Previous Page Next Page 
విషవలయం పేజి 33

    మెల్లిగా రోజులు గడుస్తున్నాయి. రామకృష్ణయ్యగారు యింటిపనితో హడావుడి చేస్తూ అట్టహాసంగా వున్నారు. సత్యమూర్తి యింటి పట్టునేవుండి రోజులు గడిపేస్తున్నాడు.

    ఓ రోజు ఉదయం అతను స్నానాదికాలు ముగించుకుని. తన గదిలో కూర్చుని వుండగా "సత్యమూర్తి బాబూ" అని దీనంగా పిలుస్తూ ఓ వృద్దుడు లోపలకు వచ్చాడు.

    అతను తలఎత్తి, వృద్దుడ్ని చూడగానే గతుకుమన్నాడు. వెంకట్రామయ్యగారు. ఈ సమయంలో ఒక్కడే యింట్లో వున్నందుకు తన దురదృష్టానికి నిందించుకుంటూ "ఊఁ... ఁఊ...కూర్చోండి" అన్నాడు తడబడుతూ.

    "ఫర్వాలేదులె నాయనా. కూర్చునేందు కేముంది? నువ్వేమీ అనుకోకపోతే ఉత్తరం విషయమే అడగటానికొచ్చాను వొణుకుతూన్న కంఠంతో.

    "అవును రాశాను" అన్నాడు సత్యమూర్తి ఆయనవైపు చూడకుండా.

    "అదే...మరి..." వృద్దుడు చెప్పటానికి సతమత మవుతున్నాడు.

    "చూడండి వెంకట్రామయ్యగారూ!" అన్నాడు సత్యమూర్తి దిటవు తెచ్చుకుని. అతను చేసిన సాధన ఫలితం అది. "మా నాన్నగారు పోయాక మా కుటుంబ పరిస్థితులన్నీ తారుమారయిపోయినయ్. అనుకొని ఖర్చులు విపరీతంగా తగిలాయ్. బాకీలు ఒక్కటీ వసూలు కావటంలేదు. మేము అనేక ఇబ్బందులకి లోనైనాం. అందుకని కష్టంగా వున్నా విధిలేక ఉత్తరాలు రాసేవాళ్ళకి ఉత్తరాలూ, నోటీసులూ ఇవ్వాల్సినవాళ్ళకు నోటీసులూ యిచ్చాం. మేము మాత్రం నష్టం ఎంతకని భరించడం చెప్పండి."

    వెంకట్రామయ్యగారు నోరావలించి ఆశ్చర్యంగా చూశాడు. తను అతన్నేనా చూస్తున్నాడు? ఇంత స్వల్పకాలంలో మనుషుల్లో ఇలాంటి మార్పు సాధ్యమా?

    "పైకానికి....యిబ్బంది.."తికమకపడుతున్నాడు.

    "ఇబ్బందులనేవి అందరికీ సమానమేగా వెంకట్రామయ్యగారూ! మీ గురించే మీరు ఆలోచిస్తారు. నేను ఎలాంటి యిడుముల్లో వున్నానో మీకు తెలీదు. మిమ్మల్ని కళ్ళనీళ్ళ పర్యంతం చేసే వృత్తాంతాలూ దృష్టాంతాలూ ఆపమనేవరకూ చెప్పగలను నేను మీ గురించి."

    "సరే నాయనా!" అన్నాడు వృద్దుడు, అభిమానం వుట్టిపడే కంఠంతో వ్యర్ధప్రార్ధనలు, వేడికోళ్ళూ లాభంలేదని ఆయన గ్రహించాడు. "ఎప్పుడు ఇమ్మంటావు?"

    "ఎంత త్వరగా వీలయితే అంతమంచిది."

    "తప్పకుండా అలాగే ప్రయత్నిస్తాను బాబూ. వస్తాను" అంటూ ఆయన యిహ జాగుచేయకుండా అక్కడనుంచి వెళ్ళిపోయాడు.

    సత్యమూర్తి ఆయన వెళ్ళిపోయిన వంకే చూస్తూ నిట్టూర్పు విడిచాడు. తనేనా మాట్లాడింది? అవును తనే. సాధ్యమైంది మరి? ఎలా అంటే? అంతే.

    "ఏమిట్రా సత్యం ఆలోచిస్తున్నావు?" అంటూ ఎక్కడినుంచో ఊడిపడ్డాడు రామ్మూర్తి. ఉన్నట్లుండి అతను సోదరుడి పట్ల అత్యంతాభిమానాలు ప్రదర్సిస్తుంటాడు.

    "ఏమీ లేకపోవట మేమిటి? ఉంది. ఎందుకు అనవసరంగా ప్రతి చిన్నవిషయాన్ని గురించి ఆలోచించి బుర్ర పాడుచేసుకుంటూ వుంటావు.

    నీ వ్యవహారాలన్నీ చూసి పెట్టటానికి ఢక్కాముక్కిలు తిన్నవాళ్ళం మేమువుండగా నీకేం కర్మరా? హాయిగా తిను. తిరుగు. సినిమాలు చూడు. కారు కొనుక్కుని భూ ప్రదక్షిణం చెయ్యి. బెంగుళూరు, మైసూరు, కలకత్తా, బొంబాయి, పైలా పచ్చీసుగా ఎన్ జాయ్ చెయ్యి. నీకు భయమైతే నన్ను కూడా తోడు తీసుకువెళ్ళు. నిక్షేపంగా వస్తాను" అని ఓ ఉపన్యాసంయిచ్చి తమ్ముడి ముఖంవంక ప్రశ్నార్ధకంగా చూశాడు.

    సత్యమూర్తి బలవంతాన నవ్వి "చూద్దాంలె అన్నయ్యా" అన్నాడు.

    "గుడ్. అలా అన్నావు బాగుంది. అది సరేగాని ఓ పాతిక రూపాయలుంటే యియ్యరా, త్వరగా పోవాలి" అన్నాడు అన్నగారు జరూరుగా.

    అంతకు ముందురోజునే అర్జంటు పనివుందని చెప్పి యాభయి రూపాయలు తీసుకువెళ్ళి మళ్ళీ యివాళ పాతిక తెమ్మంటూండటంవాళ్ళ సత్యమూర్తికి కష్టంకలిగి "ఎందుకు?" అనడిగాడు అప్రయత్నంగా.

    అన్నగారు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవిచేసి "బాగుందిరోయ్. నీకంతా అజలూ పజలూ చెబుథోఇ కూర్చుండటానికి కుదురుతుందనుకున్నావా ఏమిటి? ఏది అవసరమో అది యీ చేత్తో ఖర్చు పెట్టటమే గాని_లెక్కలు చెప్పే ఆనవాయితీలేదు" అన్నాడు.

    అంతవరకూ ఎక్కడున్నాడోగాని హఠాత్తుగా రామకృష్ణయ్యగారు కూడా రంగంలోకి ఊడిపడి "ఏమిటేమిటని" అడగసాగాడు.

    ప్రతి రూపాయికి పద్దు చెబుతూ ఖర్చుచేయటం నాకు చేతకాదు నాన్నా, అధికారం చలాయిస్తూ మనగలనుగాని అర్ధిస్తూ పనిచెయ్యలేను. ఆఁ ఖచ్చితంగా చెబుతున్నా" అన్నాడు రామ్మూర్తి తన అఖండ వ్యక్తిత్వం ప్రదర్సనచేస్తూ.

    "ఏం జరిగిందిరా బాబూ? చిన్నవాడేమైనా అన్నాడా?"
   

 Previous Page Next Page