Previous Page Next Page 
నల్లంచు-తెల్లచీర పేజి 34

  

       జీవితంలో పోలిక తెలియనంతవరకు ఫర్వాలేదు. ఒకసారి పోలిక తెలిసిన తరువాత లభ్యమైనదానికన్నా అలభ్యమైనదే బావుంటుంది. అందీ అందకపోవటంలో వున్న అందమే ఆకర్షణ అయి, బలమైన తపనగా మారుతుంది.
   
    ప్రపంచం అంతా వేలెత్తి చూపుతున్నప్పుడు, చివరికి భార్యకూడా అతడిని వెళ్ళగొట్టినప్పుడు, అతడొక్కసారిగా ఈ శృంఖలాలు తెగ్గొట్టుకున్నప్పుడు, ఆ ట్రాన్స్ లో ఈ కొత్త అనుభవం ప్రాప్తమైంది. రోజూ చూసే మాధవి-పుట్టినప్పటినుంచీ ఎత్తుకు తిరిగిన మాధవి- తనముందే గౌనుతో ముక్కు తుడుచుకున్న మాధవి- చివరికి భార్య అయి, భార్య అయిన రోజునుంచీ దూరమయి, ఇవ్వలేని సుఖాన్ని ఆమె ఒక్క ముద్దుతో యిచ్చింది. అంత పెద్ద టెక్స్ టైల్స్ ఎగ్జిక్యూటివ్ కీ, ముద్దులో అంత అందముందని అప్పుడే మొట్టమొదటిసారి తెలిసింది. దుఃఖం క్షణాల్లో ఆవేశంగా మారి అతడిని నిలువునా ముంచెత్తింది. అతడు భుజంమీద చెయ్యివేసి ముందు ఆమెని ఓదార్చాడు. అతడి ఛాతీమీద ఆమె తల ఆన్చి వెక్కి వెక్కి ఏడ్చింది. అతడి చెయ్యి అప్రయత్నంగా మొదట క్రిందికి దిగిందో, లేక ఆమె తలే ముందు పైకి లేచిందో తెలీదు. క్రిందికి దిగిన చెయ్యి నడుము మెలికలో చిక్కుపడి అక్కడే ఆగిపోయింది. క్రిందికి దిగిన తలకి పెదవి చెలమల్లో అమృతం దొరికింది. అయితే అదంతా క్షణంసేపే.
   
    ఆమె చప్పున అడుగు వెనక్కివేసి, "వద్దండీ, ప్లీజ్ వెళ్ళిపోండి" అంది కంగారుగా. "... ఇప్పటికి జరిగింది చాలు."
   
    అతడామెని వదలకుండా, "లేదు ప్రియంవదా! ఇన్నాళ్ళూ అవసరమైన వాటికి విలువనిస్తూ నేను చాలా పోగొట్టుకున్నాను. ఇక దేన్నీ వదులుకోదల్చుకోలేదు" అన్నాడు.
   
    ఆమె సందిగ్ధంగా తల దించుకుంది. అతడు తిరిగి ఆమెని దగ్గిరకు తీసుకున్నాడు. ఈసారి ఆమె అతడిని ముద్దు పెట్టుకుంది.
   
    టెక్నిక్!
   
    అదీ ఆమెలో ప్రత్యేకత!! అది పుట్టుకతోనే స్వభావసిద్దంగా వచ్చిందై వుండాలి. అనుభవంవల్ల రాదు. మనిషికి తినటానికి నోరు, పనిచేయటానికి చేతులు, నడవటానికి కాళ్ళు, వాటిని కలపటానికి నడుము ఇచ్చాడు దేముడు. కేవలం ఒక్క సమయంలో మాత్రమే వాటిని వేరే ఇంకొక పనికి వినియోగించుకునే అవకాశం మనిషికి ఇచ్చాడు. దురదృష్టవశాత్తు కొంతమంది మాత్రమే వాటిని సద్వినియోగపరుచుకునే కళ కలిగివున్నారు. అలాటి కళవున్నా కొద్దిమందిలో ఆమె ఒకత్తె! వైవాహిక జీవితంలో అంత అనుభవం వున్న అతడికే ఆమె క్షణకాలపు సామీప్యత మతిపోగొట్టింది. ఇరవై రెండేళ్ళ వయసులో స్త్రీ పురుషుడి స్పర్శ మొట్టమొదటిసారిగా తగలగానే అలా మైనంలా వేడెక్కిపోతుందనీ, కరిగిపోతుందనీ అతడికి తెలీదు. మాధవిలో అటువంటి తీవ్రత అతడేనాడూ చూడలేదు. అసలామెను ఇటువంటి సామీప్యానికి తీసుకురావటానికే అతడికి ఆర్నెల్లు పట్టింది. మాధవి దృష్టిలో 'అది' అంటే, పురుషుడి ఆనందంకోసం స్త్రీ ప్రతిరోజు ఇష్టంలేకపోయినా చేసే త్యాగం! ఆమె అతడిని ఎంత ప్రభావితం చేసిందంటే- అతడు కూడా నిజంగా అది నిజమేనేమో, స్త్రీకి అది చాలా బాధాకరమైన చర్య ఏమో, కేవలం భర్తని సంతృప్తిపరచటానికే ఒప్పుకుంటుందేమో అని నమ్మే స్థితికి వచ్చాడు.
   
