Previous Page Next Page 
హృదయాంజలి పేజి 32

   
    "ఇంత పెద్ద పత్రిక నడుపుతూ కొన్ని వందలమందికి ఉపాధి కల్పించిన మీరు జీతగాణ్నని చెప్పుకోడం బాగాలేదు. చెబితే నమ్మేటట్టుగా ఉండాలి."

    "పత్రిక నడుపుతున్నంతవరకు నిజం! కాని, యజమానిని నేను కాదు! లక్ష్మీప్రసన్నకుమారి. అత్తగారి ఆస్తి కలిసిందని అందరూ చెప్పుకొంటారుగాని అసలు ప్రాపర్టీ అంతా నా భార్య పేరుమీద ఉంది! నేను పత్రిక ఎడిటరుగా జీతం తీసుకుంటాను! ఆ సంగతి చాలా మందికి తెలీదు!"
 
    "ఇదే మేం ఉంటున్న ఇల్లు!" అంటూ తమ గదిలోకి ఆహ్వానిస్తుంటే అపురూప మనసు చచ్చినట్టుగా అయింది. రేకుల కప్పుతో ఉన్న చిన్న గది! ఎన్నేళ్ళ క్రిందో సున్నాలు వేసిన గోడలు! ఆ గదిలో ప్రతి వస్తువూ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత దరిద్రులైందీ చెబుతున్నట్టుగా ఉంది!
 
    ఇన్నేళ్ళలో గొప్ప వాళ్ళెవరూ వాళ్ళింటికి రాలేదు. తమ లేమి తమకి కించపరుస్తూంటే గొప్పవాళ్ళతో పరిచయం పెంచుకోలేదు! పరిచయాలే పెట్టుకోలేదు. అసలు, తమ గురించి ఎవరూ పట్టించుకోకుండా గుట్టుగా ఉండడం నేర్చుకొన్నారు. ఓపూట తిండి లేకపోయినా ఎవరింటికి అప్పుకోసం వెళ్ళి ఎరుగరు! బ్రతికి చెడిన వాళ్ళకి అభిమానం ఒకింత పెరుగుతుందేమోగాని తరగదనిపిస్తుంది వాళ్ళని చూస్తే.
 
    పరంజ్యోతిని కట్టె పెట్టెమీద కూర్చోబెట్టింది. కుర్చీలేమీ లేక పోవడంవల్ల.

    "మా నాన్నగారు, సుప్రసన్నాచారి!"
 
    "నమస్కారం, ఆచార్లూ!" పరంజ్యోతి లేచివెళ్ళి మంచం పట్టె మీద కూర్చొంటూ అన్నాడు.

    "ఈయన పరంజ్యోతిగారు. ఉషోదయం పత్రిక ఎడిటరుగారు! నిన్ను చూడాలని వచ్చారు" అపురూప చెప్పింది.

    "నన్ను చూడాలని వచ్చారా? ఏముంది చూడ్డానికి?" నీసరంగా ఉన్న ఆయన స్వరంలో అవ్యక్తమైన నిరసనభావం ధ్వనించింది.
 
    "ఎందుకు లేదు , ఆచార్లూ? విధి మనిషిని ఎంత దెబ్బ తీస్తుందో చూడొచ్చుకదా?"
    "చూసి ఏం చేస్తారు?"
 
    "చేస్తాను! కాని, ఏం చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి!"
 
    "నిజంగా చేస్తారా?" గాజు గోళీల్లా ఉన్న ఆయన కళ్ళలో కొద్దిగా కదిలిన చైతన్యం!
 
    "ష్యూర్! చెప్పండి!" నిస్సంకోచంగా అన్నాడు పరంజ్యోతి.

    "నాకు .....నాకు మనశ్శాంతి కావాలయ్యా!"
 
    "సజ్జనుడికి సహజంగా కలిగే కోరికే అది! ధనధాన్యాలు అక్కరలేదు! మనశ్శాంతి మాత్రం కావాలి!
 మనశ్శాంతి మహానుభావుల దగ్గర దొరుకుతుందని విన్నాను! చెప్పండి! ఏ ఆశ్రమాలకి తీసి కెళ్ళమంటారు?"
 
