Previous Page Next Page 
శతఘ్ని పేజి 34

 

    "థేంక్స్"
    
    "నువ్వు నాకు చాలా కావాల్సినవాడివని తెలిసిన మా ఫ్రెండ్స్ నాకు మరోపరీక్ష పెట్టారు"
    
    "ఏమిటిది"
    
    చెప్పింది ఫంక్షన్ గురించి.
    
    "ఎంతపని వున్నా నువ్వు స్పీకర్ గా రావాలి కాదనకుండా...... ఎందుకంటే" సౌందర్య పిడికిలి రిసీవర్ చుట్టూ బిగుసుకుంది "నా కోసం"
    
    "తప్పకుండా"
    
    మాటిచ్చాడు త్యాగి అనాలోచితంగా.
    
    ఫోన్ క్రెడిల్ చేస్తూ అనుకుంది సౌందర్య నన్నింత అవమానించిన మిస్టర్ త్యాగి! జీవితంలో ఇక నువ్వు కోలుకోలేనంత షాక్ ట్రీట్ మెంటివ్వబోతున్నాను......గెట్ రెడీ.
    
    ఆకాశం మేఘావృతమై వుంది. సత్యాన్వేషణలో అలసినసూర్యుడు అస్తమించి అప్పటికి అరగంటైంది. కూడని ఓ స్ప్రుతి చితాభస్మాన్ని ఊదటానికి సిద్దపడుతున్నట్టు క్రమంగా గాలి ఉధృతమౌతుంది......
    
    సాయంకాలం అయిదున్నర గంటల కే అంబేద్కర్ విగ్రహం దగ్గర వందల సంఖ్యలో విద్యార్ధులు గుమికూడారు.
    
    ఆ రోజు ఓ ఇంటర్మీడియట్ విద్యార్ధి ఆత్మాహుతి చేసుకుంటాడని తెలిసిన జూనియర్ కాలేజీ విద్యార్ధులు కాలేజీలనుంచి ఇళ్ళకి కాకసరాసరి అక్కడికే వస్తున్నారు.
    
    సరిగ్గా ఇదే సమయంలో.....
    
    "నేను చావలేను......" గెస్ట్ హౌస్ లో నుంచి బయలుదేరాల్సిన కృష్ణ భయంతో పరమహంస కాళ్ళని చుట్టేశాడు ఆందోళనగా.
    
    "నాకు బ్రతకాలనుంది."
    
    అప్పటికే మిగతా డబ్బునిచ్చేసినా ముకుందం ఆ డబ్బుని యింటికి చేర్చి తిరిగివచ్చేక యిప్పుడిలా కృష్ణ పేచీ పెడుతుంటే తట్టుకోలేనట్టు పట్టుకుని దూరంగా విసిరేశాడు.
    
    "బాస్టర్డ్, చివరి నిమిషంలో యిలామాట్లాడితే నిన్నిక్కడే తగలబెట్టే ఏర్పాట్లు చేస్తాను...."
    
    ఈ సారి కృష్ణ చెంప పగిలి కన్నీళ్లు ధారకడుతున్నాయి.
    
    "నన్నుకొట్టండి, కాని నాకు బ్రతకాలనుంది."
    
    వ్యవధి మించిపోతున్నట్టు ముకుందం కృష్ణపై మరింత ఆవేశాన్ని ప్రదర్శించబోతుంటే వారించాడు పరమహంస.....
    
    "కృష్ణ....." కృష్ణ తలని నిమిరాడు ఆప్యాయంగా "నువ్వే కాదు నీ స్థానంలో వున్న ప్రతి మనిషీ యీ చివరి దశలో యిలానే ఆలోచిస్తాడు."  

 

    ఓ ప్రక్క టైం ముందుకొస్తుంటే పరమహంస యింతసాత్వికతని ప్రదర్శించడం బొత్తిగా నచ్చని ముకుందం కృష్ణవేపు దూసుకుపోతుంటే ముకుందాన్ని మరో గదిలోకి లాక్కుపోయాడు పరమహంస.
    
    "చావాల్సినవాణ్ణి రక్షించి చచ్చేదాకా షడ్రసోపేతమైన భోజనాన్ని తినిపించియిప్పుడు అర్జెంట్ గా చచ్చితీరాలి అంటే ఎవడూ సిద్దంకాలేడు ముకుందం......అది ఆ స్థితిలో వున్నవాడికి కాని అర్ధం కాని విషయం...... అయిదు నిమిషాలు నువ్విక్కడే వుండు."
    
    లోపలికి వెళ్ళాడు పరమహంస......
    
    ఏ క్షణంలో అయినా కృష్ణ స్పృహతప్పిపోయేట్టున్నాడు.
    
