Previous Page Next Page 
ప్రేమికారాణి పేజి 33

    "వచ్చానేగాని నాకూ మనసు బాగాలేదు. ఈరోజు బస్సుకివద్దామని ప్రయాణమయ్యారు. అన్నయ్యా, అమ్మా వద్దన్నారు."

    మధు వెంటపడి పరిగెత్తిన జ్యోతి ఓగంట తరువాతగాని రాలేదు. వస్తూనే, "ఆలూబొండా నాతో మాట్లాడాడు, మమ్మీ" అంది.

    "ఆలూబొండా ఎవరు?"

    "పక్కింటి కొండముచ్చుకొడుకు. అమెరికానుండి ఇవాళే వచ్చాడట. నీకు ఆయన బాల్య స్నేహితుడు కదా? కొండముచ్చు చెప్పింది. 'గీతకూతురా?' అంటూ నన్ను దగ్గరికి పిలుచుకు కూర్చోబెట్టుకున్నాడు. 'నీ డేటాఫ్ బర్త్ ఏమిటి?' అని అడిగాడు. నాముఖంలోకి గ్రుచ్చి గ్రుచ్చి చూశాడు. 'అంతా గీతలాగే ఉన్నావు. కాని, ఈ మూతి మాత్రం ఆమెది కాదు.' అన్నాడు. వాళ్ళకి పిల్లలు లేరని, ఎవరిపిల్లల్ని చూసినా ముచ్చట పడతారని, ఆయన భార్యకి ఆడపిల్లలంటే మరీ ముద్దని కొండముచ్చు ఆయన చూపులకు అర్ధం చెప్పింది. ఆయన భార్యఉందే, అప్పుడే నిద్రలేచి పాచిమొహంతో నిలబడిందా అన్నట్టు తలంతా రేగిపోయి ఎలాగో ఉంది. ఆవిడ నాకసలు నచ్చలేదు."

    గీతాభవాని గుండె దడదడ లాడింది. ముఖం కళా విహీనమైంది. మరుగున పడేయాలనుకొన్న కధను తిరిగి ముందు నిలబెట్టినట్టుగా అయింది.

    అమెరికా వెళ్ళబోయేముందు జరిగిన సంఘటన అతడికి గుర్తుందా? ఒకమ్మాయిని అన్యాయం చేశానని గుర్తుందా? జ్యోతిలో తన ప్రతిరూపం వెదుక్కున్నాడా? తన రక్తం పంచుకు పుట్టినబిడ్డ జ్యోతికాదని, ఆపిల్ల మరొక చోటఉందని, ఆపిల్ల ఇప్పుడు అనాధ కాబోతూందని తెలిస్తే ఆమెను తనదగ్గరికి తెచ్చుకోడానికి వెడతావా?

    తనవల్ల గర్భంధరించి ఆడదాన్ని కాలదన్ని వెళ్ళిన మగవాడికి తన రక్తసంబంధమంటే అనురాగ ముంటుందా? సృష్టి చిత్రం ఇక్కడే ఉందా?

    మరునాడు ఉదయం.

    గీతాభవాని వాళ్ళు వాకిట్లో కారెక్కుతూంటే, తమఇంటి వరండాలో పేపరు చేతిలో పట్టుకొని, ఎవరో పెద్దమనుషులతో మాట్లాడుతున్న రాజశేఖరం ఇటే చూడసాగాడు ఆసక్తిగా.

    గీతాభవాని అరక్షణం అటుచూసి ముఖం త్రిప్పుకొంది.

    కారు కదులుతూంటే జ్యోతి చెయ్యెత్తి టాటా చెప్పింది ఆయనకి, ఓ అల్లరి నవ్వు పెదవుల మీద నర్తిస్తూంటే.

    "అబ్బా. అప్పుడే అందరితోనూ స్నేహం కలుపుకు వస్తావు కదమ్మా." అన్నారు గిరిధరం.

   
                                        12

    "మమ్మీ! నువ్వొకటి మరిచిపోయావు. ఏమిటో చెప్పుకో." జ్యోతి తల్లిగదిలోకి వెళ్ళి అంది.

    "మర్చిపోయానన్నావుగా? జ్ఞాపకం చెయ్యందే ఎలా వస్తుంది?"

