ఇంత నిర్వికారంగా, ఇంత అచేతనంగా జీవితం గడపటం ఎలాగో ఆమెకర్ధం కావటంలేదు. ఒక్కసారిగా ఆమెకు తన ఉనికి తనకే ఆశ్చర్యం కలిగించింది. ఏం జరుగుతూంది తనకు? తన నిమిత్తం లేకుండా రోజులు గడిచిపోతున్నాయి.
ఈ పల్లెటూళ్ళో.... పెంకుటింట్లో.... అభాగ్యురాళ్ళయిన ఇద్దరు ఆడవాళ్ళు ఏ వ్యవస్థకూ, ఏ సామాజిక చింతనకూ సంబంధం లేకుండా జీవిస్తున్నారు. రోజులు.... నెలలు.... సంవత్సరాలు.... గడిచిపోతున్నాయి. చిత్రం! తనకింకా పిచ్చెక్కకుండా ఎలా వుంది?
కంటిముందు ఆవరించి వున్న ఆ చీకటిలో ఆమె కెదురుగా సారధి కనిపించాడు. అమాయకంగా, సుకుమారంగా వున్నాడు. జాలిగా నవ్వుతున్నాడు.
భారతికి నవ్వు వచ్చింది. "భయపడకు సారధీ! ఒక విధంగా తప్పు నేనే చేసినా, నిన్ను క్షమించే అర్హత నాకు వున్నది. ఈ అర్హత ఎలా వచ్చిందో నీకు తెలుసు....నిన్ను క్షమిస్తున్నాను.... అంతేకాదు....నిన్ను మరిచిపోలేకుండా వున్నాను. సారధీ....నిన్ను ప్రేమిస్తున్నాను సారధీ....! నువ్వెంత ధన్యుడివి!"
అది నిజమే. అతను ధన్యుడే. కాని ఈ ధన్యత ఎవర్ని ఉద్దరించటానికి?"
ఆ సాయంత్రం వరకూ ఒకరితో ఒకరికి నిమిత్తం లేకుండా గడిచిపోయింది. అప్పుడు రాధమ్మ లేచి పెరట్లోకి వెళ్ళి ముఖం కడుక్కుని. వంటింట్లోకి వెళ్ళింది పని చూడటానికి. అసలే క్రుంగిపోయి వున్న భారతిని పస్తులుంచటానికి ఆమెకు శక్తిలేదు.
బయట హాల్లో ఏదో అలికిడి అయినట్లయి భారతి గదిలోంచి బయటకు వచ్చేసరికి నాగరాజు కనిపించాడు.
"భారతీ!" అన్నాడు గాద్గదికంగా. "నిన్ను అన్యాయం చేసేశారు, భారతీ! నిన్ను అన్యాయం చేసేశారు."
అతడి కళ్ళు ఎర్రబడి వున్నాయి. వాటి నుంచి కరుణాశ్రవులు.
భారతి చలించిపోయింది. "నాగరాజూ!" అంది ఒక అడుగు ముందుకు వేసి. "నేను నీకు ఏమి శాంతి నిచ్చానని. నేనంటే నీకు సానుభూతి?"
"చెల్లీ!" అన్నాడు నాగరాజు ఉద్రేకంగా. "సానుభూతి అశాంతి నుంచే పుట్టుకు వస్తుంది. ఈ అశాంతి నాలో లేకపోతే నేను ఈ మనిషిని అయ్యేవాణ్ని కాదు. నెనుకటి జంతువు మాదిరిగానే ఉండేవాణ్ని. నాలో ఆ మృగం చచ్చిపోయింది చెల్లీ. జరిగింది క్రమంగా మరిచిపోవటానికి ప్రయత్నించమ్మా. అతనికి నువ్వు భార్య కానప్పుడు, నీకతను భర్తా కాడు, నువ్విప్పుడు ఒక స్వచ్చమైన స్త్రీవి. ఆభమూ, శుభమూ ఎరుగని ఆడపిల్లవు. ఇప్పుడే పుట్టావు ఈ భూమ్మీద నీ జీవితం ప్రారంభిస్తున్నావు."
భారతి మరింత కదిలిపోయింది. కళ్ళు పెద్దవి చేసి అతనివంక ఆశ్చర్యంగా చూస్తూంది. ఈ పృథ్విలో అన్నీ సాధ్యం. తనకు మాయదారి రోగం రావటం, అయినా పెళ్ళి కావటం, అంతలో బ్రతుకు బండలు కావటం, ఒక దుర్మార్గుడు ఊహించలేనంత మంచివాడు కావటం_అన్నీ సాధ్యం.
ఆమె అతనికి మరింత దగ్గరగా జరిగి, అతని భుజంమీద చేయి వేసింది. ఇద్దరి శరీరాల్లోనూ ఊహాతీతమైన అనుబంధ స్రవంతులు మంచు బిందువుల్లా ప్రవహించి ఒకదాని చల్లదనంతో మరొకటి సేదతీరాయి.
"నాగరాజూ! ఇంత సంస్కారివి. ఈ త్రాగుడెందుకు మానలేకుండా వున్నావు?"
అతని పెదవుల మీద తృప్తితో కూడిన ఓ మందహాసం కనిపించీ కనిపించనట్లయి మాయమైంది.
"క్రిందటిసారి నేను త్రాగి రాగా, నువ్వు భయకంపితురాలివయినావు చూశావా? ఆనాడు ఇంటికెళ్ళి పశ్చాత్తాపంతో కుళ్ళి కుళ్ళి ఏడ్చాను. ఎంత సదుద్దేశంతోనైనా కానీ, త్రాగి నీ ఇంట్లో అడుగుపెట్టటమా! ఆనాటి నుంచే త్రాగుడుకు స్వస్తి చెప్పేశాను, భారతీ."
