హేమకు కోపం పొంగుకొచ్చింది.
"ఇలాంటి ఆంక్షల్ని నేను లెక్కచేయను. నేను కథలు రాస్తున్నాను. అవి నచ్చినవాళ్ళు అభిమానంతో నన్ను చూడ్డానికి వస్తే గెంటేయడం నావల్ల కాదు!"
"అంటే నేను వద్దన్నా వారితో ముచ్చట్లాడుతూ కూర్చుంటావన్నమాట!"
హేమకు అతనికి సమాధానం చెప్పాలనిపించలేదు. నిర్లక్ష్యంగా లోపలకువెళ్ళిపోబోయింది.
"హేమా! నీకు ఆఖరిసారి వార్నింస్తున్నాను. ఇకముందు ఈ అభిమానువగైరాలెవ్వరూ ఇక్కడికిరాకూడదు!"
"ఓహో! నేను రాసే రచనలమీద వచ్చే డబ్బుకావాలిగాని ఇలాంటి వేమీ పనికిరావన్నమాట!" వ్య్మగ్యంగా అందామె.
"ఆడబ్బ ధర్మంగా ఇచ్చాననుకుంటున్నావేమో! నీలాంటి దాన్ని తెలివి తక్కువగా వివాహం చేసుకున్నందుకు పాతికవేలు కట్నంపోగొట్టుకున్నాను. ఆ విషయం మర్చిపోయవనుకుంటాను!"
"మీకిలాంటి ఆలోచన ఉందని ఆ రోజే చెప్పినట్లయితే మిమ్మల్ని అప్పుడే బయటకు వెళ్ళగొట్టేవారు మా నాన్న!" పౌరుషంగా అందామె.
"వెళ్ళగొడితే జీవితాంతం పెళ్ళికాకుండానే అఘోరించేదానివి! అటు సుధీర్, ఇటు నేనూకాదన్న తరువాత ఇంకెవరు చేసుకోవడానికిధైర్యం చేస్తారు?"
"కట్నంమీద ఆశవున్న మృగాల్ని పెళ్ళాడటం కంటే వివాహం చేసుకోకుండా మిగిలిపోవడమే నాకానందం కలిగించేది!"
"నోర్మూసుకోహేమా! ఊరుకుంటూంటే బరితెగించిపోతున్నావ్!" ఆవేశంగా అన్నాడతను.
"ఎవరూ హద్దులు మీరుతున్నారో మీకే తెలుసు!" అనేసి లోపలకు వెళ్ళిపోయిందామె.
ఆమెనేం చేయాలో అర్ధంకావటంలేదతనికి. చేయి చేసుకుంటే పరిస్థితులు మొదటికొస్తాయేమోనని భయంగా వుంది అదీగాక యిప్పుడు ఆమె బంగారుపిచ్చుకలాంటిది. ఇంటినుంచి గెంటివేస్తే నష్టం తనకే! అలా అన్జెప్పి ఆమె చేసే చేష్టలను సహించడం కూడా తనకిష్టం లేదు. తనకు తెలుసు ఆమె ప్రవర్తన వీసమెత్తు కూడా మారలేదు ఆమె మొండితనం, నిర్లక్ష్యం ఇష్టమొచ్చినట్లు సమాధానాలు చెప్పడం, ఆమెకిష్టమయిన పనులేచేయడం-ఇవన్నీ అలానే వున్నాయి. వీలయినన్నిరోజులు ఆమె దగ్గరున్నడబ్బంతా గుంజుకుని విడాకులిచ్చి పారేయడంతనకెంతైనా శ్రేయస్కరం ఆ తరువాత నాగమణిని వివాహం చేసుకుని జీవితమంతా సుఖంగా గడిపేయవచ్చు!
ఆమెకూడా ఆ సమయంలో అదే విధమైన ఆలోచనలతో సతమతమయిపోతంది. అతనిలో ఏ కొంచెమయినామార్పు వచ్చిందేమోనని ఆశ పడింది కానీ అతని మనస్తత్వం ఏమాత్రం మారలేదు. ఇలా ఒకరంటే ఒకరికి పడకుండా ఎందుకు కలిసి ఉండాలో ఆర్ధం కావడంలేదు. ఇక్కడి కొచ్చాక మళ్ళీ తన రచనా వ్యాసంగం దెబ్బతింది తనకు మఖ్యరచనలుగని శ్రీనివాసరావు లాంటి మూర్ఖుడితోగడిపే జీవితం కాదు. రచనలు చేయడం వల్ల తనకు మనశ్శాంతి ఉంది నలుగురికీ ఉపయోగం ఉంటుందన్న సంతృప్తి వుంది. తనజన్మ సార్ధకమవుతుందన్న ఆనందం వుంది ఏదేమయినా తను చేయగలిగిందేమీ లేదు. పరిస్థితులెలావస్తే అలా ప్రవర్తించడమే! ఆ సాయంత్రం భోజనాలయాక తనుగదిలో రాసుకుంటూకూర్చుందామె.