    "ఏమిటి, మమ్మీ? ఈ మధ్య పరధ్యానంగా సంసారం, పిల్లలంటే ఆసక్తి లేనట్టుగా ఉన్నావు. నువ్వెంత పరధ్యానంగా ఉన్నావంటే నీ కూతురు పుట్టినరోజుకూడా మరిచిపోయావు."

    "ఓ! ఈరోజు డిసెంబరు పదహారుకదూ? నిజంగా మరిచిపోయాను. ఇప్పుడే షాపుకు ఫోన్ చేస్తాను చీరలు పంపించమని."

    "చీరలు రావడమూ, నాకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవడమూ అయింది"

    "అయితే తలంటుతాను పద."

    జడవిప్పుకొని తల్లి ముందు కూర్చొంది జ్యోతి. ఎంతమంది దాసదాసీజనం ఉన్నా పిల్లలకు తను చేసుకోవడమే తృప్తి గీతాభవానికి. నూనెగిన్నెలో వేళ్ళు అద్ది జ్యోతి మాడు మీద రుద్దుతూనే పరధ్యానంలో పడిపోయింది.

    జ్యోతి, స్వాతి పుట్టినరోజు ఎంత హడావిడి. ఎంత సందడి! ఎంత సంబరం!

    హాస్టల్లో తన ప్రసవం గుర్తువస్తే ఇప్పటికీ గడ్డకట్టుకు పోతుంది భయంతో.

    నొప్పులు వస్తున్నాయి. నడుము చీల్చుకుపోతున్నట్టుగా బాధ! ఎవరో ప్రేగులు వడి త్రిప్పుతున్నట్టుగా నొప్పి. గిలగిల్లాడుథూ కూడా నోరు మెడపలేని స్థితి! తన పరిస్థితి ఎవరైనా గమనిస్తారేమోనని భయం.

    ఆ రాత్రి భోజనానికి వెళ్ళలేదు.

    నొప్పులు తీవ్రమయ్యాయి. బాత్ రూంలో జొరవడి తలుపులు బిగించుకొంది. పన్నెండు గంటల రాత్రి. అందరూ నిద్రలో ఉన్నారు.

    పెద్దగా నొప్పి.

    పళ్ళ బిగువున అరుపును లోపలే నొక్కివేసింది.

    తన పాప ఫలం బయటపడింది. కేర్ కేర్ మని తన ఉనికిని చాటుకో బోయింది శిశువు. ఆ ఏడుపు విని ఎవరైనా వస్తారేమోనని భయంవేసింది. ఓవైపు కళ్ళు, తల తిరుగుతున్నాయి. చలికాలమైనా ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. పుట్టింది పిల్లో పిల్లవాడో కూడా సరిగా చూచుకోలేదు. తనకడుపున పెరిగిన పాపం తన ఒకనాటి తప్పటడుగుకు సాక్ష్యంగా ప్రపంచంలోకి వచ్చేసింది. ఎవరైనా ఈ బిడ్డతో తనని చూస్తే? అమ్మో! ఇన్నాళ్ళు తనకడుపున గడ్డ పెరుగుతూందని బొంకింది ఇందుకా?

    ఎదురుగా కిటికీ కనిపించింది. మరో ఆలోచన లేకుండా శిశువును చేతిలోకి తీసుకొని కిటికీలోంచి అవతలికి విసిరివేసింది.

    తన పాపానికి సాక్ష్యం దూరం చేశానన్న నిశ్చింత తప్ప రేపు ఉదయం ఆపిల్లను ఎవరైనా చూస్తే, ఆరాలు మొదలుపెడితే అన్నప్రశ్నలే ఉదయించలేదు. అసలు ప్రశ్నించుకొనే స్థితిలో లేదు మెదడు. భయం: భయం! బాత్ రూం నిండా రక్తమాయం. శుభ్రం చేద్దామనుకొంది. కాని, చేతకాలేదు. ఒళ్ళు తూలుతూంటే ఎలాగో గదిలోకి వచ్చి మంచంమీద పడుకొని ఒళ్ళు చల్లబడుతున్నట్టుగా అనిపిస్తే దుప్పటి కప్పుకొంది. తెలివి ఎప్పుడు తప్పిందో తెలియదు.
   

 Previous Page Next Page