"నీకు తెలుసు" శంకూ లేతపిడికిలి బిగుసుకుంది.
"చెబుతున్నది నీకే...వదులు...."
ఈసారి గట్టిగా దగ్గరకు లాక్కున్నాడు.
బిత్తరపోయింది మంగ.....లేతపిందెలా అనిపించే పిల్లాడి దగ్గర ఇంత శక్తివుందని అంతదాకా తెలీనందుకేమో కోపంతో చూడబోతూనే నవ్వేసింది. "ఎలా వుంది ఒంట్లో."
"మంగా జోకు చేయకు....సావేరి...."
ఇక లాభంలేదనుకుని గట్టిగా విదిలించుకుంది. "సావేరి.....సావేరి....సావేరి....ఏం.... ఆ పిల్లెలా వుందో చూడటం తప్ప నాకు మరో పని లేదనుకున్నావా? అసలు ఏమిటి నీ ఉద్దేశ్యం....ఆఇంటికెళితే శంకూ ఎలా వున్నాడని ఆ పిల్ల ప్రాణం తీస్తుంది. ఇక్కడేమో...." అసంకల్పితంగా నోరు జారింది.
అలా విసుక్కుంటే దూరం జరుగుతాడనుకుంటే ఈసారి రెండు చేతుల్తో భుజాల్ని పట్టుకుని ఉత్సుకతగా అడిగాడు.... "నా గురించి అడిగేది ఒక్కసారేనా? అస్తమానం అడుగుతూంటుంది కదూ....బాగా ఏడ్చిందా అలా అయితే మరి కబురెందుకు పెట్టలేదు కనీసం ఏటిగట్టుకైనా."
రోషంగా దూరం జరిగింది మంగ.... "ఏం మనుషులు మీరు.....ప్రమాదం ముంచుకొస్తుంటే ఒకరికోసం మరొకరు ఎందుకిలా తల్లడిల్లిపోతున్నారు.....మీకేం పోయేకాలమిది.....ఇంత జరుగుతున్నా ఇదెక్కడి చోద్యమర్రా చచ్చేదాకా మరిచిపోలేరా....మీకిదేం మాయరోగం....."
మంగ కళ్ళనుంచి నీళ్ళు జలజలరాలాయి. మృత్యువు ముంగిట సింగారించబడిన లేతమామిడి రెమ్మల్లా రెప రెపలాడుతూ కూడా ఇంతలా ఒకరికోసం మరొకరు అంగలార్చుకుపోతున్నారెందుకని....?
తల వంచుకున్నాడు శంకూ "సావేరి ఎలా వుంది మంగా.....?"
"చెప్పమంటారా.....? చివాలున అతడి చెంపనందుకుని తల పైకెత్తింది ఉక్రోషంగా. "నేలదిగిన నక్షత్రంలా ఆ లోగిలిలో వెలిగే ముద్దరాలు సావేరి ఇప్పుడెలా వుందో చెప్పమంటావా....నీ మైకంలో పడి చివికిపోతూంది ....రేపేం చేయాలో తెలీక ఆ ఆలోచనల సిగల్లో ఒంటిని హారతిలా కాల్చుకుంటూ నీ కోసం కలవరిస్తూంది. వెళ్ళు.....అక్కడ నిన్ను చూసిన వాళ్ళు నీ కాళ్ళూచేతులూ విరిచి నిన్ను ఆ ఇంటి చెట్టుకు కట్టి కాల్చేస్తే ఆ సంబరమెలా వుంటుందో ఆ పిచ్చిపిల్ల చూసే అవకాశాన్నివ్వు...."
స్థబ్దుడిలా వుండిపోయిన శంకూ తలపైకెత్తేసరికి మంగ లేదక్కడ.....
* * * * *
అపరాత్రి దాటింది.
చీకటిశస్త్ర చికిత్సతో చచ్చిన వెలుగులా ఊరు నిశీధిలో నిర్జీవంగా వుంది....
దూరంగా స్మశానంలో నక్కల ఊళలు ఉండుండీ భయంకరంగా వినిపిస్తున్నాయి.
ఉరితీయబడుతున్న నిర్దోషి చివరి ఊపిరిలా గాలి నిర్జీవంగా వీస్తూంది.
నిభాయించుకోలేకపోయాడు శంకూ....
నిద్రకోసం ప్రయత్నిస్తే ఆలోచనలు కత్తుల్లా మనసుకుత్తుకపైన నొక్కిపెడుతుంటే అర్ధరాత్రిదాకా మంచంపై అటూ ఇటూ ఒత్తిగిల్లాడు....
సావేరిని నిన్నటిదాకా చూడాలనిపిస్తే మంగ చెప్పింది విన్నాక చూడకుండా ఉండలేననిపిస్తూంది.
మనసు సద్దుమణిగిన ఆ నిశిరాత్రివేళ ఊపిరందనట్టు ఉక్కిరిబిక్కిరౌతుంటే పైకిలేచాడు.
బామ్మ నిద్రపోతూంది నిశ్చింతగా.
తను ఏం చేస్తున్నదీ గ్రహించే స్థితిలోలేడు శంకూ....
వేగంగా నడుస్తున్నాడు.....
సావేరి ఏ గదిలో వుంటుందో తెలీదు.
సావేరితోబాటు మరెవరైనా తోడుంటారేమో అన్న ఆలోచనా అతడ్ని వారించడంలేదు.
