Previous Page Next Page 
నిరాశలో నిండు గుండె పేజి 35

   
    "ఈ హోటల్ లో నాకొక ప్రైవేట్ రూం ఉంది- రండి. కొంచెంసేపు కాఫీ తీసుకొని వెళ్లిపోదురుగాని....."    
    "పద!" అన్నాడు మోహన్......    
    మోహన్ ముందు కాఫీకప్పు ఉంచి "నా ప్రార్ధన ఒకటి మన్నించరా?" అంది......
    పక పక నవ్వాడు మోహన్.    
    "మీరెందుకు నవ్వుతున్నారో నాకు అర్ధం కావటం లేదు!" బుంగమూతితో అంది రేఖ......    
    "నా దగ్గిర నుండి ఆ రికార్డు తీసుకోవటం అంత తేలిక అనుకుంటున్నారా, మీరంతా? నిజంగా?"    
    "ఏ రికార్డూ? నాకేం తెలుసు?" అంది రేఖ అమాయకంగా......    
    అది నటన అని మోహన్ కు తెలుసు. మోహన్ కు తెలుసునని రేఖకు తెలుసు.......    
    "మీరు నన్ను అంత తేలిగ్గా అంచనా వేస్తున్నారా- నిజంగా?" అంది మోహన్ ను అనుకరిస్తూ.....    
    మోహన్ రేఖను పరిశీలిస్తూ "మీ ప్రార్ధన ఏమిటో చెప్పండి!" అన్నాడు.....
    "నేను ఏ క్షణంలోనైనా మీకు సహాయం చెయ్యటానికి సిద్దంగా ఉంటాను. నన్ను ఎప్పుడు ఏది అడగవలసి వచ్చినా సంకోచించకండి. ఇదే నా ప్రార్ధన__"
    దిమ్మెరపోయాడు మోహన్.    
    రేఖ పెదవులపైన కనీకనిపించని చిరునవ్వు విరిసింది.    
    అది చూసిన మోహన్ కు లిప్తమాత్రం తల తిరిగింది. క్షణాలలో సర్దుకుని రేఖను చూస్తూ చిరునవ్వు నవ్వాడు.    
    "నిజమగానే మిమ్మల్ని కొంత తక్కువగానే అంచనా వేసుకున్నాను. ఇంకమీదట జాగ్రత్తగా ఉంటాను."    
    రేఖ విలాసంగా వెటకారంగా నవ్వి  "థేంక్యూ" అంది......    
    ప్రసూన ఎలా ఉందో చూడాలని ఎంతగానో అనిపించింది మోహన్ కి. కానీ ఆ గదివైపు మళ్ళకుండా తన కాళ్ళను అతి ప్రయత్నంమీద నిగ్రహించుకున్నాడు.    
    ఆ సాయంత్రం పరమేశ్వరి దగ్గిరకు ప్రత్యేకించి ప్రసూనను చూడాలనే వెళ్ళాడు మోహన్......    
    ప్రసూన రాలేదు. చిరంజీవి ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు......తను కుట్టించుకున్న కొత్త సూట్ పరమేశ్వరికీ, మోహన్ కీ చూపించాడు.....    
    "నా ఫ్రెండ్స్ నాకు పార్టీ ఇస్తున్నారు సార్! అందుకే ఈ సూట్ కుట్టించుకున్నాను. సూట్ కాదు కాని భలే అవస్థపడ్డాను లెండి. పడితే పడ్డాను. పార్టీకి ఆ మాత్రం సూట్ లేకపోతే ఎలా సార్!"    
    వదిలీ వదలని అమాయకత్వంతో మాట్లాడే చిరంజీవి మాటల్లోని ఉత్సాహమూ, అతని ముఖంలో వెల్లివిరుస్తోన్న అపూర్వమైన ఆనందమూ అతనికి ఆ పార్టీ ఎంత అపురూపమైన విషయమో స్పష్టం చేస్తున్నాయి.    
    పరమేశ్వరి వాత్సల్యంగా చిరంజీవి వెన్నుతట్టింది......
    మోహన్ కూడా అభిమానంగా నవ్వి "నువ్వు ప్రెసిడెంట్ వయి ఎం సాధిస్తావో చూస్తానుగా!" అన్నాడు.    
    "చూడండి సార్! నేను అందరిలా అనుకున్నారా?" గర్వంగా నవ్వాడు చిరంజీవి.....  "ప్రసూన ఎలా ఉందో?" అడగకుండా ఉండలేక పోయాడు మోహన్......    
    చిరంజీవి తెల్లబోయాడు.    
    "ఏం సార్! ప్రసూనగారి కేమయింది?"
    "ఏం లేదు. ఇక్కడికి రాకపోతే అడిగాను."    
    "అదా? ఇవాళ ఆవిడా తన గదిలోనే పడుకున్నారుట! బయటికి కూడా రాలేదు. వాళ్ళ అమ్మగారే చెప్పారు నాకు సమాధానం......"    
    ఈ విషయం చిరంజీవికి సామాన్యంగా తోచింది కాని మోహన్ కు చాలా చికాకు కలిగించింది. తనేం చేస్తున్నాడో తనకు అర్ధమయ్యేసరికి మోహన్ ప్రసూన ఇంటిముందు ఉన్నాడు. అప్పటివరకు ప్రసూన ఎన్నడూ మోహన్ ను ఇంటికి ఆహ్వానించలేదు. పైగా రావద్దన్నట్లే మాట్లాడింది. చదువుకునే రోజులలో ఎప్పుడో ఒకసారి-అదీ ఇంట్లో ఎవరూ లేనప్పుడు వచ్చాడు. అంతే! ఒక్క క్షణం సదేహించి ఇంట్లో ప్రవేసించాడు. "ఎవరూ?" అంది రాధమ్మ గట్టిగా......మాటలో, వేషంలో అనాగరికత ఉన్నా ఖరీదైన బట్టలూ, వంటినిండా మెరుస్తోన్న నగలూ చూసి పని మనిషి కాదని నిర్ణయించుకున్నాడు మోహన్. ప్రసూన తల్లి అయి ఉండాలి.    
    "ప్రసూన కోసం వచ్చాను."    
    రాధమ్మ గుసగుస నడుచుకుంటూ లోపలికి వెళ్ళింది.    
    "సూనమ్మా! నీ కోసం ఎవరో వచ్చినారు" అన్న మాటలు గట్టిగా వినిపించాయి. ప్రసూన ఏమందో వినిపించలేదు. రాధమ్మ వచ్చి "అమ్మాయి మాట్లాడదంట! ఇప్పుడు ఇవతలికి రానంటూ వుంది" అంది.    
    "మోహన్ వచ్చాడని చెప్పండి" అన్నాడు మోహన్. రాధమ్మ మళ్ళాలోపలికి వెళ్ళింది. అంతలో వచ్చి "కూసోండి, వస్తాదంట!" అంది.    
    కూచున్న మోహన్ మనసు పరిపరివిధాల పోసాగింది. ఏం చేస్తున్నాడు తను? తన మనసు ఎందుకిలా అయిపోతోంది?    
    కొంచెం సేపట్లోనే ప్రసూన బయటికి వచ్చింది. బాగా ఏడ్చినట్లు కళ్ళు ఉబ్బి ఉన్నాయి. కానీ ముఖం కడుక్కుని పౌడర్ వేసుకుని వచ్చింది.

 Previous Page Next Page