Previous Page Next Page 
నల్లంచు-తెల్లచీర పేజి 36

   

      రవితేజ కూడా అదే స్వరంతో, "నేనుకూడా ఇప్పుడే చెపుతున్నాను. ఇంకెప్పుడూ ఇలా ఆఫీసుకి ఫోన్ చెయ్యొద్దు. అంతేకాదు- ఆ పూర్ణచంద్రరావు భార్యకి కూడా చెప్పు-భర్తల వ్యవహారాల్లో భార్యలు జోక్యం చేసుకుని ఉచిత సలహాలివ్వటం అంత మంచిది కాదని-" అంటూ మాధవి ఇంకా ఏదో అట్నుంచి అనబోతూ వుండగా ఫోన్ పెట్టేశాడు.
   
    ఫోన్ పెట్టేస్తూ వుండగా కనిపించింది ఆఫీసు ఫైళ్ళ నడుమ- తన కుర్చీ ఎదురుగా బల్లమీద గులాబీరంగు కవరు. అతడికి అది గుర్తే. ఆ చేతివ్రాత కూడా తెలుసు. ఇప్పటికి తనని వెంటాడి వేటారుతూన్న ఉత్తరం తాలూకు చేతివ్రాత. తనని దాదాపు పిచ్చివాడిని చేసిన చేతివ్రాత.
   
    గుండె వేగంగా కొట్టుకుంటూంటే చప్పున ఆ కవరు అందుకున్నాడు. అది అక్కడికి ఎవరు తెచ్చి పెట్టారు అని కూడా అడిగే ప్రయత్నం చేయలేదు. కవరు చింపుతూ వుంటే శర్మ మాటలు గుర్తొచ్చాయి. 'నా భార్యకీ నాకూ ప్రొద్దున్న ఇంట్లో ఇదే చర్చ జరిగింది' అన్న వాక్యాలు. ఈ లోపులో అతడు కవరులో కాగితం బయటికి తీశాడు. అయిదారు వాక్యాలున్నాయి అందులో- గుండ్రటి అక్షరాలు.
   
    ఆమె మళ్ళీ ఎక్కడికైనా రమ్మంటుందేమో- మొదట కొద్దిగా బింకం చూపించాలి.....వగైరా ఆలోచన్లతో చదవటం మొదలు పెట్టిన అతడు అందులో వున్నది చూసి ఆశ్చర్యపోయాడు. "రిస్క్" అని హెడ్దింగ్ వుంది.
   
                                'రిస్క్'
   
    నవ్వటంలో మూర్ఖత్వాన్ని బయటపెట్టే రిస్కు వుంది.
      ఏడవటంలో బలహీనత బయటపడే రిస్కు వుంది.
     మరొకర్ని కలుసుకోవటంలో ఇన్ వాల్వ్ మెంట్ 'రిస్క్'.
సరదాగా కబుర్లు చెప్పటంలో మన మనసు బయట పెట్టే రిస్కు
ప్రేమించటంలో, తిరిగి ప్రేమింపబడకుండా వుండే రిస్కుంది.
         బ్రతకటంలో చావు రిస్కు, ఆశలో నిరాశ రిస్కు.
                   ప్రయత్నంలోనే ఓటమి రిస్కు
అలా అని ఏమాత్రం రిస్కు చేయని, తీసుకోని, తీసుకోలేని మగవాడు ఏమీ
                            చేయడు,
                            చేయలేడు.
                 అతడికి బాధలు వుండకపోవచ్చు.
       కానీ గెలుపుద్వారా లభించే ఆనందం కూడా వుండదు.

