"అయ్యా నాపేరు ఒకరు చెప్పేంతవరకూ కూడా నేను ఆగేవాడినికాదు అంత యిష్టం నాకు నిరాహారదీక్షలంటే! కానీ ఈ మధ్య మా డాక్టరుగారు నేను ప్రతి రెండుగంటలకు ఓసారి ఫలహారమో, భోజనమో చేయాలనీ లేకపోతే దారుణమయిన కడుపునొప్పి వస్తుందనీ చెప్పారు. అంచేత ఇలాంటి అద్భుతమయిన అవకాశం పోగొట్టుకుంటున్నందుకు నాకెంతో ఇదిగా ఉంది" అంటూ నెమ్మదిగా స్టేజిదిగి ఓ పక్కగా నిలబడ్డాడు.
జనార్ధన్ మైక్ ముందు కొచ్చాడు మళ్ళీ.
"సోదరులారా! ప్రస్తుత పరిస్థితిలో ఒకే ఒక మార్గం కనబడుతోంది. అదేంటంటే అందరి ఇళ్ళనంబర్లూ చీటీ మీదరాసి అందులో నుంచి ఓ చీటీతీసి ఆ ఇంటినెంబరున్నవాళ్ళతో నిరాహారదీక్ష చేయించడం! ఎలా వుంది మన ప్లాను!"
అంతా "అద్భుతం" అంటూ తప్పట్లు కొట్టారు.
మరుక్షణంలో అందరి ఇంటినెంబర్లూ చీట్లమీద వరుసగారాసి ఓ కుప్పగా పోశారు. ఓ ఆరేళ్ళకుర్రాడిని పిలిపించి ఆ పోగులోనుంచి చీటి తీయమన్నారు. అంతా నిశ్శబ్దం అలుముకుపోయింది. అందరి మొఖాల్లోనూ టెన్షన్! కుర్రాడు చీటీ తీసి జనార్ధన్ కిచ్చాడు. జనమంతా ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. శాయీరామ్ ఆ చీటీ చూసి మైక్ లో ఆ ఇంటినంబరు చదివాడు.
చదివిన మరుక్షణం జనం మధ్యనుంచీ దబ్బుమన్న శబ్దం వినిపించింది. అందరూ కోలాహలంగా అటువైపు పరుగెత్తారు. నేనూ పరుగెత్తి "ఏం జరిగింది?" అనడిగాను.
"ఎవరో పడిపోయారు!" అన్నాడు రెడ్డి. పడిపోయిన అతని ముఖంమీద నీళ్ళు కొట్టాక నీరసంగా లేచి నిలబడ్డాడు. అతనిని చూస్తూనే గుర్తుపట్టాను, వెంకట్రావ్! "ఇంటి నంబరు ఇంకోసారి చెప్పండి" అన్నాడతను నీరసంగా.
శాయీరామ్ ఇంటి నంబరు మళ్ళీ చదివాడు.
"ఎవరిదీ ఇంటినెంబరు?" అడిగాడు జనార్ధన్.
"మాదే!" అన్నాడు వెంకట్రావ్ నీరసంగానే.
"ఓహో అదా సంగతి! మరింకేం ఇలాంటి అవకాశం దొరికినందుకు ఆనందించక అలా కంగారు పడతావేమయ్యా పద పద" అంటూ అప్పటికప్పుడే వెంకట్రావ్ ని స్టేజీమీదకు తీసుకెళ్ళి అందరికీ పరిచయం చేశాడు గోపాల్రావ్.
"సోదరులారా! పువ్వు పుట్టగానే పరిమళించినట్లు, వెంకట్రావుగారికి చిన్నప్పటి నుంచీ కూడా నిరాహారదీక్షలంటే ఇష్టం అట. అలాంటి మహానుభావుడికే మళ్ళీ అలాంటి అవకాశం రావడం నిజంగా చాలా గొప్ప విషయం! చాలా అద్భుతమయిన విషయం! చాలా....." అని ఇంకేమీ పదాలు దొరకక "అంతే!" అన్నాడు. మీటింగ్ ముగిసిపోయింది.
వెంకట్రావ్ పైకి ధైర్యంగా ఉన్నట్లే కనబడుతున్నా, లోలోపల తెగ భయపడుతున్నట్లు కనిపించాడు. "షుమారుగా ఎన్నిరోజులు నిరాహారదీక్ష చేయాలంటారు?" అన్నాడు దిగులుగా.