    పొరలు పొరలుగా అతడి అనుమానాల్ని విడగొట్టింది ఆ ముద్దు. ఒక రంగంలో ఎంతో నిష్ణాతుడైన వ్యక్తి కూడా, మరొక విషయంలో ఎంత అంధకారంలో వుంటాడో చెప్పటానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.
   
    అంతలో అలికిడై అతడు ఆమెను చప్పున వదిలేసి వెను దిరిగాడు.ఆమెకూడా వెనక్కి అడుగువేసి సర్దుకుంది.
   
    "ఏమ్మో ఎవరు వస్తిరి? ఏదో అలికిడి అయినట్టులా ఉంది" అంటూ ప్రవేశించాడు ఒక అరవాయన. ప్రియంవద ముందుకు రేగిన జుట్టును వెనక్కి తోసుకుంటూ, "రండి రండి" అంటూ పరిచయం చేసింది. ఇబ్బందికరమైన స్థితి లోంచి వెంటనే సర్దుకోవటం స్త్రీకి వచ్చినంత గొప్పగా పురుషుడికి రాదు. అతడింకా క్షణం క్రితపు మైకంలోనే వున్నాడు. "ఈయనా?" అన్నాడు - ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలాన్ని కళ్ళల్లో నింపుకుని సౌందరరాజన్.
   
    "నేను పనిచేసే బట్టల ఫ్యాక్టరీలో నాతోపాటు పనిచేస్తారు. పేరు సుబ్బారావు" అంది ప్రియంవద- రవితేజ అసలు పేరు చెప్పకుండా అంతే దాదాపు అరగంటసేపు బట్టల గురించీ, పంపునీళ్ళ గురించీ బోరుకొట్టాడు. మధ్య మధ్యలో ప్రియంవద మంచితనం గురించీ, ఈ కాలం అమ్మాయిలు ఎలా చెడిపోతున్నారో కానీ వాళ్ళకి ప్రియవంద ఏ విధంగా భిన్నమో చెప్పాడు. అరగంట తరువాత ప్రియంవద యిచ్చిన కాఫీ తాగి వెళ్ళిపోయాడు.
   
    "ఐ యామ్ సారీ" అందామె అతడు వెళ్ళిపోయాక.
   
    "ఫర్వాలేదు ఒక రకంగా మనల్ని ఆ మూడ్ లోంచి బయటకు తీసుకువచ్చాడు" అన్నాడు రవి లేస్తూ. "ముఖ్యంగా నేను వచ్చింది దేనికంటే- నిన్ను రాజీనామా ఉపసంహరించుకొమ్మని చెప్పటానికి. ఎవరో ఏదో అనుకుంటారని మనం 'భయపడటం' అనవసరం ప్రియంవదా! రేపు నువ్వు ఆఫీసుకు వస్తున్నావు అంతే."
   
    ఆమె ఏదో చెప్పబోయింది.
   
    "నీ తరపునుంచీ, నా తరపునుంచీ నేనే ఆలోచించాను. నా మాటమీద ఏమాత్రం గౌరవంవున్నా, నా మీద ఏ కొద్దిగా ప్రేమ వున్నా, నువ్వు తిరిగి జాయిన్ అవుతున్నావు" అన్నాడు. ఆమె కొద్దిగా ఆగి, నెమ్మదిగా, 'సరే' అన్నట్టు తలూపింది.
   
                           18
   
    రవితేజ టెక్స్ టైల్స్ వారి సరికొత్త ఫాషన్ 'జనతా' చీరల తాలూకు మొట్టమొదటి దూరదర్శన్ ప్రకటన వచ్చి ఆ రోజుకి మూడు రోజులయింది. అంతకు పదిరోజుల ముందు నుంచీ కేవలం పత్రికల్లో మాత్రమే ప్రకటన ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఈ అమ్మకాల్ని ప్రయోగ పథకంగా ముందు ఒక్క రాష్ట్రానికే కుదించారు. దానికి ఆంద్రప్రదేశ్ ని ఎన్నుకున్నారు.
   
    రకరకాల అందమైన మోడల్స్ ఈ జనతా చీరల్ని కట్టుకుని కెమేరా ముందు నడుస్తూ వుండగా ఆ చీరె కోడ్ నెంబరు చెప్పటం; రంగుల్ని విశ్లేషించటం-కామెంటరీలా నడిచినయ్. అదే చీర షాపులో కొంటే ఎంతవుతుంది? దానికి కారణాలేమిటి? సరాసరి ఫ్యాక్టరీనుంచి తెప్పించుకుంటే ఎంత చౌకగా లభిస్తుంది? అలా తెప్పించుకోవాలంటే పోస్టుద్వారా ఏం చెయ్యాలి?.....వగైరా వివరాలన్నీ పత్రికల్లోనే ప్రకటనల ద్వారా ఇచ్చారు, ఆ ప్రకటనల్లోనే ఫలానా ఫలానా రోజులలో దూరదర్సన్ చూడండి అని కూడా ప్రకటించారు.
   