    "కృష్ణా" పరమహంస గొంతులో అలవిమాలిన లాలిత్యం ధ్వనించింది "బ్రతికి ఏం చేద్దామని......అసలు నీదో బ్రతుకని ఎలా నమ్మగలుగుతున్నావు......కేన్సర్ తో మంచం పట్టినతల్లి...... వ్యభిచారంతో నిన్ను చదివించాలనుకునే నీ అక్క......నీ కుటుంబాన్ని చూసి నలుగురూ పరిహసించడం...... ఆకలి ....... అవమానం...... ఇవేగా ..... ఇప్పుడు లక్షదక్కిందిగా అనుకోకు......నువ్వు కాదన్న మరుక్షణం నిన్నిక్కడే కాల్చిచంపి ఆ శవాన్ని నగరంలో ఓ మూల విసిరి అదే ఓ విద్యార్ధి ఆత్మ హత్యగా పత్రికల్ని, ప్రజల్ని నమ్మించడం మాకోసమస్య కాదు. కాని ఆ తర్వాత అంటే నీ అంతటనువ్వు చావక మాచేత చంపించుకునే శ్రమమాకు కలిగించినందుకు నువ్వు యింటికిచ్చి నలభై తిరిగి రాబట్టడం జరుగుతుంది. ఒకవేళ లక్ష నేను వెనక్కిస్తానని నువ్వు మొరాయించి నా మా పథకం నీకు తెలిసిపోయాకనిన్ను ఎలా వదిలిపెట్టగలం..... తప్పు నాన్న.....బుద్దిగా చచ్చిపో..... నువ్వు బ్రతికి నీ కుటుంబానికే కాక మాకూ, మా ఉద్యమానికీ నష్టంకలిగించకు....."
    
    "ప్రపంచంలో లక్షల మంది పుడతారు...... చస్తారు..... కాని కీర్తిశేషులుగా పోయేది కొందరే కృష్ణా...... భగత్ సింగ్ పోయింది యించుమించు నీ వయసులోనే...... అయితేనేం...... ఎంతచరిత్ర మూటగట్టుకున్నాడని ......అంతెందుకు.......విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు మరణించింది ఈ వయసులోనేగా.......చూడూ ..... ఈ రోజు ఎందరతడి కోసం ఆత్మార్పణకి సిద్దపడుతున్నారో...... అంచేత బుద్దిగా చచ్చిపొ ..... నువ్వు చచ్చి నీ కుటుంబాన్ని బ్రతికించుకో.......కాదన్నా ఏనాడూ చావుతప్పని నువ్వు బ్రతకాలనేభస్మ సింహాసనంపైకాక తెలుగు రాష్ట్రచరిత్ర నుంచి విద్యార్ధులకి అందించబడే పాఠ్యాంశంగా మారిమరణించు....... నువ్వుపోతే నేం...... ఆ తర్వాత నీకోసం విద్యార్ధుల ఊరేగింపులు జరుపుతారు....... నీ పేర్న విగ్రహాలు ఆవిష్కరిస్తారు........ ఆశ్చర్యపోకు....... కొన్ని వీధులకి  నీపేరు పెట్టి మంత్రులు అక్కడ జరిగే ఫంక్షన్లకివచ్చి నిన్ను స్తుతిస్తారు...... చెప్పు....... ఇక్కడ చస్తావా లేక మొక్కలాంటినువ్వు ఓ మహావృక్షమయ్యే అవకాశం కోసం చెప్పినచోట చావాలనుకుంటున్నావా."
    
    చిత్రం....... చప్పుడు చేయలేదుకృష్ణ.
    
    అది ఎలాగూ చావడం తప్పదనితెలిసినందుకు ఏర్పడిన స్తబ్ధతోలేక రేపు తనకు అసాధారణ చరిత్ర సృష్టించబడుతుందన్న ఆలోచనో ట్రాన్స్ లోకి జారినట్టు రెప్పలార్పకుండా చూసేడు అప్పటిదాకా చేసిన అల్లరి మరిచి.....
    
    అంతే......
    
    మేకతల నారికే కసాయిలాకృష్ణ నుదుట కుంకుమ అద్దేడు పరమహంస.
    
    చేష్టలుడిగి నిలబడ్డ కృష్ణ మెడలో ఆనందంగా ఓ పూల దండ వేశాడు ముకుందం.
    
    ఇదిజరిగిన నాలుగున్నర నిమిషాలకి......
    
    ఏంమూల నుంచి ప్రకటించిన విద్యార్ధి వస్తాడో తెలుసుకోలేక సతమతమవుతున్న పోలీసులకి దూరంగా...... వూహించనిదిశలో ముందుకొచ్చిన కృష్ణ  క్షణంపాటు ఊపిరి బిగబట్టాడు.
    
    అందరూ చూస్తున్నది అంబేద్కర్ విగ్రహాన్ని......
    
