Previous Page Next Page 
న్యాయానికి అటూ-ఇటూ పేజి 35

 

      "తీసుకెళ్ళటమంటే? నీ అంతట నువ్వే నడిచి వెళ్ళావా?"
   
    "చిన్నపిల్లని కాబట్టి తీసుకెళ్లారన్నాను. నా అంతట నేనే నడిచాను."
   
    "అక్కడ ఎవరు చూశారు?"
   
    "డాక్టర్ అశోక్!" ఒక్కసారిగా ఆమెగొంతులో వణుకుపోయి కసి, కఠినత్వం పొంగుకు వచ్చాయి.
   
    "ఆయన ఏమన్నారు?"
   
    "ఎడమకంటిలో.... కేన్సర్ వుందనిచెప్పి, ఆపరేషన్ చెయ్యాలన్నారు."
   
    "కుడికన్ను?"
   
    "ఏ జబ్బూ లేదన్నారు."
   
    "తర్వాతేం జరిగింది?"
   
    "ఆపరేషన్ జరిగింది."
   
    "ఏ కంటికి?"
   
    "మత్తు యివ్వటంవల్ల నాకేం తెలీలేదు. తెలివొచ్చాక.... ఎడమకంటికి బదులు కుడికంటికి..." మళ్ళీ గొంతు దుఃఖంతో వణుకుతోంది. "కుడి కంటికి.... అసలేమీ కనబడలేదు. అంతా చీకటి.... చీకటి... చీకటి."
   
    కోర్టంతా నిశ్శబ్ధంగా వుంది.
   
    ".....తర్వాత?"
   
    లోపల్నుంచి పొంగిపొర్లే దుఃఖం బయటపడే దారిలేక ఉక్కిరిబిక్కిరయి పోతోంది.
   
    "అసలు కేన్సర్ వున్న ఎడమకన్ను అలాగే వుండిపోతే, ఆ జబ్బు తల్లోకి వెళ్ళి పెరిగి చచ్చిపోతానని... ఆ కన్నుకూడా తీసేశారు."
   
    కోర్టంతా మళ్ళీ నిశ్శబ్దం.
   
    ఆమె చెప్పేదంతా న్యాయమూర్తి శ్రద్దగా రాసుకుంటున్నాడు.
   
    "చూడు పాపా...."
   
    ".... చూడలేను."
   
    అందరి గుండెలు కదిలాయి.
   
    "నా ఉద్దేశం అదికాదమ్మా" అని ప్రదీప్ "నీ ఎడమకంటికి బదులు నిర్లక్ష్యంగా ఆ డాక్టరు కుడికన్ను తీసిపారెయ్యకుండా వుంటే- యిప్పుడు నువ్వు అందరూ.... మా అందరిలా చూడగలుగుతూ వుండేదానివి. చదువు కుంటూ వుండేదానివి. నువ్వనుకున్నవన్నీ సాధించగలిగేస్థితిలో వుండేదానివి. అవునా?" అనడిగాడు.
   
    "అవును.... అవును.... అవును."
   
    రాధ దుఃఖంతో, ఆవేదనతో, ఆవేశంతో గట్టిగా అరిచింది.
   
                                  * * *
   
    ఛీఫ్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ప్రదీప్ వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు.
   
    ప్రతాపరావు లేచినిలబడి బోనుదగ్గరకు వచ్చాడు.
   
    "ఏమ్మా! అవతల లాయరుగారు అడిగే ప్రశ్నలకు ఈవేళ జవాబు చెబుతావా? ఇంకోరోజుకు వాయిదా వెయ్యమంటావా?" అడిగాడు మేజిస్ట్రేటు గారు.
   
    "చెబుతాను" అంది రాధ.
   
    "మంచినీళ్ళేమైనా తాగుతావా?"
   
    "అక్కర్లేదండీ" అంది వినయంగా.
   
    "ఆల్ రైట్! ప్రొసీడ్" అన్నట్లు చూశారు, మేజిస్ట్రేట్ గారు ప్రతాపరావువంక.
   
    "చూడు పాపా" అంటూ మొదలుపెట్టాడు.
   
    "చూడలేను."
   
    "సారీ! నా ఉద్దేశం అదికాదు.... నువ్వెప్పట్నుంచీ చూడలేకపోయావు?"
   
    "నా కంటికి జబ్బు చేసినప్పటినుంచి."
   
    "అంటే నీ కళ్ళకి జబ్బు చేసినప్పట్నుంచీ నువ్వు చూడలేకపోతున్నావన్న మాట!"
   
