Previous Page Next Page 
శతఘ్ని పేజి 36


    
    "అసలిదంతా చేయిస్తున్నది ఆ బ్రహ్మాజీ గాడని, వాడి వెనుక ముకుందం వున్నాడని తెలిసినా యిదిలాంటి మలుపు తిరుగుతుందని ఊహించలేకపోయాను" అన్నాడు రాజారాం కంగారుగా.
    
    "ఇప్పుడేం చేయాలి?"
    
    జవాబు లేదు.
    
    "ఇంత ప్రాక్టికల్ మనిషి నయ్యుండి యిలా చేతులు ముడుచుక్కూచోవడం నావల్ల కాదు......అసలు మన ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందని నేను నిలదీసి అడుగుతున్నాను....."
    
    "చచ్చినోడిముందు శ్రద్దాంజలి ఘటిస్తున్నట్టు మాట్లాడరేం" అసహనంగాలేచి పచార్లు చేస్తూ "పోయిన ఆ విద్యార్ధికి నష్టపరిహారంగా ఓ పాతిక వేలు అనౌన్స్ చేసేస్తాను" అన్నాడు సెక్రటరీలను చూస్తూ.
    
    "లాభంలేదు" టక్కున జవాబు చెప్పాడు చీఫ్ సెక్రటరీ "దానివలన మరికొన్ని ఆత్మాహుతులు జరిగే ప్రమాదముంది."
    
    అందరూ విస్మయంగా చూస్తుంటే చెప్పాడు చీఫ్ సెక్రటరీ "నిజానికి యిలాంటి ఉద్యమాలలో విధ్యార్ధులు జోక్యం చేసుకోవాల్సిన ఆగత్యం లేదు. కాని దురదృష్టవశాత్తూ రాజకీయాల కాలుష్యం కాలేజీ ఆవరణల్లోకి ప్రవేశించి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేస్తోంది. ఇక్కడున్న నాయకులు అంగీకరించకపోయినా తిరుగులేని వస్తావమిది"
    
    ఇలా మాట్లాడేది మరెవరైనా అయితే ముఖ్యమంత్రి ఘాటుగా జవాబు చెప్పేవాడే కాని చీఫ్ సెక్రటరీ ముక్కుసూటిగా పోయే తత్వం గలవాడని తెలియడంతో నిశ్శబ్దం వుండిపోయాడు.
    
    "అర్ధంలేని విధానం, భవిష్యత్తుకుగ్యారంటీలేని చదువులు, కళ్ళముందు కనిపించే నిరుద్యోగ సమస్య, రాజకీయాల్లో అవినీతి మొత్తం విద్యార్ధిలోకాన్ని సైకో పాత్రగా మార్చివేస్తున్న తరుణమిది. దీనికి మూలం ఏదైనా అది యింకా రేపు సంఘాల్ని ఏ పరిస్థితికి నెట్టినా గాని యిప్పుడు మీరు భారీ నష్ట పరిహారాన్ని ప్రకటిస్తే ఈ బ్రతుక్కంటే చావే నయమనిపించే కొందరు విద్యార్ధులైనా డబ్బుకోసం ఇలాంటి ఆత్మాహుతులకి సిద్దపడే అవకాశముంది".
    
    "అంటే" సాలోచనగా అన్నాడు ముఖ్యమంత్రి" చచ్చిపోయిన కృష్ణ కూడా ఆ టైపు కుర్రాడేనంటారు."
    
    "కావచ్చు కాకపోనూవచ్చు కానిసైంటిఫిగ్గా ఆలోచిస్తే వ్యక్తిగతమయిన సమస్యలే మనలోని ఆత్మహత్యలని ప్రేరేపిస్తాయి. ముఖ్యంగా ఆ వయసు విద్యార్ధుల్లో ఆర్దిక సమస్యలు, భగ్నప్రేమలు, ఒంటరితనం, కోరిన గుర్తింపు పొందలేకపోవడం, వయసుకు మించిన బాధ్యతలు విద్యార్ధుల ఆత్మహత్యలకి కారణమంటారు సైకో అనలిస్ట్ లు."
    
    "అయితే నన్నేం చెయ్యమంటారు?"
    
    క్షణం నిశ్శబ్దం తర్వాత అన్నాడు చీఫ్ సెక్రటరీ "వెంటనే ఈ సంఘటనపై విచారణ జరిపే ఆదేశమివ్వడం.....చనిపోయిన కృష్ణ కుటుంబాన్ని పరామర్శించే ప్రయత్నం చేయడం......
    
    ఈ ఆలోచననచ్చలేదు రాజారాంకి. కాని అంతకన్నా ఏం చెయ్యాలో తోచడంలేదు కూడా ఓ స్టేజ్ లో చీఫ్ సెక్రటరీ యిలాంటి చచ్చు సలహాతోతనపై ఏదన్నా కుతంత్రం ప్రకటిస్తున్నాడా అన్న అనుమానం వచ్చింది.
    
