Previous Page Next Page 
బొమ్మా - బొరుసూ పేజి 33


    "నాగమణిగారూ! మీ మనసు తెలిసుండి కూడా నేనో ఇడియట్ లా ప్రవర్తించాను" అన్నాడు చలించిపోతూ.
    ఆ రోజు నుంచీ ఆమె అతనికి మరింత సన్నిహితురాలయింది. అతని కుటుంబం గురించి అన్ని విషయాలూ నాగమణికి చెప్పేశాడతను. తన తండ్రి కొద్దికాలం క్రితం చనిపోయిన దగ్గర్నుంచీ మొత్తం ఇంటి బాధ్యతంతా తన భుజాలమీద పడడం ఆ రోజునుంచీ తనెన్ని అవస్థలు పడుతోందీ, ఎన్ని ఇబ్బందులెదురవుతున్నా తన ఇద్దరు చెల్లెళ్ళనూ, ఇద్దరు తమ్ముళ్ళనూ, అందులోనూ పోలియోతో బాధపడుతున్న రెండో తమ్ముడినీ ఎలా చదివిస్తోందీ ఒకోసారి తిండి కూడా లేకుండా ఎలా పస్తులుంటూ గడుపుతోందీ అన్నీ చెపుతోంటే ఆమె హృదయం ద్రవించిపోయింది.
    "చంద్రంగారూ! మీరిక నుంచీ అవసరమయినప్పుడు నన్ను డబ్బు అడిగి తీసుకోండి! నాకు రుణపడిపోతున్నాననీ, తీసుకున్నది తీర్చలేకపోతున్నాననీ ఎలాంటి సంకోచం పెట్టుకోవద్దు. మీ అవసరానికి ఆదుకోవడం నాకెంతో ఆనందం కలిగిస్తుందని గుర్తుంచుకోండి. మీ పరిస్థితి బావున్నప్పుడు నేనే నా బాకీ పైసల్తోసహా వసూలు చేసుకుంటాను....." అందామె ఆప్యాయంగా.
    వారిద్దరి మధ్యా ఏర్పడిన సన్నిహితత్వం ఆఫీసులో చాలామందికి అనుమానం కలిగింది.
    "ఏమోయ్ చంద్రం! నీకూ నాగమణిగారికీ ప్రాణ స్నేహం ఉన్నట్లుందే" వ్యంగ్యంగా అడిగాడు షరీఫ్ ఓరోజు.
    "మీ నాగమణి ఇవాళ నీతోపాటు ఆఫీసుకి రాలేదేం"? అడిగాడు శ్రీధరం మరోరోజు. మరికొద్దిరోజులకు వారి ఎదురుగ్గానే సూటిపోటీ మాటలనడంవ్యంగ్యంగా మాట్లాడినవ్వుకోవడం ప్రారంభమయింది.
    చంద్రానికేం చేయాలో తెలీలేదు అతని మనసంతా బాధతోనిండిపోయింది. ఇలాంటి అపవాదువల్ల తనకేమీ నష్టం లేదు. ఎందుకంటే తను మగాడు. ఈ సంఘంలో ఎంత చెడునడతగలమగాడికయినా రక్షణ ఉందికానీ దానివల్ల నాగమణికిఎంతటి చెరుపు కలిగిస్తుందో తల్చుకుంటే భయంగా వుంది. దీన్నెలా అరికట్టడం?
    అందరూ తామిద్దరి గురించీ అలా అనుకుంటున్నారన్న విషయం నాగమణి గ్రహిస్తే ఆమె ఎంత బాధపడుతుంది? తనమూలాన ఆమె అంతటి మనస్తాపానికి గురికావడం ఎంత దారుణం? తనకు ఎంతో సహాయం చేసినందుకూ, తనను విపరీతంగా అభిమానించినందుకూ ఆమెకిది శిక్షా? అతనికి మనశాంతి పూర్తిగా కరువయిపోయింది. బహుశా వాళ్ళమాటల్లోని వ్యగ్యం నాగమణి ఇంకా అర్ధంచేసుకుని ఉండదు. ఆమె తెలుసుకునేలోపలే తను ఈ పరిస్థితిని ఎదుర్కోవాలి.
    ఆమెతో చనువుగా ఉండడం రోజూ ఆమెతోపాటు కలిసి ఆఫీస్ కి రావడం ఇంటికి వెళ్ళడం తగ్గిస్తే కొంతవరకూ ఉపయోగం ఉంటుందనిపించిందతనికి.