   
    దాదాపు మూడు నాలుగుసార్లు ఆ వాక్యాన్ని చదువుకున్నాడు రవి. అతడి పెదాలమీద చిరునవ్వు వెలిసింది. దాన్ని మడిచి జేబులో పెట్టుకుని, అలాగే బోర్డు రూమ్ లోకి నడిచాడు. లంచ్ తరవాయి భాగం కార్యక్రమంలో పాల్గొనటానికి జేబులో ఆ కాగితం పెట్టుకుంటూ వుండగా, అంతకు ముందున్న రాజీనామా ఉత్తరం చేతికి తగిలింది. దాన్ని బయటికి తీసి, చివర్లో మరో వాక్యం వ్రాశాడు. "....నేను మరో కంపెనీలో చేరటానికి దయచేసి అనుమతి ఇవ్వగలరు! రూల్స్ దృష్ట్యా నాకు ఈ అనుమతి అవసరం లేకపోయినా, ఇంతకాలం మీతో కలిసి పనిచేసినందుకు, నా భవిష్యత్ కార్యక్రమాన్ని మీకు తెలియపర్చటం నా విధిగా భావిస్తున్నాను."
   
    అతఃడు బోర్డు రూమ్ లోకి ప్రవేశించబోతూ గుమ్మం దగ్గిర ఆగాడు. అప్పుడే వరండాలోంచి వస్తూ మరో డైరెక్టర్ కనపడ్డాడు. సేల్స్ మానేజర్ తన గదిలోకి వచ్చి లక్షా యాభైవేలకి చీరల ఆర్డర్లు వచ్చాయని చెప్పినప్పుడు మీద కాఫీ ఒలకబోసుకున్న డైరెక్టర్ ఆయన.
   
    "ఏమిటి ఇక్కడ నిలబడ్డారు?" అని రవితేజని అడిగాడు.
   
    ఆయన్ని దూరంనుంచి చూసే రవితేజ జేబులోంచి కాగితం తీసి చదువుతున్నట్టు నిలబడ్డారు. ఆయన ప్రశ్నకి అప్పుడే ఆయన్ని చూసినట్టు తలెత్తి "ఏమీలేదు. టైపిస్టు కిచ్చేముందు ఏమైనా తప్పులీ ఉత్తరంలో వున్నాయేమో అని చూస్తున్నాను" అన్నాడు.
   
    "ఉత్తరం ఏమిటి"?
   
    "చదవండి....." అంటూ రాజీనామా పత్రాన్ని ఆయన కిచ్చాడు. చదువుతూ ఆయన మొహంలో మారుతూన్న భావాల్ని గమనించాడు. చదవటం పూర్తిచేసి ఆయన తలెత్తగానే "ఇలా వ్రాయటంలో తప్పులేదుగా" అన్నాడు ఆయనకీ పెద్దరికాన్ని ఆపాదిస్తూ "ఇదేమిటి?" అన్నాడు ఆయన అయోమయంగా, "....దీనికి మేము ససేమిరా వప్పుకోము."
   
    "నా మాట కంపెనీ వప్పుకోని పక్షంలో నేనిక డైరెక్టరుగా ఈ కంపెనీ వ్యవహారాలు నడపటం అనవసరం. ఈ రోజు అవసరమొస్తే ఇచ్చేద్దామని దీన్ని తయారుచేసి వుంచాను. అఫ్ కోర్స్-దీన్ని అందజేసే అవసరం వస్తుందనుకోను. కానీ ఏమో-ఎవరు చెప్పగలరు? నేను చెప్పిన పథకం డైరెక్టర్లకి నచ్చకపోతే, తొలగిపోవటమే మంచిది కదా! మీరు వెళ్ళండి. దీన్ని టైప్ కిచ్చి వస్తాను" అని మరి ఆయన ఆలోచించుకోవటానికి సమయం ఇవ్వకుండా దాన్ని తీసుకుని, టైపింగ్ సెక్షన్ వరకూ వెళ్ళాడు.
   
    అయితే దాన్ని అతడు అక్కడ ఎవరికీ ఇవ్వలేదు. కొంచెం సేపు అక్కడే నిలబడ్డాడు.
   
    బోర్డ్ రూమ్ లోకి వెళ్ళిన డైరెక్టరు ఈ విషయాన్ని లోపల అందరికీ చెపుతాడని అతడికి తెలుసు. దానిమీద చర్చ జరుగుతుందని కూడా అతడికి తెలుసు. అతడికి కావలసింది అదే!
   
