Previous Page Next Page 
విషవలయం పేజి 34

    "ఇంకా ఏమనాలి నాన్నా? పాతిక రూపాయలివ్వరా పనుందంటే ఎందుకు? ఏంచేస్తావు? అని గుచ్చిగుచ్చి అడిగితే నేనేమైనా జీతానికున్న వాడ్నా ఆరాలు చెప్పటానికి? నేనేమన్నా దుబారా చేస్తున్నానా?"

    రామకృష్ణయ్యగారు హఠాత్తుగా సర్దుకుని, చిన్నకొడుకు అమాయకత్వానికన్నట్లు ఒకటిచేసి "ఆదా? వరేయి వాడికి అభమూ శుభామూ తెలియదు. ఇప్పుడిప్పుడే ప్రపంచములోకి అడుగుపెడుతున్నాడు. అలాంటి వాడికి నచ్చచెప్పాలిగాని, కోప్పడితే ఎలాగురా?" అని సత్యమూర్తి వంక తిరిగి "వాడు అడిగింది ఇచ్చెయ్యినాన్నా. ఏదో అవసరం లేనిదే వాడు నిన్ను ఎప్పుడూ డబ్బడగడని గుర్తుంచుకో" అని హితోపదేశం చేశాడు.

    అతను మారుమాట్లాడకుండా బీరువా తెరిచి పైకంతీసి అన్నగారి చేతికిచ్చాడు. అది జేబులోకి త్రోసి గజగజ అక్కడ్నుంచి నిష్క్రమించాడు రామ్మూర్తి.

    తర్వాత కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకుని రామకృష్ణయ్యగారు భోదించసాగారు "నీ తెలివితక్కువతనం కొంత సడలించుకోవాలిరా అబ్బీ! బ్రతకటానికి నేర్పరితనం, గడుసుతనం కావాలి. పెద్దవాడ్ని, శ్రేయోభిలాషిని పట్టుకుని అలా నిలదీయవచ్చా? సమయానికి నేను రాకపోతే ఎంత రభస జరిగేదిచెప్పూ."

    ఇంతకూ తనుచేసిన అపరాధం ఏమిటో అతనికి అర్ధం కాలేదు కాసేపు వాక్ప్రవాహం కురిపించి ఆయన వెళ్ళిపోయాడు. సత్యమూర్తి తలపట్టుకుని కూర్చున్నాడు.

    తను ఆనర్సు ప్యాసయ్యాడు. ఆనాడు తల్లి చెప్పినట్లు అంత అప్రయోజకుడా? తనని ఎందుకు అంతా అలా తీసిపారేస్తున్నారు?"

    కోపం, దుఃఖం, అవమానం అతన్ని క్రుంగదీస్తున్నాయి.

    ఆ మధ్యాహ్నం అతను ఇంట్లో కూర్చోలేక అలా సముద్రంతీరం వరకూ వెళ్ళివద్దామనుకొన్నాడు. చాలారోజులయింది సముద్రానికి వెళ్ళి. ఊరికి బాగా దూరంగా వుండటంవల్లా, వెళ్ళటానికి కూడా సరిగ్గా సదుపాయమ్గా కూడా వుండనందువల్ల-ఎప్పుడన్నా బుద్దిపుడితే పనిగట్టుకుని పోవాలి.

    అతను బట్టలేసుకుని, తీరా బయల్దేరుదామని సిద్దపడేవేళకు న్తకుమునుపే ముసురుగా వున్న ఆకాశాన, మేఘాలు మరింత గాఢంగా అలుముకుని, చినుకులు పడసాగింది. వర్షాకాలం ఎప్పుడో వచ్చేసింది ఈ ఏడు వానలుకూడా ఎక్కువగా వున్నాయి. తగ్గుముఖం పడ్తుందేమోనని కాసేపు ఆశగా ఎదురుచూసి, రానురానూ మరీ పెద్ద వానగా పరిణమించేసరికి యిహ నిరాశ చేసుకుని ఏదో పుస్తకం ముందు పెట్టుకుని పేజీలు త్రిప్పుతూ కూర్చున్నాడు.

