వెంటనే మేమంతా నినాదాలు ప్ర్రారంభించాం.
"వెంకట్రావ్" అన్నాడు యాదగిరి. "జిందాబాద్" అన్నాం మేము.
"ప్రజలకోసం ప్రాణాలర్పించడానికి సిద్దపడి నిరాహారదీక్ష చేస్తున్న వెంకట్రావ్"- "వర్ధిల్లాలి"
"దేశ్ కీ నేతా-"
"వెంకట్రావ్ బన్ తా!"
"దేశ్ కీ నేతా కై సేహూ!"
"వెంకట్రావ్ జైసేహూ!"
"వెంకట్రావ్ వెంకట్రావ్!"
"జిందాబాద్- జిందాబాద్!"
వెంకట్రావ్ షామియానాలో ఏర్పాటు చేసిన పరుపుమీద కూర్చున్నాడు. ఈరోజు ఆదివారం కాబట్టి అందరం షామియానాలోనే గడిపాము.
సాయంత్రమయేసరికి వెంకట్రావ్ కి భోజనం మీదకు మనసు మళ్ళినట్లుంది.
"మీ ఇంట్లో ఏం కూర?" అని అందరినీ అడగడం ప్రారంభించాడు.
మేము ముందే ఏం చెప్పాలో నిర్ణయించుకుని ఉండడం వల్ల "అబ్బే! కూరేంలేదు. పచ్చడీ, చారునూ! అసలే ఎండలు కదా! కూరగాయలు దొరకటం లేదు!" అంటూ చెప్పేశాము. కొద్దిసేపు సైలంటుగా ఉన్నాక-
"పోనీ రాత్రి పొద్దుపోయాక కొంచెం పచ్చడన్నం లాగిస్తాను ఏమంటారు." అన్నాడు హఠాత్తుగా.
అందరం అదిరిపడ్డాం.
"అదేమిటి? నిరాహారదీక్ష ప్ర్రారంభించాక పచ్చడన్నం అంటావేమిటి?"
"ఆ! ఎవరు చూస్తారులెద్దూ! అంతా మన కాలనీ వాళ్ళేగా!"
"అయినాగాని అట్లాతినొద్దు తమ్మీ! గట్ల చేస్తేగలత్ అవుతది! నేనే నిన్ను అరెస్ట్ జేయాలమళ్ళా!" అన్నాడు ఓ మీసాలతను అందరం ఆ మీసాలతని వంక ఆశ్చర్యంగా చూశాం! అవి మా కాలనీ తాలూకూ మీసాలుకావు. మా కాలనీలో మీసాల్రావ్ లెవరూలేరు.
"మీరెవరు?" మర్యాదగా అడిగాము.
"పోలీస్ డిపార్ట్ మెంట్! ఈ నిరాహారదీక్షలు చేసేటోళ్ళు గిసంటి దందాలు చేయకుండా మఫ్తీలో పహారా కొచ్చినా" అన్నాడతను. వెంకట్రావ్ మొఖం మాడిపోయింది.
"అబ్బే మా వాడు 'జోక్' కోసం అంటున్నాడంతే!" అన్నం మేముసర్దేస్తూ.
"అవున్సార్! ప్యూర్ 'జోక్' అంతే!" అన్నాడు వెంకట్రావ్ కూడా అతి కష్టంమీద నవ్వుతూ.
"ఆయనెప్పుడూ అంతేనన్నా! భోజనం చేస్తా, చేస్తానని దిల్లగీ చేస్తుంటాడు!" అన్నాడు యాదగిరి! మీసాల కానిస్టేబుల్ మా మాట నమ్మాడు.
ఆ రాత్రి గడిచిపోయింది.
మేమంతా ఆ సాయంత్రం పెద్ద ఊరేగింపుతో మున్సిపల్ కార్పొరేషన్ కెళ్ళి స్పెషల్ ఆఫీసర్ కి ఒక మెమొరాండం అందజేయాలని నిర్ణయించుకున్నాం.
తీరా ఆఫీస్ నుంచి వచ్చేసరికి అక్కడి దృశ్యం భయం కలిగించింది. షామియానా కెదురుగా ప్రభుత్వ మొబైల్ కాంటీన్ వాన్ ఆగివుంది. అందులో వివిధ రకాల ఫలహారాలు వాసనలు ఘుమఘుమలాడుతూ బయటికొస్తున్నాయ్.
వెంకట్రావ్ ఆ కాంటీన్ వేపే గుడ్లప్పగించి చూస్తున్నాడు. మా కాలనీ పిల్లలు కొంతమంది అప్పటికే వాన్ చుట్టుచేరి మిరపకాయబజ్జీలు తినేస్తున్నారు. నేనూ, యాదగిరి హడావిడిగా వాన్ దగ్గరికెళ్ళాం.