    "కళ్ళకి కాదు, కంటికి నా ఎడమకంటికి జబ్బు చేసినప్పట్నుంచీ..."
   
    "పోనీ నీ మాటల ప్రకారం ఎడమకంటికి జబ్బుచేసినప్పట్నుంచీ నీ చూపు పోయిందన్నమాట."
   
    రాధ 'అవును' అనబోయి, అంతలోనే తెలివితెచ్చుకున్నట్లయి- "ఎడమ కంటితో చూడలేకపోయేదాన్ని కుడికన్ను బాగానే కనిపించేది" అన్నది.

    "ఎడమకన్ను కనబడటంలేదనీ, కుడికన్ను కనబడుతుందనీ ఎలా గ్రహించావు నువ్వు?"

    "గ్రహించాను."
   
    "అంటే ఎలా?"
   
    "ఎలా అంటే.... నేను చదువుకుంటున్నప్పుడు అటూ యిటూ తిరుగుతున్నప్పుడూ ఆ తేడా నాకు తెలిసింది."

    "ఏ తేడా?"

    "ఎడమకంటితో చూడలేకపోతున్నానని."
   
    "అప్పుడు కుడికన్ను బాగా కనిపించేదని ఎలా తెలుసు?"
   
    "తెలుసు."
   
    "ఎలా తెలుసు?"
   
    "నాకు నేను ఒక కన్ను తెరచీ ఒక కన్ను మూసి అలా పరీక్షించుకుని చూసుకున్నాను."

    "అంటే కుడికన్ను మూసుకుని ఎడమకంటితో చూస్తే కనిపించేది కాదా?"
   
    "అవును."
   
    "ఏమిటి అవును?"
   
    "కనిపించేది కాదు."
   
    "ఎడమకన్ను మూసుకుని కుడికంటితో చూస్తే ఎలా వుండేది?"
   
    "కనిపించేది."
   
    "ఎడమకన్ను అసలు కనిపించకుండా వుంది కాబట్టి కుడికన్ను దానికంటే కొంచెం మెరుగ్గా వుండేది. అవునా?"
   
    "అవును."
   
    కోర్టులో వున్నవారంతా ఒక్కసారి స్తబ్దులైనట్లయారు.
   
    ప్రదీప్ లేచి నిలబడ్డాడు. "యువరానర్! రాధ చాలా చినపిల్ల, కోర్టులో వేసే జటిలమైన ప్రశ్నలు అర్ధంచేసుకునే వయసూ లేదు. నా లెర్న్ డ్ ఫ్రెండ్ తెలివిగా, మెలికపెట్టి వేసిన ప్రశ్న ఆమెకర్ధం కాలేదు. ఆ ప్రశ్న యింకా వివరంగా, మరోసారి అడగమని కోరుతున్నాను" అన్నాడు.
   
    "యువరానర్! రాధ వయసులో చిన్నదైనా తెలివైన పిల్ల. ఆమె భాషకూడా వయసుకు మించి మాట్లాడుతుంది. నాకు నేను పరీక్షించుకున్నాను అనేటంతటి భాషా, తెలివితేటలూ ఆమెకున్నాయి. ఈ ప్రశ్న ఆమెకర్ధం కాలేదనటం హాస్యాస్పదం" అన్నాడు ప్రతాపరావు.
   
    "ఇంకోసారి వివరంగా అడగండి" అన్నాడు మేజిస్ట్రేట్ గారు.
   
    ప్రతాపరావుగారు తప్పనిసరిగా ఆ ప్రశ్న మళ్ళీ అడగవల్సి వచ్చింది.
   
    రాధ తన పొరపాటు సరిదిద్దుకుంది.
   
    "కాదు. మామూలుగా కనిపించేది."
   
    "మామూలుగా కనిపించేదని ఎలా చెప్పగలవు?"
   
    "అంతకుముందు ఎలా కనిపించేదో తెలుసుకాబట్టి."
   
    "చూపులో కొంచెం తేడా వుంటే తెలుసుకోవటం అంత తేలిక కాదుగదా?"
   
    రాధ జవాబివ్వలేదు.
   
    "అంత తేలికకాదు. అవునా?"
   
    "తెలీదు."
   
    "నీ ఎడమకన్ను ఎర్రబడి, చూపు తగ్గి వున్నప్పుడు కుడికన్ను కూడా ఎర్రబడింది. అవునా?"
   
    "ఎర్రబడింది కానీ డాక్టర్లు అది మామూలు కంటికలక అన్నారు"

 Previous Page Next Page