అసలు అడుగుపెట్టగలడో ఆ తర్వాత తిరిగిరాగలడో లేడో అన్న మీమాంస అతడ్ని నిరోధించడంలేదు.
కాపువీధి కుమ్మరివీధి దాటేసాడప్పటికే.
అయిదు నిమిషాలు గడిచాయి.....
ఓ సందులో కుక్క మొరిగింది గుండెచెదిరేలా.
అప్పటికే ఆ భవంతి చేరుకున్న శంకూ ఎత్తయిన ప్రహరీని చూస్తూ నిలబడ్డాడు చాలా సేపటిదాకా.
వీధి లాంతరుకాంతిలో గోడపైనున్న గాజుపెంకులు వధ్యశిలల్లా మెరుస్తున్నాయి.
ఉన్మాదం....
ఆహ్ది ఎలాంటి ప్రమాదానికి దారితీస్తుందో తెలీని ఆవేశం....
పక్కనున్న చెట్టుపైకెక్కి నెమ్మదిగా గోడపైకి దూకాడు.
సన్నని మూలుగు వెలికిరాబోతుంటే అదిమిపెడుతూ చూశాడు.
అరికాలులో దిగిన గాజుపెంకుపై చిక్కని రక్తం.
అదికాదు ఆ క్షణంలో అతడిని ఆకట్టుకున్నది.
అక్కడ దగ్గరలో ఉన్న బాల్కనీకి ఆనుకున్న గదిలో సావేరి గోడకి జారగిలబడి కూర్చుని వుంది. బెడ్ లైట్ కనత్య్లో ఆమె రూపం అతని గాయాన్ని మరిపించినగేయమై రమ్మని పిలుస్తున్నట్టనిపిస్తుంటే యిప్పుడు బాల్కనీ పైకి దూకాడు.
అప్పుడు కళ్ళు తెరిచింది ఆమె.
ఆ చప్పుడుకి ముందు గతుక్కుమంది సావేరి.
మసక వెలుతురులోనైనా మనసు గుర్తించిందేమో నరాలలో స్వరగతులు పలకగా పరుగున వచ్చి కిటికీలోనుంచి చూసింది.
"సా....వే.....రీ....."
ముందు కలేమో అనుకుంది.
కాదంది ఎదుటి రూపం.
ఎన్ని యుగాల నిరీక్షణగా అనిపించిందో_
కనిపించింది శంకూ కాదు, నెలరేకుల ముసుగుదిద్ది అంతరిక్ష వీధులలోనుంచి జారిపడిన జాబిల్లిలా చిగురించిన శుక్లపక్షంలా కనుదోయి కలవరంగా చూసింది.
ఆర్తిగా చేయి చాచిందో లేక స్పర్శ కోరిన ఆమె చేతులు అసంకల్పితంగా చొచ్చుకుపోయాయో కిటికీ ఊచల్లోనుంచే తమకంగా అల్లుకుపోవాలని తొందరపడింది.
"సావేరీ!"
రెప్పలార్పని శంకూ చూపుకు ఆమె వదలిన వర్తమానం అనిపించింది.
తలపు సంకేతాల ప్రేమకావ్యం అంకితమిస్తానన్నప్పుడు తీసుకునే స్తోమత వుందో లేదో తెలీక తడబడుతున్నట్టు "ఏమిటిలా అయిపోయావు?" అన్నాడు నెమ్మదిగా.
ఆమాత్రం ఆప్యాతయతకే ఆమె కళ్ళు నీటికుండలయ్యాయి.
అప్పుడు గుర్తుకొచ్చింది సావేరికి ఇద్దరి నడుమా ఓ అడ్డు గోడ వుందని మనసుగోడు చెప్పుకోవడానికి యిదీ సరైన ప్రదేశం కాదని.
అయినా తెగించి ద్వారం తెరిచింది.
రా రమ్మని చేతులు చాచింది.
ఒక్క అంగలో ఆమెను చుట్టుకుపోయాడు.
ఆమె దేహమే వేడిగా ఉందో లేక తనలో తనకు తెలీని మరేదో దాహమే ఉప్పెనగా వుబికిందో పరిసరాలు మరిచాడు.
చీకటి సిగ్గుగా తలవాల్చింది.
ఇద్దరి మధ్యా సన్నగిల్లిన 'దారి' ముందు ఝరిగా పరిమితిలేని ఆర్తిగా మారింది. అక్కడ గాలి మెల్లగా సొగనేస్తం అయ్యింది. అదే ఆ యిరువురి పాణీగ్రహణానికి సాక్షి మమకారాల పరదాలను పెదవులకద్ది అధరాల్ని కలిపింది.
సన్నని మూలుగు సావేరి మనసుకి నేపథ్యంలా....
అలా ఎన్ని క్షణాలున్నారో యిద్దరికీ గుర్తులేదు.
అలసిపోతున్నారు. అయినా పెదవుల కలయికలో అల్లుకున్న తనువుల స్పర్శలో అదోరకమయిన ఆనందం....అలసట కూడా కాదు, ఏ దీవికో వలసపోతున్నట్టుగా వుంది. ఒదులుగా పొదిగిలిలోనుంచి బిగించిన పిడికిలిలోకి పిదప ఏ మనిషి నేత్రాలకీ అందని కడలి కడుపులోకి అలా నూరేళ్ళు కాదు, వెయ్యేళ్ళు రగిలిపోతూ పగిలిపోవాలనుకుంది.