    కొద్దిరోజులు ఆఫీస్ లో సీటు వదలకుండా పని చేసుకుంటూ విరామం దొరికినప్పుడు అధివరకూ నాగమణి దగ్గరకూర్చుని మాట్లాడకుండా కాంటీన్ లో కూర్చుని గడపడం ప్రారంభించాడతను. అతనిలో వచ్చిన ఈ మార్పుని గమనించి నాగమణి ఆశ్చర్యపోయింది. అతను కావాలని తనకెందుకు దూరంగా వుంటున్నాడో, అదివరకులా తనతో వీలు దొరికినప్పుడల్లా ఏదొకటి సరదాగా మాట్లాడడం ఎందుకు మానేశాడో ఏమీ అర్ధంకావడంలేదు. ఆమెకు అతనిమీద రాన్రానుకోపం పేరుకుపోతోంది. తన స్నేహం చిరాకు కలిగించిందేమో అతనికి! తను చేసినసహాయాలన్నీ మర్చిపోయాడేమో! అతను పలకరించినా ముభావంగా సమాధానంచెప్పడం ప్రారంభించిందామె. అతనినసలు పట్టించుకోనట్టే మసులుకోసాగింది.
    ఓ రోజు ఆఫీస్ లో ఉండగానే ఆమెకు వళ్ళంతా నొప్పులు, జ్వరం ఆవహించినయ్ హఠాత్తుగా. మధ్యాహ్నమే పర్మిషన్ తీసుకుని ఇంటికి చేరుకుందామె. సాయంత్రానికి జ్వరం బాగా ఎక్కువయిపోయింది. భవానీ రాత్రి డ్యూటీనుంచి వచ్చి పరిస్థితి చూసి హడలిపోయింది. "అదేమిటి? ఇంతజ్వరంగా వుంటే అలా ఊరుకున్నారేం? చంద్రంగారికి కబురు చేయలేకపోయారా? డాక్టరుని తీసుకొచ్చేవాడు?" అడిగిందామె ఖంగారుగా.
    "వద్దులేండి! అదే తగ్గిపోతుంది." అంది నాగమణి అయిష్టం గా. మర్నాడు భవానీయే డాక్టర్ ని తీసుకొచ్చింది.
    "మరేం పర్వాలేదు. ఇది ఫ్లూజ్వరం" అన్నాడు డాక్టర్ మందులురాసిచ్చి. రెండురోజులు వరుసగా ఆఫీసులో కనిపించకపోయేసరికి చంద్రం కలరవపడ్డాడు. నాగమణి కేమయింది? ఆఫీస్ కెందుకు రావడంలేదు? ఆమెను చూడకపోయేసరికి అతని మనసులో అశాంతి మొదలయింది. ఆమెను ప్రతిరోజూ చూస్తుండడం, రోజుకోసారి అయినా మాట్లాడడం ఇంతటి అనుభూతి ఏర్పరుస్తుందని అతననుకోలేదు. రెండోరోజు ఎక్కువసేపు ఆఫీస్ లో గడపలేకపోయాడతను. ఒక రోజు శెలవు పెట్టి ఆఫీస్ నుంచి నాగమణి ఇంటికి బయల్దేరాడు.
    తన అయిదేళ్ళ సర్వీస్ లోనూ అదే మొదటిసారి శెలవు పెట్టడం! ఇంతవరకూ ఎంతటి అవాంతరాలెదురయినా శెలవు పెట్టలేదు తను! అందరూ తనని మరమనిషి అని హేళన చేస్తూండేవారు. కానీ తను శెలవు ఎందుకు పెట్టడంలేదో తన కొక్కడికే తెలుసు. ప్రతి సంవత్సరం ఆ శెలవునంతా డబ్బుగా మార్చుకోవచ్చు. ఆ డబ్బు తనకుటుంబావసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దానికోసం ఇంటిల్లిపాదీ ఎదురుచూస్తుంటారు.
    తన అక్కయ్యకు వివాహమయివెళ్ళిపోయిన దగ్గర్నుంచే తనకీ దరిద్రం ఎక్కువయింది. ఆమె వివాహం తన కుటుంబాన్ని పూర్తిగా ఫుట్ పాత్ మీదకు ఈడ్చేసింది. రాన్రానూ తను మరిన్ని అవస్థలపాలవుతున్నాడు గాని కోలుకోవడంలేదు. తన కుటుంబంకోలుకోవాలంటే  మరొకరెవరయినా ఉద్యోగం చేయాలి. ఆ అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు తనకి తన చెల్లెళ్ళూ తమ్ముళ్ళూ ఎవ్వరూ ఇంకా డిగ్రీ పూర్తిచేయలేదు. చేసిన వెంటనే ఉద్యోగం దొరుకుతుందన్న నమ్మకం ఏదీ?
    ఓ పక్క తన వయసు దాటిపోతోందనీ పెళ్ళి చేసుకోమనీ తల్లి గొడవ. కానీ పెళ్ళి చేసుకుంటే మరో మనిషిని పోషించాల్సివస్తుందన్న తనభయం ఆమెకెలా అర్ధమవుతుంది? అందుకే ఉద్యోగం చేసే అమ్మాయి అయితేనే వివాహం చేసుకుంటానని బంధువులందరికీ చెప్పేశాడతను. దాంతో ఏ సంబంధమూ రావడం లేదు. ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలు తనలాంటి బాదరబందీలున్న వాడిని చేసుకోవడానికి ఎందుకు వప్పుకుంటారు? తన బాధ్యతలువారి భుజం మీద ఎందుకేసుకుంటారు? వారికేమీకాని ఇంతమంది బాగోగులెందుకు చూస్తారు? అందుకే వచ్చిన ఒకటి రెండు సంబంధాలూ తమ ఇంటి పరిస్థితిని చూసి వెనక్కు పోయాయ్. తనకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే ఒక కాలు అవిటయిపోయిన ఓ ఉద్యోగస్తురాలు కూడా తనను చేసుకోడానికి నిరాకరించింది. ఎందుకంటే ఆమె వికలాంగురాలు కాబట్టి ఆమె కొచ్చే జీతం ఆమె కోసమే రక్షణగా మిగిలిపోవాలిట!
