-రవితేజ కంపెనీలో అతడు ఇలా విజయపు మొదటి కప్పురుచి చూస్తూ వుండగా, అదే సమయానికి అక్కడ చెంచురామయ్య కంపెనీలో డైరెక్టర్లు బారుగా కూర్చుని వున్నారు.
రవితేజ ప్రవేశపెట్టిన స్కీము తాలూకు ప్రచారాన్ని చర్చించటానికి వారు సమావేశమయ్యారు. సాధారణంగా ప్రతీ కంపెనీ తాలూకు "ఇన్ ఫార్మెంట్స్" అవతల కంపెనీలో కొందరు ప్లాంట్ చేయబడతారు. అక్కడ విషయాలు ఇక్కడ చేరవేయటం వారిపని. అయితే ఇక్కడ మరొక విషయం కూడా గుర్తించాలి. అవతలివాళ్ళ విజయాన్ని ఇవతలి గ్రూపు అంత తొందరగా ఒప్పుకోరు. ఒక సినిమా విడుదల అవుతే మిగతా సినిమా కంపెనీలన్నీ ఎలా దాన్ని "ప్లాప్" అనేస్తాయో, అదే మనస్తత్వం మిగతా అన్ని రంగాలకీ వర్తిస్తుంది. అటువంటి పరిస్థితుల్లోనే, రవితేజ సాధించిన ఈ విజయాన్ని చెంచురామయ్య వెంటనే ఒప్పుకోలేకపోయాడు. రెండురోజుల్లో లక్షా యాభైవేలకి ఆర్డర్లేమిటి, మరొకసారి సరిగ్గా కనుక్కొని రమ్మని పంపాడు. రవితేజ పూర్తిగా పడిపోవటానికి ఇంకెంతో సమయంలేదని అతడి నమ్మకం.
ఇటువైపు రవితేజ ఎవరికీ ఆలోచించటానికి టైమ్ యివ్వలేదు. ఈ కెరటపు తాకిడినుంచి ఇంకా తేరుకోకముందే వాళ్ళని వెల్లువలో ముంచెయ్యాలన్నది అతడి ఆలోచన.
ఆంద్రదేశంలో సఫలమయిన ఈ ప్రయోగాన్ని దేశమంతా విస్తరించాలని అతడి కోర్కె అయితే అది ఎప్పుడో కాకుండా, అవతలివారికి ఊపిరి తిరిగే లోపులో జరగాలని అతడి వాంఛ. ముందు అనుకున్నట్టు దీనికోసం ఎనభై అయిదు లక్షలు కేటాయించటం జరిగింది. కేటాయించటమైతే జరిగింది కానీ, క్యాష్ ఇన్ ఫ్లో కావాలి. ఇంతకన్నా పెద్ద సమస్య మరొకటి వుంది. దేశం అన్ని వైపుల్నుంచీ ఒక్కసారిగా ఈ చీరలకోసం తాకిడి ఏర్పడితే దాదాపు కోటి చీరలను ఒకటి రెండు నెలలలోగా సప్లై చేయవలసి వుంటుంది. అన్ని వనరులు సమకూర్చుకోవాలంటే, యుద్ద ప్రాతిపదిక మీద పనులు చేయవలసి వుంటుంది. దీనికోసం ఎంత లేదన్నా మరొక కోటి రూపాయలు కేటాయించాలి.
రవితేజ వెనక్కి తగ్గదల్చుకోలేదు.
పాలియెస్టర్ విభాగాన్ని సంవత్సరంపాటు లీజుకి ఇవ్వాలనుకున్నాడు. దానికి 'రాయల్టీ'గా రెండు కోట్ల రూపాయల్ని ఇవ్వటానికి అవతలి కంపెనీ సిద్దంగా వుంది. ఒక చిన్న కంపెనీ అది. వీరికి ఏ విధంగానూ పోటీ కాదు.
రవితేజ అంచనా ప్రకారం ఈ జనతా చీరల తాకిడి ఇంత ఉధృతంగా మరో సంవత్సరంపాటు వుంటుంది. ఆ తరువాత ఆ వ్యాపారం కూడా మళ్ళీ మామూలు గాడిలో పడిపోతుంది. కాబట్టి సంవత్సరంపాటు పాలియెస్టర్ విభాగాన్ని ఇంకొకరికి లీజుకి ఇవ్వటంలో నష్టమేమీ లేదు.
ఈ జనతా చీరలవల్ల కొన్ని లక్షలమందికి పని దొరుకుతుంది. పైగా ప్రియంవద మాటలు అతడి మనసులో లోతుగా నాటుకుపోయాయి. ఎన్నోక్రింది తరగతి కుటుంబాలకి సహాయం చేసినట్టు అవుతుంది. మరింత అందమైన చీరలు చౌకధరకి!