    భారంగా కళ్ళు మూసుకున్నాడు జేబులోనుంచి అగ్గిపెట్టె తీస్తూ.
    
    స్వేదం భస్మ సముద్రపు ఊర్ధ్వ ధారలా నుదుటినుంచి కారుతుంటే......
    
    ఉన్నట్టుండి ప్లాస్టిక్ టిన్ లోని పెట్రోల్ ని ఒంపుకున్నాడు శరీరంపై
    
    అప్పుడు చూశారు కొందరు విద్యార్ధులు......
    
    ఉన్నట్టుండి కలవరం మొదలైంది.......
    
    ఆ హోరుగమనించిన పోలీసులు అటు వస్తుండగానే అగ్గిపుల్ల గీసి అంటించుకున్నాడు......
    
    భగ్గుమన్న శబ్దం.....
    
    కెవ్వుమన్న ఆర్తనాదం.....
    
    ముందుకు రాబోయిన పోలీసులు ఆగిపోయారు పాకుతున్న అగ్నిసర్పంలా పరుగెడుతున్న విద్యార్ధిని చూస్తూ......
    
    జనంకకావికలై పోయారు......
    
    "సీతారామ...... రాజు...... అమర్ ......"
    
    కాలుతున్న కృష్ణ గొంతు నుంచిచివరి బాధ్యత నిర్వహించాలనే తమకం......
    
    మరోసారి అరిచాడు కాని శక్తి చాలలేదు.
    
    అన్నివేలమందిలో అతడ్ని చేరుకున్న ఒకే ఒక వ్యక్తి త్యాగి......
    
    అందరిలా ఆగలేదు...... ఆ చిరుదీపం ఆరకూడదని కృష్ణ ఒంటిపై కాలుతున్న చొక్కా లాగేడు.
    
    ఆకాశ పరివ్యాప్త    
    విశ్ర స్ఫులిత
    వరోచమిరీన
    రూపినందాకురంలా
    నివళిత ముకుందా గ్రోసిత
    వ్యక్తీకరణకీ మంధోత్తాదక
    భ్రమణగమకంగోంకాంకిత
    ధూమపుష్పంలా
    సన్నిభవేత్తధరంఝంకారంలా .....
    
    శబ్దంచేస్తూ మండుతున్నకృష్ణని రక్షించాలని విశ్వప్రయత్నంచేశాడు.
    
    కాని అప్పటికే ఆలస్యమైంది...... రాజకీయ మహాయజ్ఞంలో మొదటి శలభంలా కమిలిన రూపం తో కృష్ణ నేలకొరిగాడు. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
    
                                                                * * *
    
    సరిగ్గా ఇదే సమయంలో......
    
    'బ్రహ్మాజీ జిందాబాద్' అన్న నినాదాలతో ఉలికిపాటుగా కళ్ళు తెరిచాడు నిరాహారదీక్ష టెంట్ లో కూచున్న బ్రహ్మాజీ ప్రాణం కడగంటిపోతుంటే చీకటికీ ముందునిలబడ్డ వందలమంది ఎక్కడనుంచి ఊడిపడ్డారో అర్ధం కాలేదు.
    
    "అమరజీవి సీతారామరాజు వర్ధిల్లాలి" మరో స్లోగన్...... నీరసంలోనూ చేతులు జోడించాడు.
    
    "అవతలవిద్యార్ధిలోకం ఆహుతవుతుంటే మీరిలా....." గుడిసెలసంఘం నాయకుడు అప్పారావు చెంగున బ్రహ్మాజీదగ్గరకు దూకి రహస్యంగా చెవిలో చెప్పాడు.
    
    కృష్ణ ఆత్మాహుతి విషయం.
    
    ప్రేతకళస్థానంలో జీవకళచోటుచేసుకోగా యింత జరిగినా దగ్గరకు రానిముకుందంపై రోషంతో "ఇప్పుడీ విద్యార్ధిలోకానికి ప్రభుత్వం ఏం జవాబు చెబుతుంది?" అంటూ అని లేచాడు యింతకు మించి అవకాశంరాదన్నట్టు.
    
    తూలిపడబోయిన బ్రహ్మాజీకి ఆసరా యిచ్చాడు అప్పారావు.

 

    అంతేకాదు......పరమహంస ఆదేశం గుర్తుకొచ్చినట్టు బ్రహ్మాజీని కుదిపేస్తూ "మీరీ నిరాహారదీక్షలు చేస్తే విద్యార్ధిలోకం అనాధగా మారిపోతుంది....... మీరు బ్రతకాలి......మీ తరపున  మేం చేస్తామంటున్న విద్యార్ధుల ఉద్యమానికి మీరు ఊపిరి పొయ్యాలి...... "అన్నాడు బలవంతంగా ఓ రిక్షాలోకిలాగి.

 Previous Page Next Page