    తనకు నవ్వు వచ్చింది. తను అందం చూడటంలేదు. అమ్మాయి అర్హతలు, చదువూ, ఇవేమీ అడగడం లేదు. ఆమెకో కాలు లేకపోయినా సిద్దపడ్డాడు. అయినా ఆమె తనను తిరస్కరించింది. దాంతో తనకి నిరాశ కలిగింది తనలాంటి దురదృష్టవంతుడిజీవితం ఇలా గడిచిపోవాల్సిందే. ఆశపడితే నిరాశే ఎదురవుతుంది. హఠాత్తుగా అతనిలో ఓ ఆలోచన మెరుపులా మెరిసి శరీరమంతా విద్యుత్ లా ప్రవహించింది.
    "అవును! నాగమణి తనను వివాహం చేసుకోడానికి అంగీకరిస్తుందా?" ఠక్కున రోడ్డుమీదే నిలబడిపోయాడతను. ఇంతకాలం తనకీ ఆలోచనరాలేదెందుకనో! ఆమెకు తనంటే అభిమానం ఉంది. ఇద్దరి మధ్యా మంచి స్నేహం ఉంది. తనంటే సానుభూతి ఉంది. మరింక ఆమె అభ్యంతరం ఎందుకు చెప్తుంది? ఒకవేళ ఆమె మరెవరినయినా ప్రేమించి ఉంటే తనను నిరాకరిస్తుంది అంతేకదా! మరోసారి తను దురదృష్టవంతుడని తనను తనేనిందించుకుని ఊరుకుంటాడు. త్వరత్వరగా నాగమణిఇంటివేపు నడిచాడతను.
    ఆమె అప్పుడే మొఖం కడుక్కుని మళ్ళీ పడుకుంది నీరసంగా. ఈ రెండు రోజులకే బాగా బలహీనమయిపోయింది. ఏమీ తినబుద్దికావటం లేదు. ఏం తినాలన్నా చేదుగా ఉంటోంది. చంద్రంని చూస్తూనే ఆమె ముఖం సంతోషంతో విప్పారింది. కానీ అంతలోనే అతను తనను నిర్లక్ష్యంచేస్తున్నాడన్న విషయం గుర్తుకొచ్చి మొఖం తిప్పేసుకుంది.
    "నాగమణిగారూ! ఏమయింది?" ఆప్యాయంగా, ఆదుర్దాగా అడిగాడు చంద్రం ఆమె మంచం దగ్గరే నిలబడి.
    "జ్వరం!" అంది ఆమె పొడిగా.
    "అరె! ఎప్పటినుంచి?"
    "మొన్నటినుంచి"
    "మరి నాతో ఎందుకు చెప్పలేదు? కనీసం కబురయినా చేయలేదు ఎందుకని?" నిష్టూరంగా అడిగాడతను.
    "మీకెందుకు చెప్పడం? అనవసరంగా మీకు శ్రమ".
    "బావుంది! ఇలా మాట్లాడడం ఎప్పుడు నేర్చుకున్నారు?"
    "మీరు మాట్లాడడం తగ్గించినరోజునుంచే".
    "నేననుకున్నానులెండి మీకు కోపం వచ్చి ఉంటుందని అయినా నేనేం చేయను మీతో మాట్లాడి మీకు నష్టం కలిగించడంకంటే, మాట్లాడకుండా మీకుకోపం కలిగించడమే మంచిదనుకున్నాను".
    "ఏదో సమర్ధించుకోవాలని ఇదంతా చెబుతున్నారు?"
    "నాగమణిగారూ! ఇప్పుడు మిమ్మల్ని చిరాకు పెట్టడం నాకిష్టంలేదు. మీరు ముందు తీసుకుంటున్నారా?"
    "ఆ!"
    "మీకేమయినాకావాలంటే చెప్పండి చేస్తాను"
    "టీపార్టీ కోసమా?"
    "ఊహు! ఈ రోజునుంచీ మిమ్మల్ని టీపార్టీ అడగను".
    "ఎందుకని?"
    "మీ మనసు నొప్పించానుగనక నాకు అదే శిక్ష".
    నాగమణి నవ్వేసింది. ఆమె మంచంపక్కనే నేలమీద చతికిలబడ్డాడతను.
    "అదేమిటి? కింద కూర్చుంటారేం? బట్టలు పాడయిపోతాయ్".

 Previous Page Next Page