Previous Page Next Page 
భారతి పేజి 34

    ఓ మృదు సుగంధం  వీచినట్లయింది మల్లికవైపుగా. "ఏమిటి?" అంది ఆనందోద్రేకాలతో.

    "అవునే. చాలా  చిత్రమైన  వూహ  వచ్చింది....నర్సింగ్ చదువుదామనుకుంటున్నా."

    మల్లిక  స్నేహితురాలివైపు  విస్మయంగా చూసింది. ఏ పరిస్థితులు  ఆమెకీ  కోరికను  కలిగించాయి? తను  ఓ వ్యాథిగ్రస్తురాలిగా వుండటమా? ఈ మధ్య  తరుచు  డాక్టర్ని  కలుసుకుంటూ  వుండటంవల్ల కలిగిన ఉత్తేజమా?

    ఇటీవల  ఒకసారి తన తల్లిని  గుంటూరు  ఆసుపత్రిలో  చేర్చినప్పుడు  చూడటానికి  భారతి వచ్చింది. ఆమె అక్కడవున్న  కాసేపూ అక్కడ అటూ ఇటూ చలాకీగా  తిరిగే  నర్సులనూ, వాళ్ళు చేసే పనులనీ సకౌతుకంగా  తిలకిస్తూ  కూర్చుంది. "చూడవే! తెల్లటి యూనిఫారాలు  వేసుకుని వార్డులలో  తిరుగుతూ, ఎలా  తమ సేవాధర్మం  నిర్వర్తిస్తున్నారో, వాళ్ళ వృత్తి సాటిలేనిది. వాళ్ళు ధన్యజీవులు" అంది తనతో  ఉద్రేకంగా  ఒకటి రెండుసార్లు.
   
    ఏది ఏమైనా మల్లిక సంతోషించింది. తన స్నేహితురాలు  విధిని నిందిస్తూ  యింట్లో కూర్చుని  జీవితాన్ని గాఢాంధకారం చేసుకోక, సజీవమైన ఓ వృత్తిని  ఎన్నుకోవటానికి  నిశ్చయించుకుంది. ఇది మానసికంగా  ఆమెకు మందులా  పని చేస్తుంది. ఎంతోమంది ప్రజలను  పలకరిస్తూ  వుండాలి. ఎంతోమందితో  కలసిమెలసి  తిరగాలి. ఆమె దిగుళ్ళకూ, మానసిక తాపాలకూ  అవకాశం  ఉండదు.

    "నువ్వు  స్కూల్ ఫైనల్  పాసయ్యావు  కాబట్టి నీకు సీటు తప్పకుండా  వస్తుంది భారతీ. తప్పకుండా చేరు. కాని ఇంకో మూడ్ నెలలు టైము ఉందనుకొంటాను  కోర్సు  ప్రారంభమవటానికి. ఈలోగా  నీ ఆరోగ్యాన్ని  పరిపూర్ణంగా చక్కదిద్దుకో. నీ అనారోగ్యం  నీ పురోగమనానికి  ఎప్పుడూ  అడ్డు తగలకూడదు. తెలిసిందా?" అంది తన హర్షం  వెలిబుచ్చుతూ.  
         
    కాని ఈ మలుపులో, ఈ పరిణామంలో  అంతర్లీనంగా  ఆమెకు విషాదగరిమ  కానవచ్చింది. అది గుర్తు వస్తే  గుండెల్ని  కోసే విషాదం. ఆ విషాదం  భరించలేక ఆమె అప్పటికప్పుడు  ఒక తీవ్రమైన  నిశ్చయం చేసుకుంది. అది చాలా విపరీతమైన  నిర్ణయం. ఆమె జీవితాని కంతటికీ  సంబంధించిన  సమస్య.


                                  *    *    *


    మరో మూడు నెలలు గడిచిపోయాయి. ఈ మూడు నెలలలో  భారతి గుర్తుపట్టనంతగా  మారిపోయింది. నిరంతరం  ఒకటే  దీక్ష. ఒకటే తపస్సు. తను మామూలు మనిషి కావాలి? ఎప్పటి రూపాన్ని తెచ్చుకోవాలి. ఎవరికోసమో తెలియదు: ఎందుకోసమో  తెలియదు.

