"అంతేకదా!" ఆర్ ష కూడా నవ్వుతూ అన్నాడు.
"కెమేరాలో ఏ రహస్యమూ లేదుకదా బాస్!"
"ఉహూ అది అతనికి ట్రైనులో దొరికిందట. తనకి ఫోటోలు తీయటం కూడా చాతగాదుట. కెమేరాలో రీలు వుంది. ఫిలిం డెవలప్ చేయించి చూశాను. కొన్ని పెళ్ళి ఫోటోలు ఉన్నాయి. ఆరా తీశాను. అతను చెప్పింది నిజమే. కెమేరాని పోగొట్టుకున్నవాళ్ళు పోలీసు రిపోర్టు కూడా చేశారు.
'ఈ ఆధారం చాలు, అతనివల్ల మనకే ప్రాబ్లం లేదని గ్రహించటానికి' అంది సాధన.
'ఎవరివల్లా లేదు ఆఖరికి ఆ దేముడివల్ల కూడా?' పకపక నవ్వుతూ అన్నాడు ఆర్ ష.
సాధన చిరునవ్వు నవ్వి ఊరుకుంది.
21
ఉదయం పది పదకొండు నిమిషాలు.
ఆరోజు శుక్రవారం కావటం వల్ల గుడికెళ్ళే భక్తుల సమాఖ్య ఎక్కువగా ఉంది.
వారం రోజులబట్టి కోయవాళ్ళ వేషాలలో తిరుగుతున్నారు ఇన్ స్పెక్టరు కానిస్టేబుల్ అహోబిలం.
సాధించింది అంటూ ఏమీలేదు. అది మహా పెద్ద బాధగా ఉంది వాళ్ళకి.
'నాకు చాలా విసుగు పడుతున్నది' అన్నాడు వర్ధనరావు.
'నాకు పుట్టటం లేదని అనుకోకండి సార్? నాకు పుడుతున్నది అలా అని సన్యాసుల్లో కలిసిపోతామా? ఏమీ సాధించలేకపోతే మనం ఈ వృత్తికే అనర్హులం అని అర్థం కనుక....!"
'కనుక ఏం చేద్దాం?'
'పట్టుదల వుంటే సాధించలేనిదంటూ ఏమీలేదు.'
ఆ మాత్రం నాకూ తెలుసు. ఇప్పుడు పట్టుదలలు పళ్ళు కొరకటాలు ఓపిక ఏది? దొంగనా కొడుకులు ఒకళ్ళు కనపడరు. చిరాకుపడుతూ అన్నాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.
"ఒక్కసారంటే ఒక్కసారి ఆలోచించండి సార్!"
"ఏమాలోచించను? ఇప్పుడు అద్దంలో నా ముఖం చూసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించాలి."
"అది కాదు సార్! ఆ పండాకోర్ రంగాగడు మీరు పరిశోధనలోకి దిగారని గ్రహించగానే ఉడాయించాడా లేదా?" అని ఒక్కక్షణం ఆగాడు అహోబిలం.
ఆమాట వినగానే వర్ధనరావు ఛాతీ పావు అంగుళం ఎత్తు పొంగింది.
"వాడు ఈ చెట్టు మీద నుంచి ఎగిరి మరో చెట్టు మీద వాలి వుంటాడు. ఎందుకంటే ఎగిరే పక్షిగాని పారిపోయే మనిషిగాని ఎక్కడో అక్కడ ఆగాల్సిందేకదా!"
"ఈ పాయింట్ ఏదో కొద్దిగా బాగానే వుంది. ఆ పక్షిగాడు ఎక్కడ వాలాడని....? అదెలా తెలుసుకోవటం?"
"దాందేముంది సార్! వాడు ముందు ఒక రూమ్ తీసుకుని వున్నాడా లేదా?"
"ఉన్నాడు."
"కనుక మరో మారువేషంతో రూమ్ తీసుకుని వుంటాడు. మనం మరోమరు వేషం వేసినట్లే వాడూ వేసివుంటాడు."
"ఇదీ ఒక పాయింటే ప్రతి రూమ్ ని గాలిద్దామంటారా?"