    ఇక్కడ ఈ చర్చ జరుగుతున్న సమయంలో ......
    
    హాస్పిటల్ నుంచి బయలుదేరిన కృష్ణ శవంపై పూల దండలు గుమ్మరించిన బ్రహ్మాజీ తన అనుచరులమధ్య నిలబడిమరణించిన కృష్ణకి నివాళులు అందించడమేకాక రకరకాల కోణాలలో ఫోటోలు తీయించుకున్నాడు పత్రికా విలేఖర్లకవరేజ్ కి అనుకూలంగా.......కృష్ణ ఇంటిదాకా శవాన్ని ముందువూరేగిస్తూ తీసుకు వెళ్ళాలనిభారీ ఏర్పాట్లు చేసుకున్న బ్రహ్మాజీ ఓ మైలు దూరం వెళ్ళాక ఊహించని ప్రతిఘటన్ని ఎదుర్కొన్నాడు. కొన్నివందల మంది చూస్తుండగా ఓ యువతి వూరేగింపుకి అడ్డంగా నిలబడింది.
    
    "ఈ శవం యింటికే వెళ్ళటానికి వీల్లేదు"
    
    హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
    
    "ఎవర్నువ్వు" అరిచాడు బ్రహ్మాజీ.
    
    "కృష్ణకి అక్కని"
    
    ఇప్పుడు ఆమె కళ్ళ నుంచి నీళ్ళు రాలకపోయినా ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టు ఆమె మొహం వడలిపోయివుంది.
    
    "నీతమ్ముడు అమరజీవి సోదరీ" బ్రహ్మాజీ పోర్టబుల్ మైక్ అందుకున్నాడు "అలాంటిబిడ్డని కన్న నీ తల్లి దండ్రుల జన్మ చరితార్ధమైపోయిందని నేను మనవి చేస్తున్నాను. అందుకని శవాన్ని ఓ రెండు గంటలపాటు మీ యింటి దగ్గరవుంచి అశేష ప్రజావాహిని దర్శించుకునే అవకాశంకల్పించి ఆ తర్వాత గంధపు చెక్కలచితిపై......"    

 

    "వద్దు" ఇక నిగ్రహించుకోలేనట్టు ఆమె కళ్ళ నుంచినీళ్ళు ఉబుకుతున్నాయి "నా తమ్ముడి శవానికి అంత ఘనమైన సత్కారం అక్కర్లేదు. ఇంతకాలం ఆకలి దప్పుల మధ్య అలమటించిన మా కుటుంబానికి అలాంటి చరిత్ర దక్కించుకోవాల్సిన అవసరం లేదు. చచ్చినవాడ్ని నిశ్శబ్దంగా చావనివ్వండి.......ఇంకా రంకెలు వేసి ..... 'కృష్ణేడమ్మా' అని అడిగే నా తల్లినినాకు కాకుండా చేయకండి. నా తమ్ముడి శవంతోసైతం వ్యాపారం చేయాలని ప్రయత్నించేమహానుభావులారా..... ఈ నిస్సహాయురాలైన ఆడదానికోరిక మన్నించి శవాన్ని స్మశానానికి తరలించండి"చేతులు జోడించింది ప్రాధేయపడింది.
    
    బ్రహ్మాజీ ఆలోచిస్తున్నాడు. ఈ టైపు అవాంతరంలో ఎలాంటి దక్షతని ప్రదర్శించాలో తెలీని బ్రహ్మాజీ అవాక్కయి వుండగానే పోలీసు బలగాన్ని పర్యవేక్షిస్తున్న ఓ డిప్యూటీ కమీషనర్ ఆమె సమీపంగా వచ్చి నిలబడ్డాడు.
    
    "శవంమీద కూడా మీ అధికారాన్ని ప్రదర్శించడంలో అర్ధంలేదు బ్రహ్మాజీగారూ నిజానికి మేం శవాన్ని అందించాల్సింది సంబంధిత కుటుంబానికి. వీలైతే ఆమె కోరికమన్నించి స్మశానం వేపు మరలండి. లేదా శవాన్ని ఆమెకు అప్పచెప్పండి."
    
    చుట్టూచూశాడు బ్రహ్మాజీ......
    
    తన అభీష్టానికి అనుకూలంగా ఒక్క నినాదమూ వినిపించకపోయేసరికి 'అమరజీవి కృష్ణ అక్క కోరికపై యిప్పుడు స్మశానానికి వెళ్తున్నాం' అన్నాడు పొలికేకలా.
    
    "అమరజీవి కృష్ణ వర్ధిల్లాలి"

 Previous Page Next Page