"దారిలో కనిపిస్తే కంపెనీ కోసమని తీసుకెళ్ళాను. ఏం తప్పా?" అంది పంకజం ధాటిగా.
'తప్పా! తప్పున్నరా? వొళ్ళు చీరిపారేసేటంతటి తప్పు.'
ఈమాట కేవలం మనసులో అనుకున్నాడు. బయటకు మాత్రం "అహ! తప్పని కాదు. ఇతనికి కోటేశ్వరరావు కుంభకోణం గురించి సమాచారం సేకరించమని డ్యూటీ అప్పజెప్పాను. అది మరిచిపోయి...."
"ఆ కుంభకోణాలెప్పుడూ వున్నవే లేవయ్యా....!"
'ఏమన్నావు? ఏమయ్యా అనా? నన్నేనా' ఈ మాట కేవలం మనసులో అనుకున్నాడు. ఎర్రగా చూశాడు.
"ఎప్పుడూ వున్న కుంభకోణమంటే ఏమిటలా కళ్ళింత చేసుకుని చూస్తావు? నూన్ షోకి వెళ్ళి అన్నం వండాలంటే బోర్ గా వుంటుంది. ఇంట్లో ఊరికినే అలా కూచోపోతే కాస్త అత్తెసరు పడెయ్యకూడదూ?" అంటూ విసురుగా లోపలకు పోతూ మళ్ళీ ఆగి నువ్వుకూడా భోజనానికి వుండు రామలింగం, ఈ టైంలో హోటలుకు వెళ్ళి ఏం అవస్థ పడతావు?" అంటూ అతనివంక క్రీగంట చూసి వొయ్యారంగా లోపలకు వెళ్ళిపోయింది.
పరాంకుశం అప్రతిభుడై వుండిపోయాడు. ఏమిటలా చూసింది క్రీగంట? ఆ నడకలో హొయలు! ఏదో జరుగుతోంది. 'వీళ్ళిద్దరూ కలసి నా కొంప ముంచుతున్నారు.'
పరాంకుశానికి బి.పి. పెరగసాగింది.
16
రాధ బోన్ లో ఎక్కి నిలబడింది. పి. డ్యూటుగా.
ఆర్టిఫిషియల్ ఐస్ వున్నా-చూడ్డానికి అదోరకంగా వుంటుందని ఆమెకెప్పుడూ గాగుల్స్ పెడతారు.
ప్రమాణ స్వీకారం జరిగింది.
చీఫ్ ఎగ్జామినేషన్ మొదలయింది.
"చూడమ్మా! నువ్వేం చదువుకున్నావు?" ప్రదీప్ అడిగాడు.
రాధ చెప్పింది.
"క్లాస్ లో నువ్వెన్నో ర్యాంక్ వచ్చేదానివి?"
"స్కూల్లో చేరినప్పట్నుంచీ ఫస్టుర్యాంకే."
"నీకు గేమ్స్ అన్నా, స్పోర్ట్స్ అన్నా యిష్టముందా?"
"చాలా."
"స్కూల్ గేమ్స్ లో పాల్గొంటూ వుండేదానివా?"
"అవును."
"వాటిలో ఎప్పుడైనా ప్రైజులొచ్చేవా?"
"చాలా వచ్చాయి"
"అవన్నీ మీ యింటిలో వున్నాయా?"
"ఉన్నాయి."
"నీ భవిష్యత్తుగురించి, అంటే ముందు ముందు నీ జీవితంలో ఏం చేద్దామనే అంశాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించేదానివా?"
"ఆలోచించేదాన్ని."
"ఏమని?"
"బాగా చదువుకుని డాక్టర్ని అవుదామనో, లేకపోతే మంచి ఉద్యోగం చేద్దామనో ఎప్పుడూ అదే ధ్యాస వుండేది."
"నీ చదువు స్కూల్లో, ఆ తరువాత కాలేజీలో కొనసాగివుంటే నువ్వనుకున్న వన్నీ నెరవేరి వుండేవన్న నమ్మకం వుందా?"
"ఉంది."
"నీ కంటిగురించి- మొదట ఏం జరిగింది?"
"ఎడమకన్ను కొంచెం కొంచెంగా ఎర్రబడినట్లుగా వుండటం, ఏదో బాధ మొదలయింది."
"తర్వాత?"
"నాలుగయిదురోజుల తర్వాత బాగా ఎక్కువయింది."
"ఏమిటెక్కువయింది?"
"కన్ను ఎర్రబడటం, నొప్పి."
"ఏ కంటిలో?"
"ఎడమకంటిలో."
"కుడికన్ను ఎలా వుండేది?"
"బాగానే వుండేది."
"అప్పుడేం జరిగింది?"
"డాక్టరుగారి దగ్గరకు తీసుకెళ్ళారు."
"ఆయన ఏమన్నారు?"
"మందువేసి పంపించేశారు."
"తగ్గిందా?"
"లేదు."
"ఎడమకంటికి ఎర్రబడటం, నొప్పిలాంటివేనా ఇంకేమన్నా జరిగిందా?"
"చూపు తగ్గిపోయింది."
"బాగా తగ్గిపోయిందా? కొంచెం కొంచెం కనిపించేదా?"
"మొదట కొంచెం కొంచెం కనిపించేది, రాను రానూ బాగా తగ్గిపోయింది."
"అంటే అసలు కనిపించేది కాదా?"
"కాదు."
"కన్ను కనిపించకుండా వుంటే నీ పనులు యెలా చేసుకునేదానివి?"
"కుడికన్ను బాగానే వుందిగా, అందుకని ఏమీ యిబ్బంది వుండేది కాదు."
"అంటే నీ కుడికన్ను బాగానే కనిపిస్తూ వుండేదా?"
"అవును."
"అప్పుడు నువ్వు పుస్తకాలు చదవగలిగేదానివా?"
"అవును."
"ఏ కంటితో?"
"కుడికంటితో."
"కాబట్టి ఎడమకన్ను చూపుపోయినా ఒక్కకంటిసహాయంతో నీ పన్లన్నీ చేసుకుంటూ వుండేదానివి."
"అవును."
"తర్వాతేం జరిగింది?"
"కంటి డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళారు."
"ఆయన పేరు తెలుసా?"
"డాక్టర్ గుర్నాథ్."
"ఆయన దగ్గరకు ఎలా వెళ్లావు? ఇప్పుడు కోర్టుకు తీసుకొచ్చినట్టు నడిపించుకుంటూ తీసుకెళ్ళారా? నీ అంతట నువ్వే నడిచి వెళ్ళావా?"
"నేనే నడిచి వెళ్ళాను."
"ఆయన ఏమన్నారు?"
"ఎడమకంట్లో... ఎడమకంట్లో... జబ్బు....క్యా..." రాధకు దుఃఖం పొంగుకు వచ్చింది. కంట్లోంచి నీటిచుక్కలు రాలే అదృష్టానికి నోచుకోలేదు గాని, గొంతులోంచి మాట రాలేదు.
కోర్టులో కూర్చుని వున్నవారంతా గుండెలు ద్రవించినట్లయి చలించి పోయారు.
"చెప్పమ్మా, ఆయన ఏమన్నారు?"
"ఎడమకంట్లో....కేన్సర్....కేన్సర్....వుందన్నారు" ఆమెగొంతు వణుకుతుంది.
"అప్పుడేం జరిగింది?"
"ఇంకో పెద్ద హాస్పిటల్ కు తీసుకెళ్ళారు."