    ఆ రోజు రాత్రి దూరదర్శన్ లో వచ్చిన ఆ ప్రోగ్రాం ని రవితేజ దగ్గిరుండి నిర్వహించాడు. అతడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. పొట్టి-సన్నం-నలుపు, పొడుగు-సన్నం-నలుపు, పొడుగు-లావు-తెలుపు, మధ్యరకం- సన్నం-ఛామనఛాయ, పొడుగు-సన్నం-తెలుపు, ఇలా రకరకాల కాంబినేషన్స్ లలో మోడల్స్ ని ఎన్నుకుని తనకి చీరలమీద వున్న పరిజ్ఞానం అంతా ఉపయోగించి ఆయా రకాల చీరలు కట్టించి కెమేరాలో బంధింపచేశాడు. అతడు ఎక్కడ జాగ్రత్త తీసుకున్నాడంటే- 'ఈ చీర బావుంటుంది' అని చూసేవాళ్ళకి అనిపించనివ్వకుండా, 'ఈ చీర తను కట్టుకుంటే బావుంటుంది' అనిపించేలా అన్నిరకాల స్ట్రక్చర్స్ నీ ప్రెజెంట్ చేశాడు. వాళ్ళ సబ్ కాన్షస్ మైండ్ లో "ఓహో! నేనిలా వుంటాను కాబట్టి ఈ చీర నాకింత బావుంటుందన్నమాట" అనిపించేలా చేశాడు. ఇంతవరకూ ఈ ప్రయోగాన్ని ఎవరూ చేయలేదు. కదిలే బొమ్మల్లాటి అమ్మాయిలు చీరలకి అందాన్ని తెచ్చారు.
   
    కాదు కాదు చీరలు కదిలే మనుష్యులకి అంత అందాన్ని తెచ్చాయనిపించాడు. దూరదర్సన్ లో అడ్వర్టెయిజ్ మెంట్స్ మీడియాని ఇంతకు ముందెవరూ వాడుకోలేనంతగా ఉపయోగించుకున్నాడు. రెండోరోజు గడిచేసరికి ఉత్తరాలు రావటం ప్రారంభమైనాయి. మూడోరోజు గడిచేసరికి రెండు గదులు నిండిపోయాయి. సామాన్యమైన రాబడి వున్నవారు, ఇంతకన్నా క్రింది తరగతి వారు కూడా వందరూపాయలకి ఆర్.టి. చీర అనేసరికి, వందకి పట్టుచీర దొరికినంత సంబరపడ్డారు.
   
    సేల్స్ డైరెక్టర్ ఆ గదిలోకి వచ్చేసరికి రవితేజతోపాటు మరొక డైరెక్టర్ కూర్చుని కాఫీ తాగుతున్నాడు.
   
    "ఈ రెండు రోజుల్లో మన చీరలకి ఎన్నొచ్చినయ్ ఆర్డర్లు?" అని అడిగాడు రవితేజ.
   
    "లక్షా యాభై వేలు సర్".
   
    కాఫీ తాగుతున్న డైరెక్టర్ కి పొలమారి మీదపడింది కాఫీ. "ల....క్షా......యా.....భై ....వేలా?" అన్నాడు దగ్గుతూ. రవితేజ దీని గురించి ఆలోచించటం లేదు.
   
    ఆంద్రప్రదేశ్ లో ఆరుకోట్లమంది జనంలో టీ.వీ. చూసే వాళ్ళు, ప్రకటనలు చదివేవాళ్ళు, దీన్ని గురించి విన్నవాళ్ళు, ఒక కోటిమంది వున్నారనుకుంటే, అందులో చీరలు కట్టేవాళ్ళు యాభై లక్షలు అనుకుంటే, కనీసం మూడు శాతం మంది దీనికి స్పందించారు. ఇంత చిన్న పరిధిలో ఇంత పెద్ద రెస్పాన్సు అనూహ్యం. ఈ లెక్కన పూర్తి అడ్వర్టయిజ్ మెంట్ తో దాదాపు ప్రత్యర్దులందర్నీ పడగొట్టయ్యొచ్చు.
   
    కంగ్రాట్స్ రవితేజా! ఇన్నాళ్ళకి మళ్ళీ నీకు ఆయుధం దొరికింది!! తక్కువ ఆదాయం కలవాళ్ళకే కాక, రోజుకో చీర మార్చే వారికి కూడా ఈ ఫాషన్స్ నచ్చటం అదృష్టం.

 Previous Page Next Page