మేము పిల్లలను చావగొట్టి ఫలహారాలు వాపస్ చేసేశాము. లేపోతే వెంకట్రావ్ లేచివెళ్ళి ఆ ఫ్రీసరుకు తినేస్తాడేమోనని అనుమానం.
ఈలోగా మఫ్తీలో కొంతమంది కానిస్టేబుల్స్ కాలనీ అంతా తిరిగి వెంకట్రావ్ కిష్టమయిన వంటకమేదో తెలుసుకోడానికి ప్రయత్నించసాగారు. ఈ సంగతి తెలియగానే మేము పిల్లలందరినీ అన్ని ఇళ్ళకూ పరిగెత్తించి వెంకట్రావ్ కిష్టమైనది 'బగారా బైగన్' అన్న సంగతి పోలీసులకు తెలియనీయవద్దని హెచ్చరికలు చేశాము.
తమప్లాను పారకపోయేసరికి పోలీసు కమీషనర్ గారు కొత్త పథకం ఆలోచించారు. పూటకు అయిదారురకాల వంటకాల చొప్పున తయారు చేసి వెంకట్రావ్ కి కనిపించేలా తినాలని ప్లాను! అందులో వెంకట్రావ్ కిష్టమయిన వంటకం ఉంటే అతగాడు ఇక ఎగిరిదూకి వచ్చేస్తాడని అయిడియా.
అదృష్టవశాత్తూ వాళ్ళు ఆరోజు వండిన వంటకాలలో బగారా బైగన్ రాలేదు. ఓ పక్క వెంకట్రావు పరిస్థితి విషమించిపోతోంది. "ఇంక చాల్లెండి! నాకాకలేస్తోంది. నేనుండలేను కావాలంటే మరోసారి ఇంకో రెండు రోజులు చేస్తాను నిరాహారదీక్ష!" అనడిగాడు అసహనంగా ఆకలి చూపులు చూస్తూ-
"పిచ్చివాడా! అంత తొందరెందుకు? ఓపక్క అసెంబ్లీలో నీ నిరాహారదీక్ష గురించి గొడవచేయిస్తున్నాం! ఇంకొక్కరోజు ఓపిక పట్టుచాలు! ఈలోగా ఎవరోకరి హామీ అయినా తీసుకుందా కనీసం" అంటూ నచ్చజెప్పాము.
సరిగ్గా అప్పుడే కమీషనరుగారు ఓ ప్లేట్లో వేడివేడి బజ్జీలు వేసుకొచ్చి ఎదురుగ్గా నిలబడి మా అందరికీ ఆఫర్ చేసేసరికి వెంకట్రావు స్ప్రింగులా ఎగిరినిలబడ్డాడు అందుకోటానికి. అతని చేయి ప్లేట్లోకి వెళ్తూండగా మేమంతా ఒక్క దూకుదూకి వాడి చేయి వెనక్కు విరిచేసి వాడిని కిందపడేసి లేవకుండా నొక్కి పట్టాము.
పోలీస్ కమీషనర్ చిరునవ్వునవ్వాడు. "మీ అందరినీ అరెస్ట్ చేస్తున్నాను" అన్నాడు నా దగ్గరకొచ్చి.
"ఎందుకు?"
"ఒక వ్యక్తిని నిర్భంధించి తిండి పెట్టకుండా హత్యచేయడానికి ప్రయత్నిస్తున్నందుకు."
"అతను నిరాహారదీక్ష చేస్తున్నాడండీ! మేమెక్కడ నిర్భందించాం"
"మరి అదేమిటి? పాపం అతనికిష్టమయినా ఆలూబజ్జీలు తినకుండా అతనిమీద కూర్చున్నారు! ఇది నిర్భంధం కాదూ!"
"కాదు"
"మర్యాదగా అతనిని స్వేచ్చగా వదులుతారా, లేక మిమ్మల్ని వాన్ లో స్టేషన్ కి తీసుకెళ్ళమంటారా?" అందరం చేసేదిలేక దూరంగా జరిగాము.
వెంకట్రావ్ నెమ్మదిగా లేచాడు. అతని దృష్టి అంతా కమీషనర్ చేతిలో ఉన్న బజ్జీల ప్లేట్ మీదే వుంది. హఠాత్తుగా యాదగిరికో అయిడియా వచ్చింది.
కెవ్వున నినాదాలు ప్ర్రారంభించేశాడు.
"వెంకట్రావ్- వెంకట్రావ్"
"జిందాబాద్- జిందాబాద్" అంటూ అరచారు ఆదా, మగా అందరూ.
"రేపు ఎలక్షన్ లొ నిలబడబోయే వెంకట్రావ్!"
"వర్ధిల్లాలి!"
"ఆలూ బజ్జీలు"
"రేపు తినొచ్చు-"
"ఉల్లిపాయ పెసరట్లూ."
"రేపు తినొచ్చు!"
"బగారా..." మూడో స్లోగన్ ఇవ్వబోతుంటే నేను ఠక్కున యాదగిరి నోరు మూసేశాను.
"అది పోలీసులకు తెలియకూడదురా పక్షీ! తెలుస్తే అది వండి వాడికి చూపించారంటే వాడ్నింక ఎవరూ ఆపలేరు."
"అవ్ అన్నా" అనేసి నినాదం మార్చేశాడు యాదగిరి.
