కళ్ళు తెరవని పసికందుల వున్న కూతుర్ని చేరి లాలనగా తల నిమరబోయిన వీర్రాజు ఉలికిపాటుగా చేతిని వెనక్కి లాక్కున్నాడు.
సావేరి శరీరం వేడెక్కిన చలువరాతిలా జ్వరంతో కాగిపోతూంది.
వీర్రాజులో నిజమైన అలజడిని రేపిన తొలిరోజది.
* * * *
"WHEN MY LOVE SWEARS THAT SHE IS MADE OF TRUTH I DO BELIVE THOUGH I KNOW SHE LIES"
చెప్పడం ఆపిన లెక్చరర్ జవహర్ ఓ క్షణం తన ముందున్న విధ్యార్ధులవేపు సాలోచనగా చూశాడు.
ఇసుక రేణువు రాలిపడితే వినిపించేటంత నిశ్శబ్దం క్లాస్ రూంలో అలవోకగా జవహర్ దృష్టి శంకూ పైకి మళ్ళింది.
అందరితోబాటు శంకూ రెప్పవాల్చకుండా చూస్తున్నాడు లెక్చరర్ వేపు. కానీ ఆ చూపులో జీవంలేదు.
శారీరకమైన గాయాలతో క్రమంగా శంకూ శరీరం రాటుదేలిపోతూంది. కానీ ఇప్పుడిప్పుడే మానసికంగా నలిగిపోతున్నాడు.
ఆ మధనంలో సావేరికి తనో, తనకి సావేరో శాశ్వతంగా దూరం కాబోతూందన్న భావం చోటు చేసుకుని అతడ్నింత కృంగదీస్తూందీ అంటే రెండురోజుల తర్వాత శంకూ ఆ రోజే క్లాస్ కి వస్తే సావేరి కనిపించలేదు.
ఆ రోజునుంచి సావేరి సైతం కాలేజీకి రావడంలేదని తెలిసినప్పుడు రెండు రోజులుగా శరీరాన్ని నులిపేసిన బాధకన్నా ఆమె ఆలోచన మనసికంగా ఎక్కువ కృంగదీసింది.
తనపై చేయి చేసుకున్నా సావేరిని రాజేందర్ ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగిందీ అతనికి తెలీదు. కానీ ఏదో జరిగి వుంటుందని మాత్రం అతడి మనసు పదే పదే చెబుతూనే వుంది. మంగని అడిగినా చెప్పకుండా దాటేసింది.
చివరికి సావేరినే అడగాలని ఇంకా శరీరం సహకరించక పోయినా కాలేజీకి వచ్చేశాడు.
బయట స్టూడెంట్సంతా విచిత్రంగా చూస్తూంటే బిడియమనపించింది.
అందరూ అదోలా నవ్వుతున్నారు. ఎందుకని.....అడుగడుగునా తనకు దక్కుతున్నది అవమానాలే అన్న అవహేళన.
అయితేనేం...సావేరికి తనంటే ఇష్టం. దబాయిస్తూ దగ్గరగా నిలబడి మాట్లాడుతుంటే ఎంత ఉల్లాసంగా అనిపిస్తుందని.
అసలు సావేరి ఎందుకు రాలేదు.
ఒకవేళ కాలేజీ మానిపించేశారా?
గుండె దడదడలాడుతూంది.
అతనిలో చలనంలేదు.
"మిస్టర్ శంకూ...." ఈసారి జవహర్ కంఠం తీవ్రంగా వినిపించింది.
ఉలికిపడిన శంకూ తత్తరపడుతూ లేచాడు. "విన్నావా?"
ఏమిటో అర్ధంకాలేదు. విద్యార్ధులకదో వినోదంగా వుంది.
కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా చూసిన లెక్చరర్ జవహర్ మళ్ళీ అదే వాక్యాన్ని రిపీట్ చేసి "ఇలా రాసిందెవరో చెప్పగలవా?" అడిగాడు.
"విలియమ్ షేక్ స్పియర్...." బావిలో నుంచి వినిపించినట్టుంది అతడి కంఠం.
అందరూ వూహించినట్టు జవహర్ శంకూని దండించలేదు.....దండించాలని ప్రయత్నించలేదు.
జవహర్ వుండేది శంకూ పల్లెలోనే.....
రెండురోజుల క్రితం విన్నాడు. కొంత....సురేంద్రని పిలిచి వివరంగా అడిగాడు.
అది చెరగని భావుకతో మరిచిపోలేని ప్రేమకావ్యాలు ముద్దగా మారి మనసులో రవళింపచేసే కృతో మరి శంకూలో లేతదనం, అతని కళ్ళలలోని నైర్మల్యం ఆయన్ని చాలా కదిలిస్తుంది. ఎందుకో శంకూని చూస్తుంటే కలవరపాటుగానూ అనిపిస్తుంది.