ఎప్పుడూ లాభాలు..... వ్యాపారమూ ఇదేనా? కొన్ని లక్షల మందికి ఉపాధికల్పన-కొన్ని కోట్లమందికి ఆనందం-మనిషిగా పుట్టినందుకు ఆ మాత్రం బాధ్యత లేదా?
-దీనివల్ల కంపెనీకి కూడా నష్టం ఏమీలేదు. కేవలం ఒక లైనులో వ్యాపారం తగ్గించి, మరొక లైనులోకి వెళ్ళటమే!
అయితే రవితేజ టెక్స్ టైల్స్ డైరెక్టర్లు కొంతమంది అలా ఆలోచించలేదు. అన్ని విభాగాల్లోకి పాలియెస్టర్ లోనే ఎక్కువ లాభాలున్నాయి. ప్రజలు ఎంత ధరకైనా ఈ చీరలని కొంటారు. జనతా చీరల్లో, చీరకి అయిదు రూపాయలన్నా లాభం వుండదు. ఇంతమంది షాపులవాళ్ళని కాదని, ఇంత శ్రమపడి కోట్లకొద్దీ చీరలు తయారుచేసి, ఇంత పెట్టుబడి పెట్టి, జనతా చీరలు అమ్మటం దేనికి? కేవలం చీరకి అయిదు రూపాయలు లాభం కోసమా?
కొద్ది చీరలైనా ఖరీదైన చీరలు తయారుచేసుకుంటే చీరకి అయిదొందలు చొప్పున లాభం వుంటుంది. వంద జనతా చీరలు అమ్మటంకన్నా ఒక ఖరీదైన చీర అమ్మటం లాభదాయకం.
సాయంత్రానికి, ఒక డైరెక్టరు ఎక్స్ ట్రార్డనరీ మీటింగ్ కి నోటీసు యిచ్చాడు. యాభై సంవత్సరాల కంపెనీ చరిత్రలో అదే ఆ రకం మొట్టమొదటి మీటింగు.
రవితేజ మానసికంగా బాగా క్రుంగిపోయాడు. ఒక మంచి పనికి కూడా యిన్ని అడ్డంకులు, అదీ తనవారి నుంచి! డబ్బు సంపాదిస్తున్నంతకాలం ఎంతో ఆత్మీయంగా వున్నవారు- పరిస్థితి కాస్త ఎదురుతిరిగేసరికి ఎలా మారిపోతారో అతడికి స్పష్టమైంది.
పదిన్నరకి మీటింగు.
రాజీనామా ఉత్తరాన్ని జేబులో పెట్టుకుని అతడు ఇంటి నుంచి బయల్దేరాడు.
* * *
అరగంట తరువాత మీటింగు ప్రారంభమయింది.
నోటీసు ఇచ్చిన డైరెక్టరు తన అభ్యంతరాన్ని బోర్డుముందు వుంచాడు. రావితేజకి యింత డబ్బుని ఒక ప్రయోగం మీద ఖర్చుపెట్టె అధికారాలు లేవనీ, అతడు వాటిని దుర్వినియోగపరుస్తున్నాడనీ అతడి అభియోగం. ఇప్పుడు కంపెనీ చాలా లాభాల్లో నడుస్తూంది. అనవసరమైన రిస్కులు తీసుకోవటం అనవసరం. ముఖ్యంగా పోలియెస్టర్ విభాగం బంగారు బాతులాంటిది. దాన్ని బయటికి యివ్వటం శుద్ధ అవివేకం. ఒకసారి ఆ మార్కెట్టు కోల్పోతే తిరిగి సంపాదించటం చాలా కష్టం.
అతడు మాట్లాడుతున్నంతసేపూ బోర్డు సభ్యులందరూ శ్రద్దగా విన్నారు. అతడు చెపుతున్నదంతా చాలా కరెక్టుగా వుంది. ముఖ్యంగా, లాభాల విషయంలోనూ, అనవసరమైన జనతా చీరల తయారీ విషయంలోనూ అతడు డైరెక్టర్స్ ని తన మాటల ద్వారా బాగా కన్విన్స్ చేశాడని అర్ధమవుతూంది. ఒకవేళ తన సూచన్లని వినకుండా, కంపెనీ గానీ యధావిధిగా ఈ జనతా చీరల తయారీని కొనసాగించే పక్షంలో తనతో సహా మరికొంతమంది డైరెక్టర్లు కంపెనీ నుంచి తప్పుకోవటానికి సిద్దంగా వున్నారని అన్యాపదేశంగా హెచ్చరించాడు.
అతడికి ఆ కంపెనీలో పెద్దగా వాటాలేదు. కానీ తన మాటల్తో మిగతావారిని బాగా ప్రభావితం చేశాడని అర్ధమవుతూ వుంది. తను కంపెనీ నుంచి వెళ్ళిపోతానని అనటం కూడా కేవలం బెదిరింపే! వెళ్ళిపోవటం వల్ల అతఃదికే నష్టంగానీ, కంపెనీకేమీ లేదు. కేవలం అవతలివారి సైకాలజీ మీద ఆడుకుంటున్నాడంతే.