    అందరూ తెలుసుకొనేలా చేశాడు, చాలు. బెదిరించటం వల్ల మొత్తం బెడిసి కొట్టవచ్చు.
   
    తన ఉపన్యాసానికి రాజీనామా క్లైమాక్స్ కాదు. కేవలం పునాది మాత్రమే! ఆ విధంగా డైరెక్టర్స్ కి ముందు మానసికంగా ప్రిపేర్ చేసి, ఆ తరువాత తను చెప్పదల్చుకున్నది చెపుదామనుకున్నాడు అతడు. దానికోసమే అతడు ఈ 'ట్రిక్' ప్లే చేశాడు.

    అది కరెక్టుగా జరిగింది!
   
    అతడు ఆ గదిలో ప్రవేశించేసరికి అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు- అన్న విషయం, అతడు లోపలికి వెళ్ళగానే ఒక్కసారిగా ఆగిపోయిన సంభాషణ వల్ల తెలిసింది. అతడు ఏమీ ఎరగనట్టు వెళ్ళగానే కుర్చీలో కూర్చున్నాడు.
   
    మీటింగ్ తిరిగి ప్రారంభమయింది.
   
    అతడు తన వాదనని చెప్పటం మొదలుపెట్టాడు. ముందు చెప్పిందే కానీ ఈసారి అందరిముందు మందస్వరంతో, నాటకీయంగా, ఒక ఉత్తేజకరమైన ఫీలింగ్ తో దాదాపు పావుగంట మాట్లాడాడు.
   
    "....మన కంపెనీ ఇప్పుడు బాగానే నడుస్తుంది. కానీ అద్భుతంగా నడవటం లేదు. బాగా నడవడమే కాదు కావల్సింది. కంపెనీకి- ప్రత్యర్ధుల్ని దెబ్బతీయటం కూడా....! ఈ కొత్త స్కీమ్ జనంలోకి చొచ్చుకుపోతుందని భావిస్తున్నాను. దానికి తార్కాణం అప్పుడే మనకి కనపడింది కూడా. ఒక వేళ మనం ఈ స్కీమ్ ప్రారంభించకపోతే మన ప్రత్యర్ధులు దీన్ని వెంటనే చేపడతారని నేను భావిస్తున్నాను. నా మిత్రుడు అన్నట్టు దీనివల్ల వచ్చే సంవత్సరం మన లాభాలు తగ్గవచ్చు. కానీ కంపెనీ అంటే కేవలం లాభాలు ఆర్జించటమే కాదు. మన పెట్టుబడి నాలుగు రెట్లు విస్తరిస్తుందని నా వుద్దేశ్యం. ఈ స్కీమ్ 'క్లిక్' అయిన పక్షంలో రెండేళ్ళల్లో దరిదాపుల్లోకి ఎవరూ రాలేనంతగా మన కంపెనీ ఎదిగిపోతుంది. దీనికోసం మనం రిస్క్ తీసుకోవడం చాలా అవసరం. "What would life be like-if you never took a risk." అని ఆగి "You would never go out of your house, find Job-ask for a raise-" అని నెమ్మదిగా పూర్తిచేశాడు."...... fall in love".
   
    రూమ్ లో సన్నగా నవ్వులు, తరువాత ఈ అంశం ఓటింగ్ కి పెట్టబడింది. రవితేజ టెన్షన్ తో చూస్తున్నాడు. చైర్మన్ శర్మ కాగితం కలం తీసుకున్నాడు.
   
                            19
   
    చెంచురామయ్య అండ్ కో తాలూకు నలుగురు సభ్యులూ తమ బోర్డ్ రూమ్ లో కూర్చుని వున్నారు. చాలసేపట్నుంచీ వారి మధ్య సంభాషణ లేదు. మాట్లాడుకోవటానికి కూడా ఏమీలేదు. తమ ప్రత్యర్ధి తాలూకు కంపెనీ మీటింగు అదే సమయానికి నాలుగు ఫర్లాంగుల దూరంలో ప్రస్తుతం జరుగుతూ వుందని వారికి తెలుసు. ఆ కంపెనీ ఏ నిర్ణయం తీసుకుంటుందా అని ఎదురు చూస్తున్నారు. టెక్స్ టైల్స్ మార్కెట్ లో ఒక ఉప్పెనలా వచ్చి పడబోయే  ఆ నిర్ణయం తాలూకు ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తున్నారు.
   