    వేసవి ఎండలు  విశ్వరూపం  దాల్చేసరికి  భారతి  రూపంలో కూడా  చాలా మార్పు వచ్చేసింది.

    "నువ్విదివరకు కూడా  ఇంత అందంగా లేవు తెలుసా? రాను రానూ  కళ్ళు కుట్టేటట్లుగా  తయారవుతున్నావు. నీ ఆరోగ్యాన్ని  చూస్తే అసూయకూడా  వేస్తోంది. పాపం, ఆ దౌర్భాగ్యుణ్ణి  చూస్తే  జాలేస్తోంది" అనేది మల్లిక.

    "ఆ దౌర్భాగ్యుణ్ణి  నువ్వెన్నటికీ   క్షమించేటట్లుగా  లేవే" అన్నది  నవ్వుతూ  భారతి.

    "క్షమించటమా? ఎప్పుడన్నా  ఎదురుపడితే  ఆరు నెలలు  మంచాన పడేటట్లుగా  చివాట్లు  పెడతాను."

    భారతి  ఒక రోజు  బుట్టెడు  పళ్ళు  తీసుకుని  బెజవాడలో  డాక్టరు గారి   ఆసుపత్రి  ముందు రిక్షా దిగింది. రిక్షావాడు బుట్ట తీసుకుని  వెనకరాగా మెట్లెక్కి  లోపలకు  అడుగుపెట్టింది.

    డాక్టర్ సాగర్  తల వంచుకుని  ఏదో పుస్తకం  చదువుకుంటున్నాడు. అలికిడి విని తల ఎత్తి చూసి  "మీరా?" అన్నాడు. అతడి కంఠంలో  ఆనందం  తొణికిస లాడింది.

    మరు నిమిషంలో  అతను పరిస్థితి  అర్ధం చేసుకున్నాడు. వెంటనే లజ్జితుడవుతూ, "ఎందుకండీ  ఇవన్నీ, మీరు మొత్తానికి బలేవారే" అన్నాడు.

    రిక్షావాడు అంతకుమునుపే  బుట్ట అక్కడపెట్టి, డబ్బుతీసుకుని  వెళ్ళిపోయాడు.

    భారతి కూడా సిగ్గుపడుతూ, తల వంచుకుని  "నిరాకరించకండి. ఏదో నా కృతజ్ఞత" అంది ఆర్ద్రత నిండిన కంఠంతో.

    అంటూనే  హ్యాండ్ బ్యాగ్  తెరిచి ,అందులోంచి బరువుగా ఉన్న కవరుతీసి అతని బల్లమీద ఉంచింది.

    అతను  మరింత దిగ్ర్భాంతుడై "ఇదేమిటి?" అన్నాడు.

    "మీ ఫీజు."

    "ఎందుకు?"

    ఈసారి ఆమెకు నవ్వు వచ్చి  తల కొద్దిగా ఎత్తి అతనివంక  చూస్తూ, "డాక్టర్లకు ఫీజు ఎందుకిస్తారు? నెలల తరబడి మీచేత  ముఫత్ గా వైద్య సహాయం  పొందేశాను; ఇహనన్నా  విముక్తి కలిగిస్తారేమోనని" అంది.

    "ఈ మందులు  తీసుకోవటం, అప్పుడప్పుడూ  వచ్చి  పరీక్ష చేయించుకోవడం  నిజంగా  మీకు బరువుగా వుందా?"

    "మీరు పేషెంటు అయితే తెలుస్తుంది....నెలలు తరబడి  ఈ శిక్ష అనుభవించటం  ఎంత కష్టమో?"