రవితేజ అతడివైపు సూటిగా చూశాడు.
ఇలాటివాళ్ళు ప్రతీ గ్రూపులోనూ ఒకరో ఇద్దరో వుంటారు. సాధారణంగా ట్రేడ్ యూనియన్స్ లో రెండు వర్గాలుంటే అందులో మైనారిటీ గ్రూప్ లో, ఎక్కువ కనపడుతూ వుంటారు. ప్రతిపక్షంలోనూ, అసెంబలీలోనూ కూడా వుంటారు. వీరేమి ప్రొడక్టివ్ పనిచెయ్యరు. కేవలం తమ వాదనల ద్వారా అవతలివారిని ఆకర్షిస్తారు. సాధారణంగా వీరివి వితండవాదాల్లాగా వుంటాయి. అయినా చాలా బలంగా అవతలివారిని తమవైపు తిప్పుకుంటారు. ప్రస్తుతం బోర్డు డైరెక్టర్లందరూ ఆ ప్రభావంలో వున్నారు. కంపెనీ సజావుగా నడిచిపోతున్నప్పుడు నిజంగా ఎందుకు రిస్కు తీసుకోవటం అన్న ఆలోచన వారిలోనూ అంకురించింది.
మీటింగ్ లంచ్ కోసం వాయిదా వేయబడింది.
లంచ్ లో శర్మ రవి దూరంగా నిలబడి మాట్లాడుకుంటున్నారు.
"నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ నా నిర్ణయాన్నుంచి దిగిరాను. ఈ పథకాన్ని మిగతా డైరెక్టర్లు ఒప్పుకోకపోతే నేను ఈ పదవిలో వుండనంతే-" రవితేజ అనధికారంగా శర్మకి తన మనసులో మాట చెప్పాడు. అతడు రాజీనామా ఉత్తరం.. జేబులో పెట్టుకునే వచ్చాడు.
"నా భార్యకి నాకు ప్రొద్దున్నంతా ఇదే చర్చ ఇంట్లో జరిగింది" అన్నాడు శర్మ. అకస్మాత్తుగా వచ్చిన ఆమె ప్రసక్తితో రవితేజ అప్రతిభుడయ్యాడు. శర్మ చెప్పుకుపోతున్నాడు. "....ఆవిడ నిన్నే సపోర్ట్ చేసింది. ఇక నా విషయమంటావా- అందరు డైరెక్టర్లూ ఏం చెపితే నా ఓటూ అటే".
రవితేజ అతడి మాటలు వినటంలేదు. 'ఆమె' గుర్తుకు రాగానే స్తబ్దమై వున్న నీటినుంచి తరంగాల్లా జ్ఞాపకాలు లేచినయ్.
"ఏమిటి నేను చెప్పేది వింటున్నావా?"
అతడు తేరుకుని "చెప్పండి" అన్నాడు.
"ఏమీలేదు నేనెటూ నిర్ణయించలేకపోతున్నాను. అందరూ ఏం చేస్తే నేనూ అదే-"
అంతలో ఫ్యూన్ వచ్చి రవికి ఫోన్ వచ్చిందని చెప్పాడు. అతడు వెళ్ళి ఫోన్ అందుకున్నాడు. మిగతా డైరెక్టర్లందరూ, తిరిగి సమావేశం అవడం కోసం బోర్డు రూమ్ లోకి వెళ్తున్నారు.
మాధవి దగ్గిర్నుంచి ఫోను "ఏమిటి ఏవో చౌకరకం చీరలని కంపెనీని ముంచేస్తున్నారట" అంది.
"అప్పుడే నీ కెవరు చెప్పారు?"
"పూర్ణచంద్రరావుగారి భార్య. "పూర్ణచంద్రరావంటే, ప్రొద్దున్న మీటింగ్ లో ఈ కొత్త స్కీమ్ కి వ్యతిరేకంగా మాట్లాడినాయన. అప్పుడే ఇది ఇంటి వరకూ పాకిందన్న మాట.
"ఏం మాట్లాడరేం?"
"ఏం మాట్లాడను?"
"ఎవరికీ లేనిది మీకెందుకు? మామూలుగా వుండరాదూ."
అందరూ మామూలుగా వుంటే ప్రపంచం ఇలా వుండదు- మనసులో అనుకున్నాడు.
"ఇప్పుడే చెపుతున్నాను. వాళ్ళతో గొడవలు పెట్టుకోకండి. ఉన్నదాంతో సరిపెట్టుకోవచ్చు. కానీ కొత్త కొత్త ఐడియాలు, పథకాలు మనకొద్దు."