    ఈ దెబ్బతో రవితేజ అండ్ కో అటో ఇటో అని వారికి తెలుసు. 'అటు' అయితే ఫర్వాలేదు. ఇటు అయితేనే కష్టం. కష్టమేమిటి అంటే-మిగతా కంపెనీలన్నీ తుఫానులో తెప్పలాగా వూగిపోవల్సిందే. ఇదే పద్దతిని తరువాత ప్రవేశపెట్టినా, మొదటిసారి సిస్టమ్ ని పరిచయం చేసినవారికి వుండే లాభం, రెండోసారి చేసిన వారికి వుండదు. మారుతీకారు ఆలోచన తమ కొచ్చింది. తరువాత చాలామంది చాలా బహుమతులు పెట్టారు. కానీ తమ స్కీమ్ ఫలించినంతగా వారిని ప్రజలు గుర్తించలేదు.
   
    తమ తాలూకు మనిషిని ఒకడిని రవితేజ కంపెనీలో ముసలం సృష్టించటానికి డైరెక్టరు రూపంలో ప్రతిష్టాపించాడు చెంచురామయ్య.
   
    పైకి అమాయకుడిగా, ఏమీ తెలియని వాడిగా కనపడతాడు కానీ, చెంచురామయ్య గొప్ప స్కీమింగ్ వున్నవాడు. పంచె. ఖద్దరు చొక్కా, పైకి దువ్విన జుట్టు, రిమ్ లెస్ కళ్ళజోడు, ఆకు జోళ్ళు... అతడిని మామూలుగా చూసిన వాళ్ళెవరూ కోట్లతో వ్యాపారం చేస్తున్నవాడని అనుకోరు. చందూలాల్ పట్వారీ, బాబూలాల్ మిశ్రా లాటి వాళ్ళకి అతడు ఏ విధంగానూ తక్కువకాడు. ఆ కళ్ళవెనుక ఏముందో ఎవరికీ తెలీదు. పాతికేళ్ళ అతడు ఆ ప్రపంచాన్ని ఏలాడు. రవితేజ కాంపిటీషన్ రాకపోతే మరో పాతికేళ్ళు ఏలేవాడు. ముందు చెప్పినట్టుగా, అతడు గొప్ప స్కీమింగు వున్నవాడు. ఎత్తులూ, పైఎత్తులు, కాపిటల్ మార్కెట్టు, పంపిణీ వ్యవస్థ మొదలైనవన్నీ అతడికి వెన్నతో పెట్టిన విద్యలు. కేవలం డిజైనింగ్ ఫాషన్ లలో ఆమాత్రం అతడు కాస్త వెనుక బడ్డాడు. రవితేజ సరీగ్గా అక్కడే అతడిని దెబ్బకొట్టాడు. అతడికి పుట్టుకతోనే వచ్చిన కళ అది. అతడు ఎమ్.డి. అవగానే నాల్గయిదు సంవత్సరాల్లో మిగతా అన్ని విభాగాల్లో ప్రావీణ్యం సంపాదించాడు. చెంచురామయ్య మాత్రం ఆడవారి మారే ఫాషన్ల గురించీ, ఇష్టాల గురించీ, డిజైన్ల గురించీ ఎంత కష్టపడినా తెలుసుకోలేకపోయాడు. "రవితేజకున్న ఆర్ట్ లో సగం వున్న వాడెవరైనా నా కంపెనీ డిజైన్ల విభాగంలో వుండి వుంటే, నా కంపెనీని ఎవరికీ అందనంత ఎత్తులో నిలబెట్టి వుండేవాడిని" అని అతడు చాలాసార్లు అన్నాడు.

 Previous Page Next Page