ఆమె ఆనందాతిరేకంతో మాట్లాడలేకపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి. అతను మారాడనుకుందేగాని, ఆ మారటాని కింత ఆపదలు లేవని తలపోయలేదు.
కాసేపటికి మళ్ళీ నాగరాజే అన్నాడు: "భారతీ! నీ జీవితాన్ని కొత్తరూపంలో తీర్చిదిద్దుకోవలసిన బాధ్యత ఇప్పుడు నీకుంది. ఇలా శూన్యంగా, బాధ్యతారహితంగా ఈ పల్లెటూళ్లో ఇంతమంది దృష్టికి గురవుతూ గడపటం నాకిష్టంలేదు. వెళ్ళు, నీ ఇష్టమైన చోటుకు వెళ్ళు. ఒకప్పుడు నిన్ను చూస్తే అడవిలో ఛంగున గెంతే లేడిపిల్ల గుర్తువచ్చేది. తిరిగి ఆ స్వరూపం ధరించాలి నీవు. నీకు చదువులో ఎంత జిజ్ఞాస వుందో నాకు తెలుసు. నీ కిష్టమైన కోర్సు చదువు. ఎంత డబ్బయినా ఖర్చుగానీ__నీ అన్న వున్నాడు భరించటానికి.
భారతి మనస్సులో ఒక పెద్ద గాలిదుమారం లేచినట్లయింది. 'అడవిలో ఛంగున ఎగిరే లేడిపిల్ల!" అలా మారగలదా తిరిగి తాను? అది సాధ్యమా?
కాని చదువు! చదువంటే ఆమె శరీరంలో రక్తం పరవళ్ళు తొక్కింది. ఆమెలో ఆశావాదం మొలకెత్తింది. ఎన్నడూ అనుభవించని స్పందన కలిగింది. ఆమె చంటిపిల్లలా మారిపోయినట్లు, ముద్దు ముద్దు పలుకులు పలుకుతున్నట్లు అనుభూతి పొందింది.
"ఇంత పరీక్షకు నేను తట్టుకోగలనా? నేను రెండు రోజుల్లో ఆలోచించి ఒక నిశ్చయానికి వస్తాను నాగరాజూ!"
అతని కళ్ళలో వెలుగు తొంగి చూసింది. "అలాగే చెల్లీ! నీ ఆలోచన నిన్ను ముందుకు నడిపిస్తే నాకు సంతోషమమ్మా!" అన్నాడు.
తరువాత కాసేపుండి నాగరాజు వెళ్ళిపోయాడు.
* * *
ఆరోజే__చీకటి పడింది. భారతి బయటి తలుపు గడియపెట్టబోతూంది. "నిజమేనుటే!" అంటూ చీకట్లోంచి ఒక్క దూకున లోపలకు వచ్చింది మల్లిక: నోట్లో కుక్కుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది.
భారతి తల పంకించి నిలబడింది. గోడకు తగిలించివున్న దీపం వెలుగులో ఆమె ముఖం ఎర్రగా, శోణిమ కాంతులతో గోచరించింది.
'ఇంటికి రాగానే అమ్మ చెప్పింది. నిజమేనా? నిజమేనా అంటున్నా!" మల్లిక ఆమె భుజాలు పట్టుకు కుదిపేసింది.
భారతి జవాబు చెప్పలేదు. మళ్ళీ తల ఊపి ఊరుకుంది.
మల్లిక పిచ్చి ఆవేశం వచ్చినట్లు భారతి ముఖంలో ముఖంపెట్టి చూసింది. ఆమె జుట్టు రేపేసింది.
కష్టంమీద నిట్టూర్పు అణుచుకుంది భారతి. చివరకు నిట్టూర్పు విడచి అంది మల్లిక! "ఇప్పటికీ క్షమిస్తున్నావా అతన్ని నువ్వు!"
భారతి పెదవులమీద మలిన మందహాసం ఉదయించింది. "ప్రేమించినవారికి క్షమించక తప్పుతుందా మల్లికా?" అంది.
"అతను నీకు విడాకులిచ్చాడు. నువ్విప్పుడెవరివి?"
"ఎప్పటి భారతినే! మానసికంగా అతని భార్యగానే వుంటాను. అతని స్మృతి ఈ జీవితంలోంచి చెరిగిపోదు."
"అంటే యిలాగే క్రుంగి క్రుంగి కృశించిపోతూంటావా? ఒక్కటడుగుతాను చెప్పు. నిన్ను నువ్వు రిపేరు చేసుకోవాలన్న కోరిక లేదా?"
"ఎందుకు లేదు మల్లికా! నేనిప్పుడు చేయబోతూన్న పని అదే!"
"అయితే ఇంకే? ఆ దౌర్భాగ్యుణ్ణి నీ మనస్సులోంచి బయటకు తోసేసి కొత్త జీవితం మొదలుపెట్టు."
"కొత్త జీవితం ప్రారంభించటానికి ఇంత కఠిన నియమం ఎందుకు మల్లికా! జీవితంలో ఒక అధ్యాయం ముగిసినంత మాత్రాన ఆ అధ్యాయం తాలూకు ప్రభావం తరువాత అధ్యాయంమీద ప్రసరించకుండా ఉంటుందా? చూడూ!ఇంతకుముందే ఓ చిత్రమైన ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఆ ఆలోచన ఓ నిర్ణయంగా కూడా మారిపోయింది.... నేను మళ్ళీ చదువు దామనుకుంటున్నాను."