"ఆలూ బజ్జీ- పెసరట్టు"
"రేపు తినొచ్చు బోలెడు తినొచ్చు"
"ఇవాళ్ళ మాత్రం"
"ఛీ చీ! వద్దే వద్దు-"
"పోలీస్ కమీషనర్ బజ్జీలూ-"
"డౌన్ డౌన్-"
"పోలీస్ కమీషనర్ కాంటీనూ"
"గో బాక్! గో బాక్-"
మా కేకలు వెంకట్రావ్ లో కొంచెం సంచలనం కలిగించినట్లుంది, వెనక్కు తగ్గి పరువు మీద కూలబడ్డాడు మళ్ళీ. ఎప్పటికప్పుడే వెంకట్రావు పేరుతో జైజై నినాదాలుతో మోతెక్కించేశాడు యాదగిరి.
పోలీస్ కమీషనర్ ముఖం చిన్నబోయింది. కసిగా బజ్జీలన్నీ తనే తినేశాడు. ఇక్కడీ గొడవ జరుగుతుండగా, మాకు తెలీకుండా ఇంకో వ్యవహారం చాటున జరిగిపోయింది.
ఈలోగా కాలనీ పిల్లలందరినీ వాన్ లొ సరదాగా షికార్లు తిప్పుతామని తీసుకెళ్ళి వాళ్ళందరికి చాక్ లెట్లు, బిస్కెట్లు ఇచ్చి పోలీస్ ఇన్ స్పెక్టర్లు- వెంకట్రావు కిష్టమయిన వంటకం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారట!
మొదట్లో మా కాలనీ పిల్లలు చెప్పటానికి నిరాకరించారటగానీ, చివరకు వాళ్ళు మన ఇండియా క్రికెట్ టీమ్ ఫోటోస్ ఉన్న ఆల్బమ్ అందరికీ తలోటీ ఇస్తామనేసరికి రహస్యం కాస్తా చెప్పేశారు. అయితే మేము చావగొడతామని ఈ విషయం మాకు చెప్పనేలేదు.
మర్నాడు మొబైల్ కాంటిన్ వాళ్ళు గుత్తివంకాయలు తెచ్చి మసాలా నూరడం కనిపించేసరికి మా పై ప్రాణాలు పైనేపోయాయి. ఆ దృశ్యం వెంకట్రావుకి కనపడకుండా యాదగిరి బోలెడుమంది కాలనీ వాళ్ళను కూడగట్టుకొని గోడలాగ అడ్డునిలబడ్డాడు.
"ఆ కూర రెడీ అయ్యేలోపల ఎవరొకముఖ్య అధికారినో, లేక ఏ చోటరాజకీయ నాయకుడినో తీసుకొచ్చి తను ఈ విషయంలో జోక్యం కలుగజేసుకుంటున్నట్లూ అంచేత రోడ్డు రిపేరు విషయం తనకొదిలేయమని హామీ ఇచ్చి, వెంకట్రావుని నిరాహారదీక్ష విరమించమనికోరి నిమ్మకాయనీళ్ళు ఇచ్చేసే ఏర్పాట్లు చేయడానికని శాయీరామ్, గోపాల్రావులు టాక్సీలో తిరగసాగారు.
ఈలోగా యాదగిరి పాలిపోయిన మొహంతో మా దగ్గరకొచ్చి రహస్యంగా ఓ విషయం చెప్పాడు.
"అదేంటంటే జంట నగరాల్లోకంతటికీ బగారా బైగన్ అద్భుతంగా వండగల పూరానాఫూల్ జాఫర్ అనే గజవంటగాడిని పిలిపించారట కమీషనర్ గారు! ఆవార్త విన్నాక ఎవరి మొఖాల్లోనూ రక్తంలేదు. ఇంక మా పరువుని రక్షించడం ఎవరివల్లకాదు. కేవలం హైదరాబాద్ నిజాం నవాబుతాలూకు కుటుంబసభ్యుల వివాహాలకే జాఫర్ బగారా బైగాన్ వండుతాడని మిగతావారి నెవ్వరిని లెక్కచేయడనీ- అతని వంటకం రుచి చూడానికి ఢిల్లీ నుంచి కూడా గొప్పగొప్పోళ్ళు ప్రత్యేకంగా భోజనానికి కొస్తారనీ మేమందరం కథలు విన్నాం! మరి కాసేపట్లో బగారా బైగన్ ఘుమఘుమలు మా కాలనీ అంతా వ్యాపించినయ్. పోలీస్ కమీషనర్ గారు వాళ్ళ షామియానాలో ఠీవిగా, సంతోషంగా, మమ్మల్ని దెబ్బకొట్టబోతున్న ఆనందంతో చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నారు.
పూరానా ఫూల్ జాఫర్ బగారాబైగాన్ వండుతున్నాడన్న విషయం తెలిసి కాలనీలోని ఆడాళ్ళందరూ అతనెలా వండుతున్నాడో చూసి నేర్చుకోవాలని అక్కడగుమికూడిపోయారు.
"మీరందరూ కూడా ఈ పూట ఇక్కడే భోజనం చేయండమ్మా! ఏం ఫరవాలేదు. కన్షెషన్ రేటు!" అంటున్నాడు కమీషనర్!