నిరాహారదీక్ష! (లేక బగారా బైగన్)
మానిర్భయ్ నగర్ కాలనీ ఎప్పుడూ ఏదొక సందడిగా ఉండటం మామూలేకదా!
అందులోనూ అలా వారానికొకసారయినా సందడిగా ఉండేట్లు చేయడం మా కాలనీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ శాయీరాంకి మరీ సరదా!
వీధి కుక్కల్ని పట్టి బండిలోపడేస్తూ వేటాడే మున్సిపల్ బండిలాంటి ఆర్టీసీ బస్సులోపడి అప్పుడే ఆఫీసు నుంచి ఇంటికి చేరుకున్నాను.
స్నానం వగైరాలు ముగించి ఇలా 'టీ' తాగి అలా న్యూస్ పేపరు పక్కింటాయనను అడిగి తెప్పించుకున్నానో లేదా శాయీరామ్ హడావిడిగా వచ్చేశాడు.
"త్వరగా పదగురూ! మీటింగుంది!" అన్నాడు గడపలో నిలబడి.
"మళ్ళీ ఏం మీటింగు?" చిరాకుగా అడిగాను.
"మన కాలనీ రోడ్డు అధ్వాన్నపు స్థితిని గురించి మనం తీసుకోవాల్సిన చర్యల కోసం మీటింగు ఏర్పాటు చేశాం కదా! త్వరగా పద! అందరూ వచ్చేశారు." ఇంక తప్పదని లేచి బయల్దేరాను.
అప్పటికే జనార్ధన్ మైక్ ముందు నిలబడి మాట్లాడుతున్నాడు.
"కాలనీ వాసులందరికీ నమస్కారం! సోదరులారా! మన కాలనీ రోడ్డు వేసి ఎంత కాలమయిందో ఎవరికీ తెలీదు. పాతనైజాం స్టేట్ వాళ్ళు వేసిన నాటిరోడ్లని కొంతమందీ, కాదు శ్రీకృష్ణదేవరాయలు వేయించిన రోడ్లని మరి కొంతమందీ, కాదు, అశోక చక్రవర్తి బాటకిరువైపులా చెట్లు నాటించే పధకం కింద ముందీబాట వేయించాడని ఇంకొంతమందీ ఇలా అనేకమంది అనేకరకాల అభిప్రాయాలు వెలిబుచ్చారు. కానీ ఇటీవల మనకాలనీ డిటెక్టివ్ సాహిత్యం రచయిత్రి రాజేశ్వరి గారు పరిశోధించి ఈ రోడ్డుని హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ వాళ్ళే వేశారనీ, అయితే అందుకు వాళ్ళు కాంట్రాక్టర్లకిచ్చి బిల్లులే ఆధారమనీ తేల్చారు. ఎందుకంటే ప్రస్తుతం ఆ రోడ్డు ఉండేచోట దిగుడుబావుల్లాంటి గుంటలు తప్పితే ఇంకేమీ కనిపించటం లేదు. ఈ దారుణమయిన రోడ్డుకి కనీసం రిపేర్లయినా చేయించమని మనం పెట్టుకున్న ఆర్జీల గురించి పట్టించుకునేవారే లేరు. అంచేత మనం ఏంచేయాలో నిర్ణయించడానిగ్గాను ఇక్కడ సమావేశమయ్యాం!
ఈ విషయంలో అందరూ తమ తమ అమూల్యమయిన సూచనలు అందించవలసిందిగా కోరుతున్నాము-జైహింద్!" అంటూ ఉపన్యాసం ఆపాడతను. ఎవరూ తప్పట్లు కొట్టలేదు.
"ఆ మధ్య రామంతపూర్ కాలనీవాళ్ళు ఇలాగే వాళ్ళ రోడ్డు రిపేరుకోసం నిరాహారదీక్షచేసి, సాధించారుకదా! మనం కూడా అదే చేద్దాం!" అన్నాడు గోపాల్రావ్.
"అవును! ఈ రోజుల్లో అదొక్కటే ఎఫెక్టివ్ మెథడ్" అన్నాడు రెడ్డి.
"అవునవును! అదే బెస్ట్" అంటూ అరిచారు ఇంకొంతమంది.
అప్పటికప్పుడే గోపాల్రావ్ సూచన ఏకగ్రీవంగా ఆమోదించబడింది.
"ఇప్పుడు మనలో నిరాహారదీక్ష ఎవరు చేయాలోకూడా మన నిర్ణయం తీసుకుంటే రేపే నిరాహారదీక్ష ప్రారంభించవచ్చు!" అన్నాడు శాయీరామ్ మైక్ ముందుకొచ్చి.
