Previous Page Next Page 
హృదయాంజలి పేజి 33

   
    ఆచారి ముఖంలో గాయపడి విల విల్లాడిన బాద! "మీరు మనిషి కాదు! కొన ఊపిరితో ఉన్నవాడి మీద రాళ్ళు విసరగల హీనకార్యం శాడిస్టులు మాత్రమే చేస్తారు. కాటికి కాళ్ళు చాచుకున్న ఈ అవిటివాడికి కర్తవ్య మేమిటి? నేనెవరిని వంచన చేశాను?"
 
    "ప్రాణం పోయేవరకు పెళ్ళికాని ఆడపిల్లలకు మీరు తండ్రినన్న విషయం మరిచిపోకూడదు! పెళ్ళయ్యే వరకు మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత మీకుంది. మీ ఊరికి వెడితే ఏనుగంత బలం వస్తుందన్నారే? అదే ఇక్కడెందుకు తెచ్చుకోకూడదు? మీ పిల్లలకోసం మీరా ఏనుగు బలం తెచ్చుకొని బ్రతకండి. ఇక కర్తవ్యం నుండి పారిపోయే వాళ్ళు వంచకులేకదా?"
 
    "ఆ పిల్లలకి నేనొక గుదిబండని! నాకు స్నానం చేయించడం, తినిపించడం, మందుల ఖర్చు ఇవైనా తప్పుతాయి ఆ పిల్లలకు, నా అపురూపను ఎంత అపురూపంగా పెంచుకోవాలనుకున్నానో, అంతగా కష్టపెడుతున్నాను! కనీసం దానికి ఆ బాధైనా తప్పించాలని నా తాపత్రయం. ఆత్మహత్య మహా పాతకమని ఊరుకొన్నానుగాని లేకపోతే ఎప్పుడో చచ్చుండేవాడిని! దయచేసి నా వ్యధ అర్ధం చేసుకోండి పరంజ్యోతిగారూ! నన్ను మా వూరికి చేర్చి పణ్యం కట్టుకోండి!"
    ఆయన ఆక్రోశం ఎంతటి వాళ్ళకీ గుండెలు కరిగించేట్టుగా ఉంది.

    "ఏమ్మా అపురూపా? ఆయనకి తిండి పెట్టే సేవ చేయడంకంటే. ఆయన మనసుకు శాంతి నివ్వగల పనిచేయడమే మంచిది కదా?ఆయన్ని అంత బాధపెడుతూ ఇక్కడ కట్టిపడేయకపోతేనేం?"
 
    "ఆయన్నలా ఊరివాళ్ళ దాక్షిణ్యానికి వదిలి నేనిక్కడ వుండ గలనా? ఆయన వెళ్ళక తప్పదనుకుంటే నేను కూడా వెళ్ళాల్సి వస్తుంది! అక్కడికి వెళ్ళి ఎలా బ్రతుకుతామన్న చింత నాకేం లేదు. ట్యూషనులు చెప్పుకుంటే మా రెండు జీవితాలు నిశ్చింతగా గడిచిపోతాయి. కాని, అర్పితను ఏం చేయాలి? దాని చదువు మధ్యలో ఆగిపోతుంది కదా? అందుకే చెప్పాను ఆయనకి ఇంకొద్ది రోజులు ఓపిక పట్టమని! అర్పిత చదువు పూర్తికాగానే ఊరికి వెళ్లిపోదామని!"
 
    "విన్నారుగా ఆచార్లూ? అమ్మాయి చెప్పింది కరక్టే కదా? ఇంత కాలం భరించారు! ఇంకొక్క ఏడాది, రెండేళ్ళు ఓపిక పట్టండి. ఈలోగా మీరు బాధపడి మీ పిల్లల్ని బాధపెట్టకండి. నాకు తెలుసు! మీరు విజ్ఞులు! ఒకరితో చెప్పించుకునే దుస్థితిలో మీరు లేరు!" మంచి మాటలతో ఆచారి నోరు కట్టేశాడు పరంజ్యోతి.

    పరంజ్యోతి తెప్పించిన పళ్ళలోంచే ఓ రెండు ఏపిల్ పళ్ళు తీసి కడిగి చాకుతో ముక్కలు చేసి ప్లేట్ లో ఆయన కిచ్చింది అపురూప. మరో ప్లేటులో తండ్రికిచ్చింది.

    పరంజ్యోతి ఒక్కొ ముక్క నెమ్మదిగా కొరుకుతూ అన్నాడు. "అపురూప చెప్పింది మీకు చక్కటి నాటకానుభవం ఉందని! శ్రావ్యంగా పాటలు, పద్యాలు పాడేవారని!"
 
