Previous Page Next Page 
ప్రేమికారాణి పేజి 34

    జ్యోతి కడుపున పడ్డప్పుడు అటు పుట్టింటివాళ్ళు, ఇటు అత్తింటి వాళ్ళు చెప్పలేనంత అపురూపం చేశారు. క్రిందనడిస్తే కడుపులో బిడ్డ కందుతుందేమో నన్నట్టుగా చూశారు. వారానికి ఓసారి లేడీ డాక్టరు వచ్చి పరీక్ష చేసేది. తగిన జాగ్రత్తలు చెప్పేది. పళ్ళు బాగా తినమనేది.

    తన మొదటి బిడ్డకు ఎవరూ జాగ్రత్తలు చెప్పలేదు! ఎవరూ అపురూపం చెయ్యలేదు! పళ్ళు లేవు. మందులు లేవు. కడుపు పోతే బాగుండేదని భగవంతుడిని ప్రార్ధించేది. కడుపు పోవాలని తిండి మానేసి పస్తులుండేది. నీరసంతో కళ్ళు తిరిగేవి తప్ప తన కడుపులో పిండం చెక్కుచెదరలేదు. అది మొండిగా ప్రపంచంలోకి వచ్చింది. తనను శిక్షించడానికి కంకణం కట్టుకొంది.

    జ్యోతి పొత్తిలిగుడ్డలమధ్య లేత చేతులు పిడికిళ్ళుగా బిగించి పడుకొన్నప్పుడు తన ఆలోచనలన్నీ మొదటి బిడ్డమీదే సాగేవి! ఎలా పారేయగలిగింది ఆ బిడ్డను? ఆ క్షణంలో ఆ బిడ్డతో తనని ఎవరైనా చూస్తారేమో నన్న భయం తప్ప మరొకటిలేదు తనహృదయంలో. జ్యోతి  ఎదుగుతూ తప్పటడుగులు వేస్తూంటే, చిన్ని చిన్ని మాటలు నేరుస్తూంటే మొదటి బిడ్డ కళ్ళముందు కదలడం ఎక్కువైపోయింది. ఈ చేతులతోనే ఆ బిడ్డను పారేశాననుకొన్నప్పుడు ఆ చేతుల్ని విరిచి పొయిలో పెడదామనిపించేది!

    స్వప్నావిష్ణురాలిలా నిలబడిపోయిన తల్లిని జ్యోతి కంగారుగా కుదుపసాగింది. "మమ్మీ! నీకేమైంది?"

    గీతాభవాని చేతిలో నూనెగిన్నె క్రిందపడిపోయింది. తరువాత ఆమె కూడా నిలువునా విరుచుకుపడిపోయింది!
   
              
                   13

    ఇరవై సంవత్సరాల క్రితం.

    గిరిధరంగారి గృహదీపం ఆరిపోయి అంధకారంతో మునిగిపోయింది ఆయన కుటుంబం. మాతృహీనులైన ఇద్దరు పసిగందులు. ఎప్పుడో ఓసారి పుట్టింటిమీద మమతపొర్లి వచ్చే ఆడపిల్లలు, తదితర బంధువులు ఆ అంధకారం చూసి అల్లాడిపోతున్న సమయంలో ఆ ఇంట్లో చీకట్లు పారద్రోలడానికి వచ్చిన జ్యోతిలా ప్రవేశించింది గీతాభవాని.

    అందరి కష్టసుఖాలు పంచుకోడానికి వచ్చిన సేవామూర్తి అనిపించింది.

    ఆ ఇంట్లో నవ్వులదీపాలు వెలిగించేందుకు అవతరించిన దేవతామూర్తి అనిపించింది.

    'మా గీతవదిన' అనుకోకుండా ఒక్కరోజు గడవదు ఆడపడుచులకు.

    'మా పిన్ని' అనుకోకుండా ఒక్కపనీచేయరు గిరిధరంగారి మొదటిభార్య పిల్లలు.

    అలాంటి సేవామూర్తి, దేవతామూర్తి కొన్నాళ్ళుగా అనారోగ్యంతో మంచం పట్టింది.