అందరూ మొఖమొఖాలు చూసుకున్నారు. పరిస్థితి గమనించి జనార్ధన్ మైక్ దగ్గర కొచ్చాడు. "మనలో ఎవరయినా వాలంటీర్లు నిరాహారదీక్షకోసం తమ పేర్లు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం!" అన్నాడు చిరునవ్వుతో.
అందరూ ఎవరయినా పేర్లు ఇస్తున్నారేమోనని వెనక్కు తిరిగి చూశారు కాని ఒక్కడూ నోరు మెదపలేదు.
"కేవలం మగాళ్ళే నిరాహారదీక్ష చేయాలనేం లేదు, స్త్రీలు కూడా పాల్గొంటే బావుంటుంది!" అన్నాడు రెడ్డి. అయినా ఎవరూ ముందుకి రాలేదు.
"ఎవరో ఎందుకు? మన కాలనీ కమిటీ కార్యనిర్వాహకవర్గం వారందరూ చేస్తే సరిపోతుంది!" అనరిచాడు రంగారావ్ వెనకనుంచి.
నా గుండెలు ఝల్లుమన్నాయ్, గోపాల్రావ్, జనార్ధన్, శాయీరామ్ ల మొఖాలు కూడా పాలిపోయినయ్ గానీ అది కనిపించకుండా నానా తంటాలూ పడుతున్నారు.
"అవ్! జర కాలనీల పేరుగిట్ట ఉన్నోళ్ళు చేస్తేనే ఖదరుంటది!" అన్నాడు యాదగిరి.
అందరిలోకీ ముందు జనార్దనే కోలుకున్నాడు.
"సోదరులారా! మేము నిరాహారదీక్ష చేయటానికి మాకేం అభ్యంతరం లేదు! కానీ ఇక్కడో టెక్నికల్ డిఫికల్టీ ఉంది. అదేంటంటే వేరేవాళ్ళు ఎవరయినా నిరాహారదీక్ష ప్రారంభించినట్లయితే- మేము అధికారుల దగ్గరకూ, ఇతర రాజకీయ నాయకులు దగ్గరకూ, వెళ్ళి వత్తిడి తెచ్చి త్వరగా రోడ్ రిపేరు చేయించేందుకు వీలుంటుంది. కనుక మీలోనే ఎవరొకరు-" మళ్ళీ నిశ్శబ్దం.
రంగారెడ్డి మైకు ముందు కొచ్చాడు.
"ఇంతకాలం ఎన్నో ధైర్యసాహసాలకు పేరుపొందిన మన కాలనీలో నిరాహారదీక్ష జరిపేందుకు ఒక్క వ్యక్తి కూడా ముందుకు రావటం లేదంటే మన కాలనీయే అవమానం! నిజానికి నిరాహారదీక్ష నేనంటే నేనని జనం ముందుకురావాలి!"
హఠాత్తుగా జనంలో తోపులాట కనిపించింది.
రెడ్డి ఆనందపడ్డాడు "ఆ! అదేమనక్కావలసింది. అదీస్పిరిట్ అంటే"
"అలలు నేనంటే నేనని కాదు డకలాయిస్తున్నది. నువ్వంటేకాదు నువ్వని నూకుతున్రు" అన్నాడు యాదగిరి.
అరగంట గడిచిపోయింది. ఒక్కరుకూడా వేదికవేపు రావడంలేదు.
గోపాల్రావ్ మైకు ముందు కొచ్చాడు.
"సోదరులారా! మన కాలనీ యాక్టివ్ మెంబరయిన శ్యామల్రావ్ గారిని నిరాహారదీక్ష చేయవలసిందిగా మీ అందరి తరపున కోరుతున్నాను. ఎందుకంటే ఆయనకు రాజకీయాల్లో కూడా అనుభవం ఉంది గనుక!" అక్కడున్నవారి కరతాళధ్వనులు ఆకాశాన్నంటినయ్.
శ్యామల్రావ్ గాబరాగా నుంచున్న చోట నుంచే అరిచాడు.
"నాకు ఆనందమే కానీ - నేను ఇవాళ అర్జంటుగా ఖమ్మం వెళ్ళాలి"
"ఎందుకు?"
"అక్కడ మా తమ్ముడి పెళ్ళివుంది" అన్నాడతను.
"అదేమిటి? మీకెవరూ తమ్ముళ్ళు లేరని చెప్పారుగా."
"అది కేవలం ఈపాడు మతిమరుపువల్ల చెప్పి ఉంటాను! క్షమించండి! వస్తా! బస్సు టైమయింది" అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
"పోనీరెడ్డిగారినే చేయమనండి" ఎవ్వరో అరిచారు జనంలోనుంచి. రంగారెడ్డి అదిరిపడ్డాడు.