"ఆ-ఎంత? నాలుగయిదు రోజులు- ఈలోగా మేము ఊరేగింపులు, ధర్నాలు జరిపి కనీసం వెంటనే రోడ్లపని మొదలుపెడతామన్న 'హామీ' అయినాతీసుకుని నిరాహారదీక్ష విరమింపజేసేస్తాం!"
"నాలుగు రోజులనే సరికి వెంకట్రావుకి ధైర్యం వచ్చేసింది.
"ఓశ్! ఇంతేనా! నాలుగయిదు రోజులు ఓలెక్కా ఏమిటి? ఎనిమిదేళ్ళ క్రితం నాకు జ్వరం వచ్చినప్పుడు పదిరోజులు తిండిలేకుండా గడపలేదా ఏమిటి?" అన్నాడు ఉత్సాహం తెచ్చుకుంటూ.
"అంతేకాదు! ఇంకో సంగతికూడా ఆలోచించు! నువ్వెలాగూ ఎలక్షన్లో నిలబడాలనుకుంటున్నావు కదా! దానికి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు. ఈ నిరాహారదీక్షతో నువ్వు పెద్ద పాపులర్ ఫిగరయిపోతావు ఈ ఏరియాలో! మన నాయకులూ చాలామంది ఇలాగే కదా ఎన్నికయింది" అన్నాడు రెడ్డి ప్రోత్సాహం ఇస్తూ.
ఆమాట వెంకట్రావు మీద షార్ట్ సర్క్యూటింగ్ లాగా పనిచేసింది.
"అవును! ఎలక్షన్లు కూడా దగ్గరకొస్తున్నాయ్ కదా నాలుగయిదు రోజులే కాదు! ఇంకో గంట ఎక్కువయినా ఫరవాలేదు నేను బ్రహ్మాండంగా నిరాహారదీక్ష చేస్తాను" అన్నాడు వెంకట్రావ్.
వెంకట్రావ్ వెళ్ళిపోయాక మా కార్యవర్గం మళ్ళీ అత్యవసర సమావేశం జరిపాము.
"వెంకట్రావ్ నిరాహారదీక్ష చేయటం ఖాయమేగానీ, అతనికి మంచి వంటకాలంటే కొంచెం వీక్ నెస్ ఉన్న విషయం మీకు గుర్తుందికదా?" అన్నాన్నేను పాత విషయాలు గుర్తుకితెస్తూ.
"అవునవును! ఈడెన్ గార్డెన్ లో వాడు చేసిన పని ఎలా మరచిపోతాం!" అన్నాడు శాయీరామ్. ఈడెన్ గార్డెన్ అనేది ఒక మారేజ్ హాల్. ఓ రోజు మేమందరం మాట్నీ సినిమాకెళ్ళి ఆ రోడ్ వెంబడి వస్తోంటే ఆ పెళ్ళి ఆవరణలో నుంచి నోరూరించే వంటకాల వాసనలు వచ్చి ఎటాక్ చేసినాయ్.
"ఆహా! బగారాబైగన్" అన్నాడు వెంకట్రావ్. హైదరాబాద్ వంటకాల్లో బగారా బైగాన్ (గుత్తి వంకాయకూర) ఒకటన్న విషయం మా అందరికీ తెలుసు.
"అయితే ఏమంటావు?" అడిగాడు గోపాల్రావ్.
"నేను వెళ్ళి భోజనం చేసి వస్తాను-మీరు పదండి!"
"అదేమిటి? ఇది ముస్లిమ్స్ పెళ్ళికదా! వాళ్ళు పిలవందే ఎలా వెళ్తావు?" ఆశ్చర్యంగా అడిగాడు జనార్ధన్.
"అయితేనేం హిందూ ముస్లిం భాయ్! భాయ్! ఖుదా హాఫిజ్!" అనేసి పెళ్ళిలోకి జొరబడిపోయాడు. మేము మా దారినకాలనీ కొచ్చేశాము.
గంటసేపటి తర్వాత అతను కాలనీలో మా ఇంటిముందు నుంచి టిఫిన్ కారియర్ పట్టుకెళ్తూంటే భోజనం చేశాడో లేదో కనుక్కుందామని పిలిచాను.
