Previous Page Next Page 
పన్నీటి కెరటాలు పేజి 34


    "ఎలా?"
    "చెపుతాను బాస్!" అంటూ కళ్ళు మూసుకొని ఆలోచనలో పడింది సాధన.
    ఆర్ ష వేచి చూస్తూ ఉండిపోయాడు.
    అశిరిపల్లె వెళ్ళిన తర్వాత ఓ రోజు సాధన మారువేషం వేసుకుని తిరుగుతూంటే రామన్న, లచ్చన్న వేషాలతో ఉన్న వర్ధనరావు, అహోబిలం తారసపడ్డారు. వాళ్ళు యాస భాషతో మాట్లాడుతూ ఉంటే సాధన మామూలుగా వాళ్ళెవరో పల్లెటూరి బైతులనుకుంది. వాళ్ళ మాటల మధ్యలో 'ఎస్ సార్' అన్నమాట విని చెవి అటు ఒగ్గి విన్నది.
    వాళ్ళని మారువేషాలని గ్రహించటానికి ఎంతోసేపు పట్టలేదు సాధనకి. ఎవరైనా మారువేషం వేశారూ అంటే వాడు దొంగయినా కావచ్చు, మోసగాడయినా కావచ్చు, పోలీసువాడయినా కావచ్చు, సి.ఐ.డి. అయినా కావచ్చు. ఈ విషయం సాధనకి బాగా తెలుసు.
    ఎప్పుడైతే వాళ్ళమీద సాధనకి అనుమానం వచ్చిందో ఇంక వాళ్ళ వెనుకపడింది. వాళ్ళొక చెట్టుచాటున నుంచుని అక్కడ ఎవరూ లేరుకదాని మామూలుగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. వాళ్ళ మాటలు విన్న తర్వాత వాళ్ళెవరూ అన్నది సాధనకి తెలిసిపోయింది. పైగా ఒక వ్యక్తిని వెంటాడుతూ, అతని గురించి మాట్లాడుకోవటం విని చాలా కుతూహలం కలిగింది సాధనకి. వాళ్ళ వెనకనే బయలుదేరి ఇదేమిటో తెలుసుకోవాలనుకుంది.
    ఆ రోజు  
    అతనితో కొండ పైకి అహోబిలం ఒక్కడూ వెళ్ళటం, ఇన్ స్పెక్టరు ఇక్కడే ఆగిపోయి, వెనక్కి మరలివెళ్ళి అతని గది తలుపులు మారు తాళం చెవులతో తీసి అతని గదిలో ప్రవేశించి లోపల దాదాపు ఒక గంట వుండి మళ్ళీ బయటకి రావటం, తాళం వేసి వెళ్ళిపోవడం అంతా సాధన చూస్తూనే ఉంది.
    అప్పటికప్పుడే ఒక నిర్ణయానికి వచ్చింది సాధన.
    ఇన్ స్పెక్టరు అటు వెళ్ళగానే పదినిముషాలు ఆగి పిన్నుతో తాళంతీసి లోపలకి ప్రవేశించింది. సాధన కూడా గదినంతటినీ పరిశోధించి వదిలిపెట్టింది. క్రిందపడ్డ అద్దం పెంకులని చూసి అది ఇన్ స్పెక్టర్ పనే అని గ్రహించి నవ్వుకుంది. ఈ గదిలో ఉన్న అతను దేవాలయాన్ని పదిశోధించడం చిన్న నోట్ బుక్ లో ఏదో రాసుకోవటం ఇదివరకే చూసి వుంది సాధన. అప్పటికప్పుడే ప్లాన్ సిద్ధం చేసుకుంది.
    ఆ ప్లాన్ ప్రకారం,
    అతను గుడినుంచి వచ్చి మామూలుగా తన గదిలోకి వెళ్ళాడు. ఆ గదిలోనే పొంచివున్న సాధన అసిస్టెంటు అతని వెనుకగా వచ్చి మెడమీద రివాల్వర్ మొన ఆనించి బెదిరించాడు. అలా బెదిరిస్తూనే ముక్కుకి మత్తుమందు వాసన చూపెట్టాడు. ఆ వాసన పీలుస్తూనే అతను పడిపోయాడు. అతను వెంటనే స్పృహ తప్పాడు.
    అర్ధరాత్రి
    సాధన, ఆమె అసిస్టెంటు కలసి చాకచక్యంగా అతనిని ఊరు దాటించారు. అతని గదిలో వున్న సామాను అంతటినీ కూడా అతనివెంటనే తరలించారు. అతనిని బాస్ కి అప్పజెప్పి తిరిగిరావటం జరిగింది.
    బాస్ 'ఆర్ ష' ఎన్నివిధాలో అతనిమీద అన్ని ప్రయోగాలు చేసి నయాన, భయానా దండన అన్నీ పూర్తిచేసి తెలుసుకున్నదేమంటే అతను వేపకాయంత వెర్రి వున్న అతి తెలివిగలవాడు. అతను ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి నా అన్నవారు లేరు. పెళ్ళి కాలేదు. కొన్నాళ్ళు జాబు చెయ్యటం, గుడులూ గోపురాలు దర్శించటం గుడులూ గోపురాల మీద ఎప్పటికైనా సుదీర్ఘమైన గ్రంథం రాయాలని అతని ప్రయత్నం.