ఉయ్యాలలో పాపాయి లేచి ఏడవడం ప్రారంభించింది.
"కొంచెం ఆ ఉయ్యాల ఊపండి!" అందామె మంచంమీద పడుకున్న శ్రీనివాసరావు తో.
"ఆకాగితాలు అవతల పారేసి పాపాయిని ఎత్తుకో...." విసుగ్గా అన్నాడతను.
"అంటే ఆ పాపాయి బాధ్యత నాదేగానిమీకేమీ సంబంధం లేదన్నమాట!"
"పిల్లలను చూసుకోవల్సిందెవరు తల్లా, తండ్రా?"
"ఆకబుర్లన్నీ చెప్పకండి! దానికో రూలంటూ ఏమీ లేదు. ఎవరికీ వీలయితే వారు చూసుకోవాలి! మగాళ్ళు ఆఫీసు కెళ్ళారు కాబట్టి పిల్లల్ని తల్లులు కనిపెడుతుంటారు. అంతేగాని వాళ్ళే చూడాలనేమీలేదు ఆ పని ఆఫీసు నుంచివచ్చాక మగాడు కూడా చేయాలి....?"
"అవన్నీ కథల్లో రాసుకో? అందరూ సంతోషిస్తారు. అంతేగాని నాదగ్గర ఉపయోగించకు!" హేళనగా అన్నాడతను.
"సరే! అలాగయితే పాపాయిని అలాగే ఏడవనీయండి! నేనూ పట్టించుకోను! ఎవరు కావాలనుకుంటే వాళ్ళే చూస్తారు....." మొండిగా అని తను మళ్ళీ రాసుకుంటూ కూర్చుందామె. పాపాయి ఏడుపు ఎక్కువయిపోయింది. శ్రీనివాసరావుకి ఆమె మొండితనం చూస్తుంటే కోపం పెరిగిపోతోంది.
"ఏయ్! లేచి పాపాయిని ఎత్తుకుంటావా లేదా?" ఆమె దగ్గరకు నడిచి క్రోథంగా అరిచాడు.
"నేను రాసుకుంటున్నాను! నన్ను డిస్టర్బ్ చేయకండి!" తలెత్తకుండానే అందామె. చటుక్కున ఆమె ముందున్న కాగితాలూ, ఫైలూ అన్నీ తీసి కిటికీలోనుంచి బయటికి విసిరేశాడు అతను.
"ఇప్పుడు రాయి ఏం రాస్తావో!" అన్నడు కసిగా.
ఆమెకు కోపం ఆగలేదు. "నువ్వు ఇడియట్ వి! మేనర్స్ లెస్ బ్రూట్ వి!" ఆవేశంగా అందామె.
మరుక్షణం ఆమె చెంపమీద బలంగాకొట్టాడు అతను.
"రాస్కెల్! ఊరుకుంటుంటే పొగరెక్కువయిపోతోంది! యేదీ ఇప్పుడు తిట్టుచూద్దాం!" మళ్ళీ చెయ్యెత్తుతూ అన్నాడతను.
సరిగ్గా అప్పుడే బయటనుంచి ఎవరిదో గొంతు వినిపించింది.
"హేమ గారూ!"
"వాడెవడో నేను చూస్తాను! నువ్వు బయటకురావద్దు!" అనేసి బయటకునడిచాడు శ్రీనివాసరావు ఎదురుగ్గా చంద్రకాంత్ కనిపించేసరికి అతనికోపం అవధులు దాటింది."
"ఏం కావాలి? ఎందుకొచ్చావ్ మళ్ళీ?" దారి కడ్డంగా నిలబడి అడిగాడు.
"హేమగారితో పనుంది!"
"హేమరాదు! నీ దారిన నువ్వుపోవచ్చు!" అతనికోపం చూసి జంకాడు చంద్రకాంత్.
"ఆమెకీ ఉత్తరమయినా ఇవ్వండి!" ఆ ఉత్తరం అందుకుని అక్కడేచింపి పారేశాడు శ్రీనివాసరావు.