"భలేవాడివే గురూ! భోజనం చేయకపోవడం ఏమిటి? తీరాచూస్తే ఆ పెళ్ళి ఎవరిదో కాదు! మనాఫీసులో హాకీప్లేయరు నిసార్ గాడు లేడూ? వాడికి చాలా దూరపు బంధువులదట! నేను నిసార్ గాడి ఫ్రెండ్ నని పరిచయం చేసుకుని దూసుకెళ్ళిపోయాను. నాకు బగారా బైగాన్ ఇష్టమన్జెప్పి- కారియర్ లో కొంచెం కూర ఇమ్మని రిక్వెస్ట్ చేస్తే పాపం ఆ పెద్దమనిషి పేరేంటంటే....ఆ! అబ్దుల్ ఖాదర్- అదే పిల్ల తండ్రి- వెంటనే ఈ టిఫిన్లో బగారా బైగన్ బోలెడు పెట్టి ఇచ్చాడు. టిఫిన్ రేపొద్దున్న వాళ్ళింట్లో ఇచ్చేస్తానని చెప్పాను"
ఇది ఒక్కటేకాదు! ఇలాంటి కథలు కాలనీలో ఎన్నెన్నో జరిగినాయి. యాదగిరి వాళ్ళింట్లో బంగాళాదుంపల బజ్జీలు చేస్తున్నారని తెలిసి అమాంతం వంటింట్లోకెళ్ళి ప్లేటు తీసుకుని కూర్చోవటం, జనార్ధన్ వాళ్ళింట్లో పెసరట్లు వేస్తున్నట్లు వాసనను బట్టి పసిగట్టి లోపలకు దూరి జనార్ధన్ భార్యను అడిగి డజను పెసరట్లు వేయించుకుని తినేయడం- ఇది రాన్రాను చాలామామూలు విషయమైపోయింది మా అందరికీ.
"క్యాకీభాయ్! మనోడు మంచిగా నిరాహారదీక్ష చేస్తాడని నాకు నమ్మకంలేదు!" అన్నాడు యాదగిరి.
ఏదేమయితేనేం వెంకట్రావ్ నిరాహారదీక్షలో ఉన్నన్ని రోజులూ మా కాలనీలో ఎవరూ వాడికిష్టమయిన వంటకాలు చేయకూడదన్న తీర్మానం ఒకటిపాస్ చేశాము. మర్నాడు పొద్దున్న గోపాల్రావ్ అన్ని పేపర్లలోనూ వెంకట్రావ్ ఫోటో వేసి నిరాహారదీక్ష ప్ర్రారంభించబోతున్న న్యూస్ రాయించేశాడు.
దాంతో మా ఏరియాలో పెద్ద సంచలనం చెలరేగింది.
మా కాలనీ అవతల దూరంగా ఉన్న వీకర్ సెక్షన్ కాలనీ వాళ్ళంతా పదిగంటల కల్లా ఆనందంగా మా కాలనీ కొచ్చేశారు- నిరాహారదీక్ష తంతు చూడ్డానికి.
మేళ తాళాలతో రోడ్డు పక్కనే ఉన్న పెద్ద షామియానాలోకి వెంకట్రావ్ ని తీసుకెళ్ళాం. వెంకట్రావ్ కి ఎక్కడిదో రాజకీయ నాయకుడి డ్రస్ తగిలించారు మావాళ్ళు.
నిజం చెప్పొద్దూ! ఆవేషం వాడికి సూటయింది! ఇక గుణగణాలంటారా! అవీ రాజకీయ నాయకుడి గుణాలకు దగ్గరగానే ఉన్నాయ్. ఆఫీసులో లంచాలు పడుతుంటాడు! మందు కొడుతుంటాడు! ఇలా మరిన్ని చిల్లర దురలవాట్లు ఉండనే ఉన్నాయ్! అంచేత రాజకీయాల్లోకి దిగాలనేవాడి కోరికలో అసమంజసం ఏముంది? షామియానాలోకి రాగానే మా కాలనీ వాళ్ళు రెండు దండలు వేశారు మెడలో ఆ తరువాత వీకర్ సెక్షన్ కాలనీ వాళ్ళందరూ కలిసి ఓదండవేసి మొఖానికి బొట్టుపెట్టారు. ఎందుకంటే ఆరోడ్ పాడవటం మూలాన ఆర్టీసీ బస్ లు ఆరోడ్డుమీద తిరగడం మానేసినయ్. ఆటోరిక్షాలవాళ్ళు, రిక్షావాళ్ళూ ఆ రోడ్డుమీద ససేమిరా నడపడానికి వప్పుకోవటంలేదు. ఇందువల్ల మాతోపాటు ఆ కాలనీ వాళ్ళు కూడా నరకయాతన అనుభవిస్తున్నారు.