    "ఏనాటి మాట? అదంతా ఒక గత జన్మ!" నిట్టూర్చాడు ఆచారి.
 
    "నిజమైన కళకి మరణం లేదండీ! సజీవమైన దానికి గతజన్మ, ఈ జన్మ అంటూ ఉండదు. అసలు మీరు చేసిన తప్పేమిటో తెలుసా? పరిస్థితులతో పోరాటం సాగించక ముందుగానే ఓటమిని అంగీకరించి లొంగిపోయారు. కాళ్ళు పోయినవాడినని, ఇక ఎందుకు పనికిరానివాడినని క్రుంగిపోయారు. అదీ మీరు చేసిన తప్పు. కాళ్ళు లేకపోయినా, సర్వావయాల్లో నయనం ప్రధానం అంటారే - ఆ నయనాలు లేకపోయినా అద్భుతాలు సాధించే వాళ్ళున్నారు. మహాద్భుతాలు సాధించేవాళ్ళు కూడా ఉన్నారు. దేనివల్ల నంటారు? ఆత్మవిశ్వాసం అన్న ఆయుధంతో, పోరాటంలో నిలిచిన మనిషికి ఆత్మవిశ్వాసం అన్నది చేతిలో ప్రజాయుధం అవుతుంది. పది పన్నెండేళ్ళ వయసులో సంసార భారాన్ని భుజాల మీదికి ఎత్తుకొన్న అపురూపకు ఉన్న పాటి ఆత్మబలం మీదు లేకపోయింది. అపురూపలాంటి అమ్మాయిని కన్నందుకు మీరు గర్వించాలండీ! ఆమె నిజంగా ఒక వజ్రపు తునక! నాకు ఆడపిల్లల్లేరు! నాకు దత్తు ఇస్తే మహా ప్రసాదంగా పెంచేసుకొంటాను. కాని మీరు ఇవ్వరనుకోండి ఆమె ఎత్తుధనం ఇస్తానన్నా. మాటల్లో పడి నేనొచ్చిన పనే మరిచిపోయాను. పద్యాలంటే నాకిష్టం! పాడలేనుగాని విని ఆనందించగలను. మంచి పాట ఎవరయినా పాడతారంటే ఎంత దూరమయినా వెళ్ళగలను! నేనొచ్చింది ఇప్పుడు మీ పాట వినాలని!"

    "చెప్పాను కదా? ఎన్నేళ్ళ మాట? పాటైనా, పద్యమైనా సాధన లేకపోతే రాదు!"

    "కాని, కొద్దిగా ప్రయత్నిస్తే మాత్రం వస్తుంది. నా చిన్నప్పుడు మా ఇంట్లో గ్రామఫోను ఉండేది! అంటే రేడియోలు ఇంటింటికి ఇంతగా రాని కాలమన్నమాట. మాది బాగా పల్లెటూరు. మా నాన్నగారు వరండాలో చాప వేసుకుని గ్రామఫోను రికార్డ్స్ వేస్తే ఊరి జనమంతా బిలబిల్లాడుతూ వచ్చి వినేవాళ్ళు. తారాశశాంకం, లవకుశ, సంపూర్ణ రామాయణం - అబ్బా! ఏం డైలాగులు, ఏం పద్యాలు? తారాశశాంకం మీకు తెలీకుండా ఉండదు. సూరిబాబు కంఠం కంచుమోగినట్లుగా మ్రోగుతుంటే ఓహో! జనాలు పరవశించి పోయేవాళ్ళు. తారాశశాంకంలో బృహస్పతిగా చేశాడాయన. బృహస్పతి చాలా రోజులకు ఇంటికి వస్తాడు. తలుపులు మూసి వుంటాయి. పిలుస్తాడు. తారా తలుపుతీస్తుంది. గదిలో చంద్రుడు కూడా ఉంటాడు. తారా చంద్రుల అలంకరణ, గదిలో అలుముకున్న సుగంధ పరిమళాలు - తను వచ్చింది మునివాటికా, లేక వేశ్యవాటికా అనుకొంటాడు. చంద్రుడు తన శిష్యుడా లేక పెళ్ళికొడుకా అనుకుంటాడు. భార్యను 'ఓసీ కులటా!' అని సంబోధిస్తాడు. ఏదీ ...... సూరిబాబు పాడిన పద్యాలు ఒకటి రెండు పాడండి!"

    మోడువారిన వనంలోకి ఎక్కడ నుండో వసంత గాలులు వీస్తున్నట్టుగా.

 Previous Page Next Page