    అతను విభ్రాంతుడై  ఆమె ముఖంలోకి  చూశాడు. నిర్మలమైన  ఆమె విశాల నేత్రాలలో  నీలినీడలు  కనిపించాయి. వెంటనే  మాట మారుద్దామని, "ఓహో, అవునవును. మీకు నేను నయం చేశానుకదా. ఈ డాక్టరూ__పేషెంటు  రిలేషన్ షిప్  మరిచిపోయాను. ఏమీ అనుకోకండి" అంటూ ఆ కవరు తీసుకుని జేబులో  పెట్టుకొని. "అన్నట్లు నిలబడే  వున్నారు, కూర్చోండి" అన్నాడు.

    భారతి కుర్చీలో కూర్చుని  బల్లమీద  తన సన్నని  వ్రేళ్ళను  అటూ ఇటూ కదుపుతూ, "మీరు లెక్క చూసుకోకుండానే  జేబులో  పెట్టుకున్నారు....నేను చాలా బీదదాన్ని....ఏదో  నా...." తరువాత ఏం చెప్పాలో తెలియక ఆగిపోయింది.

    అతనికి గుండె కెలికినట్లయి. మళ్ళీ  అంతలోనే సర్దుకుని  నవ్వటానికి  ప్రయత్నిస్తూ, "అవునవును  మీరు చాలా బీదవాళ్ళు. అందుకే అంత బరువైన కవరు ఇచ్చారు. నా మాట నమ్మండి. నేను ప్రాక్టీస్ పెట్టాక  ఇంత బరువుగా  ఎవరూ బిల్లు పే చెయ్యలేదు" అన్నాడు.

    భారతి మృదు మందహాసం  చేసింది. "మీరింత అల్ప  సంతోషులైతే  జీవితంలో  ఎప్పుడూ  ఒక కారుని కూడా కొనుక్కోలేరు" అంది.

    "పోనివ్వండి. అనేకమైన తీరని  కోరికలలో అదీ ఒకటి  అయిపోతుంది."

    ఒక నిమిషం  నిశ్శబ్దంగా  గడిచింది.

    "మనం కాఫీ తీసుకుందామండీ" అన్నాడు  చప్పున అతను. ఆమె జవాబు ఇచ్చేందుకు కూడా వ్యవధి లేకుండా  బాయ్ ని పిలిచి  రెండు కాఫీలు  తీసుకు రమ్మన్నాడు.

    'వేళ కాని  వేళ__ఇప్పుడెందుకండీ  కాఫీ?" అప్పుడనగలిగింది భారతి.

    "వేళకు అంతా ఎవరింట్లో  వాళ్ళే వుంటారు  కదండీ. అప్పుడివ్వటం  సాధ్యం కాదు గదా."

    అతని మాటలకు ఆమెకు నవ్వు వచ్చింది. మెత్తగా నవ్వి ఊరుకుంది.

    కాఫీ వచ్చాక, భారతి కప్పు చేతిలోకి  తీసుకొని, కొద్దికొద్దిగా  త్రాగుతూ మధ్యలో  తల ఎత్తి  అతని వంక చూస్తూ, "నేనింక రానక్కర్లేదు కదండీ" అంది.

    "అంటే?"

    "అంటే....నాకు పూర్తిగా  నయమయినట్లే  కదండీ?"

    "పూర్తిగాకంటే  ఎక్కువగా కూడా. చూడండీ, మీరు నాకు నిజంగా  విభ్రాంతినే  కలిగిస్తున్నారు. మొదటిసారి  మీరు నా దగ్గరకు  వచ్చినప్పటి రూపాన్ని  ఊహించలేకుండా  ఉన్నాను."

    అతనిపట్ల  ఆమె మనసు  కృతజ్ఞతతో  నిండిపోయింది. కాని అవి మాటల రూపంలో  బయటకు వ్యక్తం  చేయటానికి  వయసు చాలదు. అనుభవమూ లేదు. కాఫీ కప్పు  బల్లమీద  పెట్టి సంకోచిస్తూ  అడిగింది. "నేనింక.... నేనింక....అందరితో  కలిసి తిరగవచ్చు  కదండీ."

 Previous Page Next Page