటు పడిపోయాడు శ్యామ్. రేఖ చెప్పిన ఉపాయాలతో దొరికిపోకుండా బయట పడటంతో హుషారొచ్చింది.    
    రేఖ "త్రి-ఇన్-వన్" చూపించి దొంగిలించమనగానే మొదట కొంచెం భయపడ్డాడు శ్యామ్.    
    "ఇలాంటి వస్తువులు తీసుకుంటే దొరికిపోతామేమో!" అన్నాడు.    
    "నిన్ను పట్టుకోవటానికి బ్రహ్మ దిగిరావాలి. అది ఆయనదేననటానికి ఏమిటి ఆధారం? వెంటనే ఆ మేన్యు ఫ్యాక్చరింగ్ నంబర్ పోయేలా చూసుకుంటే సరి! 'త్రి-ఇన్-వన్' ఇండియాలో అమ్మితే అధమం మూడువేల పైన వస్తుంది తెలుసా?"    
    "మూడువేల" సంఖ్య శ్యామ్ ను ఆకర్షించింది__ముందు ఆలోచన లేకుండా సాహసించాడు- సాంబశివం అంతా ముందుగానే ఏర్పాటుచేసి ఉండటంవల్ల శ్యామ్ దొంగతనం చేస్తూండగా ఆ ఆఫీసర్ గారి నౌకరు ఫోటోలు తీశాడు. శ్యామ్ 'త్రి-ఇన్-వన్' తో బయట పడకుండానే ఆ ఆఫీసర్ గారు పట్టుకున్నారు. 'ఇవాళ కాకపోతే రేపు' అని సాంబశివం ఏ భరోసాతో అన్నాడో అర్ధమయింది మోహన్ కి.    
    "ఇప్పుడు నేనేం చెయ్యగలను?"    
    ఎంతో దృఢంగ అనాలనుకున్న మాటలు నీరసంగా వచ్చాయి.    
    "ఆ రికార్డు నేను చూసాను. అందులో ఏవో లెక్కలున్నాయి. అంతకంటే ఏంలేదు. అసలు దొంగనోటు లెక్కడ ప్రింట్ చేస్తున్నారో ఎవరు ప్రింటుచేస్తున్నారో, పట్టుకోవాలి! అప్పుడుగాని కేసు నిలవదు."    
    "ఆ రికార్డు చూసిన ఎవరికైనా ఏరోజు ఎన్నెన్ని దొంగనోట్లు ఏ విధంగా ఎక్స్ చేంజ్ చేస్తారో అర్ధమయిపోతుంది."    
    "అవుననుకో? అంతమాత్రాన ఏమవుతుంది? ఆ వ్యాపారమంతా నడిపిస్తున్నది సాంబశివం అనటానికి ఆధారమేముంది! నీకా రికార్డు ప్రసూన గదిలో దొరికింది. అందరూ కలిసి ప్రసూనమీదకు తోసినా తొయ్యవచ్చును ఏది ఎటు తిరుగుతుందో చెప్పలేము."    
    ఉలికి పడ్డాడు మోహన్- జనార్ధన్ కనీ కనిపించకుండా నవ్వాడు- మోహన్ లోలోపల కటకట పడ్డాడు.    
    "ఏది ఏమయినా రిపోర్ట్ ఇయ్యడానికే నిర్ణయించుకున్నాను."    
    మొండిగా అన్నాడు మోహన్.    
    జనార్ధన్ లేచి మోహన్ చేతులు పట్టుకున్నాడు.    
    "నిన్ను ఇంతవాడిని చేసిన ఈ చేతులతో నీ చేతులు పట్టుకొని బ్రతిమాలుతున్నాను మోహన్. నిష్కారణంగా శ్యామ్ జీవితం నాశనం చెయ్యకు. దీనివల్ల ఎవరికీ ప్రయోజనంలేదు. నువ్వు రిపోర్టు ఇస్తావు. అంతమాత్రాన దొంగ నోట్ల వ్యవహారమంతా ఋజువు చెయ్యలేవు- అవతలివాళ్ళు సామాన్యులు కారు- వాళ్ళకు ప్రభుత్వంలో కూడా పలుకుబడి ఉన్నట్లు ఈ ఆఫీసరు వ్యవహారంతోనే తెలుస్తుంది. నువ్వు రిపోర్టు ఇచ్చినా వాళ్ళు ఎలాగైనా తప్పించుకోవచ్చు- ఈ రికార్డుకంటే బలమైన ఆధారాలు లేకపోవడంవల్ల నువ్వేమీ చెయ్యలేవు- ఈ గొడవలవల్ల వాళ్ళు ఇంకముందు మరింత జాగ్రత్తగా ఉంటారు. అలాకాక ఈ చిన్న రికార్డు విషయంలో వాళ్ళతో రాజీపడినట్లు నటిస్తే ముందుముందు అసలు దొంగనోట్లు ఎవరు ప్రింటు చేస్తున్నారో ఎక్కడ ప్రింటు చేస్తున్నారో పట్టుకోవచ్చు- అప్పుడది బలమైన కేస్ అవుతుంది- ఎవరూ సాంబశివాన్ని తప్పించలేరు."

 Previous Page Next Page