"ఈ వాన్ ఈడకెళ్ళి తీసెయాలి జల్ది" అన్నాడు యాదగిరి డ్రైవరుతో డ్రైవర్ చిరునవ్వు నవ్వాడు.
"ఎందుకు తీయాలి సార్! ఇది మీ సొంతభూమా?"
"కాకపోయినాగానీ మా కాలనీ వాళ్ళు అనుమతి లేనిదే లోపలకురావద్దు."
"మాకు పోలీస్ కమీషనర్ గారు పర్మిషనిచ్చారు!"
ఇద్దరం ఉలిక్కిపడ్డాం.
"పోలీస్ కమీషనర్ గారా!"
"అవును!"
"ఆయనెందుకిచ్చారు పర్మిషన్?"
"ఇయ్యాళ రేపు ఈ నిరాహారదీక్షలు బంద్ చేయడానికి కొత్త అయిడియా చేసిన్రు. గిట్లా కాంటిన్లు పెట్టి నిరాహారదీక్ష చేసేటోళ్ళకు ఫలహారాలు సూపిస్తే ఆళ్ళు ఆ దీక్షబంద్ చేసి తినెడిది షురూచేస్తరు."
మా కందరికీ కాళ్ళుచేతులూ వణకసాగినాయ్.
మిగతా వంటకాలు చేసినన్ని రోజులూ వెంకట్రావ్ ని ఎలాగోలా ఆపవచ్చుగానీ, ఆలూ బజ్జీలూ, పెసరట్లు బగారా బైగన్ తయారుచేస్తే మాత్రం వెంకట్రావ్ ని భగవంతుడు కూడా ఆపలేడు.
ఈలోగా వీకర్ సెక్షన్ కాలనీవాళ్ళు ఊరేగింపుగా వచ్చేశారు మా కాలనీకి. "పదండ్రి జల్దీ!" అన్నారు వాళ్ళ లీడర్లు. అప్పటికప్పుడే మా కాలనీవాళ్ళు ఆడామగా అంతా ఊరేగింపులో కలిసిపోయాం. వెంకట్రావు మొబైల్ కాంటీన్ కెళ్ళకుండా యాదగిరి కాపలా పెట్టాం. ఆడవాళ్ళ జట్టుకి రాజేశ్వరి నాయకత్వం వహించింది.
"మనిషికి కూడూ బట్టే కాదోయ్, రోడ్డు కూడా ఉండాలోయ్" అంటూ పాటలు పాడుతున్నారు కొంతమంది.
మెమొరాండం సమర్పించాక తిరిగివచ్చేటప్పుడు, ఆర్టీసీ బస్సులమీద రాళ్ళురువ్వారు మాలో కొంతమంది! ఏమిటంటే శాస్త్రంకోసం రువ్వారట- ఆనవాయితీ చెడగొట్టకూడదని! మేము వెంటనే అడ్డుపడి ఆపివేశాము.
మర్నాడు పేపర్లో వార్త మాకందరికీ ఆశ్చర్యం కలిగించింది.
"మంత్రిగారు స్వయంగా మా కాలనీ రోడ్డు స్థితి సమీక్షించేందుకు మరో రెండురోజుల్లో వస్తున్నారట! అయితే వారొచ్చేలోగా నిరాహారదీక్షలు ఆపేయాలట!"
అప్పటికప్పుడు ఎమర్జెన్సీ మీటింగ్ జరిపాము.
"ఇదంతా మోసం! మనవాడు నిరాహారదీక్ష ఆపేశాడంటే మళ్ళీ రోడ్డుగతి ఎవరూ పట్టించుకోరు!" అన్నాడు గోపాల్రావ్.
"అవును! రామగిరి కాలనీలో అలాగే జరిగింది కదా!" అన్నాడు రెడ్డి.
ఆ సాయంత్రం పోలీస్ కమీషనర్ స్వయంగా మా కాలనీకొచ్చారు, వ్యాన్ వేసుకుని ఆయనతోపాటు మరికొంతమంది అధికారులు-
అందరూ షామియానా కెదురుగ్గానే కుర్చీలు రకరకాల ఫలహారాలు ప్లేట్లో తీసుకుని వేడివేడిగా తినసాగారు మా అందరికీ కూడా నోరూరిపోతోంది. వెంకట్రావ్ కి ఆ దృశ్యాలు కనబడకుండా కొంతమంది అడ్డునిలబడ్డాం. అక్కడ మూగిన కాలనీ పిల్లలని పిలిచి ఉచితంగా బజ్జీలు, సమోసాలు ఇచ్చారు పోలీసులు.