    ఈపాటికి సుధ ఏంచేస్తూ వుంటుందో! ఆమె ఇంటర్మీడియట్ ప్యాసయి బి.ఎస్.సి.లో చేరింది. ఎందుకనో మెడికల్ కాలేజికి ఎప్లయి చేయటానికి ఆమె అంగీకరించలేదు ఈరోజు ఆదివారం. ఏ రేడియో వింటూనో ఇంట్లో కూర్చుని వుంటుంది. లేకపోతే తండ్రితో కబుర్లు చెబుతూనో, చదరంగం ఆడుతూనో వుంటుంది. ఆమె తనకు తరచు గుర్తువస్తున్నట్లు తనెప్పుడైనా ఆమెకు గుర్తువస్తూంటాడా? ఏమని తలపోస్తూ వుంటుంది తనని గురించి? తండ్రి కూతుల్లిద్దరి మధ్యా తన ప్రసంగం వచ్చినప్పుడు వలలు ఏమని సంభాషించుకుంటూ వుంటారు?

    ఇలా తలనిండా మధురభావాలు నింపుకుంటూ, మధ్యమధ్య ఉలిక్కిపడుతూ అతను గంటలు గడిపివెయ్యసాగాడు.

    సాయంత్రం కూడా గడిచిపోయింది. ఆ ఇంట్లో రాత్రి భోజనాలు కూడా అయిపోయినాయి. వర్షం ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. ఏకధారగా ఒకటే కురుస్తోంది ఇల్లంతా సమాధిలా నిస్సబ్ధమైపోయింది. వర్షంలో ఆ వొంటరి సమాధి తడుస్తున్నట్లు తడుస్తోంది.

    పదిగంటలకు తన గదిలో కూడా లైటు ఆర్పేసి, కిటికీ తలుపులన్నీ మూసేసి కప్పుకుని పడుకున్నాడు సత్యమూర్తి. ఊరికే అటూ ఇటూ పొర్లుతున్నాడేగాని అతని కంటికి కునుకురావటంలేదు. ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి.

    పన్నెండు దాటినట్లుంది.

    క్రిందనుంచి ఎవరో పిలుస్తున్నారు. గేటు దగ్గరనుండి "బాబూ! సత్యమూర్తి బాబూ!" అని కేకేస్తున్నట్లుగా వుంది.

    లీలగా వుంది పిలుపు...భ్రమా? లేకపోతే ఇంత రాత్రివేళ ఎవరు వస్తారు తనకోసం.

    ఉపేక్షచేస్తూ అట్లాగే పడుకున్నాడు...మళ్ళీ పిలుస్తున్నారు ఇంకా గట్టిగా, స్పష్టంగా కేకేస్తున్నారు.

    అతను లేచి కూర్చున్నాడు. నిజమే. లేచి, లైటు వెలిగించి, కిటికీ తలుపులు తీశాడు. చప్పున జల్లు లోపలకు వచ్చింది...గేటు అవతల చీకట్లో ఎవరో మనిషి నిలబడివున్నాడు. వర్షంలో ముద్దగా తడిసిపోయాడు ఆనవాలు తెలీలేదు.

    "సత్యమూర్తి బాబూ! గేటు తియ్యి" అని అరిచాడు మళ్ళీ.

    అతను వసారాలోకి వచ్చి లైటు వెలిగించాడు. గొడుగు తీసుకుని క్రిందకు దిగి, బయటి దీపం కూడా వేసి గేటువైపు నడిచాడు.

    అంత రాత్రివేళ, కుంభవృష్టిగా కురుస్తోన్న వర్షంలో అక్కడ నిలబడివున్న వ్యక్తిని చూసి అతను నిర్ఘాంతపోయాడు. గుండె గబగబ కొట్టుకుంది.
 

 Previous Page Next Page