    "ఆశ్రమాలకి అక్కరలేదు! నన్ను మా ఊరికి తీసికెళ్ళి మా ఇంట్లో వదలండి చాలు!"
 
    "మీ ఊళ్ళో ఇల్లుందా అపురూపా?"
 
    "ఒకప్పుడుండేది! ఇప్పుడు గోడలు మాత్రం మిగిలాయని విన్నాను! చూసేవాళ్ళులేక వర్షాలకి కుప్పకూలిపోతే ఎవరికి అందిన కిటికీలు, తలుపులు , వాసాలు వాళ్ళందుకుపోయారు. ఆ ఇంటిని పాడు గోడలుగా మిగిల్చారు ఊరివాళ్ళు! ఈయనవెళ్లి ఆ గోడల్లో అంతిమ దినాలు వెళ్ళదీస్తారట."
 
    పెళ్ళి చేసి ఒకింటికి పంపాల్సిన ఆడపిల్లమీద ఆధారపడి ఊపిరి నిలుపుకోవడం తనకెంత సిగ్గుగా, మనోవ్యధగా ఉందో, ఈ పట్నవాసపు మురికి కూపాల్లో పడి తనకెంత కంపరంగా, ఉక్కిరి బిక్కిరిగా ఉందో, ఆకరి శ్వాస తన గడ్డమీద వదలాలని ఎంతగా మనసు కొట్టుకొంటుందో చెప్పుకొన్నాడు ఆచారి.
 
    "అమెరికాలాంటి భూతల స్వర్గంలో స్వర్గ సుఖాలు అనుబవిస్తూన్న మనవాళ్ళకి మాతృదేశం మీద మనసు పీకుతుంది! పుట్టిన చోటును ప్రేమించనివాడు ఉన్నాడంటే నేను నమ్మను! మీ బాధ ఎంతో సహజమైంది! కాని , మీరొక్కరు వెళ్ళి మీ ఊళ్ళో ఉండలేరుకదా?  మీ చిన్నమ్మాయి చదువుకొంటూంది! పెద్దమ్మాయి ఉద్యోగం చేస్తోంది! మీతో రావడానికి వాళ్ళకి వీలుకాదాయే!"

    "ఫర్వాలేదు! నేనొక్కడినే వెళ్ళగలను! ఇప్పుడైతే తిన్న తిండి పైకి పట్టక ఇలా ఉన్నానుగాని నా గడ్డమీద కాలు పెడితే నాకు ఏనుగంత బలం వస్తుంది! కాళ్ళు లేవుగాని చేతులున్నాయి కదా? ఎవరైనా కాస్త నీళ్ళు తెచ్చి పెడితే వంట చేసుకోగలను!" " మీ అమ్మాయి చేసే ఉద్యోగానికి మీకు డబ్బు ఎత్తి పంపడం సాధ్యమౌతుందా?"

    "నాకు వాళ్ల డబ్బక్కరలేదు. నా ఊరది. నన్ను పస్తు పడుకోబెట్టదు. బ్రాహ్మడికి ఆ యవారం తప్పుకాదు!"

    "ఎంత స్వార్ధమండీ మీది? ఎదిగిన ఆడపిల్లల్ని వంటరిగా ఈ పట్నంలో వదిలిపెట్టి మీ మానాన మీరు వెళ్ళిపోతానంటారా? అప్పుడు మీ నేల మీకు శాంతి నిస్తుందంటారా? వంచకులకీ, కర్తవ్య హీనులకి జననే కాదు, జన్మభూమి కూడా ఊరట నివ్వలేదు. మీరు ఇక్కడే వుండి కష్టం సుఖం పంచుకోవడంలో శాంతి వెదుక్కోండి. మీకీ ఇల్లు బాగుండక పోతే మరో ఇల్లు చూస్తుంది అపురూప. మంచి ఇల్లుకోసం నా వంతు సాయం నేను చేయగలను!"

 Previous Page Next Page