Previous Page Next Page 
బొమ్మా - బొరుసూ పేజి 34


    అతను గట్టిగా నవ్వాడు.
    "నా బట్టలు పాడయిపోతాయ్ అన్నవాళ్ళను మీరొక్కరినే చూశాను. అంతానేనెక్కడ కూర్చుంటే అక్కడ నా బట్టలమురికి అంటుతుందని భయపడుతుంటారు".
    నాగమణి నవ్వుతూంటే కన్నీళ్ళు వచ్చాయి.
    "నేను మీతో మాట్లాడదల్చుకోలేదు" అందామె నవ్వు ఆపుకుని.
    "ఎందుకని?"
    "మీరు నాతో మాట్లాడడం ఎందుకు మానివేశారో చెప్పండి".
    "ఇప్పుడే చెప్పాలా?"
    "అవును!" "మీకు కులాసా చిక్కాక మాట్లాడుకోకూడదా ఆ విషయాలు?"
    "ఉహు! ఇప్పుడే కావాలి" మొండిగా అందామె.
    అతను కొద్దిక్షణాలు నిశ్శబ్దంగా వుండిపోయాడు ఆలోచిస్తూ.
    "ఫరవాలేదు చెప్పండి. మీ ఇంట్లో ఏమయినా గొడవలాయినాయా?"
    "ఊహు! అదికాదు మన ఆఫీసులోమనిద్దరి గురించీ లేనిపోనివి కల్పించిచెప్పుకుంటున్నారు"
    ఆమెకు నవ్వాగలేదు. నవ్వలేకనవ్వలేక నవ్వసాగింది.
    "ఏమిటి? మీకింత నవ్వు కలిగిస్తోందా విషయం?" ఆశ్చర్యంగా అడిగాడతను.
    "లేకపోతే ఏమిటి మరి? ఇంతోటిదీనికి పెద్ద రహస్యంలాగా దాచేసుకుని సినిమాల్లోలాగా త్యాగాలు చేసేస్తున్నారు...." మళ్ళీ నవ్వేస్తూ అందామె.
    "అంటే ఈ విషయం మీకూ తెలుసా?"
    "నాకు చాలా రోజులనుంచీ తెలుసు"
    "ఎలా? ఎవరు చెప్పారు?" ఆదుర్దాగా అడిగాడతను.
    "జానకి చెప్పింది. ఆ తరువాత అంతకంటే గట్టిరుజువే కనిపించింది కూడా! నేను ఆ మధ్య ఆఫీస్ కొచ్చేసరికి నా టైప్ మిషన్ మీద ఎవరో టైప్ చేసిన కాగితం ఒకటిపెట్టి ఉంచారు. అందులో ఏమని టైప్ చేశారో తెలుసా?"
    "లవ్ బర్డ్స్- నాగమణి-చంద్రం' అని వుంది" మళ్ళీ నవ్వేస్తూ అందామె.
    "మరి.....మీరేం చేశారు....."
    "ఏం చేస్తాను? నవ్వుకుని ఆ కాగితం చింపి అవతల పారేశాను".
    అతను ఆలోచనలో పడిపోయాడు. ఆమె ఆ విషయం అంత తేలికగా తీసుకుందంటే తమాషాగా ఉంది.
    "కాని నాగమణిగారూ! దానివల్ల నా సంగతెలా ఉన్నా మీకెంత నష్టమో ఆలోచించారా?"
    "నాకేం నష్టం?"
    "భలేవారే! మీరు వివాహం కావలసినవారు అన్న విషయం మర్చిపోతున్నారా?" నాగమణి అంతలోనే సీరియస్ గా అయిపోయింది.
    "వివాహమా! నాకా యోగం ఎలాగూ లేదులెండి! చేతులారా నన్ను నేను పాడుచేసుకున్నాను" అప్రయత్నంగా అనేసిందామె. అతను నిరుత్తరుడయ్యాడు.
    "నాగమణిగారు! ఏమిటలా అంటున్నారు? ఏం జరిగింది?" కలవరపాటుతో అడిగాడు. అంతలోనే నాగమణి తేరుకుంది.
    "ఏంలేదులెండి! ఏదో వాగేస్తున్నాను! ఆఫీస్ విషయాలేమిటి? మీరిప్పుడెలా రాగలిగేరిక్కడికి? ఆఫీస్ లేదూ?"
    "ప్రప్రంచంలో ఎనిమిదో వింత జరిగిందివాళ! అందుకని రాగలిగేను!" తమాషాగా అన్నాడతను.
    "ఏమిటది?"
    "నేను ఉద్యోగంలో చేరాక ఇన్నేళ్ళకు మొదటిసారిగా ఓ రోజు శెలవు పెట్టేశాను....."
    ఆమె ఆశ్చర్యపోయింది.
    "నిజంగానా?"
    "బోలెడు నిజం!" నవ్వుతూ అన్నాడతను.
    "ఇప్పుడంత అవసరం ఏం వచ్చింది?"
    "మీరు ఆఫీస్ కి రాక రెండు రోజులయేసరికి ఇంకేమీ తోచలేదు. తక్షణం మీ ఇంటికి రావాలనీ మిమ్మల్ని చూడాలనీ అనిపించింది....."
    ఆమె మనసంతా అవ్యక్తానందంతో నిండిపోయింది. అంతలోనే ఎంచేతో దుఃఖం కూడా    పొంగుకొచ్చింది. అతికష్టంమీద దుఃఖం అణిచేసుకుని అతనివంక చూస్తూండిపోయిందామె.