    ఆ ప్రయత్నంలోనే దేవాలయాలమీద అతను సొంతంగా, తను కనిపెట్టిన లోపాలూ, అద్భుతాలూ గుర్తులతో సహా కోడ్ భాషలో తన డైరీలో రాసుకొనేవాడు. అంతకిమించి అతను దొంగా కాదూ, పాత నేరాలతో సంబంధం వున్నవాడూ కాదు. ఆ విషయం ఆర్ ష తెలుసుకొని అతనివల్ల ప్రమాదం లేదు, కొన్నాళ్ళు నా దగ్గర బందీగా ఉంచుతాను యూ గో ఎహెడ్' అని సాధనకి వార్త పంపించాడు ఆర్ ష.
    సాధన ఇప్పుడు ఇంకోపనిమీద వచ్చింది ఇక్కడికి. దీర్ఘాలోచన చేస్తున్న సాధన కళ్ళు తెరిచింది.
    చిరునవ్వుతో "తపస్సు ముగిసిందా" అన్నాడు ఆర్ ష.
    "అతన్ని గురించి మీరు రిపోర్టు పంపించారు. దానిలో ఎట్టి సందేహం లేదు కదా!" సాధన అడిగిన మొదటి ప్రశ్న అది.
    "అణుమాత్రం కూడా లేదు. సైంటిస్టులకి వేపకాయంత వెర్రి ఉంటుందంటారు. ఇతను సైంటిస్టు కాకపోయినా వేపకాయంత వెర్రి వుంది అన్న విషయంలో ఆ జాతివాడే దిక్కుమాలిన పరిశోధనకి దిగి అటు పోలీసుల దృష్టిలో పడ్డాడు. మన చేతికి చిక్కి బందీ అయ్యాడు. అతని గురించి మనం పూర్తిగా మరచిపోవచ్చు. నీ పరిశోధన ముగిసేవరకూ అతను నాదగ్గర సురక్షితంగా వుంటాడు" అన్నాడు ఆర్ ష.   
    'ఇన్ స్పెక్టరు వల్ల నాకేమీ ఇబ్బంది లేదు. అయినా ఏ సమయం ఎలాంటిదో? నేను జాగ్రత్త వహించటం మంచిది. ఇన్ స్పెక్టరుకి కూడా చిన్న షాక్ ట్రీట్ మెంటు ఇవ్వాలి. నాకు సరదాగా ఉంది" అంది సాధన.
    "పిచ్చివాడికి ట్రీట్ మెంట్ ఇస్తూ కూర్చుంటే నీ టైమ్ వేస్ట్ అవుతుందేమో!"
    'నా టైమ్ వేస్టుకాని పథకం ఒకటి వేశాను.
    "ఏమిటది?"
    "మీరు మనవాళ్ళిద్దరినీ పంపించండి, వాళ్ళిద్దరూ చాలా పెద్ద దొంగలుగా నటిస్తూ కోయవాళ్ళ వేషంలో వున్న వీళ్ళ కంటపడతారు. అక్కడినుంచీ ఇన్ స్పెక్టరు అహోబిలం మిగతా విషయాలన్నీ వదిలేసి వాళ్ళను పట్టుకుందామని వీళ్ళవెంట పడతారు. వాళ్ళు ఇన్ స్పెక్టరుకి అందినట్లే అంది పారిపోతుంటారు. మనవాళ్ళూ, వాళ్ళూ కలసి పిల్లీ ఎలుకలాగా చెలగాటం ఆడుతూ వుంటారు. నా దోవకి ఎవరూ అడ్డురారు.'
    "ఇది బాగుంది. పాపం వాళ్ళు కోయ వేషాలు కట్టినందుకన్నా ఆమాత్రం ఆడించకపోతే ఎలా?"
    ఆర్ ష నవ్వుతూ అనటంతో సాధన కూడా నవ్వింది.
    'సరే ఇప్పుడు నీకు కావాల్సింది నలుగురు. ఇద్దరు మనుషులు నీకోసం మరిద్దరు కోయవాళ్ళ కోసం అంతేగా.'
    "ఎస్"
    'నీవు చెప్పిన కొన్ని వస్తువులు.'
    "నీవు ఈరోజే బయలుదేరుతున్నావు కదా?"
    "ఎస్."
    "రేపు మధ్యాహ్నానికి అందచేస్తాను మనుషులని వస్తువులని."
    "చాలు ఏదైనా అవసరమైతే మళ్ళీ కబురుచేస్తాను బాస్!"
    "ఓ కె"
    "పాపం ఆ పిచ్చివాళ్ళు ఇద్దరూ ఇదిలోంచి మాయమైన అతనికోసం తలలు బద్దలుకొట్టుకుని ఉంటారు."
    "అంతే కదా మరి, వాడిని పడదామనే మళ్ళీ ఈ మారువేషాలు నానా పాట్లు ఇన్ స్పెక్టరుకి మంచిపేరు లేదు. అందరూ తూర్పు దిక్కుకి నడుద్దామణి చూస్తే అతనొక్కడూ పడమటి దిక్కుకి ప్రయాణమై వెళతాననేరకం. దారిలో చీపురుకట్ట కనపడితే ఇల్లు చిమ్ముకోటానికైనా పనికొస్తుందని పట్టుకెళ్ళేరకం. అతని పెట్టెలో అంత ఖరీదైన కెమేరాని కూడా చూసి వదిలేశాడంటే పాపం చాలా పెద్దదేదో ఆశించి వుంటాడు" నవ్వుతూ అంది సాధన.

 Previous Page Next Page