"ప్రజ్ఞా! నీ దృష్టిలో ఏముందో నాకనవసరం. నువ్వు నాకు దక్కితీరాలి. నీ శరీరంతో నేనాడుకుంటాను. నిన్ను ఓ కీలుబొమ్మగా చేసి పరిపాలిస్తాను. నిన్ను అణువణువునా జుర్రుకుంటాను" అంటూ ఆమె ముఖాన్ని రెండు చేతుల్తో పొదివి పట్టుకుని పెదవుల మీద ముద్దు పెట్టుకోబోయాడు.
"విడు దుర్మార్గుడా!" అంటూ ఆమె శక్తినంతా ఉపయోగించి అతని మొహాన్ని దూరంగా తోసేసింది.
అదే సమయానికి రిక్షా ఓ గతుకులోపడి పెద్ద కుదుపుకు లోనయింది.
యోగి తూలి రిక్షాలోంచి క్రిందపడ్డాడు. రిక్షా అతను ఏం చెయ్యాలో తెలీని స్థితిలో రిక్షా ఆపబోయాడు.
"వద్దు, పోనియ్" అంది ప్రజ్ఞ యోగి లేచి ఎక్కడ వెంటపడతాడోనన్న భయంతో.
రిక్షా అతను ఏమనుకున్నాడో ఏమో గబగబా త్రొక్కుకుంటూ ముందుకెళ్ళిపోయాడు.
* * *
పూర్తిగా తడిసి ముద్దయి లోపలకు వస్తోన్న ప్రజ్ఞవంక ఆశ్చర్యంగా చూశాడు డాక్టర్ దయాకర్.
"అరె! వానలో అలా తడిసిపోయి వచ్చారేమిటి? యింట్లో వుండిపోక పోయారా?" అన్నాడు బాధగా.
"ఒకరోజు రాకపోతే ఏమయిపోయింది ? అయినా వర్షంలో పేషెంట్స్ మాత్రం ఎలా వస్తారు?"
"బెడ్ కేసెస్ వున్నాయి. అయినా ఏ ఒక ఎమర్జన్సీ వచ్చినా స్టాప్ ఎవరూలేక మీరు యిబ్బంది పడితే ?"
నిజానికి ఆ పూట మిగతా స్టాఫ్ ఎవరూ రాలేదు డాక్టర్ దయాకర్ ఒక్కడే అరగంట క్రితమే వచ్చి బెడ్స్ మీదవున్న కేసులు చూసేసి అటూ యిటూ తిరుగుతున్నాడు.
"రౌండ్స్ కి వెడదామా?" అంది ప్రజ్ఞ.
"పూర్తి చేసేశాను. విశేషమేమీ లేదు."
ప్రజ్ఞ నిశ్శబ్దంగా నిలబడింది. వర్షంలో పూర్తిగా తడిసివుండటంచేత శరీరం చిన్నగా వణుకుతూన్నట్లతను గమనించాడు. ఆమె ముఖం కూడా పాలిపోయి వున్నట్లనిపించింది.
"లోపలకెళ్ళి రెస్ట్ తీసుకోండి. వాడ్రోబ్ లో యిస్త్రీ టవల్ వుంటుంది. అది తీసుకుని వళ్ళు తుడుచుకోండి" అన్నాడు.
ప్రజ్ఞ మౌనంగా కాంపౌండింగ్ రూమ్ లోకి వెళ్ళింది. షెల్ఫ్ లోంచి ఓ టవల్ తీసుకుని ముఖం మాత్రం తుడుచుకొంది. చాలా నీరసంగా అనిపించి అక్కడున్న స్టూల్ మీద కూచుని ప్రక్కనే వున్న టేబుల్ మీద మోచేతులు ఆన్చింది.
ఇందాక జరిగిన సంఘటన గుర్తొచ్చి వళ్ళు జలదరిస్తోంది. అంత ఆకస్మిక పరిణామానికి తట్టుకుని తనగుండె ఎందుకు ఆగిపోలేదు?