 

                                                                * * * * * *
    
    "డబ్బెంత పోగుజేశావ్?" ఆఫీసునుంచి ఇంటికొస్తూనే హేమనడిగాడు శ్రీనివాసరావ్.
    "ఏ డబ్బు?"
    "అదే కథల మీద సంపాదించింది!"
    "ఏమో! ఎంతో సరిగ్గా గుర్తులేదు! అంతా నాన్నగారికే ఇచ్చాను!"
    "అదేమిటి? మీ నాన్న కెందుకిచ్చావ్?" కోపంగా అన్నాడతను.
    "ఇంకెవరికివ్వాలి?" 'టీ' అతని కెదురుగ్గా టేబుల్ మీదుంచుతూ అందామె.
    ఏం చెప్పాలో తెలీలేదతనికి.
    "నీ డబ్బు నీ దగ్గరుండాలి!" కొంచెం కఠినంగానే అన్నాడతను.
    "నాదగ్గరున్నా మా నాన్నదగ్గరున్నా ఒకటేగా?"
    "అంటే ఉండకూడనిది నా దగ్గరన్న మాట! అంతేనా?"
    "అలా అని నేననలేదు!" "నువ్వేమీ అనవులే! నాకు తెలీదా ఏమిటి నీ సంగతి!"
    "తెలిసి ఎందుకు మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడడం?"
    శ్రీనివాసరావ్ కు వళ్ళు మండిపోయింది. ఆమెలోని పొగరు ఏమాత్రం తగ్గలేదనిపిస్తోందతనికి.
    "ఇప్పుడు మీకా డబ్బుతో ఏమి అవసరంకలిగిందో చెప్పకూడదూ? ఈ గొడవంతా ఎందుకు?" తనే అడిగింది హేమ.
    ఆ ప్రశ్న తనను అవమానపరుస్తున్నట్లుగా అనిపించిందతనికి. కానీ తను రెచ్చిపోతేలేనిపోని రభస జరుగుతుంది. తనుముందు ఆమె దగ్గరున్న డబ్బంతా చేజిక్కించుకోవాలి. అప్పుడుగాని ఆమె ఆట కట్టదు. అంత వరకూ సౌమ్యంగా వ్యవహరిస్తే సరిపోతుంది. అంతగా మరీ మితిమీరితే అప్పుడే ఆమె భరతం పట్టవచ్చు.
    "నేను మోటార్ సైకిల్ కొనుక్కోవాలనుకుంటున్నాను...." అన్నాడతను.
    "సరే! నాన్నగారికి ఉత్తరం రాసిపంపించమంటాను!" అతనింకేమీ మాట్లాడలేదు. వారంరోజులు తిరక్కుండానే ఆమె తండ్రి పంపిన డ్రాఫ్ట్ అతని చేతికందించింది. అయిదువేల రూపాయలు చేతికిరావడంతో శ్రీనివాసరావ్ కి మతిపోయినట్లయింది. తను ఇంతకాలం ఉద్యోగం చేసినా కూడబెట్టలేకపోయాడిది.  హేమకొద్దినెలల్లో ఏదో చెత్త రాతలురాసి సంపాదించగలిగింది.
    మర్నాడే మోటార్ సైకిల్ కొన్నాడతను. నాలుగురోజులు ఆఫీసుకి శెలవు పెట్టి అది నడపడం నేర్చుకున్నాడు. అక్కడితో దానిమీద మోజు కొంతవరకూ తీరిపోయింది. ఓ రోజు అతను ఆఫీసునుంచివచ్చేసరికి హేమహాల్లో కూర్చుని ఎవరో యువకులతో మాట్లాడుతూ కనిపించింది. తననుచూసయినా వారితో మాట్లాడడం ఆపి లోపలికొచ్చి 'టీ' అందిస్తుందని ఎదుర్చూశాడతను. కానీ అరగంట గడచిపోయినా ఆ సన్నాహాలేమీ కనిపించకపోయేసరికి ఇంక అతనికి చిరాకేసుకొచ్చింది.
    "హేమా!" గదిలోనుంచే గట్టిగా పిలిచాడు.
    "ఏమిటి?" గదిగడపలో నిలబడి అడిగిందామె.
    "నేను వచ్చానన్న సంగతినీకు గుర్తుందో లేదోనని..."
    "అవతలనన్ను చూడ్డానికొచ్చిన పాఠకులతో మాట్లాడుతున్నాను"
    "అంటే ఇక ఇంటి విషయాలేమీ అవసరంలేదన్నమాట!" కోపంగా అన్నాడతను."
    గట్టిగా అరవకండి! వాళ్ళు వింటారు! కొద్ది నిమిషాలు ఓపికపడితే వాళ్ళు వెళ్ళిపోతారు!" అందామె సహనంగా.
    శ్రీనివాసరావ్ ఇంకేమీ మాట్లాడలేదు. అపరిచితుల ఎదుట ఘర్షణ పడడంకన్నా వాళ్ళు వెళ్ళిపోయాక ఆమె భరతం పట్టవచ్చని ఊరుకుండిపోయాడు.
    మరికొద్దిసేపట్లో ఆ యువకులిద్దరూ వెళ్ళిపోయారు. వెంటనే ఆమె దగ్గరకొచ్చి "వాళ్ళిద్దరూ నీకెలా తెలుసు?" అనడిగాడు శ్రీనివాసరావ్.
    "వాళ్ళు నాకేం తెలీదు. రచయిత్రిగా నన్ను చూడ్డానికొచ్చారు!"
    "ఇదిగో హేమా! ఇలాంటివి నాకిష్టం లేదు. రోడ్డునపోయే ప్రతి వాడూ నీతో సల్లాపాలాడ్డానికి నువ్వు వ్యభిచారిణివి కాదు. తెల్సిందా! ఇదివరకోసారి చెప్పానీ విషయం అయినా...."

 Previous Page Next Page