"ఇంకవెళ్ళు నువ్వు!" చంద్రకాంత్ కృంగిపోయాడు. "అయ్యో ఆ ఉత్తరం చింపేరేమిటి? మా సిస్టర్ హేమగారికి రాసిచ్చిందది"
"ఆ పని చేయడానికి పోస్టల్ డిపార్ట్ మెంటుంది. నువ్వు టపామోసుకుంటూ తిరగనక్కరలేదు!"
"ఆ విషయం నాకూ తెలుసండీ! ఇక్కడికొస్తున్నాను కదా అని మా సిస్టర్ నాకిచ్చిపంపించింది...."
"ఇంక నువ్వు వెళతావాలేదా?" "వెళతానండీ! వెళ్ళక ఇక్కడెందుకుంటాను?" కోపంగా అని వెనక్కు తిరగబోయాడు.
అప్పుడే ఆమె గదిలో నుంచి సూట్ కేస్ తో బయటకువచ్చింది. ఓ చేతిలోపాపా!
"ఆగు చంద్రకాంత్! నేనూ బస్ స్టాండ్ కొస్తున్నాను" అంది చంద్రకాంత్ తో అతను తెల్లబోయివారిద్దరి వేపూ చూడసాగాడు.
"హేమా లోపలికెళ్ళు నువ్వు!" గట్టిగా అరిచాడు శ్రీనివాసరావ్.
"ఇంక మనిద్దరికీ ఋణం తీరిపోయింది! ఈ క్షణంనుంచీ నా మీద నీకెలాంటి అధికారమూ లేదు!"
అతన్నిదాటి ముందుకి నడిచిందామె. ఆమె చేయి పట్టుకుని విసురుగా వెనుకకులాగాడతను. ఆ విసురుకి నేలమీద పడిపోయిందామె పాపాయి బిగ్గరగా ఏడ్చేయసాగింది.
"స్కౌండ్రల్! మరోసారి చెయ్యి చేసుకున్నావంటే పోలీస్ రిపోర్టిస్తాను! మర్యాదగా దారి ఇవ్వు!" కళ్ళల్లో నిప్పులుకురుస్తూండగా అందామె.
ఆమె గొంతుకి భయపడ్డాడు శ్రీనివాసరావ్. నలుగురూ పోగయితే నష్టం జరిగేది తనకే. అప్పటికే ఎదురింటి వాళ్ళు ఒక్కొక్కరూ బయటికొచ్చి చూస్తూ నిలబడసాగారు. హఠాత్తుగా చంద్రకాంత్ ముందుకొచ్చి ఆమెచేతిలోని సూట్ కేస్ అందుకున్నాడు.
"మీరుపదండి హేమగారూ! ఎలా అడ్డగిస్తాడో నేనుచూస్తాను...." అన్నాడు ధైర్యంగా. ఆమె చకచక బయటకు నడవబోయింది.
"ఆగు! ఆ పాపాయిని ఇలా ఇచ్చి వెళ్ళు....." ఆమెవైపు నడుస్తూ అన్నాడు శ్రీనివాసరావ్. ఆమెను మానసికంగా హింసించాలంటే అదొక్కటే మార్గంగా కనిపించిందతనికి.
"నేనివ్వను!" పాపాయిని గుండెలకు హత్తుకుంటూ అందామె.
"ఇవ్వకపోతే ఇక్కడినుంచి కదలడానికి వీల్లేదు...." ఆమెకేం చేయాలో తోచలేదు. మరో రెండడుగులు వేసింది బయటకు.
శ్రీనివాసరావ్ ఆమెమీద లంఘించిపాపాయిని బలవంతంగా లాక్కున్నాడు.
పాపాయి ఏడుపు చూడలేక తనచేతుల్లోనుంచి వదిలేసిందామె.
"ఇంక పో ఇంటిలో నుంచి! మళ్ళీనీ పాపిష్టి మొఖం నాకు చూపకు!" ఒగరుస్తూ అన్నాడతను.
ఆమెకు దుఃఖం ఆగలేదు కళ్ళ వెంబడి జలజలా రాలిపోతున్న కన్నీటితో ముందుకి నడిచింది. చంద్రకాంత్ ఆమెని అనుసరించాడు. కొద్దిదూరం నడిచాక అక్కడున్న రిక్షా ఎక్కారిద్దరూ. బస్ స్టాండ్ చేరుకుని వెయిటింగ్ రూమ్ లో కూర్చున్నారు.
"హేమగారూ! జరిగిందానికి బాధపడుతున్నారా?" అనడిగాడతను.
"ఊహు! అందుక్కాదు. పాపాయిని లాక్కున్నందుకు! లేకపోతే నేనెంత ఆనందించేదానినో ఇలా జరిగినందుకు...." ఆవేదనగా అందామె.