    బంధుమిత్రులంతా వచ్చి పరామర్శించి పోతున్నారు.

    స్టేట్స్ లో భర్తతో ఉన్న గిరిధరంగారి పెద్దకూతురు ఉష "పిన్నికి ఏమైనా అయితే మేం భరించలేము. ఆమె త్వరగా ఆరోగ్యం పుంజుకోడానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అక్కడ కాకపోతే ఇక్కడికి తీసుకురండి స్పెషలిస్టులకి చూపించుతాము" అని వ్రాసింది తండ్రికి.

    "అన్ని పరీక్షలూ చేశాను! ఆమెకే జబ్బూ కనిపించడంలేదు. నాకు తోస్తున్నదొక్కటే. ఆమె దేనికో వ్యధ పడుతున్నారు. మనశ్శాంతికి దూరమైన మనిషిలా కనిపిస్తున్నారు. ముందు అదేమిటో తెలుసుకొంటే తప్ప ఆమెను మామూలు మనిషిని చేయలేం!" అని చెప్పాడు ఫామిలీ డాక్టరు. మరో ఇద్దరు డాక్టర్సుకూడా అతడి అభిప్రాయాన్నే బలపరిచారు.

    దిక్కుతోచలేదు గిరిధరంగారికి. ఎందుకు వ్యధ పడుతూంది గీతా భవాని. పరిస్థితులన్నీ మునుపటిలాగే ఉన్నాయి. అన్నీ సవ్యంగానే ఉన్నాయి శాంతి ఎందుకు కరువైంది ఆమెకు! 'అమ్మని చూడాలనిపిస్తూంది' అని పుట్టింటికి వెళ్ళి వచ్చినప్పటినుండే ఆమెలో ఏదో మార్పుబయల్దేరిందనిపిస్తూంది.

    ఆ రోజు గిరిధరంగారు భార్యదగ్గర కూర్చొని కొంచెం చిక్కినట్టుగా ఉన్న ఆమె చేతిని తనచేతిలోకి తీసుకొని రుద్దంగా అన్నారు. "గీతా! నువ్వు దేనికి బాధపడుతున్నావో చెప్పు! నువ్వు ఏం కావాలంటే అది నీ ముందుంచగలను. చెప్పు గీతా!"

    గీతాభవాని పెదవులమీద పేలవమైన నవ్వు కదిలింది. "ఉహుఁ. నేను దేనికోసమూ బాధపడడం లేదు. డాక్టర్లు చెప్పేమాటలన్నీ నమ్మకండి! అనారోగ్యమా? అది మనుషులకు చేయక మానులకు చేస్తుందా? కొద్ది రోజుల్లో నేను కోలుకొంటాను. మునుపటిలా మీ మధ్య తిరుగుతాను!"

    "అలా జరగాలనే ప్రతిక్షణం భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. కాని, ఏమైనా అయితే తట్టుకొనేశక్తి ఈ వయసుకి లేదు."

    గీతాభవాని మాట్లాడలేదు. ఈ అభిమానం, ఈ గౌరవం, ఈ అనురాగం తను పెళ్ళికాకముందు ఒక బిడ్డకు తల్లి అయిందని తెలిస్తే అప్పుడవి నిలుస్తాయా? ఉఫ్ న గాలిలో కలిసిపోయి ఒక గజ్జికుక్కలా బహిష్కరింపబడదూ? అటు పుట్టింట్లోనూ, ఇటు మెట్టినింట్లోనూ చోటులేక ఏమైపోవాలి? అసలు వీళ్ళంతా తనని అసహ్యించుకొంటారన్న ఊహకే వణికిపోతూంది.

    వీళ్ళ అభిమానం, అనురాగం పోగొట్టుకోలేదు. అటు బిడ్డను మరిచిపోలేదు.

    దానికి అంత పట్టుదల ఎందుకు?

    "నీ బిడ్డనని పరిచయం చేస్తే తప్ప రాను' అని ఎందుకనాలి?

    అది బిడ్డా?

    కక్ష సాధించడానికి తయారైన శత్రువు.
 

 Previous Page Next Page