"గాలిద్దాం. కాని మన అధికారాన్ని ఉపయోగించి కాదు. ఇదే వేషాలతో అద్దెకిచ్చే రూమ్ ల దగ్గరకు వెళ్ళి జోస్యం చెబుతున్నట్లుగా ఆ రూమ్ లో వాళ్ళని పిలుద్దాము. వాళ్ళు బయటికి వస్తారు. మనం కోయ జోస్యం చెపుతూ వాళ్ళ ముఖాలని పరిశీలిస్తే...."
అహోబిలం చెపుతుంటే మధ్యలో అడ్డు తగిలి 'అర్ధమైంది' అన్నాడు వర్ధనరావు గంభీరంగా ముఖంపెట్టి.
"అయితే చిక్కేలేదు" అన్నాడు అహోబిలం.
"ఎలాగూ వేషం కట్టి వున్నాము. మనం ఇప్పుడే బయలుదేరితే మంచిదేమో?"
"అవును సార్! క్విక్ గా నిర్ణయాలు తీసుకోవటంలో మీ తర్వాతనే ఎవరైనా సార్!"
ఈ తఫా ఆ మాట వినంగానే వర్ధనరావు ఛాతీ మరో పావు అంగుళం అంటే మొత్తం అరంగుళం ఎత్తున ఉబ్బింది.
పద ఒక్కో రూము చూద్దాము ఒకేరోజులో అన్నీ కావుకదా! అంటూ వర్ధనరావు బయలుదేరాడు.
"(ఈ పూటకి) బ్రతుకుజీవుడా!" అనుకుంటూ అహోబిలం ఆయన వెనుకనే బయలుదేరాడు.
వరసగా వున్న చిన్న చిన్న గదులు.
అవన్నీ కొద్దికాలం క్రితమే అద్దెలకు ఇవ్వటానికి తట్టినవి. చిన్నవి అయినా - టాచ్డ్ బాత్ రూంతో ఉన్నాయి.
పరమేశ్వరీదేవి ఆలయానికి అంత ప్రాముఖ్యత. కొండ దిగువన పూల షాపుల వెనుక రెండు ధర్మసత్రాలు ఉండేవి. అవైనా ఎవరో దాత కట్టించినవి. ఒకళ్ళో అరో ఐదురూపాయలకి అద్దెకి ఉండేవారు.
ఆలయంలో త్రవ్వటం ఆలయంలో హత్యలు అవి సంచలనం కలిగించి పేపర్లకి వార్తలు వెళ్ళటం, అవి ప్రచురణ కావటం, దాంతో ఈ వార్త అన్ని ఊళ్ళకీ పాకటం ఆ తర్వాత భక్తులు రావటం. వాళ్ళు ఏవేవో మొక్కుకొంటే వాళ్ళ ఆపదలు తీరి అలా జనసముదాయం పెరగడంతో కొత్తగా ఓ వ్యాపారస్తుడు చూపుతో అద్దెకివ్వటానికి రూములు కట్టించి ఆ పక్కనే కాఫీ హోటల్ ని కూడా తెరిచాడు.
ఇప్పుడు వాటికి బాగా గిరాకీ పెరిగింది.
దూర తీరాల నుంచి వచ్చిన భక్తులు ఆ రూముల్లో అద్దెకి ఉంటారు.
వరసక్రమంలో నరుక్కు రావాలని ఇన్ స్పెక్టరు వర్ధనరావు, అహోబిలం కోయదొరల వేషంతో మొదటి రూం దగ్గరకు వచ్చారు.
'రేయి చూసి చెపుతాము ముగము చూసి చెపుతాము__ మచ్చలు వుంటే వాటిని గురించి కూడా చెపుతాము.... కొండదేవర కొలువుదీరి ఉన్నాము మీముందు. కొండ దిగి వచ్చాము. కోరికలు కోరుకోండి అయ్య, రామన్న దొర లచ్చన్న దొర మీ వాకిట నిలిచారు. అస్సో బస్సు హస్సో హస్సు....' అంటూ రాగాలు తీస్తూ అహోబిలం స్టీరియో ఫోనిక్ సౌండులో అరిచాడు.