అంత నీరసంలోనూ అతను పదే పదే 'అరె' అన్న పదం ప్రయోగించడం చూసి ఆమెకు నవ్వొచ్చినట్లయింది. కళ్ళు విప్పి అతని వంక చూస్తూ "కాదు" అన్నది.
"నేను డాక్టర్ని. చాలా వరకూ కరక్టుగా దయాగ్నైజ్ చెయ్యగలననుకుంటాను. దుఃఖంలో ఉబికిన కన్నీటికీ, వర్షపు చుక్కలకూ తేడా చెప్పగలననుకుంటాను."
"అలాగే? అయితే ఆ దుఃఖానికి కారణం చెప్పండి."
"చెప్పాలంటే మీ గుండెల్లోకి చొచ్చుకు వెళ్ళాలి."
"ఇందాక ఎగ్జామిన్ చేశారుగా, చెప్పండి?"
"మీ గుండెలోతులోకింకా వెళ్ళలేకపోయాను" అంటూ ఆమె ముఖంలోకి పరిశీలనగా చూస్తూ "మీరు బాగా వీక్ గా వున్నారు. సెలైన్ పెడతాను" అంటూ లేవబోయాడు.
"అయ్యో వద్దు" అంటూ వారించే ఉద్దేశంతో అప్రయత్నంగా అతని చెయ్యి పట్టుకుని ఆపింది.
క్షణంపాటు అతని చెయ్యి ఆమె చేతిలో వుండిపోయింది.
"సరే అయితే, గ్లూకోజ్ కలిపి తీసుకొస్తాను" అంటూ అతడామె చేతిని మృదువుగా విడిపించుకొని తన గదిలోకి వెళ్ళి పది నిమిషాల్లో గాజు గ్లాసులో గ్లూకోజ్ వాటర్ తీసుకొచ్చాడు. ఆమె వారించాలని ఎంత ప్రయత్నం చేసినా వీల్లేకపోయింది.
బెడ్ మీద కొంచెం లేచి వెనక్కి ఆనుకుని కూర్చొంది.
"మీరు డాక్టరుగారు, నేను నర్స్ ని. ఇలాంటి సేవలు మీరు చెయ్యకూడదు" అంది అతను గ్లాసు అందించాక చాలా సిగ్గుపడుతూ.
"ఇందులో సేవ ఏముంది? చాలా చిన్నవిషయానికి అంత ప్రాధాన్యత యివ్వకూడదు."
"కాని నా పొజిషన్ బట్టి నాకు డెలికేట్ గా వుంటుంది కదా!"
అతననుకోకుండా ఆమె ముఖంలోకి చూశాడు. అలసిపోయి, బలహీనంగా వున్నా ఎంతో అందంగా, అద్భుతంగా వున్నట్లనిపించింది.
"ఒక వ్యక్తి పేషెంట్ గా వున్నప్పుడు పొజిషన్స్ వుండవు."
ప్రజ్ఞ సిగ్గుపడుతూ నవ్వింది.
"మీరు రెస్టు తీసుకోండి" అంటూ ఆమెను విడిచిపెట్టి దయాకర్ తన కన్ సల్టింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు.
బయట వర్షం యింకా జోరుగా కురుస్తూనే వుంది.
ఏమీ తోచక టేబుల్ మీది మెడికల్ జర్నల్ తీసుకుని పేజీలు అటూ యిటూ తిరగెయ్యసాగాడు.
మనసు లగ్నం కావటంలేదు. ఎందుకో ఆ రోజు ప్రజ్ఞ పదే పదే తలపుకు వస్తోంది.
బహుశా ఆమె నిజం చెప్పడం లేదు. ఎందుకో బెదిరిపోయినట్లు కనిపిస్తోంది. ఆమె యింట్లో గుండెను రాపాడేసే సంఘటనేమయినా జరిగితే జరిగి వుండవచ్చును.
అంతకు ముందురోజు రాత్రి తల్లి అన్న మాటలు మనసులో ప్రతిధ్వనిస్తున్నాయి.
"దయా ! నా ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించిపోతున్నదిరా. యోగి పరిస్థితి చూస్తే అలా వుంది. వాడు రానురానూ దిగజారిపోతున్నాడు. తొందరగా యీ యింట్లో కోడలుపిల్ల అడుగుపెడితే నాకు మనశ్శాంతి వుంటుందిరా."
ఎవరా కోడలుపిల్ల ?
ఎన్నో సబంధాలు వస్తున్నాయి. యాంత్రికంగా ఎవర్నో ఒకర్ని చేసుకుని భార్యగా బంధించి జీవితం సాగించాలా?
ఎమ్.బి.బి.యస్. చదివేటప్పుడూ, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఎందరో విద్యార్ధినులు తనతో స్నేహంగా మెలిగారు. కొందరు తన మనసుకు దగ్గరకు రా ప్రయత్నించారు. కాని వాళ్ళెవరూ తనను ఆకర్షింపలేకపోయారు.
ఒక వైద్య విద్యార్ధిగా, డాక్టరుగా ఎన్నో మనస్తత్వాలని చూశాడు. జీవితంలో వేగంతో పెర్ వర్షన్స్ తో, ఆభిజాత్యాలతో మనుషులు కొట్టుకు పోవటం చూశాడు. వాళ్ళందర్నీ చూస్తోంటే అతనికి భయం వేస్తుంది. కంపరంగా ఉంటుంది. వికారంగా ఉంటుంది.