అసలు కలా నిజమా అనిపిస్తోంది.
ఈ షాక్ కి తానెలా తట్టుకుంది ?
ఆమె కళ్ళవెంట జలజల నీళ్ళు కారుతున్నాయి.
అతను ఏదో హక్కున్నట్లు దౌర్జన్యంగా తనని తాకుతూ కూర్చున్నాడు. తాను క్షణం క్షణం మైలపడి పోతున్నదా ? తన శరీరాన్నీ మనస్సునూ ఎంతో పవిత్రంగా వుంచుకోవాలని ఆశపడ్డది. ఆ ధర్మానికి రానురానూ దూరమైపోతున్నదా? అసలీ వ్యక్తినించి తప్పించుకోవటమెలా? పోలీసులకు రిపోర్ట్ చేస్తే? పోలీసులు గుర్తురాగానే భయంతో ఆమె వళ్ళు మరింత కంపించింది పోలీసుల అఘాయిత్యాల గురించి ఆమె ఎంతో వినివున్నది. ఒక రొంపిలోంచి బయటపడటానికి యింకో నరకంలోకి తల దూర్చటమవుతుంది.
ఆ మధ్య పత్రికల్లో చదివిన ఓ వార్త గుర్తొచ్చింది. టెన్త్ క్లాస్ చదువుతున్న యిద్దరాడపిల్లల్ని ఓ కుర్రాడు తెగ వేధిస్తూ వుండేవాడు. దారుణమైన మాటల్తో హింసిస్తూండేవాడు. అశ్లీలమైన పదాలుపయోగించి అవమాన పర్చేవాడు. చివరకు అతని భాద భరించలేక ఆ ఆడపిల్లలిద్దరూ తమ తమ తల్లిదండ్రులకు, అతనికి ఉత్తరాలు రాసిపెట్టి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
ఆ వార్త చదివినప్పుడు వారం పదిరోజులదాకా నిద్రపట్టనివ్వకుండా తరిమి తరిమి కొట్టింది. మనసంతా తూట్లుపడినట్లయింది.
అలా తను కూడా ...
ఆ...ఊహు చాలా భయానకంగా తోచింది.
వానకు తడిసిన శరీరం, మనసులోని ఆరాటం...మగత ఆవహిస్తోన్నట్లు టేబుల్ మీద తలవాల్సి కళ్ళు మూసుకుని పడుకుంది.
అలా ఎంతసేపు గడిచిందో తెలీదు. "అరె! యిక్కడే వున్నారా" అన్న గొంతు వినిపించి కళ్ళు విప్పి చూసింది.
డాక్టర్ దయాకర్ ప్రక్కనే నిలబడి వున్నాడు.
వాల్చివున్న తలను పైకెత్తటానికి ప్రయత్నించింది. సాధ్యం కాలేదు.
"అరె అంత నీరసంగా కనిపిస్తున్నారేమిటి?" అంటూ ఒక చెయ్యి ఆమె భుజంమీద వేసి రెండో చేత్తో ఆమె చేతినందుకుని పల్స్ చూశాడు.
"చాలా వీక్ గా వుందే?" అని అతను కంగారుపడి "బెడ్ మీద పడుకుందురుగాని" అని ఆమె రెండు భుజాలూ పొదివి పట్టుకుని జాగ్రత్తగా లేవదీశాడు. ఆమెనలాగే పట్టుకుని ఒక్కొక్క అడుగూ వేయించుకుంటూ దగ్గర్లో వున్న ఓ గదిలోకి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి, తానుకూడా ప్రక్కనే కూర్చుని స్టెతస్కోప్ గుండెలమీద పెట్టి ఎగ్జామిన్ చేశాడు. తర్వాత ఓ న్యాప్ కిన్ తీసుకుని ఆమె ముఖంమీద తడిని తుడుస్తూ "అరె! ఇది కన్నీరుగా వుందేమిటి?" అన్నాడు.