అందరిలాగే అయితే శంకూ వధని కొంత వూహించిన జవహర్ అంతటితోనే ఆలోచనలనుంచి త్రుంచేసేవాడు. కానీ పూర్తిగా తెలిసిన ఈ క్షణంలో మరింత ఇన్ వాల్వ్ అవుతూ చూశాడు. "శంకూ....ఈ వాక్యం రాసింది షేక్ స్పియర్ అయినా ఏ సందర్భంలో అలా రాశారో చెప్పగలవా....?
ఇంకా తేరుకోలేని శంకూ కాంటెక్ట్స్ చెప్పలేకపోయినా ఏ కథ లోదో చెప్పాడు. "లేంబ్స్ టేల్స్ నుంచి సర్__"
ఆ జవాబు చెబుతుండగా అదురుతున్న రంగువెలిసిన ఇంద్రధనుస్సుల్లాంటి అతని పెదవుల్ని చూస్తూ మృదువుగా నవ్వాడు.
సందర్భోచితంగా ఆయన చాలా కథలు మనసుకు పట్టేటంత అబ్దుతంగా చెబుతాడని స్టూడెంట్స్ అందరికీ తెలుసు.
"ఏడాది పొడుగునా పొలం కోసం శ్రమపడిన ఓ రైతు పంటసరిగా పండకపోవడంతో దేవుడ్ని తిట్టుకున్నాడట...." జవహర్ చెబుతుంటే విద్యార్ధులు ఉత్సుకతగా చూస్తున్నారు.
"ఆ రైతు బాధని చూసి ప్రత్యక్షమైన దేవుడు నా తప్పేమిటీ అంటే వాతావరణాన్ని అదుపుచేయడం నా చేతుల్లోలేదుగా అంటే సరే ఈసారి నువ్వడిగినట్టు వాతావరణాన్ని అందిస్తానన్నాడు దేవుడు. రైతు సంతృప్తిగా తల పంకించి సూర్యుడు ఉదయించాలీ అన్నాడట ఓ మబ్బు పట్టిన రోజు అలాగే చేశాడు దేవుడు....ఆ తర్వాత ఎంతకీ వర్షాలు పడకపోతే వర్షంకోసం అడిగాడట.....సరిపోయినంత వర్షపాతాన్ని అందించాడు మళ్ళీ ఎండలు కావాలన్నాడు. అలాగే చేశాడు దేవుడు....నారు వేశాడు.....వాతవరణాన్ని తన కనుకూలంగా కోరుకున్నాడు.....చివరికి పంటపండేక ఏపుగా ఎదిగిన పొలాన్ని చూస్తూ సంతృప్తిగా కోతకి కొడవలి తీసుకుని వెళ్ళాడు....ఆశ్చర్యపోయాడు."
ఉత్కంఠగా ముందుకు ఒరిగారు విద్యార్ధులు.
"చూస్తే గడ్డి దుబ్బులే వున్నాయితప్ప ధాన్యపుగింజలు లేవు."
"అదేం సర్" అప్పారావు ఇక నిభాయించుకోలేక అడిగాడు.
"అదేమాట దేవుడ్ని నిలదీసి అడిగాడట రైతు....అప్పుడు దేవుడేమన్నాడో తెలుసా....నువ్వు ఎండకావాలన్నావు....వర్షం పడాలనుకున్నావు.....అంతేకాని తుఫానుని, గాలిని, ఉరుముల్ని, మెరుపుల్ని అడగలేదుగా అంటే అది నాకెందుకు అని ప్రశ్నించాడు రైతు."
ఓ క్షణం సాలోచనగా శంకూనే చూస్తూ చెప్పాడు జవహర్. "భూమిసారవంతం కావడానికి గాలిలో కాలుష్యం పోవడానికి మొక్కల కుదుళ్ళు బలపడటానికి ఎండావర్షం మాత్రమేగాక అవసరమైనంత మేరకు అవీకావాలీ అంటూ జవాబు చెప్పాడట.....యస్.....ప్రకృతిలోని అస్తవ్యస్తత అనుకునే ఆ పరిస్థితులూ మనిషికికావాలని.....అప్పుడుగాని ఫలసాయం దక్కదు.....ఇది పంటకే కాదు, ప్రేమకైనా అంతే అంటాడు షేక్ స్పియర్...."
వాక్యాలు కేవలం తనకి అర్ధం కావడానికే అన్నాడని శంకూకి తెలీదు. కనీ జరిగిన ప్రతి సంఘటనా తన కథకి అన్వయించుకున్నాడు.
అది పాఠంలో భాగమైనా తన బ్రతుకు అధ్యయానికే అవసరమైన స్పూర్తిగా తీసుకున్నాడు.
ఇంటికి వచ్చాడో సాయంకాలం.
నిన్నటిగాయాల గుర్తుల్ని మరిచిపోయినంత ఉన్మాదంతో ఎదురయిన మంగని అడిగాడు సావేరి గురించి.
ఏది చెప్పి ఎప్పటిలా తప్పించుకోబోతుంటే ఈసారి అమాంతం ఆమె జబ్బపట్టుకున్నాడు.
ఇది మంగసైతం వూహించందే.... "వదులు...."
"చెప్పు....సావేరి కాలేజీకి ఎందుకు రాలేదు."
"నాకు తెలీదు."